• facebook
  • whatsapp
  • telegram

Educations: కలల కొలువుకు ఆధునిక నైపుణ్యం  

నాలుగేళ్లు బీటెక్‌, మరో రెండేళ్లు ఎంటెక్‌.. మూడేళ్లు డిగ్రీ, మరో రెండేళ్లు పీజీ.. ఇలా ఏళ్ల తరబడి చదివినా తప్పనిసరిగా ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు.. బహుళజాతి సంస్థల్లో ఆరంకెల వేతనానికి అర్హత పొందాలంటే సంప్రదాయ పట్టాలతో పాటు ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించాల్సిందే. నియామక సంస్థలు కూడా ప్రాచుర్యంలో ఉన్న కోర్సుల్లో నైపుణ్యాలుంటేనే అవకాశాలు కల్పిస్తామని చెబుతుండటంతో నిరుద్యోగులు వాటి వైపు దృష్టి సారిస్తున్నారు. బీటెక్‌, ఎంటెక్‌ విద్యార్థుల కోసం పైథాన్‌, అడ్వాన్స్‌ కంప్యూటర్‌ స్కిల్స్‌ కింద ‘మై ఎస్‌క్యూఎల్‌’, హెచ్‌టీఎంఎల్‌, ట్యాలీ, పదో తరగతి నుంచి పీజీ వరకు సామర్థ్యాలకు అనుగుణంగా స్పోకెన్‌ ఇంగ్లిష్‌, వెబ్‌ అండ్‌ మొబైల్‌ అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌ కమ్యూనికేషన్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌ వంటి నైపుణ్యాలు నేర్పిస్తున్నారు.

* పేద యువతకే ప్రాధాన్యం

స్కిల్‌ ఇండియా పథకంలో భాగంగా ప్రధానమంత్రి కౌశల్‌ కేంద్ర (పీఎంకేకే) ప్రాజెక్టు కింద దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్‌) ఉన్న నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలను ఉచితంగా కల్పిస్తున్నారు.
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లావ్యాప్తంగా జిల్లాకొకటి చొప్పున మొత్తం నాలుగు కేంద్రాలు నిర్వహిస్తున్నారు. పీఎంకేకే కింద కేంద్ర ప్రభుత్వంతో గుర్తింపు పొందిన నిపుణులతో బోధన అందిస్తున్నారు.

కోర్సులో చేరిన నాటి నుంచి పూర్తయ్యే వరకు ఉచితంగా బోధన, ల్యాబ్‌ వసతి, డిజిటల్‌ బోధన, ఉచిత యూనిఫాం, స్టడీ మెటీరియల్‌తో పాటు శిక్షణ అనంతరం ఉపకార వేతనం,  సామర్థ్యాలకు అనుగుణంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు.  అభ్యర్థులు ఆధార్‌, రేషన్‌కార్డు, పది నుంచి పీజీ వరకు ధ్రువపత్రాల జిరాక్సు ప్రతులు, బ్యాంకు ఖాతా వివరాలు అందజేయాల్సి ఉంటుంది.

* సెలవుల్లో విద్యార్థులకు ఉపయుక్తంగా..

గతేడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రతి మూడు, ఆరు నెలలకోసారి గరిష్ఠంగా 1500 మంది నైపుణ్య శిక్షణ పొందుతున్నారని పీఎంకేకే పెద్దపల్లి జిల్లా మేనేజర్‌ పి.నరేశ్‌ ‘ఈనాడు’తో చెప్పారు. ఏప్రిల్‌ రెండో వారం నుంచి జులై వరకు నిరుద్యోగ యువతతో పాటు వేసవి సెలవుల్లో ఖాళీగా ఉండే విద్యార్థులకు మరిన్ని అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇటీవల జరిగిన జాబ్‌మేళాల్లో తమ వద్ద శిక్షణ పొందిన దాదాపు 100 మంది విద్యార్థులకు బహుళజాతి సంస్థల్లో అవకాశాలు కల్పించామని చెప్పారు.

* నెల రోజులుగా వస్తున్నా 

నేను ఎంఎస్సీ(జువాలజీ) పూర్తి చేశా. నాన్‌ ఐటీ నేపథ్యమే అయినా నెల రోజులుగా పైథాన్‌ నేర్చుకుంటున్నా. ఇప్పటికే కమ్యూనికేషన్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌ నేర్చుకున్నా. పట్టా మాత్రమే ఉంటే సరిపోదని, నైపుణ్యాలు కూడా కావాలని గతంలో పలు బహుళజాతి సంస్థలు సూచించగా ఆర్థిక స్థోమత లేక నేర్చుకోలేదు. ఉచిత శిక్షణ గురించి తెలుసుకొని నెల రోజులుగా హాజరవుతున్నా.

- ఆర్‌.స్వరూప, బంధంపల్లి  

* ట్యాలీ నేర్చుకుంటున్నా : జి.వెంకటేశ్‌, పెద్దపల్లి

2018లో బీకాం(సీఏ) పూర్తి చేశా. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగం చేద్దామంటే ఆధునిక సాంకేతిక విద్యపై పట్టుండాల్సిందేనని పలు సంస్థలు చెబుతున్నాయి. దీంతో ఈ సంస్థలో కమ్యూనికేషన్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌లో శిక్షణ పొంది, ప్రస్తుతం ట్యాలీ నేర్చుకుంటున్నా. ఇక్కడ ఉచిత బోధనతో పాటు అవకాశాలు కల్పిస్తున్నారు.
 



మరింత సమాచారం... మీ కోసం!

‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్‌

‣ సోషల్‌ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర

‣ మార్కెట్‌ మందగమనంలో ఉద్యోగ సాధన!

‣ మ‌లిద‌శ ప‌రీక్ష‌లో గెలుపు వ్యూహం!

‣ మూడు నెల‌ల్లో గేట్ మొద‌టి ర్యాంకు

‣ ప్రసిద్ధ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 08-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.