విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

NEET UG 2024: నీట్‌ పరీక్షలో 4.2 లక్షల మంది మార్కుల్లో మార్పు

* సుప్రీంకోర్టు తీర్పు
 

దిల్లీ: సుప్రీం కోర్టు తాజా తీర్పుతో నీట్‌-యూజీ పరీక్షకు హాజరైన 24 లక్షల మందిలో సుమారు 4.2 లక్షల మంది అభ్యర్థులు 4 మార్కులు కోల్పోయారు. వారిలో 720కి 720 మార్కులు సాధించిన 44 మంది కూడా ఉన్నారు. ఇంతకూ ఏం జరిగిందంటే.. ఫిజిక్స్‌ సెక్షన్‌లోని 29వ ప్రశ్నకు రెండు సమాధానాలు ఉండటంతో ఆ రెండిట్లో ఏ ఒక్కదాన్ని ఎంపిక చేసినా.. మార్కులు కేటాయించారు. దీనిపై ఓ అభ్యర్థి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. మార్కులు కేటాయించిన తీరును పిటిషనర్‌ కోర్టుకు వివరించారు. ఇలా రెండు సమాధానాలకు మార్కులు ఇవ్వడం వల్ల.. చాలా మందికి 4 మార్కులు అదనంగా వచ్చాయని, మెరిట్‌ లిస్టులో ఇది ఎంతో ప్రభావం చూపిస్తుందని కోర్టుకు వివరించారు.

12లోగా సూచనలను అందించాలని ఐఐటీ దిల్లీకి ఆదేశం

దీనిని పరిగణనలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం.. ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి.. మంగళవారం మధ్యాహ్నం 12లోగా సూచనలను అందించాలని ఐఐటీ దిల్లీని ఆదేశించింది. నిపుణుల సూచన మేరకు.. ఫిజిక్స్‌లోని అటామిక్‌ థీయరీకి సంబంధించిన ప్రశ్నలో రెండు ఆప్షన్లకు మార్కులు ఇవ్వడం కుదరదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. కేవలం ఆప్షన్‌ 4 ఎంచుకున్న అభ్యర్థులకే మార్కులు ఇవ్వాలంటూ నిర్వాహకులను ఆదేశించింది. దీంతో రివైజ్డ్‌ ర్యాంక్‌లు విడుదల చేయడం అనివార్యమైంది.

155 మందికి లబ్ధి 

మరోవైపు  నీట్‌ యూజీ-2024 పరీక్షను రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రశ్నాపత్రం లీకైందన్న మాట వాస్తవమేనని, ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. 155 మంది లబ్ధి పొందినట్లు తెలుస్తోందని ప్రధాన న్యాయూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తెలిపారు. ఈ ఘటన వల్ల వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైందని నిర్ధరణకు రావడం ప్రస్తుత దశలో కష్టమన్న ఆయన.. మళ్లీ పరీక్ష పెడితే 24 లక్షల మంది ఇబ్బంది పడతారని తెలిపారు.

Published at : 23-07-2024 19:53:30

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం