• facebook
  • whatsapp
  • telegram

డిజిటల్‌ పోరులో ఉక్రెయిన్‌ పైచేయి!

సాంకేతికత సాయంతో ఆధునిక రణరీతి

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య భూమి మీదే కాదు- డిజిటల్‌ సీమలోనూ పోరాటం కొనసాగుతోంది. అమెరికా, ఐరోపా సమాఖ్య(ఈయూ)లు అంతర్జాతీయ బ్యాంకింగ్‌ యంత్రాంగం నుంచి రష్యాను వెలివేయడం రష్యన్‌ పౌరులపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. వారు వీసా, మాస్టర్‌ కార్డులను ఉపయోగించి ఏటీఎంల నుంచి డబ్బు తీసుకోలేకపోతున్నారు. ట్విటర్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలు కూడా రష్యా అనుకూల ప్రచారంపై కత్తెర వేశాయి. సంప్రదాయ యుద్ధాలకు భిన్నంగా ఆధునిక యుద్ధాల్లో ఎలెక్ట్రానిక్‌, సైబర్‌, సమాచార సమరాలు కీలక అంతర్భాగాలుగా మారాయి. గూఢచర్య సమాచార సేకరణకు అధునాతన సాంకేతికతలను ఉపయోగించడం సర్వవ్యాప్తమైంది.

సమాచార యుద్ధం

పత్రికలు, టీవీ ఛానళ్లు, సామాజిక మాధ్యమాల్లో ప్రసారమయ్యే వ్యాఖ్యలు, చిత్రాలకు, రహస్య గూఢచారులు సేకరించిన సమాచారాన్ని జోడించి కృత్రిమ మేధ సాయంతో తమ కోణాన్ని విరివిగా ప్రచారంలోకి తీసుకురావడం సమాచార యుద్ధం కిందకు వస్తుంది. ప్రత్యర్థుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం, అంతర్జాతీయ ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడం- సమాచార యుద్ధం లక్ష్యాలు. ఈ విషయంలో తొలి అంచెలో రష్యాకన్నా ఉక్రెయిన్‌ పైచేయి సాధించిందని చెప్పాలి. ఉక్రెయిన్‌లో పౌరులకు, మౌలిక వసతులకు రష్యన్‌ సేనలు కలిగిస్తున్న నష్టాన్ని చూసి ప్రపంచ దేశాలు రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌ను తెగనాడటం దీనికి నిదర్శనం. చివరకు రష్యాలో కొన్నిచోట్ల సైతం ఉక్రెయిన్‌పై దాడికి నిరసనగా ప్రదర్శనలు జరిగాయి. ఈ సమాచార యుగంలో ప్రత్యర్థిని దెబ్బతీయడానికి అవాస్తవ సమాచారాన్ని ప్రసారం చేసేందుకూ వెనకాడని ధోరణులు ప్రస్ఫుటమవుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యన్‌ బాంబర్‌ విమానాలు దాడులు చేస్తున్నట్లు మొదట్లో ప్రసారమైన పోస్టులు ఏదో వీడియో గేమ్‌లోనివని నిర్ధారణ కావడాన్ని ఇక్కడ ఉదాహరించాలి.

గూగుల్‌, మెటా (ఫేస్‌బుక్‌), ట్విటర్‌, టెలిగ్రామ్‌ తదితర సామాజిక మాధ్యమాలు రష్యా, ఉక్రెయిన్‌ల సమాచార యుద్ధానికి వేదికలయ్యాయి. ఉక్రెయిన్‌ విజ్ఞప్తిని పురస్కరించుకుని గూగుల్‌, ఫేస్‌బుక్‌లు రష్యన్‌ ప్రభుత్వ సమాచార సంస్థల వాణిజ్య ప్రకటనలను నిషేధించాయి. సామాజిక మాధ్యమాల్లో రష్యా దుష్ప్రచారాన్ని ఎలా ఎదుర్కోవాలనే విషయమై గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ ఈయూ నాయకులతో మాట్లాడారు. రష్యాకు చెందిన టెలిగ్రామ్‌ మెసేజింగ్‌ యాప్‌ యుద్ధానికి సంబంధించిన ఛానల్స్‌ను మూసివేస్తామని హెచ్చరించింది. తమ యాప్‌ను రష్యా, ఉక్రెయిన్‌లు సమాచార యుద్ధానికి ఉపయోగించుకోకుండా చూడటం టెలిగ్రామ్‌ ఉద్దేశం. రష్యా ప్రభుత్వ సంస్థల దుష్ప్రచారాన్ని అడ్డుకోవడానికి ట్విటర్‌, యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌లు తగు చర్యలు తీసుకొన్నాయి. తటస్థతను కాపాడుకోవడానికి ఈ చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నాయి. ఇదంతా చివరకు రష్యా, చైనాలు ఈ సామాజిక మాధ్యమాలను నిషేధించడానికి; అమెరికా, ఈయూలు నియంత్రణలు విధించడానికి దారితీస్తుందా అనే తర్జనభర్జన మొదలైంది. రష్యా సేనలు ఉక్రెయిన్‌ భూభాగంలోకి చొచ్చుకెళ్ళిన రోజే ఉక్రెయిన్‌ ప్రభుత్వం, పార్లమెంటు, విదేశాంగ తదితర శాఖల వెబ్‌సైట్లపై రష్యన్‌ హ్యాకర్లు దాడి చేసి స్తంభింపజేశారు. ఉక్రెయిన్‌ ప్రభుత్వ కంప్యూటర్లలోని సమాచారాన్ని చెరిపేయడానికి ‘వైపర్‌’ మాల్‌వేర్‌ను ప్రయోగించారు. రష్యన్ల సైబర్‌ దాడులను ఎదుర్కోవడమే కాదు, రష్యా ప్రభుత్వ కంప్యూటర్లను కకావికలం చేయగల ఐటీ వాలంటీర్ల సేవలను ఉక్రెయిన్‌ ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. రష్యాపై డిజిటల్‌ యుద్ధాన్ని ప్రకటించిన అంతర్జాతీయ హ్యాకర్‌ బృందం ‘ఎనానిమస్‌’ ఉక్రెయిన్‌కు ఈ విషయంలో తోడ్పడుతోంది. రష్యన్‌ ప్రభుత్వం తరఫున పాశ్చాత్య దేశాల్లో రష్యా అనుకూల ప్రసారాలు నిర్వహించే వార్తాసంస్థ ‘ఆర్‌టీ’ వెబ్‌సైట్‌పై సైబర్‌ దాడులు జరిగాయి. రష్యన్‌ హ్యాకర్లు ఉక్రెయిన్‌ శతఘ్నులను నడిపే యాప్‌లను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించారు. ఉక్రెయిన్‌ను సమర్థిస్తున్న జర్మన్‌ వార్తాపత్రికలు, సామాజిక మాధ్యమ ఖాతాలపై రష్యన్‌ సైబర్‌ దాడులు జరిగాయి. శత్రువు రాడార్లను, కమ్యూనికేషన్‌ వ్యవస్థలను ఏమార్చడం లేదా నాశనం చేయడం- ఎలెక్ట్రానిక్‌ యుద్ధం కిందకు వస్తాయి. యుద్ధ కాలంలో ఉపగ్రహాల నుంచి సమాచారం, సంకేతాలు అందకుండా- ఇంటర్నెట్‌, సెల్‌ టవర్లు పనిచేయకుండా నిరోధించడం ఎలెక్ట్రానిక్‌ యుద్ధంలో అంతర్భాగమే. తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా ఈ చర్యలన్నీ చేపట్టింది.

ఆర్థిక ఆంక్షలు

రష్యన్‌ బ్యాంకులపైన, కుబేరులు, కంపెనీలపైన అమెరికా, ఈయూలు ఆర్థిక ఆంక్షలు విధించిన దరిమిలా వీసా, మాస్టర్‌ కార్డులు, గూగుల్‌ పే, అమెజాన్‌ పే యాప్‌లు రంగంలోకి దిగాయి. రష్యన్‌ ప్రజలకు, కంపెనీలకు చెల్లింపు సేవలను నిరాకరించాయి. రష్యాలోని 30 కోట్ల క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల్లో 21.6 కోట్లు వీసా, మాస్టర్‌ కార్డులు జారీ చేసినవే. అవి స్తంభించిపోవడంతో రష్యన్‌ ప్రజలు క్రెడిట్‌, డెబిట్‌ కార్డులను ఉపయోగించలేకపోతున్నారు. డిజిటల్‌ చెల్లింపులు జరపలేకపోతున్నారు. ఇలాంటి అవాంతరాలను నివారించడానికి భారత ప్రభుత్వం ముందుచూపుతో 2012లో రుపే డెబిట్‌ కార్డును అందుబాటులోకి తెచ్చింది. మొదట్లో ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజనకు విరివిగా వినియోగించిన రుపే కార్డులు నేడు అనేక దేశాల్లో వినియోగంలో ఉన్నాయి. ఆన్‌లైన్‌ చెల్లింపులకు భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ ఫేస్‌ (యూపీఐ) ఆధారంగా ఫోన్‌పే యాప్‌ రంగ ప్రవేశం చేసింది. యూపీఐని సింగపూర్‌, భూటాన్‌లు కూడా స్వీకరించాయి. రుపే కార్డులు, యూపీఐ సాంకేతికతలను రష్యాకు అందించాలని భారత ప్రభుత్వానికి సూచనలు అందుతున్నాయి.

డ్రోన్‌ల బీభత్సం

టర్కీలో తయారైన బైరక్తార్‌ డ్రోన్లను రష్యన్‌ సేనలపై ఉక్రెయిన్‌ విజయవంతంగా ప్రయోగిస్తోంది. 2020లో టర్కీ, ఇజ్రాయెల్‌ సరఫరా చేసిన డ్రోన్లతోనే రష్యా మద్దతు గల ఆర్మీనియా సేనల మీద అజర్‌ బైజాన్‌ పైచేయి సాధించింది. బైరక్తార్‌ డ్రోన్‌ మానవ చోదకుడు లేకుండానే ఎగిరి శత్రువుపై దాడి చేస్తుంది. ఇది ఆకాశంలో 27 గంటల వరకు నిర్విరామంగా ఎగరగలదు. నాలుగు లేజర్‌ ఆధారిత బాంబులను తీసుకుని 300 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళి దాడి చేయగలదు. ఫిబ్రవరి 27న రష్యన్‌ బక్‌ క్షిపణి వ్యవస్థపై బైరక్తార్‌ డ్రోన్‌ విరుచుకుపడిన దృశ్యం ట్విటర్‌లో చక్కర్లు కొట్టింది. తరవాత ఇలాంటి దాడి మరొకటి చేశామని ఉక్రెయిన్‌ వాయుసేన ప్రకటించింది. డ్రోన్‌ దాడులను నిర్వీర్యం చేసే ఎలెక్ట్రానిక్‌ యుద్ధ సామర్థ్యం రష్యాకు ఉన్నా, ప్రస్తుతానికి ఆచితూచి అడుగులు వేస్తోంది. రష్యా వద్ద 2,000 డ్రోన్లు ఉండగా, ఉక్రెయిన్‌ వద్ద 40 వరకు బైరక్తార్‌ డ్రోన్లు ఉంటాయని అంచనా.

 

- ఏఏవీ ప్రసాద్‌

 

‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 10-03-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం