• facebook
  • whatsapp
  • telegram

భారత్‌తోనే చైనాకు కట్టడి

పదునెక్కుతున్న అమెరికా వ్యూహం

‘ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో బలంగా ఉన్న భారత్‌ భావసారూప్యత కలిగిన దేశాలతో సహకారాన్ని పెంపొందించుకోవడం ద్వారా చైనాను నిలువరిస్తుంది’ అన్న అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ హయాంలోని ఇండో-పసిఫిక్‌ విధానపు కీలక వ్యాఖ్య సమకాలీన ప్రపంచంలో భారత్‌కు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని వెల్లడిస్తోంది. ప్రపంచ వాణిజ్యంలో హిందూ మహాసముద్రం కీలక భూమిక పోషిస్తోంది. చైనాతో పాటు ఇతర తూర్పు ఆసియా దేశాలకు మధ్యప్రాచ్యం నుంచి చమురు సరఫరాకు ఇదే కీలక మార్గం. చతుర్భుజ కూటమిలోని అమెరికా, భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియాలకు ఇండో-పసిఫిక్‌ వ్యూహాత్మకంగా ముఖ్యమైంది. ఈ ప్రాంతం ఎటువంటి అలజడులు లేకుండా ప్రశాంతంగా ఉండాలని ఈ కూటమి ఆశిస్తోంది. వివిధ కారణాలతో చైనా నెమ్మదిగా హిందూ మహాసముద్రంలో తన ప్రాబల్యాన్ని విస్తరించేందుకు కుయుక్తులు పన్నుతోంది. గల్వాన్‌ ఘటన తరవాత భారత్‌, చైనాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. లద్దాఖ్‌ సరిహద్దుల్లో ఇరు దేశాల సైన్యాలు వెనక్కిమళ్లినా ఇంతకు ముందున్న ప్రశాంత వాతావరణం లేదు. ఈ పరిస్థితుల్లో ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో బీజింగ్‌ను అడ్డుకోవాలంటే న్యూదిల్లీ సహకారం తప్పనిసరని అమెరికా రక్షణ రంగ నిపుణుల విశ్లేషణ. దక్షిణాసియాలోని చిన్న దేశాల సార్వభౌమాధికారంతో పాటు వాటి ప్రయోజనాలను పరిరక్షించే అంశంలోనూ భారత్‌ చొరవ తీసుకోవాలని వారు అభిలషిస్తున్నారు.

ఒబామా నుంచి బైడెన్‌ వరకూ

చైనాను నిలువరించే వ్యూహంలో భాగంగా ఇప్పటికే భారత్‌ అమెరికా నౌకాదళాలు సంయుక్త విన్యాసాలు నిర్వహించాయి. వీటిలో ఫ్రాన్స్‌ కూడా పాల్గొనడం విశేషం. చైనాను ఎదుర్కొనేందుకు బైడెన్‌ సర్కారు చతుర్భుజ కూటమిని- ప్రత్యేకించి భారత్‌ను కీలక భాగస్వామిగా ఎంచుకుంది. సైనికపరంగా అత్యాధునిక ఆయుధ సంపత్తిని భారత్‌కు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో కూటములు, భాగస్వామ్యాలతో భారత స్థానాన్ని బలోపేతం చేసేందుకు అమెరికా వ్యూహకర్తలు మొగ్గు చూపుతున్నారు. భారత్‌ కూడా తన వ్యూహాలను మరింత వేగవంతం చేసింది.   చతుర్భుజ కూటమి దేశాలతో పాటు ఫ్రాన్స్‌, దక్షిణ కొరియా, సింగపూర్‌లతో సైనిక ఒప్పందాలకు ప్రయత్నిస్తోంది. దిల్లీ-వాషింగ్టన్ల మధ్య రక్షణ సహకారానికి ప్రస్తుత అధ్యక్షులు బైడెన్‌ కూడా తోడ్పడతారని అమెరికా రక్షణ రంగనిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బైడెన్‌ ఉపాధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. చైనాకు ముకుతాడు వేయడానికి సంబంధించి దిల్లీకి సహకరించేందుకు ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. చైనాతో పాక్‌కు సుదీర్ఘకాలంగా ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయి. భారత్‌కు వ్యతిరేకంగా దాయాదిని చైనా రెచ్చగొట్టవచ్చు. చైనా దుందుడుకు విధానాలను వ్యతిరేకిస్తున్న దేశాలను ఒక తాటిపైకి తెచ్చేందుకు అమెరికా యత్నిస్తోంది. అయితే, ఇది కష్టతరమే! పలు దేశాలు చైనా ఉత్పత్తులపై ఆధారపడి ఉన్నాయి. దీంతో అవి డ్రాగన్‌ దేశానికి ఎదురునిలవలేవు. ఈ పరిస్థితుల్లో పలు అంశాలను ఎంచుకుని చైనాను కట్టడి చేయాల్సివుంది.  రెండు దశాబ్దాల నుంచి రక్షణ రంగంలో అమెరికా-భారత్‌ భాగస్వామ్యం పెరుగుతోంది. ప్రచ్ఛన్న యుద్ధం తరవాత చాలాకాలం పాక్‌ను కీలక భాగస్వామిగా అమెరికా భావించేది. 9/11 ఉగ్రవాదుల దాడుల అనంతరం ఆ దేశ వైఖరిలో మార్పు వచ్చింది. ఉగ్రవాదులకు పురిటిగడ్డగా మారిన పాక్‌ తీరును వాషింగ్టన్‌ వ్యతిరేకిస్తోంది. అమెరికాతో రక్షణ ఒప్పందంలో భాగంగా అపాచీ, చినూక్‌ హెలికాప్టర్లు, గ్లోబ్‌మాస్టర్‌ విమానాలు, తీరప్రాంతాల్లో గస్తీ నిర్వహించే అధునాతన పీ8 విమానాలు మనకు సమకూరాయి. ఉభయదేశాల మధ్య ఈ రక్షణ సహకారాన్ని మరింతగా పెంపొందించేందుకు బైడెన్‌ సర్కారు కృషి చేయాలి. భారత ఉపఖండంలో ఉద్రిక్తతల నివారణలోనూ అమెరికా కీలకపాత్ర పోషించాలని రక్షణ వ్యూహకర్తలు సూచిస్తున్నారు. గత నెలలో భారత పర్యటనకు వచ్చిన అమెరికా విదేశాంగ కార్యదర్శి జాన్‌ ఆస్ట్రిన్‌ రక్షణ రంగ సహకారంపై ప్రధాని మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లతో చర్చలు జరిపారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో ఎదురయ్యే సవాళ్లను భారత్‌తో కలిసి ఎదుర్కొంటామని ప్రకటించారు. తాజాగా ఇండో-ఫసిఫిక్‌ విధానాన్ని ‘ప్రమాదకరమైనది’గా రష్యా అభివర్ణించడం గమనార్హం. భారత్‌ను ‘నమ్మకమైన భాగస్వామి’గా పేర్కొంటూనే పాక్‌కు సాయం చేయడానికి మాస్కో సిద్ధమవుతోంది.

ఆంక్షలు విధిస్తారా?

ఇరుదేశాల సైన్యసహకారం, సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం, కృత్రిమ మేధ... తదితరాల్లో అమెరికా చేయూతను భారత్‌ ఆశిస్తోంది. ఆయుధాల దిగుమతిపై మన దేశం ఇప్పటికే భారీగా వెచ్చిస్తోంది. దీనికి ప్రత్యామ్నాయంగా భారత్‌లోనే తయారీపై దృష్టిపెట్టాలని అమెరికాను కోరుతోంది. దేశీయంగా రక్షణ ఉత్పత్తి పరిశ్రమల్లో అమెరికా పెట్టుబడులు పెరగాలని ఆశిస్తోంది. ఇదిలా ఉండగా, రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఈ ఏడాది చివరి నాటికి ఎస్‌400 క్షిపణులు రానున్నాయి. వీటితో శత్రుదేశాల వైమానిక, క్షిపణుల దాడుల నుంచి భారత్‌కు పూర్తి రక్షణ కలుగుతుంది. ఈ ఒప్పందంపై వాషింగ్టన్‌ గుర్రుగా ఉంది. ఈ క్షిపణుల కొనుగోలుపై టర్కీపై విధించిన ‘కాట్సా’ ఆంక్షలను భారత్‌పై విధించే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ విషయంలో అమెరికా తొందరపడే పరిస్థితి లేదు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనాను నిలువరించేందుకు భారత సహకారం తప్పనిసరి కావడమే దీనికి కారణం.

- కొలకలూరి శ్రీధర్‌

Posted Date: 19-04-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం