• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వే 2022-23

ఆర్థికమాంద్యం, కరోనా వంటి సంక్షోభాలను తట్టుకొని తెలంగాణ బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధిలోనూ యావద్దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచి...‘తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది’ అని చెప్పుకొనే స్థాయికి చేరుకోవడం గర్వకారణమన్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కేంద్రం ఆటంకాలు కల్పిస్తున్నా గణనీయమైన ప్రగతి సాధించిందన్నారు. శాంతిభద్రతల సమర్థ నిర్వహణతో దేశంలోనే ఎక్కడా లేనిరీతిలో పెట్టుబడులు సాధ్యమయ్యాయన్నారు. శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వేను విడుదల చేశారు. 
హరీశ్‌రావు ప్రసంగం ఉదయం 10.30 గంటలకు ఆరంభమై 12.15 గంటలకు (105 నిమిషాలు) ముగిసింది. రాష్ట్ర శాసనసభ చరిత్రలో ఇదే సుదీర్ఘ ప్రసంగం.

రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.13.27 లక్షల కోట్లు
రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో సేవల రంగం ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. 2022 - 23లో 17.5 శాతం ఉండగా 2021 - 22లో ఇది 20.5 శాతం నమోదైంది. ఈ రంగం పరిధిలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఆసుపత్రులు, రవాణా, స్థిరాస్తి తదితర సేవలు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ సామాజిక, ఆర్థిక నివేదిక (సోషియో ఎకనామిక్‌ ఔట్‌లుక్‌) - 2023లో వివిధ రంగాల్లో తాజా పరిస్థితులను వెల్లడించింది. 2022 - 23లో సేవల రంగం విలువ రూ.7,50,408 కోట్లు. వ్యవసాయం, పశు సంవర్ధకం, మత్స్య, గనులు, ఖనిజాల నుంచి లభించే ఆదాయ అంచనా ప్రకారం ప్రాథమిక రంగం వాటా 11.7 శాతంగా తేలింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఈ రంగం వాటా విలువ రూ.2,45,794 కోట్లు. మాన్యుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, నీటి సరఫరా, ఇతర వినియోగ సంబంధ సేవలు, నిర్మాణ రంగం కలిపి ద్వితీయ రంగంవాటా 10.6%. దీని విలువ రూ.1,98,575 కోట్లు. మొత్తం ఆదాయంలో జీఎస్‌డీపీ వాటా 15.6%. దీని విలువ రూ.13,27,495 కోట్లు. గతేడాది 19.4% నమోదైంది. విలువ రూ.11,48,115 కోట్లు. 2015 - 16లో జీఎస్‌డీపీ 14.2%. కరోనా కాలంలో 2019 - 20లో 10.8 శాతం, 2020 - 21లో 1.2శాతానికి పడిపోగా గతేడాది నుంచి పుంజుకుంది. 
తలసరి ఆదాయం (పర్‌ క్యాపిటా)లో రూ.6,69,102లతో రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. రాజధాని నగరంలో ఎక్కువ ప్రాంతం ఈ జిల్లాలోనే విస్తరించి ఉండటంతోపాటు ఐటీ, పరిశ్రమలు, సేవలు, తదితర రంగాలు వృద్ధి చెందడంతో ఇక్కడ తలసరి ఆదాయం భారీగా నమోదైంది. హైదరాబాద్‌ జిల్లా (రూ.3,49,061), సంగారెడ్డి (రూ.2,49,091), సిద్దిపేట జిల్లా (రూ.2,12,788) వరుసగా రెండు, మూడు, నాలుగో స్థానాల్లో నిలిచాయి. హనుమకొండ జిల్లా రూ.1,30,821 తలసరి ఆదాయంతో చివరి స్థానంలో ఉంది. ఆపై స్థానాల్లో కుమురం భీం ఆసిఫాబాద్‌ (రూ.1,31,843), వికారాబాద్‌ (రూ.1,31,962) జిల్లాలు ఉన్నాయి.
మండలాల సగటు జనాభా 61,366
మండలాల సగటు జనాభా అతి తక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణే. రాష్ట్రంలోని 612 మండలాల్లో మొత్తం జనాభా సుమారు 3.75 కోట్లు. దీని ప్రకారం ఒక్కో మండల సగటు జనాభా 61,366. అదే సమయంలో దేశంలో తెలంగాణ సహా మొత్తం 18 రాష్ట్రాలు కలిపి ఒక్కో మండల సగటు జనాభా 2.07 లక్షలుగా తేలింది. అంటే రాష్ట్రంలో మండల సగటు జనాభా చాలా తక్కువని స్పష్టమవుతోంది. తెలంగాణ తర్వాత అతి తక్కువ సగటు మండల జనాభా ఉన్నది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం. అక్కడ మండల సగటు జనాభా 79,023. అత్యధికంగా మహారాష్ట్రలో 3.53 లక్షలుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యధికంగా 828 మండలాలు/బ్లాక్‌లు ఉండగా.. 668 మండలాలతో ఏపీ, 612 మండలాలతో తెలంగాణ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. 
ప్రతి 100 మందికి 105 ఫోన్‌ కనెక్షన్లు
మొబైల్‌ కనెక్షన్ల వినియోగ సాంద్రతలో రాష్ట్రం 9వ స్థానంలో ఉంది. దేశంలో ప్రతి 100 మందికి సగటున 83 కనెక్షన్లు ఉండగా రాష్ట్రంలో 105 ఉన్నాయి. 2022 నవంబరు నాటికి రాష్ట్రంలో 4.08 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. అందులో 98 శాతం మొబైల్‌ వినియోగదారులే. మొత్తం వినియోగదారుల్లో 2.28 మంది నగర/పట్టణ వాసులున్నారు.
23 లక్షలు దాటిన ధరణి లావాదేవీలు 
ధరణి పోర్టల్‌ ద్వారా ఏక కాలంలో రిజిస్ట్రేషన్‌-మ్యుటేషన్‌ పూర్తికి 47 నిమిషాల సమయం పడుతోంది. 2020 నవంబరు రెండో తేదీ నుంచి 2023 జనవరి 27 వరకు 23.20 లక్షల లావాదేవీలు నమోదయ్యాయి. వీటిలో రిజిస్ట్రేషన్ల నిమిత్తం 17.30 లక్షల దరఖాస్తులు రాగా 16.59 లక్షలు పూర్తయ్యాయి. 

అడవుల విస్తీర్ణంలో తెలంగాణ ప్రథమం
అడవుల విస్తీర్ణంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. 2019 - 21 మధ్యకాలంలో పెరిగిన విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకొని ‘ఇండియా స్టేట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రిపోర్ట్‌ - 2021’లో ఈ విషయాన్ని ప్రస్తావించారని ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ సామాజిక, ఆర్థిక నివేదికలో పేర్కొన్నారు. 2015లో తెలంగాణ 19,854 చదరపు కి.మీ. అటవీ విస్తీర్ణం ఉండగా 2019 నాటికి 20,582 చదరపు కి.మీ.లకు పెరిగింది. 2021 నాటికి 21,214 చదరపు కి.మీ.లకు చేరుకుంది. 2019 - 21 కాలంలో రాష్ట్రంలో ఏకంగా 632 చదరపు కి.మీ.(3.07 శాతం) అడవులు విస్తరించాయి. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా అటవీ ప్రాంతంలో పెరుగుదల 1,540 చదరపు కి.మీ.లు (0.22 శాతం) మాత్రమే నమోదు కావడం గమనార్హం. 
అడవుల ఖిల్లా.. భద్రాద్రి జిల్లా
రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. జిల్లాలో 4,311.38 చదరపు కి.మీ.లలో అడవులు విస్తరించాయి. 2,939.15 చదరపు కి.మీ.(10.89 శాతం)తో ములుగు రెండో స్థానంలో, 2,496.68 చదరపు కి.మీ.(9.26 శాతం)తో నాగర్‌కర్నూల్‌ మూడో స్థానంలో ఉన్నాయి. జిల్లా భూభాగంలో ఎక్కువ శాతం అటవీ ప్రాంతం ఉన్న జిల్లాగా ములుగు (71.22 శాతం) నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం (61.45%), ఆసిఫాబాద్‌ (54.45%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఉపాధి కల్పనలో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానం
2015 నుంచి ఇప్పటివరకు కొత్త పరిశ్రమల నిర్వహణకు టీఎస్‌ఐపాస్‌ అనుమతుల్లో మేడ్చల్‌ జిల్లా 21.2 శాతంతో తొలిస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో సంగారెడ్డి (8.01%), రంగారెడ్డి (7.54%) ఉన్నాయి.
‣ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ పెట్టుబడులు రంగారెడ్డి జిల్లా (32.15 శాతం)లోనే నమోదయ్యాయి. నల్గొండలో 11.17, కొత్తగూడెంలో 9.05 శాతం ఉన్నాయి.
ఉపాధి కల్పనలో రంగారెడ్డి జిల్లా 56.66 శాతంతో తొలి స్థానంలో ఉంది. వరంగల్‌ (11.12%), సంగారెడ్డి (8.04%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

రాష్ట్రంలో లక్ష కి.మీ. రహదారులు
రాష్ట్రంలో రోడ్ల పొడవు లక్ష కిలోమీటర్లు దాటింది. మొత్తం 1,09,260 కి.మీ. పొడవు రోడ్లున్నాయి. అందులో 61.80 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. రాష్ట్ర రహదారులు (హైవేలు), జిల్లా రోడ్లు 25.39 శాతం ఉండగా జాతీయ రహదారులు 4.56 శాతమున్నాయి. మొత్తం రోడ్ల పొడవులో జీహెచ్‌ఎంసీలో 8.25 శాతం ఉండటం విశేషం.
సైకాలజీలో పీజీ చేసిన 28 మంది ‘చర్లపల్లి’ ఖైదీలు
చర్లపల్లి జైలులో ఏర్పాటు చేసిన బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ అధ్యయన కేంద్రంలో 28 మంది ఖైదీలు ఎమ్మెస్సీ సైకాలజీ పూర్తి చేసి పట్టాలు పొందారు. రాష్ట్రంలో సబ్, జిల్లా జైళ్లు కలిపి 47 ఉన్నాయి. వాటిలో 7,845 మంది ఖైదీలను ఉంచే సామర్థ్యం ఉండగా 2022 డిసెంబరు 11 నాటికి విచారణ, నిర్బంధ, శిక్ష పడిన ఖైదీలు 6,786 మంది ఉన్నారు.

సర్కారు బడులు నల్గొండలో ఎక్కువ
ములుగు జిల్లాలో అతి తక్కువగా 353 ప్రభుత్వ పాఠశాలలుండగా అత్యధికంగా నల్గొండ జిల్లాలో 1,483 బడులున్నాయి. ప్రైవేట్‌ పాఠశాలలు ములుగులో అతి తక్కువగా 47 ఉండగా అత్యధికంగా హైదరాబాద్‌లో 2,156 ఉన్నాయి. ఎక్కువ ప్రైవేట్‌ పాఠశాలలున్న మొదటి మూడు జిల్లాలుగా జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి నిలిచాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల శాతం 2020 - 21లో 43.47 ఉండగా 2021 - 22లో 49.77కు పెరగడం గమనార్హం. 2019 - 20లో 42.91 శాతం మందే ఉన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2021 - 22లో సర్కారు బడుల్లో అత్యధిక శాతం విద్యార్థులు నమోదు కావడం విశేషం.
మరికొన్ని ముఖ్యాంశాలు..
‣ రాష్ట్రంలోని మొత్తం బ్యాంకు శాఖల్లో 46% (2,732) నగరాలు, పట్టణాల్లోనే ఉన్నాయి. మిగిలిన వాటిలో సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో 24% (1,408) ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో 30% (1,818) ఉన్నాయి
మాంసం ఉత్పత్తి గత తొమ్మిదేళ్లలో దాదాపు అయిదు రెట్లు పెరిగింది. 2013 - 14లో 2.30 లక్షల టన్నులు ఉండగా 2021 - 22 నాటికి 10.14 లక్షల టన్నులకు పెరిగింది. పాల ఉత్పత్తిలో 55, గుడ్ల ఉత్పత్తిలో 71 శాతం వృద్ధి నమోదైంది.
పోలీస్‌ బలగాల సంఖ్య 2015లో 52,116 ఉండగా 2019 నాటికి 77,680కి చేరింది. అంటే దాదాపు 50 శాతం పెరిగింది. 
‣ రాష్ట్రంలోని మొత్తం కార్మికుల్లో 33.21 శాతం మంది సేవారంగంలో పనిచేస్తున్నారు. ఈ అంశంలో జాతీయ సగటు 29.64 శాతమే. రాష్ట్రంలో సేవా రంగంలో ఉన్న వారిలో 39.75 శాతం మంది వర్తకం, హోటళ్లు, రెస్టారెంట్లలో పనిచేస్తున్నారు. మరో 21.04 శాతం మంది రవాణా, స్టోరేజీ, కమ్యూనికేషన్‌ రంగాల్లో ఉన్నారు. అర్బన్‌ కార్మికుల్లో 63.22 శాతం మంది సేవా రంగంలో పనిచేస్తుండగా గ్రామీణ ప్రాంతాల్లో 18.28 శాతం మంది ఈ రంగంలో ఉన్నారు.
తెలంగాణ ప్రభుత్వం 2022 మార్చి 31 నాటికి 13.79 లక్షల ఉత్తర్వులను జారీ చేసింది. గవర్నమెంట్‌ ఆర్డర్‌ ఇష్యూ రిజిస్టర్‌ (జీవోఐర్‌) పోర్టల్‌ ద్వారా సచివాలయంలోని శాఖలు 1,63,896, వాణిజ్య పన్నులశాఖ 4,26,590, ట్రాన్స్‌కో 34,774, సచివాలయ శాఖలు ఎఫ్‌ఎంఎస్‌లో జారీ చేసినవి 6,89,819, ఎస్‌వోఎంఎస్‌ ద్వారా 64,813 ఉత్తర్వులు జారీ చేశాయి. 
2014 జూన్‌ నుంచి 2023 జూన్‌ వరకు నమోదైన ఈ-లావాదేవీల్లో (ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్స్‌) దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ప్రతి వెయ్యి జనాభాకు రాష్ట్రంలో 1,58,241 లావాదేవీలు జరిగాయి. రెండో స్థానంలో ఉన్న ఏపీలో 1,41,147, మూడో స్థానంలో ఉన్న కేరళలో 1,40,709 నమోదయ్యాయి. బిహార్‌లో 11,267, మహారాష్ట్రలో 15,819 లావాదేవీలు మాత్రమే నమోదయ్యాయి.
ఆర్థికాభివృద్ధిలో ఆదర్శంగా.. 
తెలంగాణ ఏర్పాటుకు ముందు రెండేళ్లలో రాష్ట్ర జీఎస్డీపీ వార్షిక వృద్ధి రేటు 12 శాతమే. ఇది జాతీయ వృద్ధి రేటు 13.4 శాతం కంటే తక్కువ. కేసీఆర్‌ ఆర్థిక క్రమశిక్షణ చర్యలతో 2019 - 20 నాటికి 13.2 శాతానికి పెరిగింది. అదే సమయంలో దేశ జీడీపీ 10.2 శాతానికి తగ్గింది. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అని నీతి ఆయోగ్‌ పేర్కొంది. రాష్ట్రంలో 2022 - 23లో తలసరి ఆదాయం రూ.3,17,115 ఉండొచ్చని అంచనా. ఇది జాతీయ సగటు రూ.1,70,620కంటే దాదాపు 86 శాతం ఎక్కువ. కేంద్రం కల్పించిన ఆర్థిక అడ్డంకులను అధిగమిస్తూనే సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ఎఫ్‌ఆర్‌బీఎం పరిధికి లోబడి బడ్జెటేతర రుణాలను సమీకరించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక సామర్థ్యం మేరకు రుణ పరిమితిని రూ.53,970 కోట్లుగా బడ్జెట్‌లో పొందుపరిచి సభలో ఆమోదించుకున్నా కేంద్రం రూ.15,033 కోట్లు కోత పెట్టడం అసంబద్ధం.

దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ
తెలంగాణ ఏర్పాటుకు పదేళ్ల ముందు వ్యవసాయం, అనుబంధ రంగాలకు అప్పటి ప్రభుత్వాలు కేవలం రూ.7,994 కోట్లు ఖర్చు చేశాయి. రాష్ట్రం ఆవిర్భావం నుంచి 2023 జనవరి వరకు రూ.లక్షా 91 వేల 612 కోట్లు ఖర్చు చేశాం. 2014 - 15లో రాష్ట్రంలో 131.33 లక్షల ఎకరాల్లో పంటల సాగు విస్తీర్ణం ఉండగా 2020 - 21నాటికి 215.37 లక్షలకు పెరిగి దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ అవతరించింది. దేశచరిత్రలో 65 లక్షల మందికి రూ.65 వేల కోట్ల రైతుబంధు నిధులు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణనే. రైతుబీమా కింద దాదాపు లక్ష మందికి రూ.5,384 కోట్ల సాయం అందించాం. ప్రస్తుతం రాష్ట్రంలో 73 లక్షల 33 వేల ఎకరాలకు సాగునీటి వసతి ఏర్పడింది. వచ్చే మూడేళ్లలో మరో 50 లక్షల 24 వేల ఎకరాలకు నీరిచ్చి కోటీ 25 లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యాన్ని త్వరలోనే చేరుకోబోతున్నాం.
2021 - 22లో రూ.5860 కోట్ల విలువైన 3.9 లక్షల టన్నుల మత్స్య సంపద రాష్ట్ర ప్రభుత్వం సృష్టించిన బ్లూ రివల్యూషన్‌కు నిదర్శనం.
‣ 21,585 మంది చేనేత, 43,104 మంది పవర్‌లూమ్‌ కార్మికులకు జియోట్యాగింగ్‌ నంబర్లు ఇవ్వడం ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే నగదు బదిలీ చేస్తున్నాం.
2014లో స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 7,778  మెగావాట్లు. ప్రస్తుతం 18,453 మెగావాట్లకు పెరిగింది.
మిషన్‌ భగీరథతో ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందించడం ద్వారా తాగునీటి కష్టాలను అధిగమించిన తొలి రాష్ట్రం తెలంగాణనే అని కేంద్రమే ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకు రూ.44,933.66 కోట్ల అంచనాతో అనుమతులిస్తే రూ.36,900 కోట్లే వెచ్చించి పూర్తిచేశాం. ఈ పథకం స్ఫూర్తితోనే ‘హర్‌ఘర్‌ జల్‌యోజన’ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది.
గురుకులాల విద్యాలయాలకు పెద్దపీట వేయడంతో 1.3 లక్షలున్న విద్యార్థుల సంఖ్య 5.59 లక్షలకు పెరిగింది. మన ఊరు.. మన బడి పథకం కింద 26,065 పాఠశాలల్లో రూ.7,289 కోట్లతో మౌలిక సదుపాయాలు సమకూరుతున్నాయి. యూనివర్సిటీల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా రూ.500 కోట్లు కేటాయించాం.
ఉత్తమ వైద్య సేవల్లో దేశంలో తెలంగాణాది మూడో స్థానం. ప్రతి లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్‌ సీట్లతో దేశంలోనే తెలంగాణాది ప్రథమ స్థానం. కంటి వెలుగు కార్యక్రమాన్ని దిల్లీ, పంజాబ్‌లలో అమలు చేస్తామని అక్కడి సీఎంలు ప్రకటించడం తెలంగాణకు గర్వకారణం. 
‣ తెలంగాణలోని 12,769 పల్లెల్లో సాధించిన ప్రగతితో పోల్చితే ఏ రాష్ట్రమూ మన దరిదాపుల్లో లేదు.
యాదాద్రి పుణ్యక్షేత్రం, బుద్ధవనం నిర్మాణం పర్యాటక కేంద్రాలుగా మారాయి. సచివాలయంలో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం, రూ.178 కోట్లతో అమరవీరుల స్మృతి తెలంగాణ అస్తిత్వాన్ని చాçబోతున్నాయి.
ఉత్తమ ఇంక్యుబేటర్‌గా టి-హబ్‌
రాజధానిలో మౌలిక వసతుల కోసం రూ.202.275 కోట్లతో లింక్‌రోడ్ల నిర్మాణం, ఎస్సార్డీపీ కింద ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, ఆర్వోబీల నిర్మాణం, రూ.6,250 కోట్లతో శంషాబాద్‌ విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీ, రూ.95 కోట్లతో కోకాపేటలో సోలార్‌ రూఫ్‌ సైకిల్‌ట్రాక్, రూ.1,956 కోట్లతో ఓఆర్‌ఆర్‌ పరిధిలో తాగునీటి ప్రాజెక్టు, లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు తదితర పనులతో హైదరాబాద్‌ దశదిశలా అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది. ఐటీ, ఇతర పారిశ్రామిక రంగాల్లో రూ. 3 లక్షల 31 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా 22 లక్షల 36 వేల ఉద్యోగ అవకాశాలు కలిగాయి. గడిచిన ఎనిమిదేళ్లలో ఐటీ వార్షిక ఎగుమతుల్లో 220 శాతం వృద్ధి నమోదు చేసి దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. టి-హబ్‌ దేశంలోనే ఉత్తమ ఇంక్యుబేటర్‌గా నిలిచింది.

ఆరోగ్యంపై తలసరి వ్యయంలో తెలంగాణే ముందంజ
దేశంలోని పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే.. వైద్య ఆరోగ్య రంగంపై తలసరి వ్యయంలో తెలంగాణ ముందంజలో ఉందని ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. 2022 - 23లో వైద్య రంగంపై ప్రభుత్వాలు పెట్టిన వ్యయాన్ని చూస్తే.. తెలంగాణలో రూ.3,335గా నమోదు కాగా కేరళలో రూ.2,890, మధ్యప్రదేశ్‌ రూ.2,695, తమిళనాడు రూ.2,434, కర్ణాటక రూ.2,184, ఉత్తర్‌ప్రదేశ్‌ రూ.2,049 , గుజరాత్‌ రూ.1,952, ఆంధ్రప్రదేశ్‌ రూ.1,831, బిహార్‌లో రూ.1,613గా ఉందని వైద్య శాఖ పేర్కొంది.

తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వే 2022-23 పీడీఎఫ్‌

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 06-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.