• facebook
  • whatsapp
  • telegram

సాగర గర్భం... అంతర్జాల కేంద్రం



ప్రపంచవ్యాప్తంగా సమాచార ప్రసరణకు, ఆర్థిక అనుసంధానానికి అంతర్జాలం ప్రధాన ఆలంబనగా నిలుస్తోంది. సముద్ర గర్భంలో వేసే కేబుళ్లు అంతర్జాలం విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటిని కాపాడుకోవడం అత్యంత కీలకం.


ఈ ఏడాది ప్రారంభం నాటికి దాదాపు 574 సముద్రగర్భ అంతర్జాల కేబుళ్లు క్రియాశీలంగానో, ప్రణాళిక దశలోనో ఉన్నాయి. ప్రపంచంలో దాదాపు ప్రతి దేశాన్ని కలుపుతున్న ఈ కేబుళ్లు సముద్రగర్భంలో మొత్తం 14 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పరచుకుని ఉన్నాయి. ఐరోపా, ఆసియాలను కలిపే సముద్రగర్భ కేబుళ్లు భారత్‌ సమీపం నుంచి వెళ్తున్నాయి. వీటికి ప్రమాదవశాత్తు లేదా ఉద్దేశపూర్వకంగా భంగం కలగకుండా చూసుకోవడం అన్ని దేశాల బాధ్యత. ఈ కేబుళ్లు విచ్ఛిన్నమైతే దేశదేశాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.


వారాల పాటు...

ఆర్థిక లావాదేవీలతో సహా 99శాతం ఇంటర్నెట్‌ సందేశాల ప్రసరణకు సముద్రగర్భ కేబుళ్లే ఆధారమని అమెరికా కాంగ్రెస్‌ (పార్లమెంటు) పరిశోధనా కార్యాలయం తెలిపింది. ఇవి విచ్ఛిన్నమైతే 15 లక్షల డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లుతుందని అంచనా. అంతర్జాతీయ నగదు జమలు, చెల్లింపులకు, బ్యాంకింగ్‌ కార్యకలాపాలకు భారతీయ బ్యాంకులు వాడుతున్న స్విఫ్ట్‌ (సొసైటీ ఫర్‌ వరల్డ్‌వైడ్‌ ఇంటర్‌ బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ టెలీకమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌) సముద్రగర్భ కేబుళ్ల ద్వారానే పనిచేస్తుంది. స్విఫ్ట్‌ ద్వారా ప్రపంచ దేశాల మధ్య రోజుకు కోటిన్నర సందేశాలు ప్రసారమవుతూ 10 లక్షల కోట్ల డాలర్ల నగదు లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ కేబుళ్లు దెబ్బతింటే భారతీయ ఫైనాన్షియల్‌ మార్కెట్‌ తలకిందులవుతుంది. 2008లో ఈజిప్ట్, దుబాయ్‌ తీరాల్లోని సముద్రగర్భ కేబుళ్లు రెండు వారాలపాటు దెబ్బతిన్నప్పుడు భారత్‌ 80శాతం అంతర్జాతీయ లావాదేవీలను నిర్వహించ లేకపోయింది. ఆరు కోట్ల వినియోగదారులకు సేవలు దూరమయ్యాయి.


జాతీయంగా, అంతర్జాతీయంగా అన్ని విధాలా ఆయువుపట్టు అయిన సముద్రగర్భ కేబుళ్లకు ప్రాకృతికంగా నష్టం వాటిల్లవచ్చు. లేదా దుష్టశక్తులు ఉద్దేశపూర్వకంగా వాటిని దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఇండియాకు ఈ ఏడాది మార్చిలో మొదటిసారిగా అలాంటి అవాంతరం అనుభవంలోకి వచ్చింది. యెమెనీ హూతీలు ఎర్ర సముద్రం గుండా వచ్చిపోయే చమురు నౌకలపై దాడులు చేయడమే కాకుండా, సముద్రగర్భ కేబుళ్లకూ విఘాతం కలిగించారు. ఆసియా-ఆఫ్రికా-ఐరోపా 1; ఐరోపా-ఇండియా గేట్‌ వే; టాటా గ్లోబల్‌ నెట్‌వర్క్‌ సంస్థలకు చెందిన మూడు సముద్ర గర్భ కేబుళ్లు దాడులకు గురయ్యాయి. దాంతో, వాటిపై ఆధారపడిన భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్‌ జియో, టాటా కమ్యూనికేషన్లు తమ సేవలను ఇతర నెట్‌వర్కులకు మళ్ళించాల్సి వచ్చింది. ఉగ్రవాదులు, తిరుగుబాటుదారుల నుంచే కాకుండా చేపల వేట పడవలు, రవాణా నౌకల వల్లా సముద్రగర్భ అంతర్జాల కేబుళ్లు తరచూ దెబ్బతింటున్నాయి.  ఇలాంటి దుర్ఘటనలు ఏడాదికి 150 నుంచి 200 వరకు జరుగుతుంటాయి. సముద్రంలో లోహాల కోసం తవ్వకాలూ నష్టం కలిగించవచ్చు. సునామీ, భూకంపాల వంటి ప్రకృతి విపత్తులూ సముద్రగర్భ కేబుళ్లను దెబ్బతీస్తాయి. 2006 డిసెంబరు ఆరున దక్షిణ తైవాన్‌ తీరంలో సంభవించిన భూకంపం దెబ్బకు తొమ్మిది సముద్రగర్భ కేబుళ్లు తునాతునకలయ్యాయి. దాంతో చైనా, హాంకాంగ్, జపాన్, సింగపూర్, ఫిలిప్పీన్స్, తైవాన్‌లతోపాటు భారత్‌లోనూ బ్యాంకింగ్, ఆర్థిక మార్కెట్లు దెబ్బతిన్నాయి. ఇతర కమ్యూనికేషన్‌ సేవలూ భగ్నమయ్యాయి. దెబ్బతిన్న కేబుళ్లను పునరుద్ధరించడానికి 11 మరమ్మతు నౌకలు 45 రోజులపాటు శ్రమించాయి. 1884నాటి సముద్రగర్భ టెలిగ్రాఫ్‌ కేబుళ్ల రక్షణ ఒప్పందం, 1982నాటి ఐక్యరాజ్య సమితి సముద్ర చట్టం సాధారణ టెలీకమ్యూనికేషన్‌ సేవలకు వర్తిస్తాయి. వాటిలో సముద్రగర్భ కేబుళ్లకు స్పష్టమైన నిర్వచనం లేకపోవడం పెద్ద లోటు. ఆధునిక ప్రపంచంలో ఈ కేబుళ్ల ప్రాధాన్యాన్ని ఇప్పుడు ఐరాస గుర్తిస్తోంది. తదనుగుణంగా ఐరాస సాధారణ సభ 2002, 2011, 2019 సంవత్సరాల్లో తీర్మానాలు చేసింది. సముద్రగర్భ కేబుళ్ల రక్షణకు ఐరాస సభ్య దేశాలు జాతీయ చట్టాలు చేయాలని సూచించింది. 


రక్షణ కీలకం

దాదాపు 15 అంతర్జాతీయ సముద్రగర్భ కేబుళ్లు ఇండియాలో 15 కేబుల్‌ ల్యాండింగ్‌ కేంద్రాలకు చేరుతున్నాయి. ఇవి ముంబయి, చెన్నై, కొచ్చి, తూత్తుకుడి, తిరువనంతపురాల్లో ఉన్నాయి. వాటిపై ఉగ్రవాదులు గురిపెట్టే ప్రమాదం ఉంది. యుద్ధ సమయాల్లో కేబుళ్లకు మరమ్మతులు చేసి వెంటనే పునరుద్ధరించడం చాలా కష్టం. దానివల్ల ఇండియాకు తీవ్ర నష్టం తప్పదు. దీన్ని నివారించడానికి సముద్రగర్భ కేబుళ్లను సమాచార సాంకేతిక (ఐటీ) చట్టంలోని కీలక సమాచార వసతుల (సీఐఐ) పరిధిలో చేర్చాలని, ఇతర రక్షణలనూ కల్పించాలని 2023లో టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్‌) కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. క్వాడ్‌ దేశాలూ సముద్రగర్భ కేబుళ్ల రక్షణకు భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇది క్వాడ్‌ సభ్యదేశమైన ఇండియాకు ప్రయోజనకరమే. భారతీయ ఆర్థిక విపణులు సముద్రగర్భ కేబుళ్ల సాయంతో అందే అంతర్జాలంపై ఆధారపడి ఉన్నాయి. మన సైనిక, గూఢచార వ్యవస్థలూ వాటి ఆధారంగానే సమాచార నెట్‌వర్క్‌లను నిర్వహిస్తున్నాయి. భవిష్యత్తులో కృత్రిమ మేధ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ వంటి నవీన సాంకేతికతలకూ సముద్రగర్భ కేబుళ్లు, వాటికి సంబంధించిన భూతల కేంద్రాలు ఆయువుపట్టు కానున్నాయి. భారత్‌ వాటిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి.


చట్ట సవరణ అవసరం

ఇండియాలో 1885నాటి టెలిగ్రాఫ్‌ చట్టమే సముద్రగర్భ కేబుళ్లకూ వర్తిస్తోంది. ఇందులో కేబుళ్ల గురించి స్పష్టమైన నిర్వచనం లేదు. ఈ లోపాన్ని సరిదిద్దుతూ చట్టానికి సవరణ చేయాలి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు సముద్రగర్భ కేబుళ్ల రక్షణకు 1997, 1996ల్లోనే చట్టాలు చేశాయి. తమ భూభాగాల పరిధిలోకి వచ్చే అంతర్జాతీయ సముద్రగర్భ కేబుళ్లకు ఈ చట్టాలు వర్తిస్తాయి. సముద్రగర్భ కేబుళ్లకు నష్టం కలగని రీతిలో నౌకలు లంగరు వేయాలని, చేపల పడవలు జాగ్రత్తగా సంచారం సాగించాలని ఆస్ట్రేలియా చట్టం నిర్దేశిస్తోంది. ఇలాంటి కేబుళ్లు ఉన్న ప్రాంతాలను ఆస్ట్రేలియా అధికారికంగా ప్రకటించింది. ఈ స్ఫూర్తితో భారత్‌ సైతం చట్టపరమైన నిబంధనలను ఏర్పరచాలని నిపుణులు సూచిస్తున్నారు.


- డాక్టర్‌ రావెళ్ల భానుకృష్ణ కిరణ్‌

(అంతర్జాతీయ న్యాయ, భద్రతా వ్యవహారాల నిపుణులు)
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కేంద్రానికి మిగులు సాయం

‣ విజృంభిస్తున్న ప్లాస్టిక్‌ భూతం

‣ కట్టుబడాలిక... సంకీర్ణ ధర్మానికి!

‣ సవాళ్లను అధిగమిస్తేనే వరి సిరులు

‣ అందరి కృషితోనే పర్యావరణ పరిరక్షణ

Posted Date: 10-06-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం