• facebook
  • whatsapp
  • telegram

AP SI Exam: కఠినంగా ఎస్సై ప్రాథమిక రాత పరీక్ష

* కష్టంగా కరెంట్‌ ఎఫైర్స్‌ ప్రశ్నలు

* అర్థమెటిక్‌ ప్రశ్నలూ అలాగే..

 

ఈనాడు, అమరావతి, ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో పోలీసు ఎస్సై ఉద్యోగాల భర్తీ కోసం ఫిబ్ర‌వ‌రి 19న‌ నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్ష చాలా కష్టంగా ఉందని అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. ప్రధానంగా జనరల్‌ స్టడీస్‌ (పేపర్‌-2)లో వర్తమాన వ్యవహారాలకు సంబంధించి చాలా కష్టమైన ప్రశ్నలు వచ్చాయని తెలిపారు. చరిత్రకు సంబంధించిన ప్రశ్నల్లో సగానికిపైగా కఠినంగానే ఉన్నాయని, ఆధునిక చరిత్రపై తక్కువ ప్రశ్నలొచ్చాయని చెప్పారు.  పాలిటీ నుంచి అడిగిన ప్రశ్నలు కనీస స్థాయిలోనే ఉన్నాయని, జాగ్రఫీ, ఆర్థిక శాస్త్రం నుంచి అడిగిన ప్రశ్నలు కొంత సులువుగానే ఉన్నాయని రేపల్లెకు చెందిన అభ్యర్థిని ఒకరు వివరించారు. గతంతో పోలిస్తే భౌతిక, రసాయనశాస్త్రాల నుంచి అడిగిన ప్రశ్నలు ఓ మోస్తరుగా ఉన్నాయని విజయవాడకు చెందిన అభ్యర్థి చెప్పారు. అర్థమెటిక్‌, రీజనింగ్‌, మెంటల్‌ ఎబిలిటీ (పేపర్‌-1)లో అర్థమెటిక్‌ విభాగం నుంచి వచ్చిన ప్రశ్నలు కఠినంగానే ఉన్నప్పటికీ, రీజనింగ్‌ విభాగంలోని ప్రశ్నలు కొంత సులువుగానే ఉన్నాయని ఓ అభ్యర్థి చెప్పారు. అర్థమెటిక్‌ విభాగంలో అడిగిన ప్రశ్నలు... గణితాన్ని ఒక సబ్జెక్ట్‌గా చదవని అభ్యర్థులు రాయటం కష్టమేనని భీమవరానికి చెందిన ఓ అభ్యర్థి అభిప్రాయపడ్డారు.

 

ఒక్కో పోస్టుకు 367 మంది పోటీ

411 ఎస్సై పోస్టుల భర్తీ కోసం పరీక్ష నిర్వహించగా.. 1,71,936 మంది అభ్యర్థులు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. వారిలో 1,51,243 మంది పరీక్షకు హాజరయ్యారు. అంటే ఒక్కో పోస్టుకు 367 మంది పోటీపడ్డారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి పోలీసు నియామక మండలి వెబ్‌సైట్‌లో ప్రాథమిక ‘‘కీ’’ అందుబాటులో ఉంచుతామని నియామక మండలి ఛైర్మన్‌ మనీష్‌ కుమార్‌ సిన్హా తెలిపారు. అభ్యంతరాలు 23వ తేదీ ఉదయం 11 గంటల్లోగా తెలియజేయాలన్నారు. పరీక్ష ఫలితాలను రెండు వారాల్లో విడుదల చేస్తామని తెలిపారు.

 

పరీక్ష రాయటానికి వచ్చి ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్‌

తెలంగాణలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెండ మోహన్‌రావు కర్నూలులో ఎస్సై పరీక్ష రాయటానికి వెళ్తూ ప్రమాదవశాత్తూ మరణించారు. శ్రీకాకుళం జిల్లా జులుమూరు మండలం దోమలపల్లెకు చెందిన మెండా శోభనరావు, రాములమ్మ దంపతుల కుమారుడు మెండా మోహన్‌రావు(26) తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాలో రెండో బెటాలియన్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఏపీలో ఎస్సై, ఆర్‌ఎస్సై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడటంతో దరఖాస్తు చేసుకుని, పరీక్ష రాసేందుకు కర్నూలును కేంద్రంగా ఎంపిక చేసుకున్నారు. ఆదివారం అతని మృతదేహాన్ని కర్నూలు రైల్వేస్టేషన్‌కు కొద్దిదూరంలో పట్టాలపై గుర్తించారు. మృతదేహం నడుము వరకు రెండు భాగాలుగా తెగిపోయి కాళ్ల భాగం ఛిద్రమైంది. రైల్వే పోలీసుస్టేషన్‌ ఎస్సై సురేష్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. నిద్రమత్తులో కదులుతున్న రైలు దిగే క్రమంలో ప్రమాదానికి గురై ఉంటాడని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.

* కర్నూలులోని పుల్లారెడ్డి కళాశాల కేంద్రంలో పరీక్ష రాయటానికి వచ్చిన ఓ అభ్యర్థి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒంగోలులోని రైస్‌, పేస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల కేంద్రాలకు నలుగురు అభ్యర్థులు సమయం దాటిన తర్వాత వచ్చారు. వారిని పరీక్షలకు అనుమతించలేదు. మొత్తం 291 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.

 

Official Notice
 

ఏపీ సబ్ ఇన్‌స్పెక్టర్స్ ఆఫ్ పోలీస్ ప్రాథమిక రాత పరీక్ష ప్రశ్నపత్రం
 

పేపర్‌-1 ప్రశ్నప‌త్రం కోడ్ - ఎ పేపర్‌-1 ప్రశ్నప‌త్రం కోడ్ - బి

 
 
పేపర్‌-2 ప్రశ్నప‌త్రం కోడ్ - బి పేపర్‌-2 ప్రశ్నప‌త్రం కోడ్ - సి

 
 


 

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ డిగ్రీతో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు

‣ మెయిన్‌లో విజయానికి మెలకువలు

‣ స్టడీ నోట్స్‌.. రెడీ రివిజన్‌!

‣ ఉచితంగా డిగ్రీ + ఉద్యోగం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.