• facebook
  • whatsapp
  • telegram

వివాదాల సుడిలో గవర్నర్‌ పీఠాలు

విమర్శలకు ఆస్కారమిస్తున్న వ్యవస్థ

ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు, గవర్నర్లకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. గవర్నర్లు తమ అధికారాలను రాజ్యాంగ పరిధిలోనే వినియోగిస్తున్నారా అనే చర్చ మళ్ళీ రేగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సొంత మెజారిటీ ఉన్నప్పుడల్లా ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలకు, గవర్నర్లకు మధ్య ఘర్షణలు తలెత్తడం ఆనవాయితీగా మారుతోంది. అటువంటి సందర్భాల్లో గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా పనిచేస్తున్నారనే అభిప్రాయం బలంగా పాదుకొంటోంది. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాములో అటువంటి వివాదాలు చాలా తరచుగా తెరపైకి వస్తుండేవి. ముఖ్యమంత్రుల ఎంపికలో, శాసనసభలో బల నిరూపణకు ముహూర్తం నిర్ణయించడంలో గవర్నర్లు కేంద్రం ఆడమన్నట్లు ఆడేవారు. రోజువారీ ప్రభుత్వ విధినిర్వహణలోనూ వారు తలదూర్చేవారన్న ఆరోపణలూ వచ్చేవి. బిల్లులకు సకాలంలో ఆమోదం తెలపకుండా తొక్కిపెట్టేవారని, బిల్లులను ఉద్దేశపూర్వకంగా రాష్ట్రపతి ఆమోదంకోసం పంపడం ద్వారా కాలయాపన చేసేవారని, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ప్రతికూల వ్యాఖ్యలు చేసేవారని నిరసన వ్యక్తమయ్యేది. గవర్నర్ల అనవసర జోక్యాన్ని నివారించాలని, కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి జాబితాలోని అంశంపై చట్టం చేయాలన్నా మొదట రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని గతంలో భారతీయ జనతా పార్టీ సర్కారియా కమిషన్‌కు విన్నవించింది. 1990-2014 మధ్య కేంద్రంలో ఏక పార్టీ పెత్తనం లేకపోవడంతో ఇలాంటి వివాదాలు సద్దుమణిగాయి. 2014నుంచి కేంద్రంలో ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉండటంతో వివాదాలు మళ్ళీ తలెత్తసాగాయి. ఇటీవల మహారాష్ట్ర, కేరళల్లో, అంతకుముందు పశ్చిమ్‌ బెంగాల్‌, పుదుచ్చేరి, రాజస్థాన్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో గవర్నర్లు నిర్వహించిన పాత్రపై పలు విమర్శలు వ్యక్తమయ్యాయి.

అసలు ఉద్దేశాలపై సందేహాలు

మహారాష్ట్రలో ఏడాది కాలంగా అసెంబ్లీ స్పీకర్‌ పదవి ఖాళీగా ఉంది. స్పీకర్‌ ఎన్నికకు సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయించిన ముహూర్తాన్ని గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారి ఆ మోదించకపోవడమే దానికి కారణం. అలా చరిత్రలో ఎన్నడూ జరగలేదు. రాజ్యాంగంలోని 178వ అధికరణ ప్రకారం స్పీకర్‌ ఎన్నికలో గవర్నర్‌కు ఎటువంటి పాత్రా లేదు. స్పీకర్‌ ఎన్నిక తేదీని గవర్నర్‌ నిర్ణయిస్తారని మాత్రం శాసనసభా నిబంధనలు పేర్కొంటున్నాయి. గవర్నర్‌ సహాయ నిరాకరణతో స్పీకర్‌ లేకుండానే అసెంబ్లీ శీతకాల సమావేశాలు ముగిశాయి. ఇక వచ్చే సమావేశాల్లోనే స్పీకర్‌ ఎన్నిక జరగాలి. మహారాష్ట్ర మాదిరిగానే నిరుడు రాజస్థాన్‌లోనూ రాష్ట్ర అసెంబ్లీని సమావేశపరచాలన్న మంత్రిమండలి సూచనను ఆమోదించడానికి గవర్నర్‌ చాలా ఆలస్యం చేశారు. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల సంకీర్ణం అధికారంలో ఉంటే- రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం నడుస్తోంది.

నాడు అలా... నేడు ఇలా!

కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో వేరే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చిక్కు పరిస్థితి ఎదురుకావచ్చు. గవర్నర్‌ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అభిప్రాయాలను ఆలకించి, రాష్ట్ర ప్రభుత్వ సూచనలను పెడచెవిన పెడితే ఆయనకు ప్రచ్ఛన్న రాజకీయ అజెండా ఉందనే అనుమానాలకు తావిచ్చినట్లవుతుంది. కేంద్రం తన మనిషిని గవర్నర్‌గా నియమించడం వల్లనే ఇలాంటి సందేహాలు, వివాదాలు రేగుతున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. గవర్నర్‌ నియామకంపై కేంద్రం గుత్తాధిపత్యాన్ని అంతం చేయాలని 1980లలో పశ్చిమ్‌ బెంగాల్‌ వామపక్ష ఫ్రంట్‌ ప్రభుత్వంతో భారతీయ జనతా పార్టీ గొంతు కలిపింది. రాష్ట్ర శాసనసభ సూచించే జాబితా నుంచి ఒకరిని గవర్నర్‌గా నియమించాలని, గవర్నర్‌ నియామకాధికారం కేంద్రానికి కాకుండా అంతర్రాష్ట్ర మండలికి ఉండాలని అప్పట్లో డిమాండ్‌ చేసింది. అయితే, ఇటీవల పశ్చిమ్‌ బెంగాల్‌ తృణమూల్‌ ప్రభుత్వంపై స్వయంగా రాష్ట్ర గవర్నరే ఆరోపణలు చేయడంతో ఆనాడు కేంద్రంలో కాంగ్రెస్‌ వ్యవహరించిన తీరులోనే నేడు భాజపా కేంద్ర ప్రభుత్వం నడుచుకొంటోందన్న అభిప్రాయానికి ఆస్కారమేర్పడింది.

వామపక్ష ఫ్రంట్‌ అధికారంలో ఉన్న కేరళలోనూ గవర్నర్‌ పాత్రపై వివాదం రేగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి వల్లనే తాను కన్నూరు విశ్వవిద్యాలయానికి వైస్‌ ఛాన్స్‌లర్‌ను పునర్నియమించాల్సి వచ్చిందని గవర్నర్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానం చట్టబద్ధమే అయినా గవర్నర్‌ అనవసర రగడ చేస్తున్నారనే భావన నెలకొంది. విశ్వవిద్యాలయాల్లో రాజకీయ జోక్యం నెలకొంటోందని గవర్నర్‌ ఆరోపిస్తూ, దానికి నిరసనగా కన్నూరు విశ్వవిద్యాలయ ఛాన్స్‌లర్‌ పదవి నుంచి వైదొలగుతానని ప్రకటించారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు గవర్నర్లే ఎక్స్‌ అఫీషియో ఛాన్స్‌లర్లు. దీనర్థం ఒక వ్యక్తి గవర్నర్‌ పదవిలో ఉన్నంతకాలం ఛాన్స్‌లర్‌ పదవిలో కొనసాగాల్సిందే. ఛాన్స్‌లర్‌ పదవి నిర్వహణలో గవర్నర్‌ రాష్ట్ర మంత్రిమండలి సలహాలు సూచనలు పాటించనవసరంలేదని, స్వతంత్రంగా వ్యవహరించవచ్చని గోపాలకృష్ణన్‌ వర్సెస్‌ కేరళ విశ్వవిద్యాలయ ఛాన్స్‌లర్‌ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే విశ్వవిద్యాలయ నిబంధనావళికి లోబడి మాత్రమే గవర్నర్‌ తన స్వతంత్ర అధికారాలను వినియోగించాలి. ఆ నిబంధనావళి వైస్‌ ఛాన్స్‌లర్‌ పునర్నియామకానికి అడ్డుచెప్పడం లేదు కాబట్టి గవర్నర్‌ చర్య అర్థరహితమవుతోంది. పైగా రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి వల్ల తాను పునర్నియామకానికి తలూపవలసి వచ్చిందని బహిరంగంగా ప్రకటించడం వెనక ఆయన ఉద్దేశాలు ఏమిటని శంకించాల్సి వస్తోంది. సాధారణంగా వేరే రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు గవర్నర్లుగా నియుక్తులవుతారు కాబట్టి- తాము పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో, ముఖ్యంగా అక్కడి విశ్వవిద్యాలయాల్లో స్థితిగతుల గురించి వారికి పూర్తి అవగాహన ఉండకపోవచ్చు. కాబట్టి స్థానిక వర్గాల నుంచి పూర్తి సమాచారం తెలుసుకుని తగు చర్యలు తీసుకోవడం సబబుగా ఉంటుంది.

ప్రభుత్వం ఏర్పడేలా చూడటమే విధి

గవర్నర్‌కు విచక్షణాధికారం ఉన్నమాట నిజమే కానీ, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ నిర్ణయాలను తోసిపుచ్చే అవకాశం మాత్రం లేదని రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్పష్టం చేశారు. మంత్రిమండలి నిర్ణయాలను గవర్నర్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ పాటించాల్సిందేనన్నారు. కాబట్టి ముఖ్యమంత్రిని ఎంపిక చేయడానికి, ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా అధికారంలో ఉన్న పార్టీని కూలదోయడానికి గవర్నర్‌కు అధికారం లేదు. ‘రాష్ట్రానికి ఒక ప్రభుత్వం ఏర్పడేలా చూడటమే గవర్నర్‌ విధితప్ప తానే ప్రభుత్వాన్ని ఏర్పరచడం కాదు’ అని సర్కారియా కమిషన్‌ గతంలో వ్యాఖ్యానించింది. మధ్యప్రదేశ్‌లో నిరుడు అధికారం కాంగ్రెస్‌నుంచి భాజపాకు మారినప్పుడు గవర్నర్‌ పాత్రపై పలు విమర్శలు వ్యక్తమయ్యాయి. రాష్ట్రాల్లో రాజకీయాలను అదుపు చేసే సాధనంగా గవర్నర్‌ పదవిని కేంద్రం దుర్వినియోగం చేయకూడదు. పార్టీలకు అతీతంగా నిర్వికార దృష్టితో గవర్నర్‌ తన పదవీ బాధ్యతలు నిర్వహించాలి.

 

- ఏఏవీ ప్రసాద్‌
 

Posted Date: 13-01-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం