• facebook
  • whatsapp
  • telegram

సాగుభూమికి సమస్యల అనంత శోకం

జాతీయ రైతుల దినోత్సవం

కాలుష్యం, వాతావరణ మార్పులు, సాగునీటి కొరత, భూసారం దెబ్బతినడం వల్ల ప్రపంచ వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. వాతావరణ మార్పులతో వర్షపాతం, భూగర్భ జల మట్టాలు, నదీ ప్రవాహాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పోనుపోను భూములు సారం కోల్పోతున్నాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అనుసరిస్తున్న పంటల సాగు పద్ధతులు సుస్థిర వ్యవసాయానికి పూచీకత్తు ఇచ్చేవిగా లేవు. ఇలాంటి సాగు పద్ధతుల వల్ల సన్న, చిన్నకారు రైతుల భవిత అంధకారమై, సేద్యానికి దూరమయ్యే ముప్పుంది. పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చేందుకు నీరు, వ్యవసాయ భూముల వినియోగంపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. ప్రజల ఆదాయాలు, జీవన ప్రమాణాలు మెరుగుపడేకొద్దీ నాణ్యమైన ఆహార వినియోగం పెరుగుతుంది. వాటి ఉత్పత్తి కోసం అన్ని వనరుల ధ్వంసం జరుగుతోంది. దాన్ని ఆపడానికే సేంద్రియ సేద్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని మోదీ తాజాగా పిలుపిచ్చారు.

స్వచ్ఛమైన జలాల కొరత

ప్రపంచ జనాభాలో ప్రతి ముగ్గురిలో ఒకరికి అవసరమైనంత ఆహారం దొరకడం లేదని ఐక్యరాజ్యసమితి తాజాగా వెల్లడించింది. ఆరోగ్యకరమైన పోషకాహారం అందనివారు కోట్ల సంఖ్యలో ఉన్నారు. పల్లెల నుంచి పట్టణాలకు నియంత్రణ లేని వలసలు, శరవేగంగా పెరుగుతున్న పట్టణీకరణ వల్ల 2050 నాటికి ప్రపంచ జనాభాలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు పట్టణాల్లోనే నివసిస్తుంటారని అంచనా. అప్పటికి మొత్తం ఆహారోత్పత్తుల్లో 80శాతం పట్టణ జనాభాయే వినియోగిస్తుంది. జనాభా పెరుగుదల, ఆహార కొరత వల్ల తలసరి సహజ వనరుల లభ్యత పడిపోతుంది. విచ్చలవిడిగా జలాల్ని వినియోగిస్తూ కాలుష్యానికి కారణమవుతున్న ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో స్వచ్ఛమైన జలాల కొరత ఏర్పడి సరిహద్దు దేశాలు, రాష్ట్రాల మధ్య వివాదాలు తీవ్రతరం కాకతప్పదు. సాగునీటి వినియోగం, నిర్వహణ విధానాలు సరిగ్గా లేకపోతే ఆహార, ఆర్థిక ఇబ్బందులు తథ్యమని ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) హెచ్చరించింది. ఉదాహరణకు వియత్నామ్‌లో ‘రెడ్‌’ నది ఎగువ భాగంలో అనేక రిజర్వాయర్లు, వాటిపై జల విద్యుదుత్పత్తి కేంద్రాలున్నాయి. వ్యవసాయ బోర్లకు, కాలువలకు కరెంటు మోటార్లు అమర్చి వరి పండిస్తున్నారు. జల విద్యుత్తు కేంద్రాల్లో ఉత్పత్తయ్యే కరెంటు ఆ మోటార్లు నడిపేందుకు సైతం ఉపయోగపడుతోంది. కరవు పరిస్థితులు ఏర్పడినప్పుడు జల విద్యుదుత్పత్తికి నీరు నిల్వ చేసి వాడాలా లేదా కాలువల ద్వారా పొలాలకు, తాగునీటికి ఉపయోగించాలా వంటి సమస్యలు వియత్నామ్‌లో తలెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం కృష్ణా జలాలను విద్యుత్‌ అవసరాల దృష్ట్యా తప్పనిసరిగా వాడుకుంటామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. దానివల్ల తమకు తాగు, సాగునీటికి ఇబ్బందులు వస్తాయని, విద్యుదుత్పత్తికి కృష్ణా జలాలు వాడకుండా చూడాలంటూ ఏపీ ప్రభుత్వం కృష్ణానదీ బోర్డుకు ఇటీవల ఫిర్యాదు చేసింది. ఇటువంటి సమస్యలు పలు దేశాల్లో ఇప్పటికే ఎదురవుతున్నాయి. అమెరికాలో తొమ్మిది రాష్ట్రాల భూగర్భంలో విస్తరించి ఉన్న జలనిధి వినియోగం విషయంలో వివాదాలున్నాయి. వాటిని అధిగమించలేక రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ నీటి వినియోగం తక్కువగా ఉండే పంటలనే సాగు చేయాలంటూ ప్రభుత్వాలు రైతులకు సూచిస్తున్నాయి. వరి సాగు కోసం నీటిని ప్రవాహంలా పారించి పొలంలో నిల్వ చేయడంవల్ల గాలిలోకి మీథేన్‌ వాయువు విడుదలై వాతావరణ కాలుష్యం పెరుగుతోందని ఎఫ్‌ఏఓ హెచ్చరించింది. ఇలాంటి పంటలకు అధికంగా వాడుతున్న రసాయన ఎరువులతో భూమి నిస్సారమవుతోంది. 1990-2019 మధ్య వ్యవసాయం కారణంగా గాలిలోకి వెలువడే వాయువుల పరిమాణం అదనంగా 16శాతం పెరిగింది. దీనివల్ల పంట సాగు, నీటి వినియోగ పద్ధతులను మార్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

వాతావరణ మార్పులను అధిగమించాలి...

వాతావరణ మార్పులతో ఉష్ణోగ్రతలు పెరగడంవల్ల మధ్య ఆఫ్రికా, తూర్పు ఐరోపా దేశాల్లో సాగు విస్తీర్ణం, దిగుబడులు తగ్గి రైతులు నష్టపోతున్నారు. వాతావరణ మార్పులను అధిగమించే ప్రణాళికలతోనే పంటల ఉత్పాదకత పెంచడం సాధ్యం. నేలను, సాగునీటిని కాపాడుతూ ప్రజలకు ఆహార, జీవన భద్రతను కల్పించేందుకు అందరికీ ఉపయోగపడే ఉమ్మడి పరిష్కారం ప్రపంచవ్యాప్తంగా ఉండదు. అయితే, అనేక పరిష్కారాలు, పరిశోధనలు ఆచరణకు అందుబాటులో ఉన్నాయి. వాటిని అమలులోకి తీసుకొచ్చేందుకు సానుకూల వాతావరణ పరికల్పన కోసం దూరదృష్టి కలిగిన ప్రభుత్వాలు అవసరమని ప్రపంచ ఆహార సంస్థ సూచించింది. నీటి కొరత, నిస్సారంగా మారిన భూములు సన్న, చిన్నకారు రైతుల జీవితాలపై తీవ్రప్రభావం చూపుతాయి. ఆహార వృథా, కోత అనంతరం పంట దిగుబడి వినియోగదారులకు చేరేలోగా వాటిల్లుతున్న నష్టాలను తగ్గించాలని ఐక్యరాజ్య సమితి గతంలోనే సూచించింది. దీన్ని సాధిస్తే ఆహార లభ్యత పెరిగి పంటల దిగుబడి పెంచడానికి భూములు, సాగునీటిపై పడుతున్న ఒత్తిడిని తగ్గించవచ్చు. కొన్ని ఆసియా దేశాల్లో వరి సాగుపై ఉపగ్రహ చిత్రాల ద్వారా జరిపిన అధ్యయనంతో సేద్యంలో మార్పులు తేవడానికి అవకాశం ఏర్పడింది. వరి సాగు ఎంత విస్తీర్ణంలో ఉంది, దాని స్థానంలో తరవాతి సీజన్‌లో పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటలు సాగు చేయించడానికి గల అవకాశాలపై ప్రణాళికలను ముందుగానే సిద్ధం చేయడానికి డిజిటల్‌ సాంకేతికత ఉపయోగపడింది. సహజ వనరులపై ఆధారపడి చేసే సేద్యం ద్వారానే లక్ష్యాలు నెరవేరేలా ప్రణాళికలు ఉండాలి. భూసారాన్ని దెబ్బతీస్తూ, సాగునీటి వృథాకు దారితీసే సేద్యంతో ప్రజలకు ఆహార భద్రత కల్పించడం అసాధ్యమన్న సంగతి గుర్తించాలి. ప్రపంచవ్యాప్తంగా సాగునీరు, భూముల వినియోగంలో ఎక్కడికక్కడ స్థానిక అవసరాల మేరకు చర్యలు చేపడితేనే ప్రజలకు ఆహార భద్రత కల్పించడం సాధ్యమన్నది ఐరాస సూచన. అది శిరోధార్యం?

విచ్చలవిడిగా రసాయనాల వాడకం

పంటల దిగుబడి పెరుగుతుందనే ఉద్దేశంతో మన దేశంలో రైతులు ఇష్టారీతిగా రసాయన ఎరువులు, పురుగు మందులు వినియోగిస్తున్నారు. ఇది బహుళ జాతి కంపెనీలకు లాభాలు కురిపిస్తోంది. గత రెండేళ్లలో ఎరువుల రాయితీకే సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలకుపైగా వెచ్చించారు. ఇది దేశానికి ఆర్థిక భారమే. ఆ రసాయనాలను తనలో కలుపుకొన్న నేల సారం కోల్పోతోంది. పంటల సాగుకు 2001లో హెక్టారుకు సగటున 86.7 కిలోల రసాయన ఎరువులను చల్లిన రైతులు 2020కల్లా సగటున 134 కిలోలు వాడినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సగటు ఏకంగా 180 కిలోలకు చేరింది. పంజాబ్‌ తరవాత తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రసాయనాలు వాడుతూ భూమి ఆరోగ్యాన్ని గుల్లచేస్తుండటంతో నేల నిస్సారంగా మారుతోంది.

 

- మంగమూరి శ్రీనివాస్‌

Posted Date: 23-12-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం