• facebook
  • whatsapp
  • telegram

సంక్లిష్ట రాజకీయ సమరం

యూపీలో బల సమీకరణ యత్నాలు

 

 

ఎన్నికల్లో ఏ సామాజికవర్గం మద్దతు ఏ పార్టీకి ఉందనేది ఆసక్తి కలిగించే అంశం. చాలా కులాల్లో నిశ్శబ్దంగా పార్టీల విజయాలను ప్రభావితం చేసేవారుంటారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ అటువంటి ఓటర్లు ఈసారి ఎన్నికల్లో ఆయా పక్షాల భవితవ్యాలను నిర్దేశించనున్నారు. యూపీలో 66 దళిత కులాల జనాభా 21శాతందాకా ఉంటుంది. మామూలుగా వారి మద్దతు బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్‌పీ)కే. సంప్రదాయ చర్మకార వృత్తిలో ఉండే జాతవ్‌ల జనాభా యూపీలో సుమారు పది శాతం. మాజీ ముఖ్యమంత్రి మాయావతి అదే కులానికి చెందిన వారు కావడంతో, బీఎస్‌పీకి వారు కంచుకోటగా నిలుస్తున్నారు. యూపీలో జాతవేతర దళిత కులాలైన పాసి, ధోబీ, బింద్‌, కోలీ, ముస్‌హర్‌, హారీల జనాభా 11శాతం. బీఎస్‌పీ అధికారంలో ఉన్నప్పుడు జాతవ్‌లకే అధిక ప్రాధాన్యం లభించిందన్న అసంతృప్తి వారందరిలో ఉంది. దాన్ని తనకు అనుకూలంగా మలచుకోవడానికి భారతీయ జనతా పార్టీ (భాజపా) పావులు కదుపుతోంది.

 

మద్దతు కీలకం

యాదవుల ప్రాబల్యం అధికంగా ఉండే సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) హయాములో తాము తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యామని చాలామంది జాతవ్‌లు భావిస్తున్నారు. దాన్ని గుర్తించిన భాజపా తన పక్షంలోని ప్రముఖ జాతవ్‌ నేతలైన బేబీ రాణీ మౌర్య, దుష్యంత్‌ గౌతమ్‌ వంటి వారిని రంగంలోకి దింపింది. ఎస్‌పీకి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం దక్కకూడదన్న లక్ష్యంతో దాదాపు 30-35శాతం జాతవ్‌లు బీజేపీవైపు మళ్ళే సంకేతాలు కనిపిస్తున్నాయి. యూపీలో 44శాతం ఉండే ఓబీసీలు ఎన్నికల్లో పార్టీల తలరాతలను నిర్ణయిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎస్‌పీ తరఫున ములాయం సింగ్‌ వారినందరినీ ఏకంచేసి అధికారంలోకి రాగలిగారు. ఎస్‌పీ హయాములో కేవలం యాదవులకే మేలు కలిగిందన్న భావన ఇతర ఓబీసీ కులాల్లో ఉంది. 2014లో భాజపా ప్రధాని అభ్యర్థిగా మోదీ రంగప్రవేశం చేశాక, ఆయన్ను దేశంలోనే అత్యంత వెనకబడిన ఘాంచీ కులానికి చెందిన వ్యక్తిగా ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర బీజేపీ పెద్దయెత్తున ప్రచారం చేసింది. అప్పటి నుంచి యాదవేతర ఓబీసీలు అధికంగా భాజపావైపు మొగ్గుచూపడం మొదలైంది. 2012 రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భాజపాకు కేవలం 17శాతం ఈబీసీల మద్దతు ఉండేది. 2014 లోక్‌సభ ఎన్నికల నాటికి అది 60శాతానికి పెరిగింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లోనూ 58శాతం ఈబీసీలు భాజపాకు దన్నుగా నిలిచారు. యూపీలో 35.5శాతం ఉన్న యాదవేతర ఓబీసీలు దాదాపు 200 స్థానాల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. యాభైశాతంకన్నా ఎక్కువ ఈబీసీల మద్దతు దక్కిన పార్టీయే అక్కడ అధికారాన్ని అందుకోవడంలో ముందంజలో నిలుస్తుంది. మధ్య, తూర్పు యూపీలోని 126 స్థానాల్లో రాజ్‌భర్‌ వర్గ జనాభా 14-22శాతందాకా ఉంటుంది. సుహేల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ (ఎస్‌బీఎస్‌పీ)కి చెందిన ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్‌ ప్రస్తుతం ఆ సామాజికవర్గంలో ప్రజాదరణ పొందిన నేతగా రాణిస్తున్నారు. శ్రీరాముడి పెద్ద కుమారుడు కుశుడి వారసులుగా చెప్పుకొనే కుశ్వాహాల (మౌర్యాల) జనాభా తూర్పు యూపీ, బుందేల్‌ఖండ్‌ ప్రాంతాల్లోని 60 స్థానాల్లో 14-20శాతం దాకా ఉంటుంది. 2014 ఎన్నికల్లో వారి మద్దతు కమలం పార్టీకే దక్కింది.

 

ఎవరికి లాభం?

ఉత్తర యూపీలో ఉండే 19శాతం జాట్లు, 27శాతం ముస్లిములు అక్కడ పార్టీల విజయాల్లో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. 2013 ముజఫర్‌నగర్‌ అల్లర్ల తరవాత జాట్లు భాజపా వెంట ఉంటూ వస్తున్నారు. వ్యవసాయ చట్టాలపై వారు ఈసారి ఆగ్రహంగా ఉన్నారు. 2013కు ముందునాటి జాట్‌-ముస్లిం సమీకరణలను పునరుద్ధరించడం ద్వారా ఎస్‌పీ-ఆర్‌ఎల్‌డీ లబ్ధి పొందనుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు జాట్‌-ముస్లిం బంధం ఇతర హిందూ కులాల్లో అసంతృప్తి రాజేస్తోంది. పశ్చిమ యూపీలోని 60 సీట్లలో త్యాగి, గుజ్జర్‌, ఇతర హిందూ కులాల జనాభా 50శాతం దాకా ఉంది. జాట్‌-ముస్లిములు ఆర్‌ఎల్‌డీ, ఎస్‌పీ వైపు మొగ్గుచూపుతుంటే- ఇతర కులాలు బీజేపీ, బీఎస్‌పీ వైపు ఆకర్షితులవుతున్నాయి. యూపీలో అగ్ర వర్ణాల జనాభా 15శాతం దాకా ఉంటుంది. ఎస్‌పీ, బీఎస్‌పీల హయాములో తమకు సరైన ప్రాధాన్యం దక్కలేదని భావిస్తున్న వారు భాజపా వెన్నంటే ఉంటున్నారు. శ్రీరాముడి చిన్న కుమారుడు లవుడి వారసులుగా భావించే కుర్మీలు తూర్పు యూపీ, దక్షిణ బుందేల్‌ఖండ్‌ ప్రాంతాల్లోని 80 స్థానాల్లో 8-12శాతం దాకా ఉంటారు. 2014 నుంచి అధికశాతం కుర్మీలు అప్నాదళ్‌-భాజపా కూటమికే మద్దతుగా నిలుస్తున్నారు. పశ్చిమ, మధ్య యూపీలోని 60 స్థానాల్లో 12-20శాతం ఉండే లోధ్‌లు కమలదళం వెంటే నడుస్తున్నారు. భాజపాను ఓబీసీ, దళిత వ్యతిరేక ప్రభుత్వంగా చిత్రిస్తూ ఆ పార్టీ వ్యతిరేక ఓట్లన్నింటినీ కూడగట్టేందుకు అఖిలేశ్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ తన సంప్రదాయ దళిత ఓటర్లు, ఇతర ఓబీసీల మద్దతుతో బీఎస్‌పీ 20శాతం ఓట్లు రాబట్టుకోగలిగితే- ఎస్‌పీకి నష్టం వాటిల్లి, భాజపా లాభపడుతుంది. భాజపా వ్యతిరేక ఓబీసీ, దళిత ఓటర్లందరూ బీఎస్‌పీకి బదులుగా ఎస్‌పీ వైపు మొగ్గితే- భాజపా, ఎస్‌పీ మధ్య గట్టి పోటీ నెలకొంటుంది.

 

- రాజీవ్‌ రాజన్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కృత్రిమ మేధతో ఆరోగ్య విప్లవం

‣ స్వశక్తితో అలుపెరుగని ప్రస్థానం

‣ కజకిస్థాన్‌లో ప్రజాందోళనలు

‣ ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో రష్యా బలగాలు

 

 

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 04-02-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం