సద్వినియోగం చేసుకుంటున్న భిక్కనూరు విద్యార్థినులు
మిగతాచోట్ల ప్రోత్సాహం కరవు
‘‘కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల విద్యార్థులు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారిస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆసక్తి పెంపొందించి వారిలో సరికొత్త ఆవిష్కరణల ఆలోచనలకు ఊతమిచ్చేలా అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు దోహదపడుతున్నాయి.’’ భిక్కనూరు ఉన్నత(బాలుర) పాఠశాలలో పదో తరగతి చదివే వైష్ణవి, మీనాక్షి, రిషిక, స్ఫూర్తి రూపొందించిన స్కూల్ హెల్త్ సర్వీస్ యాప్‌ను సోమవారం టీహబ్‌లో ప్రదర్శించి పలువురి అభినందనలు అందుకున్నారు. 2020లో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల స్థాయిలో అయిదు ఆవిష్కరణలు ఎంపిక చేయగా అందులో వీరిది ఒకటి కావడం విశేషం.
న్యూస్‌టుడే, భిక్కనూరు: నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్‌లో భాగంగా యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు గాను భిక్కనూరు బాలుర ఉన్నత పాఠశాలలో 2020 సంవత్సరంలో రూ.12 లక్షలతో అటల్ టింకరింగ్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు బాల గంగాధర్ దీనిని వేదికగా చేసుకుని విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసి నూతన ఆవిష్కరణలకు ఊతమిస్తున్నారు.
ఇంటర్న్‌షిప్‌నకు ఎంపిక
అటల్ మారథాన్ కింద దేశవ్యాప్తంగా 30 ఉత్తమ బాలికల బృందాలను ఇంటర్న్‌షిప్‌నకు ఎంపిక చేయగా.. ఇందులో భిక్కనూరుకు చెందిన మీనాక్షి, వైష్ణవి, రిషిక ఉన్నారు. వీరికి బెంగుళూరులోని డెల్ టెక్నాలజీస్‌లో ఈ నెల 9 నుంచి 13 వరకు అయిదు రోజుల పాటు ప్రత్యక్షంగా, మరో అయిదు రోజులు వర్చువల్‌గా శిక్షణ ఇచ్చారు. వీరు రూపొందించిన యాప్‌ను మరింత మెరుగుపర్చే విధంగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఇప్పటి వరకు వీరి రూపకల్పనలు
స్కూల్ హెల్త్ సర్వీస్..: గతేడాది ఇన్నోవేషన్ ఛాలెంజ్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా టీఎస్‌ఐసీ ఎంపిక చేసిన అయిదు ఆవిష్కరణల్లో భిక్కనూరు విద్యార్థులు రూపొందించిన స్కూల్ హెల్త్ సర్వీస్ యాప్ ఒకటి. ఇందులో విద్యార్థుల సమగ్ర ఆరోగ్య వివరాలు నమోదు చేసి వారి హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తారు. ఎప్పటికప్పుడు ఆరోగ్య వివరాలు తెలుసుకుని అవసరమైన చర్యలు తీసుకుంటారు. దీర్ఘకాలిక వ్యాధులు, పౌష్టికాహార లోపం, సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించి వారి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తారు. తద్వారా సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించి పరిష్కరించేలా చర్యలు చేపడతారు.
ఫేస్ రికగ్నైజేషన్.. ఎలక్షన్స్, పరీక్షల సమయంలో దీనిని ఉపయోగించడం ద్వారా అక్రమాలను నియంత్రించొచ్చు. హాలులోకి ప్రవేశించే సమయంలో కెమెరా సాయంతో వారి ముఖాన్ని గుర్తిస్తుంది. దొంగ ఓట్లు వేయకుండా, ఒకరి బదులు మరొకరు పరీక్ష రాయకుండా నియంత్రించొచ్చు.
స్మార్ట్ డస్ట్‌బిన్.. చెత్తబుట్టను తాకకుండా సెన్సార్ సాయంతో పనిచేసేలా రూపొందించారు. అంటువ్యాధులు రాకుండా ఉపయోగపడుతుంది.
ఆటోమేటిక్ స్ట్రీట్‌లైట్.. వెలుతురు తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా వీధిదీపాలు వెలుగుతాయి. తెల్లవారగానే ఆరిపోతాయి.
ఫైర్ సెన్సార్.. అగ్ని ప్రమాదాలను గుర్తించి అప్రమత్తం చేస్తాయి. పొగ, వేడిని పసిగట్టి అలారం మోగుతుంది.
స్మార్ట్ అగ్రికల్చర్.. నేలలో తడిని గుర్తించి ఆటోమేటిక్‌గా నీరు అందిస్తుంది. రైతులు అందుబాటులో లేకున్నా పనిచేస్తుంది. నీటిని ఆదా చేయడం దీని ముఖ్య ఉద్దేశం.
జిల్లావ్యాప్తంగా 16 చోట్ల ఏర్పాటు
కామారెడ్డి జిల్లాలో 16 అటల్ కింకరింగ్ ల్యాబ్ లు ఉన్నాయి. వీటిని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసి ంది. రాష్ట్ర ప్రభుత్వం వీటిని పట్టించుకోకపోవడం లేదు. దీనికితోడు ప్రత్యేకంగా నిపుణులు లేకపోవడం వల్ల ఆయాచోట్ల అనుకున్న ఫలితాలు ఉండటం లేదని అధికారులే చెబుతున్నారు. ఆసక్తిఉన్న ఉపాధ్యాయులే వీటిని సద్వినియోగం చేసుకుని విద్యార్థుల ప్రతిభకు పదును పెడుతున్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ నీట్‌లో మేటిస్కోరుకు మెలకువలు!
‣ పాదాలు పదిలం... కొలువులు పుష్కలం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.