• facebook
  • whatsapp
  • telegram

AP Engineering Seats: 1.81 లక్షల ఇంజినీరింగ్‌ సీట్లు  

* మొత్తం సీట్లలో సాఫ్ట్‌వేర్‌ బ్రాంచిల్లోనే 80%

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ప్రైవేటు, ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలలు, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలు, రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ), కేంద్రీయ విశ్వవిద్యాలయంతో కలిపి 1,81,732 సీట్లకు అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఆమోదం తెలిపింది. అమృత, గీతం, కేఎల్‌యూ, విజ్ఞాన్‌ డీమ్డ్‌ వర్సిటీల్లో 9,180 సీట్లకు ఆమోదం తెలిపింది. ఈ సీట్లను ఆయా విద్యాసంస్థలే నేరుగా భర్తీ చేసుకుంటాయి. ఆర్జీయూకేటీలో 1,440, కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 33 సీట్లు సైతం కౌన్సెలింగ్‌కు పెట్టరు. ప్రభుత్వ కళాశాలల్లోని 5,500, ప్రైవేటు కళాశాలల్లో 1,65,579 సీట్లకు మాత్రమే ప్రభుత్వం కౌన్సెలింగ్‌ నిర్వహిస్తుంది. ప్రైవేటు కళాశాలల్లోని సీట్లలో 70% కన్వీనర్‌ కోటాలో భర్తీచేస్తారు. మిగతా 30% యాజమాన్య కోటాలో కేటాయిస్తారు. రాష్ట్రంలో కొత్తగా తిరుపతి, విశాఖపట్నంలో రెండు ఇంజినీరింగ్‌ కళాశాలలకు ఏఐసీటీఈ అనుమతి ఇచ్చింది. ఒక్కో కళాశాలలో 360 సీట్ల చొప్పున ఆమోదం తెలిపింది. గతేడాదితో పోలిస్తే ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 520, ప్రైవేటు కళాశాలల్లో 27,879 సీట్లు పెరిగాయి. రాష్ట్రంలో గతేడాది ఆరు ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఉండగా.. ఈ విద్యా సంవత్సరంలో అన్నమయ్య జిల్లా రాజంపేటలోని అన్నమాచార్య, కాకినాడ జిల్లా సూరంపాలెంలోని ఆదిత్య, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని గోదావరి గ్లోబల్‌ విద్యాసంస్థలకు గత ప్రభుత్వం ప్రైవేటు వర్సిటీలుగా గుర్తింపునిచ్చింది. ప్రైవేటు వర్సిటీల్లో 35% సీట్లను కన్వీనర్‌ కోటా ద్వారా భర్తీచేస్తారు. ఇలా 6వేల సీట్ల వరకు కౌన్సెలింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. 

సీట్లన్నీ కంప్యూటర్‌ కోర్సుల్లోనే..

ఇంజినీరింగ్‌ సీట్లలో అత్యధికంగా కంప్యూటర్‌ సైన్సు, ఎమర్జింగ్‌ కోర్సుల్లోనే ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో మొత్తం 1,71,079 సీట్లు ఉంటే సీఎస్‌ఈ, ఏఐ, మెషీన్‌లెర్నింగ్, డేటా సైన్స్, ఐటీలాంటి కోర్సుల్లో 1,37,194 సీట్లు ఉన్నాయి. మొత్తం సీట్లలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకు సంబంధించినవే 80% ఉన్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఐటీ బ్రాంచిలో ఈ ఏడాది 60 సీట్లు, శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో సీఎస్‌ఈ (ఏఐ, మెషీన్‌లెర్నింగ్, డేటా సైన్స్‌)లో 120 సీట్లు అదనంగా వచ్చాయి. జిల్లాలవారీగా చూస్తే ఉమ్మడి గుంటూరులో అత్యధికంగా 26,760 సీట్లు ఉండగా.. ఉమ్మడి కృష్ణాలో 20,595 సీట్లు ఉన్నాయి. అత్యల్పంగా ఉమ్మడి శ్రీకాకుళంలో 3,360 సీట్లు అందుబాటులో ఉన్నాయి.



 


మరింత సమాచారం... మీ కోసం!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!

‣ జాగ్రఫీదే హవా!

‣ కేంద్ర శాఖల్లో 17,727 కొలువులు!

‣ ఆశావహ దృక్పథంతో ఆశయ సాధన!

‣ స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఉపాధి

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.