• facebook
  • whatsapp
  • telegram

మహిళా స్వేచ్ఛకు తాలిబన్ల సంకెళ్లు

అఫ్గాన్‌లో ఆటవిక పాలన

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు రెండోసారి అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పుడు మహిళల స్వేచ్ఛ విషయంలో గతంలో కంటే ఉదారంగా వ్యవహరిస్తామని నమ్మబలికే ప్రయత్నం చేశారు. మొదటిసారి వారి ప్రభుత్వం ఏర్పడినప్పుడు మహిళలు ఇంటినుంచి కాలు బయటపెట్టేందుకు వీల్లేకుండా క్రూరమైన ఆంక్షలు విధించారు. ఈసారి కొద్దిపాటి నిబంధనలతో మహిళలకు అన్ని అవకాశాలూ కల్పిస్తామని తాలిబన్లు హామీ ఇచ్చారు. అవన్నీ కల్లలేనని తెలిసేందుకు ఎంతోకాలం పట్టలేదు. అఫ్గాన్‌లో మహిళా స్వేచ్ఛ ఇప్పటికీ ఎండమావిగానే ఉంది. గతంలో దేశవ్యాప్తంగా ఒకే తరహా నిబంధనలను తాలిబన్లు విధించారు. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మహిళలు, బాలికలు ఎలా ఉండాలో కచ్చితంగా చెబుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ ఆ తరహా ఆంక్షలే ఉండటంతో, దేశమంతటా వాటిని పాటించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.

తీవ్ర నిర్బంధం

ఒకప్పుడు అఫ్గాన్‌లో విద్య, దుస్తులు వంటి విషయాల్లో మహిళలపై ఎలాంటి ఆంక్షలూ ఉండేవి కావు. 1919లోనే అక్కడి మహిళలకు ఓటుహక్కు ఉండేది. 1963-73 మధ్య కాలాన్ని అఫ్గాన్‌ మహిళలకు స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. 1960లలోనే వారు రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1965లో పార్లమెంటుకు ఎన్నికైన తొలి అఫ్గాన్‌ మహిళల్లో ఒకరిగా అనహితా రతెబ్జాద్‌ గుర్తింపు పొందారు. 1970ల నాటికి కాబూల్‌ విశ్వవిద్యాలయంలో చేరే విద్యార్థుల్లో అధికశాతం మహిళలే ఉండేవారు. తాలిబన్లు తొలిసారి అధికారాన్ని హస్తగతం చేసుకోగానే ఆ పరిస్థితులన్నీ మారిపోయాయి. 1996 నుంచి 2001 వరకు సాగించిన తొలి పాలనలో తాలిబన్లు మహిళలపై క్రూరమైన చట్టాలను అమలుచేశారు. అన్నిరకాల విద్యాసంస్థల నుంచి వారిని నిషేధించి, ఇంటికే పరిమితం చేశారు. చట్టాలను ఉల్లంఘిస్తే రాళ్లతో కొట్టడం, కొరడాదెబ్బలు, చివరకు కాళ్లు, చేతులు తొలగించడం లాంటి శిక్షలు అమలుచేశారు.

రెండు దశాబ్దాల తరవాత మళ్ళీ 2021 ఆగస్టులో తాలిబన్లు అఫ్గాన్‌లో అధికారం చేపట్టాక కొద్దిపాటి మార్పులతో దాదాపు ఆనాటి పరిస్థితులే పునరావృతం అవుతున్నాయి. మహిళలు ఉద్యోగాలు చేసుకోవచ్చుగానీ, అక్కడి పురుషులతో మాట్లాడకూడదని ఆంక్షలు విధిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడా మహిళలకు అవకాశాలు కల్పించడంలేదు. వాణిజ్య సంస్థల్లో మహిళా ఉద్యోగులను, పురుషులను వేర్వేరుగా ఉంచుతున్నారో లేదోనని తాలిబన్‌ నిఘాసంస్థల సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. అమ్మాయిలందరూ చదువుకునేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పినా, 13-18 ఏళ్ల వయసు బాలికలు, యువతులు విద్యాభ్యాసం చేసే విద్యాలయాలు తాలిబన్ల పునరాగమనం తరవాత ఇప్పటిదాకా తెరచుకోలేదు. ప్రాథమిక పాఠశాలలు మాత్రమే కొనసాగుతున్నాయి. త్వరలో అన్ని విద్యాసంస్థలను తెరుస్తామని ప్రకటనలైతే చేస్తున్నారుగానీ, వాటిలో బోధన సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. అమ్మాయిలు చదువుకునే పాఠశాలల్లో పురుష ఉపాధ్యాయులను తాలిబన్లు అనుమతించడం లేదు. బోధనకు ముందుకొచ్చే ఉపాధ్యాయినుల సంఖ్య అంతంతమాత్రంగానే ఉంది. ఫలితంగా ఆ పాఠశాలలు ఎంతవరకు పనిచేస్తాయన్నది అనుమానంగానే ఉందని అంతర్జాతీయ పరిశీలకులు అంటున్నారు.

విశ్వవిద్యాలయాల్లోనూ స్త్రీ, పురుష విద్యార్థులకు కలిపి పాఠాలు బోధించడానికి తాలిబన్లు అనుమతించకపోవడంతో హాజరు అంతంతమాత్రంగానే ఉంటోంది. వర్సిటీల్లోనూ బోధన సిబ్బంది కొరత వేధిస్తోంది. మహిళలు బయటికి వెళ్తే తప్పనిసరిగా పురుష బంధువులు వెంట ఉండాలని తాలిబన్లు నిబంధన విధించారు. హిజాబ్‌ ధరించనివారిని టాక్సీల్లో ఎక్కించుకుంటే కఠిన శిక్షలు తప్పవన్న హెచ్చరికలు డ్రైవర్లకు జారీ అయ్యాయి. దుకాణాల ముందు ఏర్పాటుచేసే నిలువెత్తు స్త్రీ బొమ్మల తలలు నరికివేశారు. ఆ బొమ్మలకు హిజాబ్‌ లేకపోవడమే దానికి కారణం! మహిళల బొమ్మలు ఉండే హోర్డింగులనూ తొలగించారు. తాలిబన్ల పాలన మొదలు కాక ముందువరకు బ్యూటీపార్లర్లు, ఫ్యాషన్‌ బొటిక్‌లు అఫ్గాన్‌లో బాగా సాగేవి. ప్రస్తుతం అవన్నీ మూతపడ్డాయి.

మాధ్యమాల్లో నిరసన

టీవీ కార్యక్రమాల్లోనూ మహిళలు కనిపించకూడదని, టీవీ ఛానళ్ల మహిళా రిపోర్టర్లు కెమెరా ముందుకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా బురఖా ధరించాలని తాలిబన్లు హుకుం జారీచేశారు. మహిళలు క్రీడలు ఆడటం ‘అనవసరం’ అని ఒక సీనియర్‌ తాలిబన్‌ అధికారి వ్యాఖ్యానించడం వారి ధోరణికి అద్దం పడుతుంది. దేశంలో చాలామంది మహిళా సంగీత విద్వాంసులు, కళాకారులు, చిత్రకారులు, ఫొటోగ్రాఫర్లు, గాయనీమణులు తాలిబన్‌ పాలన మొదలవగానే దేశం వదిలి వెళ్ళిపోయారు లేదా రహస్య జీవనం గడుపుతున్నారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అమ్మాయిలకు తాలిబన్లు కొత్త డ్రెస్‌కోడ్‌ను విధించారు. వారు బురఖాతో పాటు చేతి తొడుగులూ ధరించాలి. అంటే వారి జుత్తు, ముఖం, చేతులు, ఏవీ బయటికి కనిపించకూడదు. అంతకు ముందున్న మహిళా వ్యవహారాల మంత్రిత్వ శాఖను సైతం తొలగించారు. ఈ డ్రెస్‌కోడ్‌పై అఫ్గాన్‌ మహిళలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం మొదలుపెట్టారు. రంగురంగుల సంప్రదాయ దుస్తులు ధరించి పోస్టులు పెడుతూ, తమ వస్త్రాల జోలికి రావద్దంటూ వాటికి హ్యాష్‌ట్యాగులు జోడిస్తున్నారు. అఫ్గాన్‌ సంప్రదాయ దుస్తులు ఎలా ఉంటాయో ఈ ప్రపంచానికి చూపిస్తామంటున్నారు. అఫ్గాన్‌ మహిళల పోరాటానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభించి, వారికి తగిన స్వేచ్ఛ దొరుకుతుందని ఆశిద్దాం!

- రఘురామ్‌ పువ్వాడ
 

‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 17-02-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం