• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్ర‌ప్ర‌దేశ్ బ‌డ్జెట్ 2023-24

ఆంధ్రప్రదేశ్‌లో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ (AP budget 2023)ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రూ.2.79 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (Buggana Rajendranath Reddy) అసెంబ్లీలో (AP Assembly) ప్రవేశపెట్టారు. పోతన పద్యంతో, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ వ్యాఖ్యలతో తన బడ్జెట్‌ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్‌ రూపకల్పనలో భాగస్వాములైన వారికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలో ఆటుపోట్లను అధిగమించామని మంత్రి బుగ్గన అన్నారు. ఈ బడ్జెట్‌ సుస్థిర అభివృద్ధి, సుపరిపాలనపై దృష్టి సారించామన్నారు.

‣ రాష్ట్రంలో 62 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నట్టు మంత్రి బుగ్గన తెలిపారు. రైతుల ఆదాయం పెంచడంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. రైతు లేనిదే రాజ్యం లేదని విశ్వసించే ప్రభుత్వం తమదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని రైతు భరోసా కేంద్రాల పనితీరును ప్రపంచం మెచ్చుకుందని తెలిపారు. మిగిలిన 7,853 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రాభివృద్ధిలో పాడిరంగం కీలక పాత్రం పోషిస్తుందని మంత్రి బుగ్గన తెలిపారు. గుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు. మాంసం ఉత్పత్తిలో రెండో స్థానం, పాల ఉత్పత్తిలో 5వ స్థానంలో ఉందని వెల్లడించారు. పశువుల బీమా కోసం వైఎస్‌ఆర్‌ పశు బీమా పథకం తీసుకొచ్చినట్లు మంత్రి బుగ్గన వెల్లడించారు. రాష్ట్రంలో 340 సంచార పశువైద్యశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 154 నియోజవర్గాల్లో జంతు వ్యాధుల నిర్ధారణ కేంద్రాలు మంజూరు చేశామన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ రూ.2,79,279.27 కోట్లు
విధానపరమైన ఆవిష్కరణలు, వినూత్న పాలనా విధానాలు తమ ప్రభుత్వ విశిష్ట లక్షణాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. నవరత్నాలు, ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న పథకాల ఆధారంగా రూపొందించిన అభివృద్ధి కార్యక్రమాల ద్వారా సుస్థిరాభివృద్ధి సాధన కోసం ఒక సమ్మిళిత విధానాన్ని తమ ప్రభుత్వం అవలంబించిందని పేర్కొన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) పథకాల ద్వారా రూ.1.97 లక్షల కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిందని, ఈ విధానం, సంక్షేమ కార్యక్రమాల అమలులో అద్భుతమైన నమూనాగా నిలిచిందని అన్నారు. 2023 - 24 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ఆయన శాసనసభలో ప్రవేశపెట్టారు. జీవనోపాధి, సామర్థ్య అభివృద్ధి - సాధికారత, సామాజిక భద్రత, మౌలిక సదుపాయాలు - పారిశ్రామికాభివృద్ధి అనే అంశాల ద్వారా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుసంధానం చేస్తున్నామని చెప్పారు. మొత్తం రూ.2,79,279 కోట్లతో బడ్జెట్‌ను ఆయన ప్రతిపాదించారు.

బుగ్గన ప్రసంగంలోని ప్రధానాంశాలివే.. 
‣ వైఎస్‌ఆర్‌ రైతు భరోసా - పీఎం కిసాన్, వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా - ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన, వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కేంద్రాలు తదితర కార్యక్రమాల ద్వారా వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, ఆదాయాల పెంపుపై మా ప్రభుత్వం దృష్టిపెట్టింది. 
‣ వైఎస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీ పథకం పరిధిలోకి 1.41 కోట్ల కుటుంబాలను తీసుకొచ్చాం. వైఎస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా కింద శస్త్ర చికిత్స తర్వాత జీవనోపాధి నిమిత్తం నెలకు రూ.5 వేలు అందిస్తున్నాం. 
‣ ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు మెరుగైన భోజనం అందించేందుకు మా ప్రభుత్వం ఏటా రూ.1,000 కోట్లు అదనంగా ఖర్చు చేస్తోంది. 
‣ విశాఖపట్నంలో నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో రూ.13.42 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 6 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన లక్ష్యంతో 378 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. రూ.3,300 కోట్ల పెట్టుబడితో ఏడాదికి రెండు మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో జిందాల్‌ స్టీల్‌ వర్క్స్‌ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో కడప ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయనుంది. 

10 శాతం వృద్ధి అంచనా 
2018 - 19లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధికి సంబంధించి స్థిరమైన ధరలలో దేశంలో ఏపీ 22వ స్థానంలో ఉండేది. మా ప్రభుత్వ అభివృద్ధి విధానాలతో పాటు పెట్టుబడి, వినియోగం రెంటినీ అనుసంధానించడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంతో పురోభివృద్ధి సాధించింది. 2021 - 22 ఆర్థిక సంవత్సరానికి స్థిర ధరలతో 11.43 శాతం వృద్ధిరేటు నమోదైంది. 2022 - 23లో సవరించిన అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.13,17,728 కోట్లు. 2023 - 24లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.14,49,501 కోట్లు. 10 శాతం వృద్ధి అంచనా వేస్తున్నాం. 
అంచనాలు మించిన రెవెన్యూ లోటు 
ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ లోటు అంచనాలను మించిపోతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.22,316.70 కోట్లకు రెవెన్యూ లోటును పరిమితం చేస్తామని ప్రభుత్వం తన లెక్కల్లో పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.2,06,224 కోట్ల రెవెన్యూ రాబడి ఉంటుందని అంచనా వేస్తూ ఖర్చును రూ.2,28,540.71 కోట్లుగా లెక్కిస్తోంది. మార్చి నెలాఖరుకు అన్ని ఖర్చులూ, రాబడులూ లెక్కించి ఇది ఏకంగా రూ.29,107.56 కోట్లకు పెరగనుందని అంచనాలు వేస్తున్నారు. 

ఏమిటీ రెవెన్యూ లోటు?
రాష్ట్రంలో సొంత పన్నులు, పన్నేతర ఆదాయం, కేంద్రం ఇచ్చే నిధులన్నీ కలిపితే వచ్చే రెవెన్యూ రాబడి కంటే జీతాలు, పింఛన్లు, రాయితీలు, వడ్డీ చెల్లింపులతో పాటు ప్రభుత్వ నిర్వహణ, ఇతర ప్రభుత్వ పథకాలకు వెచ్చించే రెవెన్యూ ఖర్చులే ఎక్కువగా ఉంటున్నాయి. ఇలా రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ ఖర్చులు అధికంగా ఉంటే దాన్ని రెవెన్యూ లోటు అంటారు. తిరిగి ఆదాయం ఇవ్వని ఖర్చులన్నీ రెవెన్యూ లోటు కిందకే వస్తాయి.  
ఆరోగ్యానికి రూ.15,882.34 కోట్లు 
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు రూ.15,882.34 కోట్లను కేటాయించారు. మందుల కొనుగోలుకు 2022 - 23లో రూ.625 కోట్లు కేటాయించగా తాజా బడ్జెట్‌లో రూ.500 కోట్లకు పరిమితం చేశారు. ఆరోగ్యశ్రీ ట్రస్టుకు రూ.400 కోట్లు అదనంగా కేటాయించారు. మందుల కొనుగోలుకు రూ.800 కోట్లు కావాలని తాజాగా శాఖ కోరగా రూ.500 కోట్లే ఇచ్చారు. 2022 - 23 బడ్జెట్‌లో నాడు-నేడు కింద రూ.2,250.55 కోట్లు కేటాయించగా, ఈ బడ్జెట్‌లో రూ.2,585 కోట్లు చూపారు. బ్యాంకు/నాబార్డు రుణాలతో ఆసుపత్రుల అభివృద్ధి, కొత్త నిర్మాణాలు కొనసాగుతున్నాయి. పురపాలక, పంచాయతీల ద్వారా పట్టణ, ఆరోగ్య ఉపకేంద్రాలను నిర్మిస్తున్నారు. పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణాల కోసం జాతీయ ఆరోగ్య మిషన్‌ నిధులను వాడుతున్నారు. 

‣ నాడు-నేడు కింద కొత్తగా 17 వైద్య కళాశాలలను ప్రారంభించేలా ప్రణాళికలు రూపొందించారు. వీటితో పాటు 10,172 ఆసుపత్రుల్లో రూ.16,222 కోట్లతో రెండేళ్ల కిందట నిర్మాణాలు చేపట్టారు. ఇప్పటివరకు 5,083 ఆసుపత్రుల్లోనే పనులు సాగాయి. 2022 - 23 బడ్జెట్‌లో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు రూ.1,500 కోట్లు కేటాయించారు. ఆసుపత్రుల్లో యంత్రాలు/పరికరాల కోసం రూ.300 కోట్లు కేటాయించి రూ.170 కోట్లే వెచ్చించారు. తాజా బడ్జెట్‌లో రూ.200 కోట్లు చూపించారు. పలాసలో కిడ్నీ రీసెర్చి సెంటర్‌ కోసం 2022 - 23లో రూ.40 కోట్లు చూపారు. చివరికి రూ.13 కోట్లనే విడుదల చేశారు. ఈ బడ్జెట్‌లో రూ.25 కోట్లు ఇస్తున్నారు. 
రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపు రూ.150 కోట్లు 
రాష్ట్రంలో నిర్మిస్తున్న కొత్త రైల్వే లైన్ల ప్రాజెక్టులకు తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించడంతో వచ్చే ఏడాదీ వాటి పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండేలా కనిపిస్తోంది. 
నడికుడి - శ్రీకాళహస్తి మధ్య 309 కి.మీ. కొత్త లైన్‌కు అంచనా వ్యయం రూ.2,700 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా భూమి సేకరించి ఇవ్వడంతో పాటు, నిర్మాణ వ్యయంలో 50 శాతం మేర రూ.1,350 కోట్లు ఇవ్వాలి. కానీ ఇందులో రాష్ట్రం డిపాజిట్‌ చేసింది రూ.6 కోట్లు మాత్రమే. 
‣ కోటిపల్లి - నరసాపురం మధ్య 57.21 కి.మీ. కొత్త లైనుకు రూ.2,125 కోట్లు అంచనా వ్యయం కాగా 25 శాతం రాష్ట్ర వాటాగా రూ.525.25 కోట్లు సమకూర్చాల్సి ఉంది. ప్రభుత్వం డిపాజిట్‌ చేసింది కేవలం రూ.2.69 కోట్లు. 
‣ కడప - బెంగళూరు మధ్య 255 కి.మీ. కొత్త మార్గంలో మన రాష్ట్ర పరిధిలో 218 కి.మీ. నిర్మించాల్సి ఉంది. దీని ప్రాజెక్టు వ్యయం రూ.2,849 కోట్లు కాగా 50 శాతం రాష్ట్ర వాటా కింద రూ.1,425 కోట్లు ఇవ్వాలి. గత ప్రభుత్వాలు రూ.190 కోట్లు డిపాజిట్‌ చేశాయి. ప్రస్తుతం కడప నుంచి పెండ్లిమర్రి వరకు 21.30 కి.మీ. లైన్‌ మాత్రమే పూర్తయింది. 
గృహ నిర్మాణానికి రూ.6,291 కోట్లు
గృహ నిర్మాణానికి 2023 - 24 బడ్జెట్‌లో రూ.6,291 కోట్ల కేటాయింపులు చూపినా అందులో రాష్ట్ర నిధులు రూ.1500 కోట్లే ఉండటం గమనార్హం. మిగతావి కేంద్ర నిధులే. గత నాలుగేళ్లుగా ఏటా బడ్జెట్‌లో చూపిస్తున్న నిధుల్లోనూ మెజార్టీ కేంద్రానివే. ఒక్కో ఇంటి నిర్మాణానికి లబ్ధిదారుకు రూ.1.80 లక్షలు ఇస్తుండగా అందులో రూ.1.50 లక్షలు కేంద్రం వాటా. కేవలం పట్టణాల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం రూ.30 వేలు ఇస్తోంది. 

గ్రామీణ ఇళ్లు పూర్తయింది వందే
ఇటీవల రెండో విడతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (గ్రామీణ్‌) పథకం కింద కేంద్రం మంజూరు చేసిన 1.79 లక్షల గృహ నిర్మాణాల్ని ప్రారంభించింది. ఇందులో ఇప్పటివరకు పూర్తయినవి వంద ఇళ్ల వరకే ఉన్నాయి. ఇవి కాకుండా రాష్ట్రంలో పూర్తి గ్రామీణ ప్రాంతాల్లో మంజూరు చేసిన 2.5 లక్షల గృహ నిర్మాణాలకు అతీగతీ లేదు. కనీసం వాటిని ఎప్పుడు ప్రారంభిస్తారనే సమాచారమూ లబ్ధిదారులకు లేదు. 
వ్యవసాయానికి రూ.41,436 కోట్లు
చిరుధాన్యాల సమగ్ర సాగు విధానంలో భాగంగా వచ్చే అయిదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ఎకరాల్లో వాటి సాగును ప్రోత్సహించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో 7 లక్షల మంది రైతులకు రూ.455 కోట్లతో టార్పాలిన్లు, స్ప్రేయర్లను అందిస్తామన్నారు. రూ.41,436.29 కోట్లతో రూపొందించిన 2023 - 24 వ్యవసాయ బడ్జెట్‌ను ఆయన శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ వ్యవసాయ అనుబంధ రంగాల్లో జాతీయాభివృద్ధి రేటు కంటే ఆంధ్రప్రదేశ్‌ వృద్ధి రేటు అధికం. 2021-22 సంవత్సరంలో జాతీయస్థాయిలో 10% వృద్ధి నమోదవగా.. రాష్ట్రం 13.07% సాధించింది. 2022-23లో జాతీయస్థాయిలో వృద్ధి 11.2% ఉండగా.. రాష్ట్ర వృద్ధి రేటు 13.18% నమోదైందని వివరించారు. పశు వైద్యశాలలకు మందుల సరఫరా నిమిత్తం ప్రతి రైతు భరోసా కేంద్రానికి నెలకు రూ.2 వేల చొప్పున రూ.65 కోట్లు ప్రతిపాదిస్తున్నామన్నారు. చిరుధాన్యాల ప్రాసెసింగ్‌ యంత్ర సామగ్రికి రూ.1.25 లక్షల రాయితీ, కీలక వనరుల కొనుగోలుకు హెక్టారుకు రూ.6 వేల ప్రోత్సాహకంగా అందిస్తున్నామని మంత్రి తెలిపారు. పశు నష్ట పరిహార పథకానికి రూ.150 కోట్లు ప్రతిపాదించాం. వైఎస్‌ఆర్‌ పశు బీమా పథకంలో భాగంగా ప్రీమియంలో 80% వాటాను ప్రభుత్వమే పాడి రైతులకు అందిస్తుందని పేర్కొన్నారు. లోక్‌సభ నియోజకవర్గానికో ఆహారశుద్ధి యూనిట్‌ ఏర్పాటుకు తొలి విడతగా 9, యూనిట్లు, 13 సెకండరీ మిల్లెట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ప్రారంభిస్తాం. రాయితీపై సూక్ష్మసేద్య పరికరాలకు రూ.472.50 కోట్లు, ఆయిల్‌పామ్‌ తోటల పెంపకానికి రూ.50 కోట్లు ప్రతిపాదిస్తున్నామని పేర్కొన్నారు. మార్కెటింగ్‌ శాఖ అభివృద్ధికి రూ.513.74 కోట్లు, సహకార శాఖకు రూ.233.71 కోట్లు, ఆహార శుద్ధి పరిశ్రమలకు రూ.286.41 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

రైతు భరోసాకు రూ.4,020 కోట్లు
తాజా బడ్జెట్లో రైతు భరోసా పథకానికి రూ.4,020 కోట్లు కేటాయించినా 2022 - 23 సవరించిన అంచనాలతో పోలిస్తే రూ.31 కోట్లు మాత్రమే పెంచింది. వైఎస్‌ఆర్‌ ప్రధానమంత్రి ఫసల్‌ బీమా పథకానికి రూ.200 కోట్ల మేర కోత పెట్టింది. తాజా బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు మొత్తంగా రూ.14,043 కోట్ల మేర ప్రతిపాదించింది. 
పరిశ్రమల ప్రోత్సాహక బకాయిలకు ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయింపు రూ.412 కోట్లు
పరిశ్రమలను ప్రోత్సహించడంపై బడ్జెట్‌లో రూ.412 కోట్లు ప్రతిపాదించింది. సవరించిన అంచనాల ప్రకారం ఇందులో ఏకంగా రూ.366.49 కోట్లు కోత పెట్టింది. అంటే ప్రభుత్వం పరిశ్రమలకు ప్రోత్సాహకాల కింద చెల్లించాలని తేల్చింది రూ.45.62 కోట్లు మాత్రమే. 
‣ ప్రస్తుత బడ్జెట్‌లో ఎంఎస్‌ఈల మౌలిక సదుపాయాల కల్పనకు రూ.30 కోట్లు ప్రతిపాదించింది. పైసా కూడా ఖర్చు చేయలేదు. 
‣ వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వీసీఐసీ ప్రాజెక్టు పనులకు రూ.761.73 కోట్లు ఖర్చు చేసేలా ప్రతిపాదించింది.
జలవనరుల శాఖకు రూ.11,908 కోట్ల కేటాయింపులు
2023 - 24 బడ్జెట్‌లో జలవనరుల శాఖకు రూ.11,908 కోట్ల కేటాయింపులు చూపారు. ఇందులో భారీ, మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టులకు రూ.9,176 కోట్లు. చిన్న నీటి వనరులకు రూ.737 కోట్లు కేటాయించారు. భారీ నీటి పారుదల ప్రాజెక్టుల్లో పోలవరానికి రూ.5,042.47 కోట్లు చూపించారు. మరోవైపు వెలిగొండ ప్రాజెక్టు 2024 జూన్‌లోపు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టంగా పేర్కొన్నారు. ప్రస్తుత బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు కేటాయింపులు కేవలం రూ.101.47 కోట్లు. 
ఈ బడ్జెట్‌లో కేటాయింపులు ఇవే..
‣ ‘ఏపీసీఆర్‌డీఏ’కి సాయం పేరుతో ఈ బడ్జెట్‌లో రూ.500 కోట్లు కోటాయించింది. ఈ మొత్తం రాజధాని నిర్మాణానికి హడ్కో, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు, అమరావతి బాండ్స్‌కు సంబంధించిన అసలు, వడ్డీ చెల్లించేందుకే సరిపోతుంది. 
‣ కొత్త రాజధానికి భూ సమీకరణ పేరుతో రూ.240.09 కోట్లు కేటాయించింది. ఇది రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు చెల్లించాల్సిన వార్షిక కౌలు మొత్తం. 
‣ ‘రాజధాని ప్రాంత సామాజిక భద్రతా నిధి’ పేరుతో రూ.87.92 కోట్లు కేటాయించింది. రాజధాని గ్రామాల్లోని భూమిలేని పేదలకు ప్రతి నెలా కౌలు చెల్లించేందుకు, ఇతర సామాజిక కార్యక్రమాలకు కేటాయించిన నిధులివీ.
నాడు-నేడుకు రూ.3,500 కోట్లు 
ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చేపట్టిన ‘నాడు-నేడు’కు ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.3,500 కోట్లు మాత్రమే కేటాయించింది. అన్ని విశ్వవిద్యాలయాలకు కలిపి 2023 - 24కు సంబంధించి రూ.942.69 కోట్లు కేటాయించింది. 
‣ ఒంగోలులోని ఆంధ్రకేసరి, విజయనగరంలోని జేఎన్‌టీయూ, గురజాడ వర్సిటీలకు ఈ బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులూ చేయలేదు.  

బడ్జెట్‌ కేటాయింపులు ఇలా..
 వైఎస్‌ఆర్ పెన్షన్ కానుక రూ.21,434.72 కోట్లు
 వైఎస్ఆర్ రైతు భరోసా రూ.4,020 కోట్లు
 జగనన్న విద్యా దీవెన రూ.2,841.64 కోట్లు
  జగనన్న వసతి దీవెన రూ.2,200 కోట్లు
  వైఎస్‌ఆర్-పీఎం బీమా యోజన రూ.1600 కోట్లు
  డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1,000 కోట్లు
  రైతులకు వడ్డీలేని రుణాలు రూ.500 కోట్లు
  వైఎస్ఆర్ కాపు నేస్తం రూ.550 కోట్లు
  జగనన్న చేదోడు రూ.350 కోట్లు
  వైఎస్‌ఆర్ వాహనమిత్ర రూ.275 కోట్లు
  వైఎస్‌ఆర్ నేతన్న నేస్తం రూ.200 కోట్లు
  వైఎస్ఆర్ మత్స్యకార భరోసా రూ.125 కోట్లు
  మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ రూ.50 కోట్లు

  రైతు కుటుంబాల పరిహారం కోసం రూ.20 కోట్లు
  లా నేస్తం రూ.17 కోట్లు
  జగనన్న తోడు రూ.35 కోట్లు
  ఈబీసీ నేస్తం రూ.610 కోట్లు
  వైఎస్‌ఆర్ కల్యాణమస్తు రూ.200 కోట్లు
  వైఎస్ఆర్ ఆసరా రూ.6700 కోట్లు
  వైఎస్ఆర్ చేయూత రూ.5000 కోట్లు
  అమ్మఒడి రూ.6500 కోట్లు
  మొత్తంగా డీబీటీ స్కీంలకు రూ.54,228.36 కోట్లు
  ధరల స్థిరీకరణ నిధి రూ.3,000 కోట్లు
  వ్యవసాయ యాంత్రీకరణ రూ.1,212 కోట్లు
  వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం రూ.15,882 కోట్లు
  మన బడి నాడు-నేడు రూ.3,500 కోట్లు
  జగనన్న విద్యా కానుక రూ.560 కోట్లు
  పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ.15,873 కోట్లు
  పురపాలక, పట్టణాభివృద్ధి రూ.9,381 కోట్లు
  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ రూ.1,166 కోట్లు
  యువజన అభివృద్ధి, పర్యాటకం, సాంస్కృతిక శాఖ రూ.1,291 కోట్లు
  షెడ్యూల్ కులాల కాంపొనెంట్ కోసం రూ.20,005 కోట్లు
  షెడ్యూల్ తెగల కాంపొనెంట్ కోసం రూ.6,929 కోట్లు
‣ వెనుకబడిన తరగతుల కాంపొనెంట్ కోసం రూ.38,605 కోట్లు

‣ కాపు సంక్షేమం రూ.4,887 కోట్లు
  మైనార్టీల సంక్షేమం రూ.4,203 కోట్లు
  పేదలు అందరికీ ఇళ్లు రూ.5,600 కోట్లు
  పరిశ్రమలు, వాణిజ్యం రూ.2,602 కోట్లు
  రోడ్లు, భవనాల శాఖకు రూ.9,118 కోట్లు
  నీటి వనరుల అభివృద్ధికి (ఇరిగేషన్‌) రూ.11,908 కోట్లు
  పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ రూ.685 కోట్లు
  ఎనర్జీ రూ.6,456 కోట్లు
  గ్రామ, వార్డు సచివాలయ శాఖ రూ.3,858 కోట్లు
  గడప గడపకు మన ప్రభుత్వం రూ.532 కోట్లు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ బ‌డ్జ్‌ట్ 2023-24 ప్ర‌సంగం

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 16-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.