• facebook
  • whatsapp
  • telegram

సర్కారీ ఉదాసీనత... అన్నదాత నిస్సహాయత

ధీమా కల్పించలేకపోతున్న పంటల బీమా

‘ఆపదవేళల రైతులను ఆదుకోవడం, వారి సంక్షేమాన్ని పట్టించుకోవడం వ్యవసాయ శాఖ బాధ్యత. కరవు, వడగళ్లవాన, చలిగాలులకు నష్టపోయిన పంటలకే తాము బాధ్యత వహిస్తామని- వర్షాలు, వరదలతో తమకు సంబంధం లేదని కేంద్ర వ్యవసాయశాఖ తప్పించుకోజూడటం తమాషాగా ఉంది. ఈ కారణంగా కేంద్రం, మరోవైపు ఐచ్ఛికమంటూ రాష్ట్ర ప్రభుత్వం కర్షకులకు సాయం చేయకుండా చేతులు దులిపేసుకుంటున్నాయి’ తెలంగాణలో రైతులకు నిరుడు వరదసాయం అందకపోవడంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్య విచారణ సందర్భంగా హైకోర్టు ఇటీవల స్పందించిన తీరిది. విపత్తుల సమయంలో రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రదర్శిస్తున్న ధోరణికి ఇది నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.

విపత్తులు విరుచుకుపడితే రైతులను ఆదుకుని పరిహారమివ్వాల్సిన పంటలబీమా పథకాలు వెలాతెలాపోతున్నాయి. వరదలు, కరవు, తుపానులు, వడగండ్లు వంటి విపత్తులతో పైర్లు నాశనమైతే పరిహారం ఇస్తామనే భరోసా అన్నదాతలకెవరూ కల్పించడం లేదు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి పంటలబీమా పథకం (పీఎంఎఫ్‌బీవై)’ దేశంలో అధికశాతం రైతులకు అందని ద్రాక్షగా మారింది. మొత్తం 14 కోట్లమందికి పైగా రైతులుంటే గత నాలుగేళ్లలో ఏటా సగటున 5.50 కోట్ల మందికే ఈ పథకం కింద పరిహారం అందినట్లు కేంద్ర వ్యవసాయశాఖే ఇటీవల పార్లమెంటులో ప్రకటించింది. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి పంజాబ్‌ దీని అమలుకు ఇష్టపడలేదు. 2018లో బిహార్‌, 2019లో పశ్చిమ్‌ బంగ, 2020లో తెలంగాణ, ఏపీ, ఝార్ఖండ్‌ రాష్ట్రాలు ఈ పథకం అమలు చేసేది లేదని తప్పుకొన్నాయి. గత సంవత్సరం, ఈ ఏడాది వానాకాలంలో భారీ వర్షాలకు తెలంగాణలో లక్షలాది ఎకరాల్లో పైర్లు నీటమునిగినా ఎవరూ పట్టించుకోలేదు. విపత్తులొస్తే రైతులకు సాయం అందించడం బీమా కంపెనీలు లేదా రాష్ట్ర ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండటం దురదృష్టం.

పారదర్శకత ఏదీ?

పంటలకు బీమా చేయించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు, బీమా కంపెనీలు శ్రద్ధ చూపడం లేదు. పీఎంఎఫ్‌బీవై అమలుకు దేశవ్యాప్తంగా 18 బీమా కంపెనీలను కేంద్రం ఎంపికచేసింది. కంపెనీలు అన్ని రాష్ట్రాల్లో ప్రతి సీజన్‌లో పథకం అమలుకు టెండర్లు వేయడానికి ముందుకు రావడం లేదు. వాటికిష్టమైన రాష్ట్రంలో, అదీ నచ్చిన సీజన్‌లోనే ముందుకొస్తున్నాయి. నిబంధనలను సరిగ్గా అమలు చేయకపోవడంతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన జాతీయ వ్యవసాయ బీమా కంపెనీకే రూ.3.50 కోట్ల జరిమానా విధించామని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి స్వయంగా లోక్‌సభలో చెప్పారు. ఈ పథకం అమలులో కంపెనీలెంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నాయో వేరే వివరించేదేముంది?

ఈ ఏడాది (2021-22) బడ్జెట్‌లో పంటలబీమా పథకానికి కేంద్రం రూ.16 వేల కోట్లు కేటాయించింది. గతేడాదికన్నా ఇది రూ.305 కోట్లు ఎక్కువ. కానీ పలు రాష్ట్రాల బడ్జెట్లలో నిధుల కేటాయింపే లేదు. ఈ పథకం ప్రారంభించినప్పుడు ఆహార పంటలబీమాకు రైతు కేవలం రెండు శాతం ప్రీమియం కడితే మిగతా సొమ్మును రాయితీ రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించేవి. ఉదాహరణకు, ఎకరా వరి పంట బీమా విలువ రూ.30 వేలుంటే అందులో రెండు శాతం కింద రైతు రూ.600 కడతాడు. టెండర్లలో ప్రీమియాన్ని 20శాతంగా ఏదైనా జిల్లాలో నిర్ణయిస్తే అందులో రెండు శాతం రైతు కట్టగా, మిగిలిన 18 శాతాన్ని కేంద్రం, రాష్ట్రం- చెరి సగం చెల్లించేవి. కానీ, గతేడాది నుంచి కేంద్రం సాగునీటి వసతి కలిగిన భూములకు 25శాతం, వర్షాధార భూముల పంటలకైతే 30శాతమే భరిస్తామని షరతు పెట్టింది. ఈ నిబంధనతో రాష్ట్రాలపై తీవ్ర ఆర్థికభారం పడిందని తమిళనాడు సీఎం స్టాలిన్‌ ప్రధానికి లేఖ రాశారు. పథకం ప్రారంభించిన తొలి ఏడాది 2016లో తమిళనాడు ప్రభుత్వం రైతుల తరఫున ప్రీమియం రాయితీని రూ.566 కోట్లు చెల్లిస్తే, అయిదేళ్ల(2021)లో అది కాస్తా రూ.2,500 కోట్లకు చేరింది. ఇలా ఆర్థికభారం పెరుగుతూ పోతే ఈ పథకాన్ని అమలుచేయడం రాష్ట్రాలకు కష్టమవుతుందని స్టాలిన్‌ స్పష్టం చేశారు.

రైతుకు భరోసా అవసరం

పంట నష్టాలే రైతుల ఆత్మహత్యలకు కారణమని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. పైరు దెబ్బతిన్న సమయంలో బీమా ఆదుకుంటుందనే ధీమాను రైతులకు రాష్ట్రాలు కల్పించాలి. ఇతర పథకాలకు నిధులిస్తున్నామనే నెపంతో పంటలబీమా పథకాన్ని చాపచుట్టేయడం సరికాదు. రైతులకు సరిగ్గా పరిహారం అందడం లేదనే విమర్శలున్నాయి. ఉదాహరణకు 2019-20లో దేశవ్యాప్తంగా బీమా కంపెనీలకు ప్రీమియం కింద రూ.31,391 కోట్లు రైతులు, పాలకులు చెల్లించారు. ఇందులో 52శాతం (రూ.16,325 కోట్లు) సొమ్ము ప్రభుత్వ రంగ సంస్థలైన బీమా కంపెనీలకే చేరింది. ప్రభుత్వ సంస్థలు పథకం అమలులో బాధ్యత తీసుకున్నప్పుడు రైతులకు సాయపడే విషయంలో ఉదారంగా వ్యవహరించాలి. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయడం లేదంటూ- కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన జాతీయ వ్యవసాయ బీమా కంపెనీ పత్తి పంటకు రైతుల నుంచి అధిక ప్రీమియం వసూలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోతే- కేంద్రం అందిస్తున్న రాయితీ సైతం రైతుకు లభించకపోవడం ఎంతవరకు సమంజసం? రైతు సొంతంగా బీమాకు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేస్తే రాయితీ ఇవ్వాలి. పంటలు దెబ్బతిన్న వారం, పదిరోజుల్లో పరిహారం అందేలా అధునాతన ఐటీ సాంకేతికతను వినియోగించాలి. తక్షణ సాయం అందితే మరోపంట సాగు చేసి నిలదొక్కుకొనేందుకు రైతులకు ఆసరా లభిస్తుంది. ఏళ్ల తరబడి జాప్యం, అసలు పరిహారం వస్తుందో రాదో తెలియని దుస్థితి నెలకొంటున్నాయి. ఈ తరహా విధానాలు కొనసాగినంత కాలం పంటలబీమా పథకాలతో రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని పాలకులు గుర్తించాలి.

సన్నగిల్లిన విశ్వాసం

ప్రధానమంత్రి పంటలబీమా పథకాన్ని 2016 జనవరి 13న ప్రారంభించినప్పుడు కేంద్రం ఘనంగా ప్రచారం చేసింది. ఆ పథకం రైతులకు ఎంతో ప్రయోజనకరమని చెప్పింది. అయిదేళ్లు పూర్తయిన తరవాత (2021 జనవరి 13నాటికి) పరిశీలిస్తే- దేశంలోని రైతు కుటుంబాల్లో 41శాతమే దీన్ని ఉపయోగించుకున్నట్లు తేలింది. ఇందులో సన్న, చిన్నకారు రైతుల కుటుంబాలే అధికం. ఈ పథకంపట్ల నమ్మకం సన్నగిల్లడంవల్లే రైతులు దీనికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వరదలు, వడగండ్లు, తుపానులు వంటి విపత్తులతో పంటలు నాశనమైనప్పుడు 72 గంటల్లోనే నష్టాల వివరాలను నమోదు చేసి, వెంటనే 25శాతం పరిహారం ఇవ్వాలనే నిబంధన ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.

 

- మంగమూరి శ్రీనివాస్‌
 

Posted Date: 15-09-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం