• facebook
  • whatsapp
  • telegram

Govt Jobs: నైట్‌ వాచ్‌మెన్‌.. మూడు ఉద్యోగాలకు ఎంపిక  

మంచిర్యాల జిల్లా యువకుడి ప్రతిభ

* ఆర్థిక ఇబ్బందులు అధిగమించేందుకు వాచ్‌మెన్‌గా విధులు

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, లాలాపేట: ‘‘చిన్నప్పడు మమ్మల్ని చదివించేందుకు అమ్మానాన్నలు పడిన కష్టాలు చూసి ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని మంచిర్యాల జిల్లా పొనకల్‌ నుంచి వచ్చా. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంకాం, బీఈడీ పూర్తిచేశా. టీచర్‌ పోస్టుకు రాసిన పరీక్షలో అరశాతం మార్కుతో కొలువు దూరమైంది. అమ్మనాన్న ఇంటికి వచ్చెయ్‌ బిడ్డా అన్నారు.. ప్రభుత్వ ఉద్యోగం వచ్చాకే వస్తానంటూ అమ్మకు చెప్పా’’నని సంక్షేమ గురుకుల పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలో ఒకేసారి టీజీటీ, పీజీటీ, జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాలకు అర్హత సాధించిన ప్రవీణ్‌ అన్నారు. మూడు ఉద్యోగాలు వచ్చిన సంతోషాన్ని ప్రవీణ్‌ ‘ఈనాడు’తో పంచుకున్నారు. పీజీ, బీఈడీ పూర్తిచేసినా.. ఆర్థిక ఇబ్బందులు అధిగమించేందుకు ఓయూలో నైట్‌ వాచ్‌మెన్‌గా పనిచేసినా నాకు చిన్నతనంగా అనిపించలేదని తెలిపారు. ఉద్యోగంలో చేరిన అనంతరం సంతోషంగా ఇంటికి వెళ్తానన్నారు.

పేదరికం నుంచి బయటపడాలని... 

మంచిర్యాల జిల్లా పొనకల్‌ మేజర్‌ పంచాయితీ గ్రామమైనా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అంతంగా ఉండేవికావు. అమ్మానాన్నలు చదువుకోలేదు. నాన్న తాపీ మేస్త్రీగా, అమ్మ బీడీలు చుట్టే కార్మికురాలు. వారికి వచ్చేకూలి మాకు సరిపోయేది కాదు. దీంతో నేను చదువుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. చదువు పూర్తయ్యాక ఉద్యోగం వస్తే పేదరికం నుంచి బయటపడొచ్చని భావించాను. ఇంటర్మీడియట్‌ పూర్తిచేశాక బీకాం చేయడానికి 2013లో హైదరాబాద్‌కు వచ్చాను. ఓయూలో బీకాం, ఎంకాం చేశాను. టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తారేమోన్న ఆశతో బీఈడీ కూడా పూర్తిచేశాను. టెట్‌ పాసయ్యా. తర్వాత డీఎస్సీ రాశాను. కేవలం అరశాతం మార్కుతో ఉద్యోగం చేజారింది. ఇంతేకాదు.. నాతోపాటు బీఈడీ చదివిన వారిలో 30మందికి టీచర్‌ ఉద్యోగాలు లభించాయి. దీంతో తీవ్రమైన నిరాశ నన్ను కమ్మేసింది. ఆరునెలల పాటు చదువుకోకుండా గమ్యంలేకుండా క్యాంపస్‌లో తిరిగాను. ఉద్యోగం రాలేదు.. అక్కడెందుకు ఉంటావంటూ అమ్మ అనడంతో పునరాలోచనలో పడ్డా. పేదరికం నుంచి బయటపడాలని హైదరాబాద్‌కు వచ్చాను. ఎలాగైనా ఉద్యోగం సాధించే వెళ్లాలని మరింత గట్టిగా అనుకున్నా.

నా ఖర్చులకైనా సంపాదించుకోవాలని.. 

క్యాంపస్‌లో ఐదేళ్ల క్రితమే చదువు పూర్తయ్యింది. ఇక అక్కడ ఉండలేను. బయట ఉండి పోటీపరీక్షలకు సిద్ధమవ్వాలంటే డబ్బుల్లేవ్‌. అమ్మానాన్నలను అడగాలంటే ఆత్మాభిమానం. కొద్దిరోజులు పస్తులున్నా ఓ స్నేహితుడి ద్వారా క్యాంపస్‌లోని ఈఎంఆర్‌సీలో నైట్‌వాచ్‌మెన్‌ ఉద్యోగంలో చేరా. నెలకు రూ.ఆరు వేలు ఇస్తామన్నారు. నా ఖర్చులకు సరిపోతాయనుకుని ఉద్యోగంలో చేరా. అక్కడున్న అధికారులు నా గురించి తెలుసుకుని ఓ గది కేటాయించారు. రాత్రివేళ చదువుకోవాలంటూ ప్రోత్సహించారు. 2022 నవంబరులో సంక్షేమ గురుకుల బోర్డులో ఉద్యోగాల నోటిఫికేషన్‌ విడుదలైంది. ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో రాత్రీపగలూ తేడాలేకుండా చదివాను. ఆగస్ట్‌లో పరీక్షలు రాశాను. రెండునెలల క్రితం కీ చూసుకున్నా... ఉద్యోగం వస్తుందన్న నమ్మకం కలిగింది. ఎల్బీస్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా పీజీటీ ఉద్యోగ నియామకపత్రాన్ని అందుకున్నాక నా కళ్లల్లో వాటంతటవే కన్నీళ్లొచ్చాయి.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 02-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.