• facebook
  • whatsapp
  • telegram

కర్కశ చట్టానికి కళ్లెం

‘అఫ్సా’ పూర్తిస్థాయి రద్దు తక్షణావసరం

కాలం చెల్లిన చట్టాలు మనుగడలో ఉంటే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుంది. జనశ్రేయం ప్రశ్నార్థకమవుతుంది. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ-అఫ్సా) ఇందుకు ప్రబల నిదర్శనం. ఈశాన్య భారత్‌లో తిరుగుబాట్ల అణచివేతే లక్ష్యంగా 1958లో పార్లమెంటు ఆమోద ముద్ర వేసిన ఈ శాసనం- కాలక్రమంలో పెడ పోకడలు పోయింది. మానవహక్కులను హరించింది. గతంలో సంఘవిద్రోహ శక్తుల ఆట కట్టించడానికి దోహదపడిన ఈ చట్టం- ప్రస్తుతం అభంశుభం తెలియని సామాన్యుల పాలిట మృత్యుపాశంగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో అస్సాం, నాగాలాండ్‌, మణిపుర్‌లలో అఫ్సా పరిధిని కుదిస్తూ మోదీ సర్కారు గతవారం ఆదేశాలు జారీ చేయడం స్వాగతించదగిన పరిణామం.

బ్రిటిష్‌ పాలనలో మూలాలు

వాస్తవానికి భారతదేశంలో అఫ్సా బ్రిటిష్‌ పాలనలోనే అమలులోకి వచ్చింది. ఉవ్వెత్తున ఎగసిన క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణగదొక్కేందుకు 1942లో దీన్ని ఆమోదించారు. ఆ తరవాత మరుగున పడిపోయినప్పటికీ... ఈశాన్య భారతంలో (ముఖ్యంగా మణిపుర్‌, అస్సామ్‌లలో) తిరుగుబాట్లను స్థానిక ప్రభుత్వాలు నియంత్రించలేకపోవడంతో 1958లో స్వతంత్ర భారత సర్కారు దానికి మళ్ళీ జీవం పోసింది. ముష్కర కార్యకలాపాలను అణచివేయాలన్న లక్ష్యంతో ఈ శాసనం కింద సాయుధ బలగాలకు విస్తృత అధికారాలు కల్పించారు. కల్లోలిత ప్రాంతాల్లో ఎలాంటి వారెంట్లు లేకుండా సోదాలు నిర్వహించడం, అనుమానితులను అదుపులోకి తీసుకోవడం, అవసరమైతే కాల్పులు జరపడం వంటివి అందులో కొన్ని. ఈ చట్టం కింద ఎవరైనా అధికార దుర్వినియోగానికి పాల్పడినా- వారిపై చర్యలకు ఉపక్రమించాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి ఉండాల్సిందే. ఒక్కమాటలో చెప్పాలంటే, అఫ్సా అమలులో ఉన్నచోట ఆత్యయిక స్థితి ఉన్నట్లే. తొలుత ఈశాన్య రాష్ట్రాల్లో దీన్ని అమలు చేశారు. తరవాత పంజాబ్‌, జమ్మూ-కశ్మీర్‌లకూ విస్తరించారు. పరిస్థితులు శాంతించాక మొదట మిజోరం, పంజాబ్‌లలో, క్రమేణా త్రిపుర, మేఘాలయల్లో ఈ చట్టాన్ని ఉపసంహరించారు. జమ్మూ-కశ్మీర్‌, నాగాలాండ్‌, మణిపుర్‌, అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్‌లలో కల్లోలిత ప్రాంతాలుగా గుర్తించిన పలుచోట్ల ఇప్పటికీ అది అమలులో ఉంది.

అఫ్సాతో దఖలుపడిన అధికారాలతో సాయుధ బలగాలు మానవ హక్కులను దారుణంగా ఉల్లంఘిస్తున్నాయన్నది ప్రధాన ఆరోపణ. బూటకపు ఎన్‌కౌంటర్లతో అమాయకుల ప్రాణాలను అవి బలిగొంటున్నాయని, స్థిరాస్తి వివాదాలను అక్రమ మార్గాల్లో పరిష్కరించేందుకు ఈ చట్టాన్ని వాడుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఏడాది నాగాలాండ్‌లోని మోన్‌ జిల్లాలో పని ముగించుకొని ఇంటికి చేరుకుంటున్న సామాన్య కూలీలపై సాయుధ బలగాలు ఎలాంటి హెచ్చరికలూ లేకుండానే కాల్పులకు తెగబడటం అఫ్సా వికృత రూపానికి మచ్చుతునక. నాటి కాల్పుల్లో, అనంతరం చెలరేగిన ఘర్షణల్లో 12 మందికి పైగా సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. 1991లో జమ్మూ-కశ్మీర్‌లో బలగాలు పలు అకృత్యాలకు తెగబడ్డాయన్న ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయి. ఇతర రాష్ట్రాల్లోనూ సాయుధ సిబ్బంది సామూహిక అత్యాచారాలు, చట్ట వ్యతిరేక హత్యలకు సంబంధించి తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తాయి. అఫ్సా పేరిట తమ ప్రాథమిక హక్కులను హరిస్తున్నారంటూ ఈశాన్య రాష్ట్రాలతోపాటు జమ్మూ-కశ్మీర్‌ ప్రజలు దీర్ఘకాలంగా వాపోతున్నారు. ఆ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. మణిపుర్‌ ఉక్కు మహిళగా పేరొందిన ఇరోం చాను షర్మిల అఫ్సా రద్దు కోసం 2000 సంవత్సరం నుంచి 16 ఏళ్లపాటు నిరవధికంగా నిరాహార దీక్ష చేశారు. క్రూరమైన ఈ చట్టాన్ని రద్దు చేయాలని జస్టిస్‌ జీవన్‌ రెడ్డి కమిషన్‌ 2005లోనే సిఫార్సు చేసింది. వీరప్ప మొయిలీ నేతృత్వంలోని రెండో పరిపాలనా సంస్కరణల కమిషన్‌ సైతం ఆ సిఫార్సులకు అనుకూలంగా మాట్లాడింది. రక్షణ శాఖనుంచి అభ్యంతరాలు వెలువడటంతో వాటిపై అడుగు ముందుకు పడలేదు. ఈ అంశంపై పరిశీలనకు యూపీఏ హయాములో ఏర్పాటైన కేబినెట్‌ ఉప కమిటీని ఎన్‌డీయే పక్కనపెట్టింది. జస్టిస్‌ జీవన్‌రెడ్డి కమిషన్‌ సిఫార్సులనూ తిరస్కరించింది.

ప్రత్యామ్నాయ వ్యూహాలు అవసరం

ముష్కర మూకల అణచివేతలో స్థానిక ప్రభుత్వాలు, పోలీసులకు సహాయపడేందుకు అదనపు బలగాలను పంపాలన్నది అఫ్సా ప్రధాన ఉద్దేశం. ఈ చట్టం ముసుగులో చోటుచేసుకున్న అకృత్యాల కారణంగా అనేక సందర్భాల్లో ప్రజలు బలగాలకు కాకుండా తిరుగుబాటుదారులకు మద్దతుగా నిలిచారు. ఇప్పటికీ వారికి ఆశ్రయం కల్పిస్తున్నారు. ఈశాన్య భారత్‌లోని పలు ప్రాంతాల్లో పూర్తిగా, మరికొన్నిచోట్ల పాక్షికంగా అఫ్సా అమలును నిలిపివేస్తూ వెలువడ్డ ఆదేశాలు అక్కడి ప్రజలకు సాంత్వన చేకూర్చేవే. ఈ నిరంకుశ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసినప్పుడే వారి ముఖాల్లో అసలైన సంతోషం వెల్లివిరుస్తుంది. అవసరమైతే తిరుగుబాటుదారులను సమర్థంగా ఎదుర్కొనేలా స్థానిక పోలీసు సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇప్పించాలి. ప్రత్యామ్నాయ వ్యూహాలు రూపొందించాలి. అంతేతప్ప జనావాసాల్లో సైన్యం మోహరింపులను దీర్ఘకాలంపాటు కొనసాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయకూడదు. ముష్కర మూకలతో సన్నిహితంగా మెలగకుండా స్థానికులూ ప్రభుత్వాలకు సహకరించాలి. విదేశాలతో సరిహద్దులున్న ప్రాంతాల్లో మాత్రం సాయుధ బలగాలను కొనసాగించాలి.

- శ్రీయాన్‌

‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 07-04-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం