• facebook
  • whatsapp
  • telegram

చైనా గుప్పిట శ్రీలంక

భద్రత పరంగా భారత్‌కు ఇబ్బందే!

భారత్‌కు దక్షిణ దిశలోని శ్రీలంక, హిందూ మహాసముద్రంలో కీలక ద్వీపదేశం. లంక పశ్చిమ తీరంలో ఉన్న కొలంబో నౌకాశ్రయం అంతర్జాతీయ సముద్ర వాణిజ్యానికి ఆయువుపట్టు వంటిది. పశ్చిమాసియా, ఆఫ్రికా, అమెరికా తీరాల నుంచి వచ్చే భారత రవాణా నౌకలకు ఇక్కడ లంగర్‌ వేసి, చిన్న చిన్న నౌకల్లోకి సరకులను తరలిస్తారు. అనంతరం అవి భారత్‌లోని వివిధ నౌకాశ్రయాలకు చేరుకుంటాయి. కొలంబో నౌకాశ్రయం భారత్‌ నుంచే అత్యధిక ఆదాయం పొందుతోంది. ఇంతటి వ్యూహాత్మక ప్రదేశంలో ఉన్న ఈ నౌకాశ్రయానికి చేరువలోనే చైనా సారథ్యంలోని పోర్టు సిటీకి శ్రీలంక అధినాయకత్వం శరవేగంగా అనుమతులు మంజూరు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బిల్లు శ్రీలంక సార్వభౌమాధికారానికి భంగం కలిగించేదిగా ఉందంటూ దాఖలైన పలు పిటిషన్లను ఆ దేశ సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే బిల్లులోని కొన్ని అంశాలను సవరించాలని ఆదేశించడంతో  గొటబయ సర్కారు అందుకు అంగీకరించింది. ఈ నూతన రేవు నగరం దుబాయ్‌, సింగపూర్‌ తరహాలో అభివృద్ధి సాధించనుందని ప్రభుత్వం చెబుతోంది. బ్యాంకింగ్‌, వాణిజ్యం తదితర సేవలకు పోర్టు సిటీ కేంద్రంగా నిలుస్తుందని అధికారులు హామీ ఇస్తున్నారు. చైనా బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ (బీఆర్‌ఐ) పథకంలో   కీలకమైన సముద్ర సిల్క్‌ రహదారిలో ఈ ప్రాజెక్టు ముఖ్యమైనది. కొలంబో నౌకాశ్రయానికి సమీపంలో బీజింగ్‌ సంస్థల ఆధ్వర్యంలో పోర్టు సిటీ రావడం భద్రతరీత్యా భారత్‌కు ఆందోళన కలిగించే అంశమే. సముద్రతీర ప్రాంతాలు కలిగిన వర్ధమాన దేశాలపై చైనా వ్యూహాత్మకంగా అత్యంత ప్రేమ కనబరుస్తూ, ఉదారంగా వేల కోట్ల రూపాయల రుణాలను ఇస్తోంది. అనంతరం కొన్నాళ్లకు ఆ దేశంలోని కీలక ప్రాంతాలను తన అధీనంలోకి తీసుకుంటుంది. హిందూ మహాసముద్రంలో అడుగుపెట్టే ఎత్తుగడల్లో భాగంగానే శ్రీలంకలో అడుగు మోపడానికి రెండు దశాబ్దాలుగా చైనా ప్రయత్నిస్తోంది. లంకలో బీజింగ్‌కు మద్దతునిచ్చే నాయకత్వం ఉండటంతో తన విస్తరణను కొనసాగిస్తోంది.

కొలంబో పోర్టు సిటీ ఆర్థిక కమిషన్‌ బిల్లు ప్రకారం ప్రత్యేక ఆర్థిక మండలిని ఏర్పాటు చేస్తారు. పోర్టు సిటీలో లైెసెన్సులు, అనుమతులు, రిజిస్ట్రేషన్లు జారీచేసే అధికారం మండలికి ప్రాప్తిస్తుంది. ఈ ప్రాజెక్టును చైనా సంస్థల ఆధ్వర్యంలో 2014లోనే ప్రారంభించినా, మైత్రిపాల ప్రభుత్వం నిలిపివేసింది. అనంతరం ప్రారంభమైన ఈ ప్రాజెక్టు 2018లో పూర్తయింది. తిరిగి 2019లో అధికారంలోకి వచ్చిన రాజపక్స సోదరులు చైనాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతంలో మహింద   రాజపక్స అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నిర్మించిన హంబన్‌టొటా నౌకాశ్రయాన్ని చైనాకు 99 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడం తెలిసిందే. ప్రస్తుతం మహింద ప్రధానిగా, ఆయన సోదరుడు గొటబయ అధ్యక్షుడిగా ఉన్నారు. సింహళ అతివాద రాజకీయాలకు పేరొందిన రాజపక్స సోదరులు భారత్‌కు వ్యతిరేకం కాదంటూనే చైనాకు సన్నిహితం కావడం గమనార్హం! తాజాగా పోర్టు బిల్లుకు సంబంధించి ప్రతిపక్షాలతోపాటు పలు బౌద్ధ సంఘాలు సైతం ఈ ప్రాజెక్టును చైనాకు    అప్పగించవద్దంటూ డిమాండ్‌ చేశాయి. కానీ ఆ అభ్యంతరాలను పట్టించుకోని ప్రభుత్వం సుప్రీంకోర్టు సూచనల మేరకు బిల్లును సవరించి పార్లమెంటు ఆమోదం పొందింది.

శ్రీలంక సార్వభౌమాధికారానికి భంగకరమంటూ కార్మిక సంఘాలు, జాతీయవాదులు చేసిన ఆందోళనను పరిగణనలోకి తీసుకున్నామన్న ఆ దేశ సర్కారు- కొలంబో నౌకాశ్రయ తూర్పు టెర్మినల్‌ నిర్మాణంలో భారత్‌, జపాన్‌లతో కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేసింది. కొలంబో పోర్టు సిటీ అంశంలో మాత్రం ప్రతిపక్షాలు, బౌద్ధ, కార్మిక సంఘాలు లేవనెత్తిన అభ్యంతరాలను ఏ మాత్రం పట్టించుకోలేదు. ఈ పరిణామంతో చైనాకు శ్రీలంక మరో రాష్ట్రంగా మారనుందని అక్కడి తమిళ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాణిజ్య అవసరాల పేరిట పోర్టు సిటీ చైనా కంపెనీల సారథ్యంలో ఉన్నా, అత్యవసర సమయాల్లో చైనా నౌకాదళమూ అక్కడ తిష్ఠవేసే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటి వరకు భారత్‌ తన దక్షిణ తీర భాగాన్ని ఎలాంటి అలజడులు లేని ప్రాంతంగా భావిస్తూ వస్తోంది. దానితో రక్షణపరంగా ఇక్కడ పెద్దగా దృష్టి సారించలేదు. ఇండో-పసిఫిక్‌ వ్యూహంలో తిరుగులేని శక్తిగా మారాలనుకున్న భారత్‌కు చైనా రాక ఇబ్బంది కలిగించేదే. ఇండియాకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని శ్రీలంక ప్రభుత్వం హామీ ఇస్తోంది కానీ, దాన్ని విశ్వసించే పరిస్థితి లేదు. భారత భద్రతకు ప్రమాదకరమైన ఈ పరిణామాలపై న్యూదిల్లీ నాయకత్వం సత్వరం స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది! 

- కొలకలూరి శ్రీధర్‌
 

Posted Date: 27-05-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం