• facebook
  • whatsapp
  • telegram

SVU: ఎస్వీయూలో ‘దూర’మైన ‘విద్య’

* మార్చి పరీక్షలు ఇంకెప్పుడు ఆచార్యా?

ఎస్వీయూ దూరవిద్యా విభాగం గాడితప్పింది. ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వర్సిటీలోని ఈ విభాగం ఐదేళ్లలో అనేక ఆరోపణలు, విమర్శలు మూటగట్టుకుంది. ఒకప్పుడు దూరవిద్యకు చిరునామాగా నిలిచిన వర్సిటీలో ప్రస్తుతం సకాలంలో తరగతులు, పరీక్షలు నిర్వహించలేని దుస్థితి నెలకొంది. డెబ్‌ అనుమతులు రద్దయిపోగా అప్పటికే ప్రవేశాలు కల్పించిన విద్యార్థులతో వర్సిటీ అధికారులు ఆటాడుకుంటున్నారని, ఈ సమయానికి డిగ్రీ, పీజీ పట్టాలు అందుకోవాల్సిన 13వేల మందికిపైగా విద్యార్థులు మార్చిలో జరగాల్సిన ఆఖరు పరీక్షలు ఇంకెప్పుడు నిర్వహిస్తారు సారూ.. అంటూ ఆవేదన వెళ్లగక్కుతున్నారు.  

న్యూస్‌టుడే, తిరుపతి (బైరాగిపట్టెడ)

యూజీసీ నియమ నిబంధనలు పాటించకపోవడంతో డెబ్‌ అనుమతులు లేక 2022 నుంచి దూర విద్య విభాగంలో ప్రవేశాలు ఆగిపోయాయి. ప్రస్తుతం ద్వితీయ, తృతీయ సంవత్సరాల డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఈ ఏడాది మార్చిలో పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా ఇంతవరకు వాటి ఊసేలేదు. విద్యా సంవత్సరం కలిసి రాకపోవడంతో విద్యార్థులంతా అసంతృప్తితో ఉన్నారు. తరగతులు జరగడం లేదని, సమస్యలపై స్పందించేవారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

కోర్సులు ఘనం..

దూరవిద్యా విభాగంలో రెండు విభాగాల్లో డిప్లొమా కోర్సులు ఉన్నాయి. ఐదు విభాగాల్లో మూడేళ్ల డిగ్రీ కోర్సులు, 19 విభాగాల్లో పీజీ కోర్సులు ఉన్నాయి. పలు కారణాలతో చదువులు కొనసాగించలేకపోయిన వారికి, పార్ట్‌టైం ఉద్యోగులకు, వ్యాపారులకు వివిధ రంగాల్లో ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి దూరవిద్య విభాగం కోర్సుల్లో చేరి పట్టా పొందేందుకు వర్సిటీ దూరవిద్య విభాగం ఎంతో అనువుగా ఉండేది. గతంలో ఎంతోమంది ఈ విభాగాల్లో ప్రవేశాలు పొంది ఉత్తీర్ణత సాధించి జీవితంలో స్థిరపడ్డారు.

33 వేలకుపైగా విద్యార్థులు..

2021 జులైలో చేరిన విద్యార్థులు ప్రస్తుతం మూడో ఏడాది చదువుతున్నారు. ఆయా కోర్సుల్లో మొత్తం 13,125 మంది విద్యార్థులు ఉన్నారు. 2022 జనవరిలో చేరిన రెండో సంవత్సరం విద్యార్థులు డిగ్రీలో 1300 మందికిపైగా, డిప్లొమా కోర్సుల్లో 38 మంది, పీజీ కోర్సులకు సంబంధించి మరో 1,549 మంది విద్యార్థులున్నారు. ఇదే ఏడాదికి సెప్టెంబరులో బీఏలో 2,424 మంది, బీకాం (కంప్యూటర్స్‌)లో 2,133 మంది, బీకాం (రెగ్యులర్‌) 1,432 మంది, బీఎల్‌ఐఎస్సీలో 1,176, బీఎస్సీ 4,161 మంది విద్యార్థులున్నారు. పీజీ కోర్సులకు సంబంధించి మొత్తం 6,479 మంది విద్యార్థులు చదువుతున్నారు.

ప్రక్షాళనకు ఎదురుచూపు..

ప్రవేశాలు లేక, ఉన్న కోర్సులు సకాలంలో ముగించలేక, సరైన సిబ్బంది లేక విభాగం అందరికీ అందనంత దూరంలో ఉండిపోయింది. నూతన ప్రభుత్వంలో ఈ విభాగాన్ని ప్రక్షాళన చేసి తిరిగి అన్ని కోర్సుల ప్రవేశాలు పునఃప్రారంభమయ్యేలా చూడాలని విద్యార్థులు, విద్యావేత్తలు కోరుతున్నారు.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!

‣ జాగ్రఫీదే హవా!

‣ కేంద్ర శాఖల్లో 17,727 కొలువులు!

‣ ఆశావహ దృక్పథంతో ఆశయ సాధన!

‣ స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఉపాధి

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.