• facebook
  • whatsapp
  • telegram

Ramudu: దివ్యాంగులకు ప్రత్యేకం.. జగద్గురు రామభద్రాచార్య యూనివర్సిటీ

* ఉచిత విద్య, వసతి సౌకర్యాలు

* ప్రత్యేకావసరాలు ఉన్నవారికి చేయూతనందిస్తున్న సంస్థ

వనవాస కాలంలో సీతారామ లక్ష్మణులకు ఆశ్రయమిచ్చిన దేవభూమిగా ‘చిత్రకూట్‌’ ప్రసిద్ధం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆ ప్రాంతానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే మొదటిసారి దివ్యాంగుల కోసమే అక్కడొక యూనివర్సిటీ ప్రారంభమైంది. 20 ఏళ్ల క్రితం దాన్ని ప్రారంభించి విద్యార్థులకు ఉచితంగా విద్యనీ వసతినీ అందిస్తున్నారు జగద్గురు రామభద్రాచార్య. 2 నెలల వయసులోనే కంటి చూపు పోగొట్టుకున్న ఆయన 22 భాషలు మాట్లాడగలరు. దాదాపు 200 పుస్తకాలను రచించి తాజాగా- అత్యున్నత జ్ఞాన్‌పీఠ్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. దివ్యాంగుల కోసమే జీవితాన్ని అంకితం చేసిన రామభద్రుడి కథ ఇది...

వేలమంది విద్యార్థులు చదువుకునే యూనివర్సిటీ అది. అక్కడ ఏ తరగతి గదిలో చూసినా గుండెల నిండా ఆత్మవిశ్వాసం నింపుకున్న దివ్యాంగులే కనిపిస్తారు. క్యాంపస్‌లో ఎక్కడో ఒక చోట అలాంటి వారు ఉండటం సహజమే, కానీ యూనివర్సిటీ అంతటా దివ్యాంగులే ఉన్నారంటే ఎవరికైనా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది కదా. ఇందుకు కారణం ఏమిటీ అంటే-  అది ప్రపంచంలోనే తొలిసారిగా దివ్యాంగులకోసమే ఏర్పాటు చేసిన ఉన్నత విద్యాసంస్థ. ఉత్తర్‌ప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో 2001లో స్థాపించిన ‘జగద్గురు రామభద్రాచార్య దివ్యాంగ్‌ యూనివర్సిటీ’లో దివ్యాంగులకు చదువూ, వసతీ పూర్తిగా ఉచితం. ప్రత్యేకావసరాలు ఉన్నవారు ఆత్మన్యూనతను దూరం చేసుకుని ఆత్మవిశ్వాసంతో చదువుకునేలా ప్రోత్సహిస్తున్న రామభద్రాచార్య రెండు నెలల వయసులోనే ట్రకోమాతో చూపును కోల్పోయారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని జాన్‌పుర్‌ జిల్లా షండీఖుర్ద్‌ ఆయన స్వస్థలం. అసలు పేరు గిరిధర్‌ మిశ్ర. చూపులేని రామభద్రాచార్యను చిన్నతనంలో తోటి పిల్లలు ఎగతాళి చేసేవారు. తమతో ఆడుకోనిచ్చేవారు కాదు. ఆ బాధతో వెక్కివెక్కి ఏడ్చే ఆ చిన్నారిని తాత అక్కున చేర్చుకుని భగవద్గీత వినిపించేవాడు. శ్లోకాలు నేర్పించి శోకాన్ని దూరం చేసేవాడు. క్రమంగా ఆ బాలుడు భగవద్గీతనూ, రామచరిత మానస్‌నూ కంఠస్థం చేశాడు.  

ఆ అనుభవంతోనే...

లక్ష్యమంటూ లేకుండా ఇంటి పట్టునే ఆధ్యాత్మిక సాహిత్యం వింటూ కాలక్షేపం చేసే రామభద్రాచార్యకు పదేళ్ల వయసులో ఎదురైన ఓ అనుభవం దిశానిర్దేశం చేసింది. ఒకసారి ఇంటి ముందు నుంచి పెళ్లి ఊరేగింపు వెళుతుంటే సరదాగా ఆ గుంపులో కలిసిపోయాడు. కానీ ‘ఇలాంటి చోటుకు నువ్వు రాకూడదు’ అంటూ ఆ పెళ్లి బృందం అతడిని గెంటేసింది. ఆ బాధలోనే తనలాంటివారికోసం ఏదైనా చేయాలను కున్నాడు. అదే విషయం ఇంట్లో చెబితే చదువుతో ఏదైనా సాధించొచ్చని అతనిలో స్ఫూర్తి నింపాడు తండ్రి. అలా రామభద్రాచార్య ఐదేళ్లపాటు పాణిని సంస్కృత వ్యాకరణం నేర్చుకున్నారు. తరవాత వారణాసిలోని సంపూర్ణానంద విశ్వవిద్యాలయంలో డిగ్రీలో ప్రవేశం పొందారు. అక్కడ చదువుకుంటూనే దిల్లీలో జరిగిన అఖిల భారత వక్తృత్వ పోటీల్లో పాల్గొని ఇందిరాగాంధీ చేతుల మీదుగా ఐదు బంగారు పతకాలు అందుకున్నారు. డిగ్రీ అయ్యాక సంస్కృతంలో ఎం.ఏ., పీహెచ్‌డీ, పోస్ట్‌డాక్టోరల్‌ కూడా పూర్తి చేసిన రామభద్రాచార్య.. తన జీవితాన్ని రామకథా గానంతో పావనం చేసుకుందామనుకున్నారు. ఆ క్రమంలో ఓ సాధువు సూచనతో రాముడు వనవాసమున్న చిత్రకూట్‌లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని 1987లో ‘తులసీ పీఠం’ స్థాపించారు. రామకథలు చెబుతూనే, చూపులేని వారిలో ఆత్మవిశ్వాసం నింపాలనే ఉద్దేశంతో ఓ పాఠశాలకు శ్రీకారం చుట్టారు. చూపులేని చిన్నారులను గుర్తించి చదువు చెప్పడం మొదలుపెట్టారు. పిల్లలు ఆసక్తిగా చదువుకునేవారు కానీ కాలేజీకీ మరెక్కడికీ వెళ్లలేక చదువు ఆపేసేవారు. అది గమనించిన రామభద్రాచార్య అంధులతోపాటు ఇతర లోపాలున్నవారికీ చదువుకునే అవకాశమూ, వసతీ ఉచితంగా కల్పించాలనే లక్ష్యంతో 2001లో ‘జగద్గురు రామభద్రాచార్య దివ్యాంగ్‌ యూనివర్సిటీ’ని నెలకొల్పారు.

తులసీపీఠానికి భక్తులిచ్చిన నిధులతో రామభద్రాచార్య నిర్మించిన యూనివర్సిటీని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం గుర్తించి ఆయన్నే జీవితకాలం ఛాన్సలర్‌గా ఉండాలని కోరింది. ఏటా రెండు వేల మందిని పట్టభద్రుల్ని చేస్తున్న ఈ విశ్వవిద్యాలయంలో పలు కోర్సులతోపాటు, హాస్టళ్లూ అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజూ వచ్చి వెళ్లే విద్యార్థులకు రవాణా ఖర్చులు అందిస్తారు. దివ్యాంగులకే సాటివారి కష్టాలు తెలుస్తాయని అధ్యాపకుల్ని కూడా అలాంటి వారినే నియమిస్తుంటారు. దేశవిదేశాల్లో స్థిరపడిన ప్రముఖుల్ని గెస్ట్‌లెక్చరర్లుగా ఆహ్వానించి జీవిత పాఠాలూ చెప్పిస్తుంటారు. ఆత్మన్యూనతతో బాధపడేవారికి మానసిక నిపుణులతో ప్రత్యేక తరగతులూ నిర్వహిస్తుంటారు. పేదలకు క్రచెస్‌, ట్రైసైకిళ్లు, కృత్రిమ అవయవాలను ఉచితంగా అందిస్తుంటారు. చదువుతోపాటు ఫిజియోథెరపీ సేవలూ అక్కడ అందుబాటులో ఉంటాయి. డిగ్రీ, పీజీ చేసే ఆసక్తి లేనివారికోసం వృత్తివిద్యాకోర్సులూ ఉన్నాయి. దివ్యాంగ విద్యార్థులకోసం ఎంతో తపించే రామభద్రాచార్య ప్రోత్సాహంతో చదువుకున్న వారు బెనారస్‌, త్రిపుర యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లుగానూ- మరో పదివేల మంది దాకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ కొలువుదీరారు. కులమతాల ఊసు లేకుండా ప్రతిభ ఆధారంగా దివ్యాంగులకు చదువుకోవడానికి అవకాశమిచ్చే రామభద్రాచార్య దాదాపు 200 పుస్తకాలను రచించారు. 22 భాషల్లో పండితుడై, జ్ఞానపీఠ్‌కు ఎంపికైన ఆయన గుజరాత్‌లో పేదలకోసం వంద పడకల ఆసుపత్రిని నిర్మించి కార్పొరేట్‌ సేవలకు దీటుగా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్న మహానుభావుడు.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.