• facebook
  • whatsapp
  • telegram

SCERT: ప్రతిభకు లేదు వందనం.. పలుకుబడికే అందలం

* డిప్యుటేషన్లు, ఫారిన్‌ సర్వీస్‌ల పేరిట ఏళ్ల తరబడి తిష్ఠ

* మసకబారుతున్న ఎస్‌సీఈఆర్‌టీ ప్రతిష్ఠ

* సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు ఉపాధ్యాయ సంఘాల సమాయత్తం

ఈనాడు, హైదరాబాద్‌: ఉద్ధండులైన నిపుణుల కేంద్రంగా ఉండాల్సిన రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) పలుకుబడి ఉన్న ఉపాధ్యాయులకు పునరావాస కేంద్రమైంది. పాఠశాల విద్యకు గుండెకాయ వంటి విభాగం మంత్రులు, రాజకీయ నాయకుల సిఫారసులుండి హైదరాబాద్‌లో మకాం వేయాలనుకున్న వారికి ఓ వరంలా మారింది. ఇందులో ఇష్టారాజ్యంగా ఇస్తున్న డిప్యుటేషన్లు, ఫారిన్‌ సర్వీస్‌లను రద్దు చేయాలని త్వరలో సీఎంతో జరగనున్న సమావేశంలో కోరేందుకు ఉపాధ్యాయ సంఘాల నేతల సిద్ధమవుతున్నారు.

* ఫిర్యాదుకు సన్నద్ధం

విద్య, ఉపాధ్యాయ రంగ సమస్యలపై త్వరలో ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల శాసనసభ సమావేశాల్లో ప్రకటించారు. జనవరిలో ఈ భేటీ ఉంటుందని భావిస్తున్నారు. ఆ సందర్భంగా బదిలీలు, పదోన్నతులతోపాటు ప్రధానంగా ఎస్‌సీఈఆర్‌టీలో అక్రమ డిప్యుటేషన్లను రద్దు చేయాలని, అక్కడ ఓ ఉపాధ్యాయుడి పెత్తనం, 6-9 తరగతుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకు ప్రారంభించిన ఉన్నతి కార్యక్రమాన్ని రద్దు చేయాలని తదితర అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు పలు ఉపాధ్యాయ సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఎస్‌సీఈఆర్‌టీలో అక్రమ డిప్యుటేషన్లపై విచారణ జరపాలని టీపీటీఎఫ్‌ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశానికి విన్నవించాయి.

నిబంధనలకు తిలోదకాలు..

విద్యపై పరిశోధనలు చేస్తూ.. కాలానుగుణంగా పాఠ్య ప్రణాళికలు మారుస్తూ.. ఉపాధ్యాయులకు అవసరమైన శిక్షణ ఇస్తూ పాఠశాల విద్యకు దిక్సూచిగా నిలవడం ఎస్‌సీఈఆర్‌టీ ప్రధాన విధి. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్‌ నిబంధనల కారణంగా ఇక్కడున్న ఆచార్య, అధ్యాపకుల పోస్టులను పూర్తిగా శాశ్వత ఉద్యోగులతో భర్తీ చేయలేని పరిస్థితి. ఆరుగురు శాశ్వత ఆచార్యులు ఉండాల్సిన చోట ముగ్గురే ఉన్నారు. అధ్యాపక పోస్టులు 16 ఉండగా.. కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. మొత్తం మీద ఇక్కడ 20 మంది వరకు డిప్యుటేషన్లు(అసలు స్థానంలో వేతనం తీసుకోవడం), ఫారిన్‌ సర్వీస్‌(ఎస్‌సీఈఆర్‌టీలో వేతనం తీసుకోవడం) పేరిట పనిచేస్తున్నారు.
* ఖాళీగా ఉన్న 14 అధ్యాపక పోస్టుల్లో ఉపాధ్యాయులను నియమిస్తున్నారు. సబ్జెక్టు నిపుణులైన స్కూల్‌ అసిస్టెంట్లను నియమించడం కొంతలో కొంత హేతుబద్ధత ఉందని చెప్పొచ్చు. విచిత్రమేంటంటే 1-5 తరగతులకు బోధించే సెకండరీ గ్రేడ్‌ టీచర్ల(ఎస్‌జీటీల)ను నలుగురిని అధ్యాపక స్థానాల్లో డిప్యుటేషన్‌పై నియమించడం గమనార్హం.
* ఎస్‌జీటీలను నియమించడమే తప్పని నిపుణులు చెబుతుంటే ఏడాదిన్నర క్రితం మోడల్‌ స్కూల్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ)గా పనిచేసే మహిళా ఉపాధ్యాయురాలిని ఏకంగా ఎస్‌సీఈఆర్‌టీలో శాశ్వత లెక్చరర్‌(డిప్యూటీ ఈఓ స్థాయి)గా నియమించడం ఉపాధ్యాయులను విస్మయానికి గురిచేసింది.
* ఉమ్మడి మహబూబ్‌నగర్‌జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడిని ఫారిన్‌ సర్వీస్‌పై ఎస్‌సీఈఆర్‌టీలో నియమించలేదన్న విషయం 2017లో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కిషన్‌ బదిలీకి ఒక కారణమైంది.
* ఓ ఉపాధ్యాయుడు 15 సంవత్సరాలుగా ఎస్‌సీఈఆర్‌టీలోనే తిష్ఠవేశారు. ఇటీవలే ఆయన ఫారిన్‌సర్వీస్‌ ఉత్తర్వులు తెచ్చుకోవడం గమనార్హం. ఆయన పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు సమాచారం ఇవ్వకుండానే ఇంతకాలం ఓ ఉన్నతాధికారి నుంచి ఆదేశాలు తీసుకొని కార్యక్రమాలు రూపొందించారన్న ఆరోపణలున్నాయి. ఇటీవల ఉన్నతి కార్యక్రమంపై పర్యవేక్షణకు ప్రతి డైట్‌ కళాశాలకు 10మంది వరకు ఉపాధ్యాయులను కంటిన్యుయస్‌ ప్రొఫెషనల్‌ డెవలప్‌మెంట్‌(సీపీడీ) పేరిట నియమించారు. డీఈవోలనుంచి వారి జాబితాను తెప్పించుకోకుండా తన అనుయాయుల పేర్లను పంపి నియమించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 31-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.