మందకొడిగా తొలివిడత పనులు
14 నెలల్లో పూర్తయింది 21.67 శాతమే!
ఈనాడు, హైదరాబాద్: వేసవి సెలవుల్లో దాదాపు సగం కాలం పూర్తయింది. పాఠశాలలు తిరిగి తెరవడానికి (12వ తేదీన పునఃప్రారంభం) మిగిలింది సుమారు 4 వారాలు మాత్రమే. ‘మన ఊరు - మన బడి’ తొలివిడత కార్యక్రమం కింద చేపట్టిన పనుల్లో ఇంతవరకు 21 శాతానికి పైగా మాత్రమే పూర్తయ్యాయి. రాష్ట్రంలో 9 వేలకు పైగా పాఠశాలల్లో ఈ పనులు చేపడుతుండగా 7,163 బడులకు సంబంధించి ఇంకా కొనసాగుతున్నాయి. 14 నెలల క్రితం చేపట్టిన ఈ పనులను జూన్ మొదటివారం నాటికి అన్నిచోట్ల పూర్తిచేసి పాఠశాలలను సిద్ధం చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. చాలామేర ఆ గడువు లోపు పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ కార్యక్రమంలో మరుగుదొడ్లు, తాగునీరు, ఫర్నిచర్ (పిల్లలు, ఉపాధ్యాయులకు), రంగులు వేయడం; పెద్ద, చిన్నతరహా మరమ్మతులు, ఆకుపచ్చ రాతబోర్డులు (గ్రీన్ బోర్డులు), ప్రహరీలు, వంటగది శిథిల భవనాల స్థానంలో కొత్తవి నిర్మించడం తదితర 12 రకాల పనులను చేపట్టాలన్నది లక్ష్యం. ఇందులో 3 రకాల పనులను ఉపాధి హామీ కింద చేపట్టారు. మిగతా పనులకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ పద్దుల కింద నిధులు కేటాయిస్తోంది. ముఖ్యంగా ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన ప్రహరీలు, వంట గదులు, మరుగుదొడ్ల పనులు చాలాచోట్ల ప్రారంభం కావాల్సి ఉంది. మొదలైనచోట్ల కూడా మందకొడిగా జరుగుతున్నాయి. ఫలితంగా వచ్చే విద్యాసంవత్సరం కూడా చాలామేర బడుల్లో ప్రభుత్వం నిర్దేశించిన 12 పనులు పూర్తి కావడం కష్టమేనని ఆయా జిల్లాల్లో డీఈవో కార్యాలయ వర్గాలు అభిప్రాయపడు తున్నాయి.
‣ గత ఫిబ్రవరిలో 1,200 వరకు పాఠశాలల పనులు పూర్తికాగా.. ఏప్రిల్ నాటికి ఆ సంఖ్య 1,982కి పెరిగింది. మిగిలిన పనుల పూర్తికి ఆయా జిల్లాల కలెక్టర్లు చొరవ తీసుకుంటున్నా చాలాచోట్ల వేగం పుంజుకోవడం లేదు. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా 7,479 పాఠశాలల్లో ‘ఉపాధి హామీ’ కింద పనులు చేయాలి. వాటిని ఆయా సర్పంచులే చేపట్టాలి. అంతకుముందు పంచాయతీల్లో చేపట్టిన పనులకు బిల్లులు రాకపోవడంతో బడుల్లో పనులు చేపట్టేందుకు వారు జంకుతున్నట్లు తెలుస్తోంది. ‘ఉపాధి హామీ పనులు పూర్తయితేనే పూర్తిస్థాయిలో పనులు పూర్తయినట్లు లెక్క అని విద్యాశాఖ ఉన్నతాధికారి చెబుతున్నారు. కలెక్టర్లు చొరవ తీసుకుంటున్నా అధిక శాతం అవే పూర్తికావడం లేదు’ అని డీఈవో ఒకరు తెలిపారు. మిగిలిన పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ‘బిల్లులు వస్తాయో? లేదో? అన్నదే మా భయం’ అని నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన సర్పంచి ఒకరు వ్యాఖ్యానించారు.
రెండో విడత ఎప్పుడో?
రెండో విడతకు బడ్జెట్‌లో రూ.2,400 కోట్లు కేటాయించామని, రూ.వెయ్యి కోట్లను నాబార్డు నుంచి, మిగిలినవి ఎస్‌ఎస్‌ఏ, నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి తీసుకుంటామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ఫిబ్రవరిలో శాసనమండలిలో స్పష్టం చేశారు. ఈమేరకు రెండో విడత కింద పనులను ప్రారంభించాల్సి ఉంది. మూడు విడతలుగా చేపట్టే ఈ కార్యక్రమంలో మొత్తం 26,072 సర్కారు బడుల్లో వసతులను మెరుగుపరచాలన్నది లక్ష్యం.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.