• facebook
  • whatsapp
  • telegram

Architecture: ఆర్కిటెక్చర్‌ వర్సిటీ ఎంఆర్క్‌ సీట్లలో 85 శాతం తెలంగాణ విద్యార్థులకే

ఈనాడు, హైదరాబాద్‌: జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ)లో ఈ విద్యాసంవత్సరం (2024-25) నుంచి ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు ప్రవేశాల్లో ప్రత్యేక రిజర్వేషన్‌ ఉండదు. అంటే ఇక నుంచి 85 శాతం సీట్లను పూర్తిగా తెలంగాణ స్థానికత ఉన్న విద్యార్థులకే కేటాయిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జులై 19న జరిగిన పీజీఈసెట్‌ ప్రవేశాల కమిటీ సమావేశంలో మాస్టర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (ఎంఆర్క్‌) సీట్ల విషయంలో నిర్ణయం తీసుకున్నారు. త్వరలో చేపట్టే బీఆర్క్, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (బీఎఫ్‌ఏ) సీట్లకు ఈ నిర్ణయం వర్తిస్తుందని విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. 

ఇదీ నేపథ్యం..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ సమతుల్యత కోసం 1973లో 371-డీ అధికారణాన్ని కేంద్రం తెచ్చిన సంగతి తెలిసిందే. దాని ప్రకారం రాష్ట్రస్థాయి విద్యాసంస్థ అయిన జేఎన్‌ఏఎఫ్‌ఏయూలోని మొత్తం సీట్లలో 85 శాతాన్ని తెలంగాణ, ఆంధ్రా, రాయలసీమ రీజియన్ల వారీగా కేటాయించారు. ఈ 85 శాతం సీట్లనే 100 శాతంగా పరిగణించి.. విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని సీట్లలో తెలంగాణ విద్యార్థులకు 36 శాతం, ఆంధప్రదేశ్‌ వారికి 64 శాతం సీట్లు కేటాయించేవారు. ఏపీ వాటాలో 42 శాతం ఆంధ్రా విశ్వవిద్యాలయం రీజియన్, 22 శాతం శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం రీజియన్‌ విద్యార్థులకు ఇచ్చేవారు. మొత్తం సీట్లలో 85 శాతం పోగా.. మిగిలిన 15 శాతాన్ని అన్‌రిజర్వుడ్‌గా ఉంచేవారు. ఆ సీట్లను తెలంగాణ స్థానికత కలిగి ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన, ఉద్యోగాలు చేస్తున్నవారి పిల్లలకు కేటాయించేవారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత.. రాష్ట్ర పునర్విజన చట్టం ప్రకారం ఏపీలోని వారికీ పదేళ్లపాటు ప్రవేశాలు కల్పించారు. ఆ పదేళ్ల గడువు ఈ ఏడాది ముగిసినందువల్ల 371-డీ అధికరణం వర్తించదని, ఈ నేపథ్యంలో ఎంఆర్క్‌ సీట్లలో 85 శాతం తెలంగాణ విద్యార్థులతోనే భర్తీ చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ప్రవేశాల కమిటీ కన్వీనర్‌ ఆచార్య పి.రమేశ్‌బాబు తెలిపారు. మిగిలిన 15 శాతం సీట్లకు బీటెక్‌ సీట్ల మాదిరిగా నాన్‌లోకల్‌ కోటాలో ఏపీ, తెలంగాణ విద్యార్థులు పోటీపడొచ్చన్నారు. ప్రస్తుతం వర్సిటీలో రెండు ఎంఆర్క్‌ కోర్సుల్లో 40 సీట్లున్నాయి.

ఏపీలోని ఆంధ్ర, నాగార్జున విశ్వవిద్యాలయాల్లో ఆర్కిటెక్చర్‌ సీట్లు అందుబాటులోకి వచ్చాయని, కడపలో ప్రత్యేకంగా వర్సిటీ కూడా ఏర్పాటైనందువల్ల... ఈ ఏడాది నుంచి జేఎన్‌ఏఎఫ్‌ఏయూ క్యాంపస్‌లోని అండర్‌గ్రాడ్యుయేట్‌ కోర్సులైన బీఆర్క్, బీఎఫ్‌ఏలలోని సీట్లు కూడా తెలంగాణ విద్యార్థులకే దక్కుతాయని ఓ వర్సిటీ అధికారి తెలిపారు.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.