• facebook
  • whatsapp
  • telegram

ఆగని వ్యధ... ఆహార వృథా

‘సమితి నివేదిక’లో కఠోర వాస్తవాలు

‘అన్నమో రామచంద్రా...’ అంటూ ఓవైపు కోట్లమంది అన్నార్తుల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. మరోవైపు బాధ్యతారహితంగా ఆహారం పెద్దయెత్తున వృథా అవుతున్న వాతావరణం సర్వత్రా కనిపిస్తోంది. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం(యునెప్‌), డబ్ల్యూఆర్‌ఏపీ సంయుక్తంగా విడుదల చేసిన తాజా నివేదిక- ప్రపంచవ్యాప్తంగా ఏటా 93కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతున్నట్లు వెల్లడించింది. ఇది ఆహార భద్రతకు పొంచి ఉన్న ముప్పును సూచిస్తోంది. భారత్‌లో ఏటా 6.8కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతున్నట్లు ఆ నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ఆహారంలో 17శాతం వృథాగా పోతున్నట్లు నివేదిక నిగ్గు తేల్చింది. 2019లో ప్రపంచవ్యాప్తంగా 69కోట్ల ప్రజలు ఆకలిబాధ అనుభవించగా, మరోవైపు ఆహార వృథా సైతం గణనీయంగా పెరిగింది.  ఐక్యరాజ్య సమితి భద్రతామండలి అత్యున్నత సమావేశంలో సెక్రటరీ జనరల్‌ ఆంటోనియా గుటెరస్‌ ఇటీవల ప్రసంగిస్తూ- ప్రపంచానికి తీవ్ర దుర్భిక్షం ముప్పు పొంచి ఉందన్నారు. 12 దేశాలకు చెందిన 3.4కోట్లమంది ప్రజలు ఆకలిచావుతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించడం సమస్య తీవ్రతకు అద్దంపడుతోంది.

బాధ్యతారాహిత్యం

ఆహార పదార్థాల వృథా పర్యావరణ కాలుష్యానికి దారితీస్తోంది. చైనాలో ఒక్కో ఇంటినుంచి సగటున ఏడాదికి 64 కిలోల ఆహారాన్ని బయట పారబోస్తున్నారు. మరోవంక అమెరికన్లు సగటున 59 కిలోలు, భారతీయులు 50కిలోల ఆహారం వృథా చేస్తున్నారు. అవసరానికి మించి కొనుగోలు చేయడమే మన దేశంలో ఆహార వృథాకు కారణం. వివిధ ఉత్పత్తుల ధరలపై ప్రకటించే ‘డిస్కౌంట్‌’ల మాయలో పడి అవసరానికి మించి ఎక్కువ మోతాదులో కొంటున్నారు. సరైన నిల్వ, శీతలీకరణ సదుపాయాలు లేకపోవడం మరో సమస్య. 2018లో విడుదలైన ఓ నివేదిక ప్రకారం భారత్‌లో వృథా అవుతున్న ఆహారం- యూకేలోని ప్రజలు వినియోగించే మొత్తం ఆహారానికి సమానం! మరో అంచనా ప్రకారం- దేశంలో సుమారు 10శాతం నుంచి 20శాతం వరకు ఆహారం- వివాహాది శుభకార్యాల్లోనే వృథా అవుతోంది. ఏడాది కాలంలో పారబోస్తున్న ఆహార పదార్థాల సగటు విలువ- 14 వందల కోట్ల డాలర్లకు సమానం. ప్రపంచ ఆకలిసూచీలోని 107 దేశాల జాబితాలో భారత్‌ 94వ స్థానంలో ఉంది. దేశంలోని సంపన్నవర్గాలు బాధ్యతారహితంగా ఆహారపదార్థాల వృథాకు పాల్పడుతుండటం ఆందోళన కలిగించే అంశం. వాతావరణంలోకి విడుదలవుతున్న ‘గ్రీన్‌హౌస్‌’ ఉద్గారాల్లో దాదాపు ఎనిమిది నుంచి 10శాతానికి ఆహార పదార్థాల వృథాయే కారణం!

కఠిన నిబంధనలు కావాలి

ప్రపంచవ్యాప్తంగా రీటైల్‌, వినియోగదారుల స్థాయుల్లో తలసరి ఆహార వృథాకు అడ్డుకట్ట వేసి- 2030నాటికి ఆ పరిమాణాన్ని సగానికి సగం తగ్గించాలన్నది ‘సమితి’ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో కీలకమైనది. ఈ లక్ష్య సాధనలో భారత్‌కు ఇక తొమ్మిదేళ్ల సమయమే మిగిలి ఉంది. జి-20 కూటమి సభ్యదేశమైన యూకే- 13 ఏళ్లుగా డబ్ల్యూఆర్‌ఏపీ (వేస్ట్‌ అండ్‌ రిసోర్సెస్‌ యాక్షన్‌ ప్రోగ్రామ్‌) ద్వారా ఆహారపదార్థాల వృథాను అరికట్టేందుకు చర్యలు చేపడుతోంది. నిరంతర ప్రయత్నాల ద్వారా అక్కడ ఆహార వృథాను 21శాతానికి తగ్గించుకోవడం విశేషం. పొరుగుదేశమైన పాకిస్థాన్‌లో ఏటా సగటున 60 లక్షల టన్నుల ఆహారం వృథా అవుతోంది. గడచిన 15 ఏళ్లుగా పాక్‌లో అతిథి నియంత్రణ నిబంధనలు అమలులో ఉన్నాయి. దీనిలో భాగంగా విందులు, శుభకార్యాల్లో వడ్డించేందుకు వివిధ రకాల ఆహారాలకు బదులు ఒకే తరహా పదార్థాలు వినియోగిస్తున్నారు. తద్వారా ఆహార వృథా కొంతలో కొంతైనా అదుపులోకి వచ్చింది. చైనాసైతం 2020నుంచి ‘స్వచ్ఛ పళ్లెం ప్రచార’ కార్యక్రమంలో భాగంగా ఆహార పదార్థాల వృథాను అరికట్టడానికి కొన్ని నిర్దిష్ట చర్యలు చేపడుతోంది. ‘ఉహాన్‌ క్యాటరింగ్‌ పరిశ్రమల సంఘం’ అక్కడి రెస్టారెంట్లకు విచ్చేసే అతిథులకు ఒకేరకం ఆహార పదార్థాలు వడ్డించే విధంగా మార్గదర్శకాలు జారీ చేసింది. భారత్‌లోనూ ఇదే తరహాలో అసోం, దిల్లీ, జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాల్లో ఆరు, ఏడు దశకాల్లో అతిథి నియంత్రణ చట్టాలు అమలులోకి వచ్చాయి. 1991నాటి సరళీకృత ఆర్థిక విధానాల నేపథ్యంలో, ఆ చట్టాలు ఆచరణ సాధ్యం కాలేదు. క్షేత్రస్థాయిలో పౌరసమాజంతో సమన్వయం చేసుకొని ముందుకు సాగితేనే ఆహార వృథాను అరికట్టగలుగుతాం. రాజకీయ పార్టీలతోపాటు సంపన్న వర్గాలూ ఆ క్రమంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంది. ‘స్వచ్ఛభారత్‌’ తరహాలో క్షేత్రస్థాయిలో, మెరుగైన ప్రభావాన్విత కార్యాచరణకు శ్రీకారం చుట్టాలి. ప్రతి పౌరుణ్నీ ఈ మహత్తర క్రతువులో భాగస్వామిగా మార్చాలి. ఫలితంగా పర్యావరణ సమస్యలకు అడ్డుకట్ట వేయడంతోపాటు, ఆకలి ముప్పునూ ఎదుర్కోగలుగుతాం. కరోనా సంక్షోభ సమయంలో సంపద పొదుపూ సాధ్యమవుతుంది.

జి-20 దేశాల కృషి

టర్కీలో 2015లో జరిగిన జి-20 దేశాల సమావేశం ఆహారవృథా సమస్యలను అధిగమించేందుకు సభ్యదేశాలు ముమ్మర చర్యలు చేపట్టాలని కోరింది. ఈ చర్యల ఫలితంగానే 2015లో ఆహారవృథా, ఆహార నష్టాన్ని మదింపు చేయడం, తగ్గించడం కోసం జి-20 సాంకేతిక వేదిక ఏర్పాటైంది. 2020 సెప్టెంబరులో జరిగిన జి-20 సదస్సు సైతం ఆ దిశగా కృషి చేయాల్సిన ఆవశ్యకతను ఉద్ఘాటించింది. 2023లో జరగనున్న జి-20 దేశాల సదస్సుకు భారత్‌ అధ్యక్షత వహించనున్న దృష్ట్యా ఈ సమస్య పరిష్కారానికి మరింత శ్రద్ధగా ప్రయత్నించాలి.

Posted Date: 25-03-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం