మూడొంతుల మంది అర్హతలు లేనివారే
తాజాగా 40 మందిలో ఏడుగురికే జేఎన్‌టీయూహెచ్ ఆమోదం
ఏటా అనర్హులను గుర్తిస్తున్నా మళ్లీ తాత్కాలికంగా అనుమతులు
ఈనాడు, హైదరాబాద్: జేఎన్‌టీయూహెచ్ పరిధిలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల ప్రిన్సిపాళ్లలో నిబంధనల ప్రకారం విద్యార్హతలు లేనివారే కనీసం 75 శాతం ఉన్నట్లు తెలుస్తోంది. జేఎన్‌టీయూహెచ్ ఈ విషయంలో కచ్చితంగా వ్యవహరిస్తే ఆ కళాశాలలకు అనుబంధ గుర్తింపురాదని నిపుణులు చెబుతున్నారు. వర్సిటీ మాత్రం ఏటా కొందరిని ర్యాటిఫికేషన్ కోసం పిలిచి విద్యార్హతలు తనిఖీ చేయడం.. నిబంధనల ప్రకారం అర్హతలను నిర్ధారించడం... యాజమాన్యాల పైరవీలతో దిగివచ్చి చివరకు ఒకటిరెండేళ్లు తాత్కాలికంగా ఆమోదిస్తున్నామని చెప్పడం.. తర్వాత మరిచిపోవడం షరా మామూలుగా మారింది. ఫలితంగా వర్సిటీ తనిఖీలు, ర్యాటిఫికేషన్లపై కళాశాలల యాజమాన్యాలకు చులకనభావం మొదలైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వర్సిటీ పరిధిలో మొత్తం 223 ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలలున్నాయి. గత నెలలో వాటిల్లో 40 కళాశాలల ప్రిన్సిపాళ్లకు ర్యాటిఫికేషన్ కోసం అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. వారిలో ఏడుగురికి మాత్రమే ఆమోదం తెలిపారు.
15 ఏళ్ల బోధనానుభవం ఉంటేనే అర్హులు
పదమూడేళ్లు బోధనానుభవంతో పాటు పీహెచ్‌డీ కలిగి ఉంటే ఇంజినీరింగ్ ప్రిన్సిపాళ్లుగా పనిచేయవచ్చని 2019 ఫిబ్రవరి వరకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) నిబంధన ఉండేది. అదే సంవత్సరం మార్చి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఆ ప్రకారం 15 ఏళ్లు బోధనానుభవం, పీహెచ్‌డీతో పాటు అయిదేళ్లపాటు ఆచార్యుడిగా గుర్తింపు(ర్యాటిఫై) పొంది ఉండాలి. ఇద్దరు పీహెచ్‌డీ విద్యార్థులకు గైడ్‌షిప్‌గా వ్యవహరించాలి. ఇంకా పరిశోధన పత్రాలు, సదస్సులు, పుస్తకాలు రాయడం ఆధారంగా విద్యాపనితీరు సూచిక(ఏపీఐ) స్కోరు 120 ఉండాలి. ఇవన్నీ లేకపోవడంతో అధికశాతం మంది ప్రిన్సిపాళ్లుగా జేఎన్‌టీయూహెచ్ నుంచి ఆమోదం పొందడం లేదు. 2021-22లో 33 మందిని పిలిచి అందులో ముగ్గురికి, 2022-23లో 26 మందిలో నలుగురికి.. తాజాగా 40 మందిలో ఏడుగురిని మాత్రమే ప్రిన్సిపాళ్లుగా జేఎన్‌టీయూహెచ్ ఆమోదించింది.
ఇదీ పరిస్థితి
‣ ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఓ ప్రముఖ గ్రూపులోని కళాశాలకు ప్రిన్సిపాల్‌కు ఇద్దరు పరిశోధన విద్యార్థులు లేరు.
‣ దుండిగల్ ప్రాంతంలోని ఓ కళాశాల ప్రిన్సిపాల్‌కు బీటెక్ విద్యార్హత లేదు. ఆయన బీఎస్‌సీ, తర్వాత ఎంఎస్‌సీ, పీహెచ్‌డీ.. ఆపై ఎంటెక్ చేశారు. వాస్తవానికి నిబంధనల ప్రకారం అయితే యూజీలో బీటెక్ ఉండాలి.
‣ దూలపల్లి సమీప ప్రాంతంలోని ఓ కళాశాలకు ఇటీవల వరకు ఆచార్యుడిగా ర్యాటిఫై కాని ప్రిన్సిపాల్ ఉండేవారు. ఆయన స్థానంలో కొత్తగా మరొకరు వచ్చినా ఆయనకు పూర్తిగా అర్హతలు లేవని తెలిసింది.
తాత్కాలిక అనుమతులు కోరుతూ..
ప్రిన్సిపాల్ లేకుండా కళాశాలలకు అనుబంధ గుర్తింపునివ్వడం సాధ్యం కాదు. గతంలో పీహెచ్‌డీ ఉంటే ప్రిన్సిపాళ్లుగా పనిచేసేందుకు అనుమతులిచ్చారు. వారికి అయిదేళ్ల గడువు ముగుస్తుండటంతో ఏటా కొందరికి వర్సిటీ నుంచి ర్యాటిఫికేషన్ అవసరమవుతోంది. ఫలితంగా మూడేళ్ల నుంచి విడతల వారీగా వస్తున్నారు. ఈక్రమంలో కొన్ని యాజమాన్యాలు పైరవీలు ప్రారంభించినట్లు తెలిసింది. తాత్కాలికంగా అనుమతివ్వాలని కోరుతున్నట్లు సమాచారం. అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లను ఒకేసారి పిలిచి విద్యార్హతలు తనిఖీ చేయిస్తే 75 శాతం మంది అనర్హులుగా తేలతారని అంచనా.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.