• facebook
  • whatsapp
  • telegram

కేంద్ర బడ్జెట్‌ 2023-24 

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు తమ ఆఖరి పూర్తిస్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

కేంద్ర బడ్జెట్‌లో ముఖ్యాంశాలు..
బడ్జెట్‌లో ఏడు ప్రాధాన్యాలను ఎంచుకున్న నిర్మలాసీతారామన్‌ వాటిని ‘సప్తర్షి’గా అభివర్ణించారు.
అమృత కాలంలో వస్తున్న ఈ తొలి బడ్జెట్, అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు బలమైన పునాదిని నిర్మిస్తుందన్నారు.
2023 - 24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీపీలో 5.9 శాతానికి పరిమితం చేస్తామని పేర్కొన్నారు. 2022 - 23లో ద్రవ్యలోటును 6.4 శాతంగా సవరించారు.
మూలధన పెట్టుబడి వ్యయం అంచనాను 33 శాతం మేర భారీగా పెంచి రూ.10 వేల కోట్లు కేటాయించారు. ఈ మొత్తం జీడీపీలో 3.3 శాతానికి సమానం. తాజా కేటాయింపు 2020లో కన్నా మూడు రెట్లు అధికం.
మహిళలకు కొత్త పొదుపు పథకం, మహిళా సమ్మాన్‌ పొదుపు పత్రం. రూ.2 లక్షల వరకూ ఏకకాలంలో పొదుపు చేసుకోవచ్చు. రెండేళ్ల పాటు ఆ సొమ్మును దాచుకోవచ్చు. వడ్డీ 7.5శాతం.
వయోధికులు పొదుపు పథకాల్లో గరిష్ఠంగా మదుపు చేసుకునే పరిమితి మొత్తం రెట్టింపయ్యింది. ప్రస్తుతమున్న రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెరిగింది.
వ్యవసాయ రంగానికి ఇచ్చే రుణాలు రూ.20 లక్షల కోట్లకు పెంపు. 
రాష్ట్రాల ద్రవ్యలోటు రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో 3.5శాతం వరకు ఉండవచ్చు. ఇందులో 0.5 శాతాన్ని విద్యుత్‌ రంగ సంస్కరణలతో ముడిపెట్టారు.
దేశ ప్రజల తలసరి ఆదాయం రూ.1.97 లక్షలకు పెరిగింది.
కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో ఎంపీలకు 2021 నుంచి బడ్జెట్‌ పత్రాలు ఇవ్వట్లేదు. ఆయా పత్రాలను వెబ్‌సైట్, ప్రత్యేక యాప్‌ ద్వారా సభ్యులకు అందుబాటులో ఉంచారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ 2019 నుంచి ఆచరిస్తున్నట్లుగానే జాతీయ చిహ్నంతో కూడిన ఎరుపు రంగు వస్త్ర సంచిలో ట్యాబ్‌ను పెట్టుకొని పార్లమెంటుకు వచ్చారు.

వరుసగా 5 బడ్జెట్లు.. 6వ ఆర్థిక మంత్రి
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక వరుసగా 5 బడ్జెట్లు ప్రవేశపెట్టిన 6వ కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ గుర్తింపు పొందారు. 2019లో కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టగా ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 5వది. ఇంతకుముందు వరుసగా 5, అంతకన్నా ఎక్కువగా కేంద్ర బడ్జెట్లు ప్రవేశపెట్టిన అరుణ్‌ జైట్లీ, పి.చిదంబరం, యశ్వంత్‌సిన్హా, మన్మోహన్‌సింగ్, మొరార్జీ దేశాయ్‌ల సరసన ప్రస్తుతం నిర్మలా సీతారామన్‌ చేరారు. అలానే ఇందిరాగాంధీ తర్వాత కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రెండో మహిళగానూ ఆమె ఇప్పటికే గుర్తింపు పొందారు. 
2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక (2019లో సాధారణ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌తో కలిపి) ప్రవేశపెట్టిన 11వ బడ్జెట్‌ ఇది. 
ఇదే చిన్న ప్రసంగం
నిర్మలా సీతారామన్‌ ఇప్పటి వరకు చేసిన బడ్జెట్‌ ప్రసంగాల్లో ఈసారే అతి తక్కువ సమయం కొనసాగింది. ఈసారి ఆమె దేశ పద్దును 86 నిమిషాల్లో (1 గంట 26 నిమిషాలు) పార్లమెంటు వేదికగా ప్రజల ముందుంచారు. అత్యధిక సమయం బడ్జెట్‌ ప్రసంగం చేసిన రికార్డు కూడా ఆమె ఖాతాలోనే ఉంది. 2020 - 21 బడ్జెట్‌ ప్రవేశపెడుతూ 162 నిమిషాల పాటు ప్రసంగించారామె. ఒంట్లో నలత కారణంగా మరో రెండు పేజీలు మిగిలి ఉండగానే ప్రసంగాన్ని ముగించారు. బడ్జెట్‌ చరిత్రలో ఇదే ఇప్పటివరకు సుదీర్ఘ ప్రసంగంగా కొనసాగుతోంది.

రాష్ట్రపతి ఇంటి నిర్వహణ ఖర్చు రూ.10 కోట్లు తగ్గింది
రాష్ట్రపతి నివాసం నిర్వహణ ఖర్చుల కోసం కేటాయించే నిధులను బడ్జెట్‌లో తగ్గించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ.10 కోట్ల మేర కేటాయింపులు తగ్గాయి. 2023 - 24 బడ్జెట్‌లో రాష్ట్రపతి భవన్‌ ఖర్చులు..సిబ్బంది జీతాలకు రూ.36.22 కోట్లు కేటాయించారు. గత ఏడాది ఇదే పనుల కోసం రూ.41.68 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల మేరకు ఖర్చు రూ.46.27 కోట్లకు చేరింది.  
ఈ మేరకు ఏడు అంశాలకు కేంద్రం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఆ విషయాన్ని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రధానంగా యువతకు మరిన్ని అవకాశాలు, ఉద్యోగాల కల్పనకు పెద్దపీట వేస్తామని తెలిపారు. అవకాశాలను వినియోగించుకుని ఆర్థిక సాధికారత సాధించగలమని ఆమె తెలిపారు. సప్తర్షి పేరుతో ఆర్థిక మంత్రి చెప్పిన ఏడు అంశాలివే..
సమ్మిళిత అభివృద్ధి
అన్ని వర్గాలకూ అభివృద్ధి ఫలాలు అందించాం. గ్రామీణ ప్రాంతాల్లో 9 కోట్ల తాగునీటి కనెక్షన్లు ఇచ్చాం. స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద 11.7 కోట్ల కుటుంబాలకు మరుగుదొడ్ల నిర్మాణం, పీఎం-కిసాన్‌ పథకం కింద 11.4 కోట్ల మంది రైతులకు రూ.2.2 లక్షల కోట్ల అందజేత, 44.6 కోట్ల మంది పీఎంఎస్‌బీవై, పీఎంజేజేవైల కింద బీమా కవరేజి, 47.8 కోట్ల పీఎం జన్‌ధన్‌ బ్యాంకు ఖాతాలు, ఉజ్వల పథకం కింద 9.6 కోట్ల ఎల్‌పీజీ కనెక్షన్లు, 102 కోట్ల మంది ప్రజలకు 220 కోట్ల కొవిడ్‌ టీకాలు అందించాం. 
చివరి వ్యక్తికీ లబ్ధి
అన్నివర్గాల ప్రజల్నీ కలుపుకొని చిట్టచివరి వ్యక్తికీ ప్రయోజనం చేకూర్చే పనులు చేపడుతున్నాం. గిరిజనుల అభ్యున్నతి నుంచి మొదలుపెట్టి.. పురాతన శాసనాల డిజిటైజేషన్‌ వరకూ అన్నివర్గాలకూ అభివృద్ధిని అందిస్తున్నాం. ప్రధానమంత్రి పీవీటీజీ (నిర్దిష్ట దుర్బల గిరిజన తెగల) అభ్యున్నతి మిషన్‌ ప్రారంభిస్తాం. పురాతన శాసనాలను డిజిటల్‌ రూపంలో భద్రపరిచేందుకు భారత్‌ శ్రీ అనే వ్యవస్థను నెలకొల్పుతాం. 50 అదనపు విమానాశ్రయాలు, హెలిపోర్టులు, నీటి ఏరోడ్రోమ్‌లు, అత్యాధునిక ల్యాండింగ్‌ గ్రౌండ్లను పునరుద్ధరిస్తాం. పీఎంజీకేఏవై కింద ఏడాది పాటు ఉచితంగా ఆహారధాన్యాలు ఇస్తాం. పీఎం ఆవాస్‌ యోజనకు 66% అధిక కేటాయింపులు చేశాం. 
మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు
మౌలిక సదుపాయాలు, ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచే రంగాల్లో పెట్టుబడులకు ప్రోత్సాహకాలు అందిస్తాం. వృద్ధి రేటు పెరగడంతో పాటు కొత్త ఉద్యోగాలూ వస్తాయి. మూలధన పెట్టుబడులను 33.4% పెంచి రూ.10 లక్షల కోట్లకు చేర్చాం. మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణం కొనసాగిస్తాం. రైల్వేలకు గతంలో ఎన్నడూ లేనంతగా రూ.2.40 లక్షల కోట్ల కేటాయించాం. ఓడరేవులు, బొగ్గు, ఉక్కు, ఎరువుల్లాంటివి చివరి వరకు అందేందుకు వీలుగా 100 రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను గుర్తించాం. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి ఏర్పాటు ద్వారా సదుపాయాలను కల్పిస్తాం.
సామర్థ్యాల వెలికితీత
స్వదేశీ సామర్థ్యం మరింత మెరుగుపడుతుంది. విద్యాసంస్థల్లో మూడు ప్రత్యేక కృత్రిమమేధ కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నాం. దానివల్ల వ్యవసాయం, వైద్యం, సుస్థిర నగరాల్లో ఏఐ ఆధారిత పరిష్కారాలు వస్తాయి. జాతీయ డేటా గవర్నెన్స్‌ విధానం అమలుతో అంకుర సంస్థలు, విద్యాసంస్థలకు పరిశోధన కోసం కావాల్సినంత డేటా ఉంటుంది. వివాద్‌ సే విశ్వాస్‌ 1 కింద కొవిడ్‌ సమయంలో ప్రభావితమైన ఎంఎస్‌ఎంఈలకు సరళంగా కాంట్రాక్టుల అమలుతో ఊరట. వివాద్‌ సే విశ్వాస్‌ 2 కింద సులభమైన, ప్రామాణిక సెటిల్‌మెంట్‌ పథకం వల్ల ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లోని కాంట్రాక్టు వివాదాలను త్వరగా సెటిల్‌ చేసుకోవచ్చు. ఈ-కోర్టుల మూడో దశ ప్రారంభంతో మరింత సమర్థమైన న్యాయవ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. వ్యాపార, వాణిజ్య సంస్థలు, ఛారిటబుల్‌ ట్రస్టుల కోసం సంస్థల డిజిలాకర్‌తో వ్యాపారాలకు అవసరమైన పత్రాలను ఆన్‌లైన్‌లో సురక్షితంగా భద్రపరచుకోడానికి, పంపడానికి వీలవుతుంది. 
హరిత వృద్ధి
పీఎం ప్రణామ్‌ ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగానికి ప్రోత్సాహకాలు అందిస్తాం. తీర ప్రాంతాల్లో మడఅడవుల పెంపకానికి ‘మిష్ఠీ’ పథకం, చిత్తడినేలల సమర్థ వినియోగానికి ‘అమృత్‌ ధరోహర్‌’ అమలు చేస్తాం. రైతులు ప్రకృతి సేద్యం అందిపుచ్చుకునేలా 10 వేల బయో ఇన్‌పుట్‌ వనరుల కేంద్రాలు వస్తాయి. బ్యాటరీల్లో ఇంధన నిల్వ వ్యవస్థలను ప్రోత్సహిస్తాం. ఇంధన సామర్థ్య రవాణా కోసం నౌకారవాణాకు ప్రోత్సాహమిస్తాం. పాత, కలుషిత వాహనాలను మార్చేందుకు నిధులు కేటాయిస్తాం. సుస్థిర చర్యలకు ప్రోత్సాహకాల కోసం గ్రీన్‌ క్రెడిట్‌ ప్రోగ్రాం ప్రారంభిస్తాం. 
యువశక్తికి ప్రోత్సాహం
కోడింగ్, కృత్రిమ మేధ, రోబోటిక్స్, 3డి ప్రింటింగ్‌ తదితర అంశాలతో కూడిన కొత్త కోర్సులను ప్రవేశపెడతాం. స్వదేశీ, విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేందుకు 50 ప్రాంతాలను ఎంపిక చేసి, ప్యాకేజిగా అభివృద్ధి చేస్తాô. సమైక్యమాల్స్‌ ఏర్పాటుకు రాష్ట్రాలకు ప్రోత్సాహాన్ని అందిస్తాô. జిల్లాలవారీ ఉత్పత్తుల అమ్మకాలను, జీఐ, హస్తకళా ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఇవి ఉపయోగపడతాయి. మూడేళ్లలో 47 లక్షల మంది యువతకు స్టైపెండ్‌ అందించేందుకు జాతీయ అప్రెంటిస్‌షిప్‌ ప్రోత్సాహ పథకం. కృత్రిమ మేధ, రోబోటిక్స్, మెకట్రానిక్స్, 3డి ప్రింటింగ్, డ్రోన్ల లాంటి వాటి కోసం ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన 4.0ను అమలు చేస్తాô. స్కిల్‌ ఇండియా డిజిటల్‌ ప్లాట్‌ఫాం కింద నైపుణ్యాభివృద్ధి కోర్సులు ప్రవేశపెడతాం.
ఆర్థిక రంగం బలోపేతం
దేశ ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసేందుకు పలు చర్యలు చేపడుతున్నాం. జాతీయ ఆర్థిక సమాచార రిజిస్ట్రీ ఏర్పాటు ద్వారా రుణవితరణను మరింత సమర్థవంతం చేస్తాం. కేంద్రీకృత డేటా ప్రాసెసింగ్‌ సెంటర్‌ ఏర్పాటుతో కంపెనీల చట్టం కింద పాలనా వ్యవహారాలను వేగవంతం చేస్తాô. ఎంఎస్‌ఎంఈలకు క్రెడిట్‌ గ్యారంటీ పథకం ద్వారా తనఖా అవసరం లేకుండా రుణాలిచ్చేందుకు అదనంగా రూ.2 లక్షల కోట్ల కార్పస్‌ఫండ్‌ ఏర్పాటు చేస్తాô. మహిళల కోసం రెండేళ్ల కాలానికి రూ.2 లక్షల చొప్పున ఆదా చేసుకునేందుకు మహిళా సమ్మాన్‌ బచత్‌పత్ర పేరుతో చిన్నమొత్తాల పొదుపు పథకం. వయోవృద్ధులు సేవింగ్స్‌ పథకాల్లో గరిష్ఠంగా డిపాజిట్‌ చేయగల మొత్తాన్ని రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచుతున్నాం. సెక్యూరిటీల మార్కెట్లలో విద్యార్హత ధ్రువపత్రాలు అందించడం ద్వారా మరింతమంది సుశిక్షితులైన నిపుణులను రూపొందిస్తాô.

వైద్య రంగానికి రూ.89,155 కోట్లు
కేంద్ర ప్రభుత్వం వైద్యరంగానికి గతేడాదితో పోల్చితే ఈ బడ్జెట్‌లో స్వల్పంగా నిధులను పెంచింది. ఆ రంగానికి రూ.89,155 కోట్లను ప్రతిపాదించింది. గత బడ్జెట్‌లో కేటాయించిన దాని (రూ.79,145 కోట్లు) కంటే ఇది 13 శాతం అదనం. ఆయుష్‌ మంత్రిత్వ శాఖకు రూ.3,647.50 (గత బడ్జెట్‌ కంటే 20 శాతం అదనం) కోట్లు కేటాయించింది. ప్రతిపాదించిన మొత్తంలో రూ.86,175 కోట్లను ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖకు, రూ.2,980 కోట్లను వైద్య పరిశోధనల విభాగానికి కేటాయించినట్లు కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌ తన ప్రసంగంలో వివరించారు. 2014 నుంచి ఇప్పటి వరకు నెలకొల్పిన 157 వైద్య కళాశాలలకు అనుబంధంగా 157 నర్సింగ్‌ కళాశాలలను ఏర్పాటు చేయాలని కేంద్రం తాజా బడ్జెట్‌లో నిర్ణయించింది.
2047 నాటికి సికిల్‌సెల్‌ ఎనీమియా నిర్మూలన!
దేశవ్యాప్తంగా 2047 నాటికి సికిల్‌సెల్‌ ఎనీమియా వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా ప్రత్యేక మిషన్‌ను ప్రారంభించనున్నట్లు నిర్మలాసీతారామన్‌ ప్రకటించారు. ఈ వ్యాధి ప్రభావిత ఏజెన్సీ ప్రాంతాల్లోని 40 ఏళ్ల వయసులోపు 7 కోట్ల మంది గిరిజనులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, వ్యాధిపై అవగాహన కల్పిస్తామని వివరించారు. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ప్రధానమంత్రి స్వస్థ్య సురక్షా యోజన (పీఎంఎస్‌ఎస్‌వై)ను రెండుగా విభజిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దాన్ని పీఎంఎస్‌ఎస్‌వైతో పాటు కొత్తగా నెలకొల్పనున్న ఎయిమ్స్‌ స్థాపన వ్యయాన్ని ప్రత్యేకంగా పేర్కొననున్నట్లు తెలిపింది. ఈ బడ్జెట్‌లో పీఎంఎస్‌ఎస్‌వైకు రూ.3,365 కోట్లు, 22 కొత్త ఎయిమ్స్‌ల స్థాపనకు రూ.6,835 కోట్లుగా కేటాయించింది. గతేడాది పీఎంఎస్‌ఎస్‌వైకు రూ.10 వేల కోట్లు ప్రతిపాదించింది. 
పరిశోధనలు, ఆవిష్కరణలకు ఊతం
పరిశోధనలు, ఆవిష్కరణల ప్రోత్సాహానికి కేంద్రం పలు నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన ఐసీఎంఆర్‌ ల్యాబ్‌లలో పరిశోధన చేసేందుకు ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లోని బోధనా సిబ్బందికి అనుమతి ఇస్తుంది. అందుకు అవసరమైన సదుపాయాలూ కల్పిస్తుంది. వైద్య సంస్థల్లో భవిష్యత్‌ మెడికల్‌ టెక్నాలజీ, ఉత్తమ ఉత్పత్తులు, పరిశోధనలకు అవసరమైన నిపుణుల కోసం వైద్య పరికరాల (మెడికల్‌ డివైస్‌)ను ఉపయోగించడంలో మెలకువలు తెలిపేందుకు ప్రత్యేక కోర్సులు ప్రవేశపెట్టనుంది. ఫార్మా రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలను సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ద్వారా ప్రమోట్‌ చేయనున్నట్లు ఆర్థికమంత్రి వివరించారు. వైద్య రంగానికి సంబంధించిన పరిశోధన, పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తామని తెలిపారు.

రూ.10,000 కోట్లతో పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి నిధి 
దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ఏడాదికి రూ.10,000 కోట్ల కేటాయింపుతో ‘పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి నిధి’ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా నిధుల్ని వినియోగించుకోవచ్చన్నారు. 50,000 నుంచి లక్ష జనాభా ఉన్న నగరాలను ద్వితీయ శ్రేణిగా, 20,000 నుంచి 50,000 జనాభా ఉన్న వాటిని తృతీయ శ్రేణి నగరాలుగా పరిగణిస్తారు. 
తడి, పొడి వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఆర్థికమంత్రి చెప్పారు. ‘గోబర్ధన్‌’ (గాల్వనైజింగ్‌ ఆర్గానిక్‌ బయో-ఆగ్రో రీసోర్సెస్‌ ధన్‌) పథకం కింద కొత్తగా 500 ‘వ్యర్థం నుంచి అర్థం (ధనం)’ ప్లాంట్‌లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
మ్యాన్‌హోల్‌ నుంచి మిషన్‌హోల్‌కు
పట్టణ ప్రణాళికలను అమలు చేయడంలో రాష్ట్రాలను, నగరాలను ప్రోత్సహిస్తామని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. అన్ని నగరాలు, పట్టణాల్లో మురుగు కాలువలు, సెప్టిక్‌ ట్యాంక్‌ల వ్యవస్థను మ్యాన్‌హోల్‌ నుంచి మిషన్‌హోల్‌కు పూర్తిస్థాయిలో మారుస్తామన్నారు. 
రూ.35,000 కోట్లతో హరిత ఇంధన వృద్ధి 
కాలుష్య రహిత ఇంధన రంగానికి మారడానికి, కర్బన ఉద్గారాల్లో తటస్థత సాధించడానికి మూలధన పెట్టుబడిగా కొత్త బడ్జెట్లో రూ.35,000 కోట్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఏడు ప్రాధాన్యాల్లో అయిదో అంశంగా హరిత ఇంధనాన్ని చేర్చింది. పర్యావరణ హితమైన జీవనశైలికి ఊతమిచ్చి, 2070 నాటికి కర్బన తటస్థతను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. పారిశ్రామిక, ఆర్థిక రంగాల్లో హరిత వెలుగుల్ని నింపనున్నట్లు ప్రకటించింది. పెట్రోలియం - సహజ వాయు మంత్రిత్వ శాఖ ఇంధన భద్రత సాధించడానికి కేంద్రం నిధులు వెచ్చించనుంది. వాతావరణ మార్పుల్ని ఎదుర్కొని 2070 నాటికి కర్బన ఉద్గారాలకు కళ్లెం వేయడానికి భారత్‌ తరఫున 2021 నవంబరులో గ్లాస్గో సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిజ్ఞ చేశారు. శిలాజేతర ఇంధనాల ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్తును 2030 నాటికి 500 గిగావాట్లకు చేరుస్తామని కూడా ఆయన చెప్పారు. దీనికి అనుగుణంగా రూ.19,700 కోట్లతో ‘జాతీయ హరిత హైడ్రోజన్‌ మిషన్‌’ను ఇటీవల ప్రారంభించిన విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలో ప్రస్తావించారు. శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకోవాల్సిన ఆవశ్యకతను తగ్గించి, తక్కువ కర్బన ఉద్గారాలుండే ఆర్థిక వ్యవస్థ వైపు మళ్లేందుకు ఈ మిషన్‌ ఊతమిస్తుందని చెప్పారు. ‘2030 నాటికి ఏటా 50 లక్షల టన్నుల హరిత హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. బ్యాటరీ ఇంధన నిల్వల వ్యవస్థలపై వ్యయ సర్దుబాటు నిధిని ప్రభుత్వం సమకూర్చి, మద్దతుగా నిలుస్తుంది. స్టోరేజీ ప్రాజెక్టులపై సవివర కార్యాచరణను రూపొందిస్తుంది. లద్దాఖ్‌లో రూ.20,700 కోట్ల ఖర్చుతో 13 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. పర్యావరణ పరిరక్షణ చట్టం కింద గ్రీన్‌క్రెడిట్‌ కార్యక్రమాన్ని ప్రకటిస్తాం. కంపెనీలు, వ్యక్తులు, స్థానిక సంస్థలు బాధ్యతాయుతమైన చర్యలు చేపట్టేలా చూసేందుకు ఇది ఉపయోగపడుతుంది’’ అని వివరించారు.

ఆహారం, ఎరువులు, పెట్రోలియంపై రాయితీలు రూ.5.21 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వం ఆహారం, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులపై ఇస్తున్న రాయితీలు ఈ ఆర్థిక సంవత్సరంలో 17% పెరిగి రూ.5.21 లక్షల కోట్లకు చేరుకోవచ్చని బడ్జెట్లో అంచనా వేశారు. 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ రాయితీలు 28% మేర తగ్గి దాదాపు రూ.3.75 లక్షల కోట్లు ఉండవచ్చని భావిస్తున్నారు. బడ్జెట్‌ లెక్కల ప్రకారం.. 2022 - 23 ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాల మేరకు ఆహారం, ఎరువులు, పెట్రోలియంపై పూర్తి రాయితీలను ప్రభుత్వం రూ.5,21,584.71 కోట్లకు స్థిరీకరించింది. గత ఆర్థిక సంవత్సరం వీటికి కేటాయించిన వాస్తవ బడ్జెట్‌ 4,46,149.24 కోట్లు. ఈ మూడు కేటగిరీలను పరిశీలిస్తే, ఆహారంపై ఇస్తున్న రాయితీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,87,194.05 కోట్లకు స్వల్పంగా తగ్గుతుందని అంచనా కాగా, 2021 - 22లో ఇది 2,88,968.54 కోట్లు. అలాగే తాజా ఆర్థిక సంవత్సరంలో ఎరువుల రాయితీ 2,24,220.16 కోట్లకు పెరుగుతుండగా గత ఆర్థిక సంవత్సరంలో ఇది 1,53,758.10 కోట్లు మాత్రమే. ఇదే విధంగా పెట్రోలియం రాయితీ సైతం 9,170.50 కోట్లకు పెరుగుతుందని అంచనా కాగా, గత ఆర్థిక సంవత్సరం ఇది కేవలం రూ.3,422.60 కోట్లు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి పై మూడు కేటగిరీల మొత్తం రాయితీలు 28% మేర తగ్గుతాయని అంచనా. 
బడ్జెట్‌లో కొత్త పథకాలు, కార్యక్రమాలివీ..
ఈ బడ్జెట్‌లో పలు కొత్త పథకాలను ప్రకటించారు.
కృత్రిమ ఎరువుల వాడకాన్ని తగ్గించడమే లక్ష్యంగా ‘ప్రధానమంత్రి - వ్యవసాయ నిర్వహణకు ప్రత్యామ్నాయ పోషకాల ప్రోత్సాహం (పీఎం-ప్రణామ్‌)’ పథకాన్ని ప్రారంభించనున్నారు. ప్రత్యామ్నాయ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించే రాష్ట్రాలకు ఈ పథకం కింద ప్రోత్సాహకాలు అందజేస్తారు.
విలువైన ఉద్యాన పంటలు వేసేందుకు నాణ్యమైన పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చేలా రూ.2,200 కోట్లతో ఆత్మనిర్భర్‌ క్లీన్‌ ప్లాంట్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనున్నారు. 
చిత్తడి నేలలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించేందుకు, జీవవైవిధ్యాన్ని పెంపొందించేందుకు రానున్న మూడేళ్లపాటు ‘అమృత్‌ ధరోహర్‌’ పథకాన్ని అమలు చేయనున్నారు. 
చక్రీయ ఆర్థిక వ్యవస్థ (సర్క్యులర్‌ ఎకానమీ)ను ప్రోత్సహించేందుకు రూ.10 వేల కోట్ల పెట్టుబడితో గోవర్ధన్‌ పథకాన్ని ప్రకటించారు. 
తొలి దశలో లక్ష పురాతన శిలాశాసనాల్లోని వివరాలను డిజిటల్‌ రూపంలో భద్రపర్చడానికిగాను డిజిటల్‌ ఎపిగ్రఫీ మ్యూజియంలో ప్రత్యేకంగా శాసన భండారాన్ని ఏర్పాటు చేయనున్నారు. - 30 అంతర్జాతీయ నైపుణ్య భారత్‌ కేంద్రాల ఏర్పాటు. లక్షల మంది యువత కోసం ‘ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన-4.0’ ప్రారంభం. 
కొత్తగా మిష్ఠీ పథకం కింద.. తీరప్రాంతాల వెంబడి మడ అడవుల పెంపకం.  
‘ఒక జిల్లా - ఒక ఉత్పత్తి’ పరిధిలోని ఉత్పత్తులు, జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ (జీఐ) వస్తువుల ప్రచారం, విక్రయాల కోసం యూనిటీ మాల్‌లను ఏర్పాటు చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రోత్సాహం. 
హైదరాబాద్‌లోని మిల్లెట్‌ ఇన్‌స్టిట్యూట్‌ను సెంటర్‌ ఆఫ్‌ ఎక్సెలెన్స్‌గా తీర్చిదిద్దేందుకు కేంద్రం సహకారం. 
‣ కేవైసీ ప్రక్రియను సరళీకరించడంతో పాటు వ్యక్తిగత డేటాను గోప్యంగా ఉంచేందుకు జాతీయ డేటా గవర్నెన్స్‌ విధానం. 
గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నిధి (ఆర్‌ఐడీఎఫ్‌) తరహాలో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (యూఐడీఎఫ్‌) ఏర్పాటు. 
ఆదిమ కాలం నాటి గిరిజన తెగల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చేందుకు రాబోయే మూడేళ్ల పాటు రూ.15 వేల కోట్లతో ‘ప్రధానమంత్రి - నిర్దిష్ట దుర్బల గిరిజన తెగల (పీఎం-పీవీటీజీ)’ అభివృద్ధి కార్యక్రమం అమలు. 
సహకార సంఘాల పనితీరును పర్యవేక్షించేందుకు జాతీయ సహకార డేటాబేస్‌కు రూపకల్పన. 
వ్యవసాయ, అనుబంధ రంగాలకు అందించే రుణాలను రూ.20 లక్షల కోట్లకు పెంచుతున్నామని ప్రకటించడం ద్వారా రైతులకు పెట్టుబడిపరమైన ఇబ్బందులు లేకుండా భరోసా కల్పించారు. రాబోయే మూడేళ్లలో కోటి మంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించేందుకు 10 వేల బయోఇన్‌పుట్‌ రిసోర్స్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు.
ఐటీ కొత్త విధానంలో కొంత ఊరట
కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే వారిని ప్రోత్సహించే దిశగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో కీలక ప్రతిపాదనలు చేశారు. 2020 - 21 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశ పెట్టిన కొత్త విధానంలో రూ.7 లక్షల వరకు ఎలాంటి పన్ను భారం లేకుండా రిబేటును ప్రతిపాదించారు. ఇందుకు ఎలాంటి పొదుపు, పెట్టుబడులతో పని ఉండదు. అంతకుమించి ఆదాయం కలిగిన వారికి శ్లాబుల ప్రకారం పన్ను వర్తిస్తుంది. దీంతో పాటు కొత్త పన్ను విధానం శ్లాబుల సంఖ్యనూ తగ్గించి, ఊరట కల్పించారు. మధ్య తరగతి వేతన జీవులకు ఇది కాస్త ఉపశమనం కలిగించే అంశమే. పలు సెక్షన్ల కింద మినహాయింపులను అనుమతించే పాత పన్నుల విధానంలో మాత్రం ఎలాంటి మార్పులనూ ప్రతిపాదించలేదు. కొత్త పన్ను విధానంలో ఇప్పటి వరకు ఉన్న రూ.2,50,000 మినహాయింపును రూ.3 లక్షలకు పెంచారు. 
ఫలితంగా ఆదాయపు పన్ను పరిమితి రూ.50 వేలు పెరిగినట్లయ్యింది. పాత పన్ను విధానంలో ఆదాయ పరిమితిని మాత్రం రూ.2,50,000 గానే ఉంచారు. పాత పన్ను విధానంలోనూ పన్ను వర్తించే ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్నప్పుడు ఎలాంటి భారం ఉండదు. చెల్లించాల్సిన పన్ను రూ.12,500 కు రిబేటు లభిస్తుంది. రూ.5 లక్షలకు మించినప్పుడే శ్లాబుల వారీగా పన్ను చెల్లించాల్సి వస్తుంది.

ప్రామాణిక తగ్గింపుతో..
పాత పన్ను విధానంలో రూ.50 వేల వరకు ప్రామాణిక తగ్గింపును అనుమతించేవారు. ఇక నుంచి కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికీ ఈ మినహాయింపు కల్పించనున్నారు. కొత్త విధానాన్ని ఎంచుకునే వారికి అదనపు ప్రయోజనం చేకూరేలా చేశారు.
సర్‌ఛార్జీ తగ్గింపు
అధిక ఆదాయం కలిగిన వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాల (హెచ్‌యూఎఫ్‌)కు ఊరట కలిగించేలా సర్‌ఛార్జీని తగ్గించారు. ప్రస్తుతం రూ.5 కోట్లకు మించి ఆదాయం ఉన్న వారికి 37% సర్‌ఛార్జీ వర్తిస్తోంది. దీన్ని 25 శాతానికి తగ్గిస్తున్నారు. దీంతో రూ.2 కోట్ల ఆదాయం ఉన్న వారందరూ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 25 శాతం సర్‌ఛార్జీ పరిధిలోకి రానున్నారు.  
ఏదైనా ఒక దానిని ఎంచుకొనే వీలు
పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానం లేదా పాత పన్ను విధానంలో ఏదో ఒకదానిని ఎంచుకునే వీలుంది. గతంలో ఏదో ఒకదానిని మనమే ఎంచుకోవాల్సి వచ్చేది. పన్ను రిటర్నులు దాఖలు చేసేటప్పుడు వెబ్‌సైట్‌లో కొత్త పన్ను విధానమే డిఫాల్ట్‌గా ఉంటుంది. పాత పన్ను విధానం కావాలనుకుంటే దీన్ని మార్చుకోవాలి. ఒక ఆర్థిక సంవత్సరం పాత పన్ను విధానం, మరో ఆర్థిక సంవత్సరం కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు. కానీ, వృత్తి, వ్యాపారం ద్వారా లాభాలను ఆర్జించే వారు ఒకసారి కొత్త పన్ను విధానంలోకి మారిన తర్వాత, మళ్లీ పాత పద్ధతిలో రిటర్నులు దాఖలు చేయడం సాధ్యం కాదు.
ఉద్యోగులు లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ చేసుకున్నప్పుడు రూ.3లక్షల వరకే పన్ను మినహాయింపు ఉండేది. పెరిగిన వేతనాలను దృష్టిలో పెట్టుకుని, ఈ మొత్తాన్ని రూ.25లక్షలకు పెంచుతున్నట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించారు.

బీమా ప్రీమియం రూ.5 లక్షలు దాటితే..
జీవిత బీమా పాలసీల కోసం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.5 లక్షలకు మించి ప్రీమియం చెల్లించినప్పుడు, పన్ను పరిధిలోకి తీసుకొస్తూ బడ్జెట్‌లో ప్రతిపాదించారు. 2023 ఏప్రిల్‌ 1 నుంచి తీసుకునే పాలసీలకు చెల్లించే ప్రీమియం రూ.5 లక్షల లోపు ఉన్నప్పుడు మాత్రమే మెచ్యూరిటీ మొత్తానికి పన్ను పరిధి నుంచి మినహాయింపు లభిస్తుంది. రూ.5 లక్షల పైన ప్రీమియం చెల్లించిన బీమా పాలసీల ద్వారా వచ్చిన ఆదాయానికి పన్ను మినహాయింపు వర్తించదు. పాలసీదారుడు మరణించిన సందర్భంలో వచ్చే పరిహారాలకు ఎలాంటి పన్ను ఉండదు. 
వివాదాలను పరిష్కరించేలా..
ఆదాయపు పన్ను విషయంలో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకునేందుకు వీలుగా తీసుకొచ్చిన వివాద్‌ సే విశ్వాస్‌-2 పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు.
మహిళలకు ప్రత్యేకంగా..
పొదుపు, పెట్టుబడుల దిశగా మహిళలను ప్రోత్సహించేందుకు కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ మహిళా సమ్మాన్‌ బచత్‌ పత్ర’ పేరుతో అందిస్తున్న ఈ ఒకసారి పెట్టుబడి పథకంలో రూ.2 లక్షల వరకు జమ చేసుకోవచ్చు. బాలికల పేరుమీదా ఇందులో పొదుపు చేసుకోవచ్చు. రెండేళ్ల వ్యవధి ఉన్న ఈ పత్రాల్లో వార్షిక వడ్డీ 7.5 శాతం చెల్లించనున్నారు. వ్యవధి లోపు పాక్షికంగా కొంత మొత్తాన్ని తీసుకునేందుకు అనుమతిస్తారు. 
ఈపీఎఫ్‌ ఉపసంహరణపై టీడీఎస్‌ తగ్గింపు
భవిష్య నిధి నిల్వలను పాన్‌కార్డు అనుసంధానం లేకుండా పూర్తిగా వెనక్కు తీసుకుంటే, ఆ మొత్తంపై ఆదాయపన్ను భారాన్ని కేంద్రం తగ్గించింది. ప్రస్తుత 30 శాతం టీడీఎస్‌ను 20 శాతానికి తగ్గిస్తున్నట్లు బడ్జెట్‌లో తెలిపింది. 
చిన్న మొత్తాల పరిమితి పెంపు
పదవీ విరమణ చేసిన వారికి క్రమం తప్పకుండా ఆదాయం అందించేందుకు ఉద్దేశించిన పెద్దల పొదుపు పథకం (సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీం) పరిధిని పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఇప్పటి వరకు ఈ పరిమితి రూ.15 లక్షలు ఉండగా, దీన్ని రూ.30 లక్షలకు పెంచారు. ప్రభుత్వ హామీ ఉండే ఈ పథకానికి ఎంతో ఆదరణ ఉంది. ప్రస్తుతం దీనికి 8% వార్షిక వడ్డీ లభిస్తోంది. ప్రతి మూడు నెలలకోసారి వడ్డీని చెల్లిస్తారు. 55 ఏళ్ల తరవాత పదవీ విరమణ చేసిన వారు, 60 ఏళ్లు దాటిన వ్యక్తులు ఇందులో చేరొచ్చు.
‣ పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకం (మంత్లీ ఇన్‌కం అకౌంట్‌ స్కీం) పరిమితిని రూ.4.5 లక్షల నుంచి రూ.9 లక్షలకు పెంచారు. ఉమ్మడి ఖాతా పరిమితిని రూ.9 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచారు.ప్రస్తుతం ఈ ఖాతాలో 7.1 శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది.

అణు విద్యుత్‌ కార్పొరేషన్‌కు రూ.9,410 కోట్లు
దేశంలో అణు విద్యుత్‌ ఉత్పాదక సామర్థ్యాన్ని బాగా పెంచాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో ఈ దిశగా కేటాయింపులు జరిపింది. భారత అణు విద్యుత్‌ కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐఎల్‌)కు రూ.9,410 కోట్లను ప్రత్యేకించింది. తాజా ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సవరించిన అంచనాలతో పోలిస్తే ఇది 43 శాతం అధికం కావడం విశేషం. ఈ కేటాయింపులకు తోడు అంతర్గత, బడ్జెటేతర వనరుల ద్వారా రూ.12,863 కోట్లను ఎన్‌పీసీఐఎల్‌ సమకూర్చుకుంటుంది. తాజా బడ్జెట్‌లో అణు ఇంధన శాఖకు రూ.25,078.49 కోట్లను కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సవరించిన అంచనాల (రూ.25,965.67) కన్నా ఇది తక్కువ. ఈ శాఖ పరిధిలోకి వచ్చే ఇండియన్‌ రేర్‌ ఎర్త్స్‌ లిమిటెడ్‌కు రూ.120.30 కోట్లు, యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌కు రూ.59.82 కోట్లు, ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌కు రూ.15 కోట్లను కేంద్రం కేటాయించింది. ఫ్యూయెల్‌ రీసైకిల్‌ ప్రాజెక్ట్స్‌కు రూ.805.21 కోట్లను ప్రతిపాదించారు. 

హోంకు పెరిగిన కేటాయింపులు
అంతర్గత భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ తాజా బడ్జెట్‌లో రూ.1.96 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. గత ఏడాది చేసిన రూ.1,85,776.55 కోట్ల కేటాయింపుల కన్నా ఇది అధికం. హోం శాఖకు తాజాగా చేసిన కేటాయింపుల్లో సింహ భాగాన్ని కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, నిఘా సేకరణ యంత్రాంగానికి కేంద్రం ప్రత్యేకించింది. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి రోడ్లు వంటి సౌకర్యాలకు, పోలీసు మౌలిక వసతుల మెరుగుకు, పోలీసు దళాల ఆధునికీకరణకు గణనీయ స్థాయిలో కేటాయింపులు జరిగాయి. 
తాజా బడ్జెట్‌లో కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు రూ.1,27,756.74 కోట్లు ప్రతిపాదించారు. గత ఏడాది ఈ కేటాయింపులు రూ.1,19,070.36 కోట్లుగా ఉన్నాయి. 
అంతర్గత భద్రత విధుల్లో నిమగ్నమయ్యే సీఆర్పీఎఫ్‌కు రూ.31,772.23 కోట్లు ప్రతిపాదించారు. గత బడ్జెట్‌లో ఈ దళానికి రూ.31,495.88 కోట్లు కేటాయించారు.
పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ వెంబడి ఉన్న సరిహద్దులను రక్షించే బీఎస్‌ఎఫ్‌కు గత ఏడాది రూ.23,557.51 కోట్లు కేటాయించగా ఈసారి రూ.24,771.28 కోట్లు ప్రతిపాదించారు. 
అణు కేంద్రాలు, విమానాశ్రయాల వంటి కీలక ప్రదేశాల భద్రతను పర్యవేక్షించే కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాని (సీఐఎస్‌ఎఫ్‌)కి గత బడ్జెట్‌లో రూ.12,293.23 కోట్లను ఇవ్వగా, తాజాగా 13,214.68 కోట్లు కేటాయించారు. 
నేపాల్, భూటాన్‌ సరిహద్దులను రక్షించే సశస్త్ర సీమా బల్‌కు గత ఏడాది రూ.8,019.78 కోట్లు కేటాయించగా ఈసారి రూ.8,329.10 కోట్లు ప్రతిపాదించారు. 
భారత్‌ - చైనా సరిహద్దు భద్రత బాధ్యతలను చేపట్టే ఐటీబీపీకి గత బడ్జెట్‌లో రూ.7,626.38 కోట్లు కేటాయించగా ఇప్పుడు రూ.8,096.89 కోట్లు ప్రత్యేకించారు. 
‣ భారత్‌ - మయన్మార్‌ సరిహద్దుల్లో, ఈశాన్య ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న అస్సాం రైఫిల్స్‌కు గత బడ్జెట్‌లో రూ.6,561.33 కోట్లు ప్రతిపాదించగా తాజాగా రూ.7,052.46 కోట్లు కేటాయించారు. 
అత్యవసర భద్రతా పరిస్థితులను ఎదుర్కోవడానికి ఏర్పాటు చేసిన జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎస్‌జీ)కి రూ.1,286.54 కోట్లు కేటాయించారు. గత ఏడాది ఈ దళానికి రూ.1,183.80 కోట్లు ప్రత్యేకించారు. 
‣ ఇంటెలిజెన్స్‌ బ్యూరోకు రూ.3,418.32 కోట్లు, దిల్లీ పోలీసు విభాగానికి రూ.11,662.03 కోట్లు కేటాయించారు. 
ప్రధాని భద్రతను చూసే ప్రత్యేక భద్రతా దళాని (ఎస్‌పీజీ)కి గత ఏడాది రూ.411.88 కోట్లు కేటాయించగా తాజా బడ్జెట్‌లో రూ.433.59 కోట్లు ప్రత్యేకించారు. 
‣ సరిహద్దుల్లో రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.3,545.03 కోట్లు కేటాయించారు. గత ఏడాది ఈ పద్దు కింద రూ.3,738.98 కోట్లు ప్రతిపాదించారు. 
పోలీసు మౌలిక వసతుల అభివృద్ధికి రూ.3,636.66 కోట్లను ఇచ్చారు. 2022 - 23 బడ్జెట్‌లో రూ.2,188.38 కోట్లను ప్రత్యేకించారు.
పోలీసు దళాల ఆధునికీకరణకు రూ.3,750 కోట్లను ప్రతిపాదించారు. గత ఏడాది దీనికోసం రూ.2,432.06 కోట్లు కేటాయించారు. 
‣ భద్రత సంబంధ వ్యయం కోసం రూ.2780.88 కోట్లు, జనాభా లెక్కల సేకరణ పనులకు రూ.1,564.65 కోట్లు, మహిళా భద్రతా పథకాలకు రూ.1,100 కోట్లు, ఫోరెన్సిక్‌ సంస్థల ఆధునికీకరణకు రూ.700 కోట్లు, సరిహద్దు చెక్‌పోస్టుల నిర్వహణకు రూ.350.61 కోట్లు కేటాయించారు.
సీబీఐకి స్వల్ప పెరుగుదల 
దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐకి తాజా బడ్జెట్‌లో రూ.946 కోట్లు కేటాయించారు. గత ఏడాది బడ్జెట్‌తో పోలిస్తే ఇది 4.4 శాతం అధికం. 2022 - 23 బడ్జెట్‌ అంచనాల్లో ఈ విభాగానికి రూ.841.96 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల్లో అది రూ.906.59 కోట్లకు పెరిగింది. తాజా బడ్జెట్‌లో సీబీఐ శిక్షణ కేంద్రాల ఆధునికీకరణ, సాంకేతిక, ఫోరెన్సిక్‌ తోడ్పాటు విభాగాలకు నిధులు ప్రత్యేకించారు. 
ఈవీఎంల కొనుగోలుకు రూ.1,900 కోట్లు
వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రం (ఈవీఎం)ల కోసం బడ్జెట్‌లో రూ.1891.78 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. బ్యాలెట్‌ యూనిట్లు, కంట్రోల్‌ యూనిట్లు, ఓటు రసీదు యంత్రాలు (వీవీప్యాట్‌లు), వాడకంలో లేని ఈవీఎంలను నిర్వీర్యం చేయడానికి ఈ నిధులను ఉపయోగిస్తారు. వీటిని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బీఈఎల్‌), ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఈసీఐఎల్‌) తయారు చేస్తాయి.
మంత్రుల జీతభత్యాలకు రూ.1,258.6 కోట్లు
కేంద్ర మంత్రుల జీతాలు, ప్రయాణ భత్యాలు, విదేశీ ప్రముఖులకు ఆతిథ్యం వగైరా ఖర్చులకు 2023 - 24 బడ్జెట్లో రూ.1,258.68 కోట్లు కేటాయించారు. ప్రధానమంత్రి కార్యాలయ (పీఎంవో) ఖర్చులు, జాతీయ భద్రతా మండలి కార్యాలయం, ప్రధాన శాస్త్రీయ సలహాదారు పేషీ, మాజీ గవర్నర్లకు సచివాలయ సేవల ఖర్చులు కూడా ఇందులోకే వస్తాయి. సింహభాగం రూ.832.81 కోట్లు మంత్రి మండలికి కేటాయించారు. జాతీయ భద్రతా మండలి కార్యాలయ వాటా రూ.185.7 కోట్లు కాగా, ప్రధాన శాస్త్రీయ సలహాదారు పేషీకి రూ.96.93 కోట్లు, కేబినెట్‌ సచివాలయానికి 71.91 కోట్లు, ప్రధాని కార్యాలయానికి రూ.62.65 కోట్లు వెచ్చిస్తారు. దేశంలో పర్యటనలకు వచ్చే విదేశీ ప్రముఖుల ఆతిథ్యానికి రూ.6.88 కోట్లు, మాజీ గవర్నర్లకు సచివాలయ సేవల ఖర్చులకు రూ.1.8 కోట్లు కేటాయించారు.

అంతరిక్ష పరిశోధనలకు రూ.12,543.93 కోట్లు
అంతరిక్ష పరిశోధనలకు బడ్జెట్‌లో రూ.12,543.93 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌తో (రూ.13,700 కోట్లు) పోల్చితే ఇది 8% తక్కువ. కొవిడ్‌ ప్రభావంతో 2020 - 21 మినహా అంతరిక్ష పరిశోధనలకు బడ్జెట్‌లో గత రెండేళ్లు కేటాయింపులు పెరిగినా, ఈ ఆర్థిక సంవత్సరంలో కాస్త తగ్గాయి. ఇస్రో ఈ ఏడాది చంద్రయాన్‌-3, ఆదిత్య-ఎల్‌1 వంటి భారీ ప్రాజెక్టులతో పాటు వాణిజ్య ప్రయోగాలతో తీరికలేని షెడ్యూల్‌ కలిగి ఉంది.

 
పేద ఖైదీలకు ఆర్థిక సాయంజరిమానా, బెయిల్‌ రుసుం కట్టలేని స్థితిలో ఉన్న పేద ఖైదీలకు ఆర్థికంగా తోడ్పాటు అందించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ‘‘పేద ఖైదీలతో పాటు జరిమానా కట్టలేని, బెయిల్‌ రుసుం చెల్లించలేని వారికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తాం’’ అని చెప్పారు. 
మైనారిటీ వ్యవహారాలకు నిధుల కోత
కేంద్ర బడ్జెట్‌లో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు భారీగా నిధులు తగ్గాయి. గత ఏడాదితో పోలిస్తే సుమారు 38 శాతం కోత పెట్టారు. 2022 - 23 బడ్జెట్‌లో రూ.5020.50 కోట్లు కేటాయించగా వచ్చే ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.3097.60 కోట్లు ప్రతిపాదించారు.
పర్యాటకం పరుగులు తీయాలి 
‘దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించే చర్యల్ని యుద్ధ ప్రాతిపదికన చేపడతాం. ‘సమగ్ర ప్యాకేజీ’లో భాగంగా కనీసం 50 ప్రాంతాల్ని తీర్చిదిద్దుతాం. రాష్ట్రాలు తమ రాజధానుల్లో కానీ, ముఖ్యమైన పర్యాటక కేంద్రాల్లో కానీ ‘యూనిటీ మాల్‌’ను ఏర్పాటు చేసుకుని స్థానిక చేతివృత్తులు, హస్తకళా ఉత్పత్తుల్ని విక్రయించుకోవడానికి సహకరిస్తాం’ అని నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో ప్రకటించారు. నిర్దిష్టమైన నైపుణ్యాలు, వ్యవస్థాపక అభివృద్ధిని పెంపొందించుకుంటూ ‘దేఖో ఆప్నా దేశ్‌’ లక్ష్యాలను సాధిస్తామని చెప్పారు. స్వదేశీ, విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించడంపై దృష్టి పెడతామని, ముఖ్యమైన ప్రాంతాల విశేషాలు, నాణ్యమైన ఆహారం దొరికే చోట్లు, భద్రతకు సంబంధించిన వివరాలన్నింటినీ ఓ యాప్‌లో అందుబాటులోకి తెస్తామన్నారు. దేశ సరిహద్దు గ్రామాల్లో పర్యాటకాభివృద్ధికి, మౌలిక వసతులను, సౌకర్యాలను భారీ స్థాయిలో కల్పించనున్నట్లు వివరించారు. 

కృత్రిమ మేధ కోసం సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లు
డిజిటల్‌ దిశగా ఇప్పటికే ముందడుగు వేసిన భారతదేశం, ఈ రంగంలో పరుగులు పెట్టేందుకు దోహదపడే పలు చర్యలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో వివరించారు. దేశ టెక్నాలజీ ఎజెండాను ముందడుగు వేయించి, డిజిటల్‌ మౌలిక సదుపాయాలను ప్రోత్సహిస్తామన్నారు. అందులో భాగంగా కృత్రిమ మేధకు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లు, జాతీయ డేటా గవర్నెన్స్‌ విధానం, సంస్థల డిజిలాకర్లను ఏర్పాటుచేస్తామని తెలిపారు. ఆధార్, కొవిన్, యూపీఐ లాంటి ప్రపంచస్థాయి సదుపాయాలతో భారతదేశం ఇప్పటికే పలు విజయాలు సాధించిందన్నారు. అమృతకాలంలో సాంకేతిక పరిజ్ఞానం, జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థలతో ఆర్థికరంగాన్ని బలోపేతం చేస్తామన్నారు. అంకుర సంస్థలు, విద్యాసంస్థల్లో పరిశోధన, సృజనాత్మకత కోసం జాతీయ డేటా గవర్నెన్స్‌ విధానాన్ని తెస్తామన్నారు. దీనివల్ల వాటికి డేటా మరింతగా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. దేశంలో కృత్రిమ మేధ, దేశానికి అది ఉపయోపడేలా చేయడానికి మూడు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లు ఏర్పాటుచేస్తామన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం, సుస్థిర నగరాల్లాంటి రంగాల్లో వివిధ సమస్యల పరిష్కారానికి చేసే పరిశోధనలో పరిశ్రమవర్గాలూ పాల్గొంటాయని తెలిపారు. దీనివల్ల ఈ రంగంలో నాణ్యమైన మానవవనరులు అందుబాటులోకి వస్తాయన్నారు. పిల్లలు, యుక్తవయసు వారి కోసం జాతీయ డిజిటల్‌ గ్రంథాలయాన్ని ఏర్పాటుచేస్తామని, ఇందులో వివిధ ప్రాంతాలు, భాషలు, స్థాయిల పుస్తకాలు ఉంటాయని చెప్పారు. కేవైసీ విధానాన్ని మరింత సులభతరం చేస్తామన్నారు. ఇన్నాళ్లూ పౌరులకు సేవలందిస్తున్న డిజిలాకర్‌ను ఫిన్‌టెక్‌ సర్వీసులు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకూ అందుబాటులోకి తెస్తామన్నారు. ‘వీటితో కేవైసీ సేవలు మరింత సరళమవుతాయి. ఆర్థికసేవలు అందించే సంస్థలకు ఆధార్, పీఎం జన్‌ధన్‌ యోజన, వీడియో కేవైసీ, యూపీఐ వివరాలను డిజిలాకర్‌లో అందుబాటులో ఉంచుతాం. దీని ద్వారా ఆర్థిక సేవలు మరింత త్వరగా పౌరులకు అందుతాయి’ అని ప్రకటించారు. అయితే వీటి భద్రతను మాత్రం ఆయా సంస్థలే చూసుకోవాలన్నారు. ఇక 5జీ సేవలను ఉపయోగించుకునే యాప్‌లు అభివృద్ధి చేసేందుకు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 100 ల్యాబ్‌లు ఏర్పాటుచేస్తామన్నారు. ఇవి స్మార్ట్‌ తరగతి గదులు, నిర్దిష్ట వ్యవసాయం, ఇంటెలిజెంట్‌ రవాణా వ్యవస్థ, వైద్యసేవలకు ఉపయోగపడతాయి. 2022లో డిజిటల్‌ లావాదేవీలు 76%, వాటి విలువ 91% పెరిగాయని మంత్రి చెప్పారు. 2014 - 15లో రూ.18,900 కోట్ల విలువైన 5.8 కోట్ల మొబైల్‌ ఫోన్లు దేశంలో ఉత్పత్తి కాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.2.75 లక్షల కోట్ల విలువైన 31 కోట్ల యూనిట్లు ఉత్పత్తి అయ్యాయని తెలిపారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద అంకుర సంస్థల వ్యవస్థగా భారత్‌ నిలిచిందని, మధ్యాదాయ దేశాల్లో సృజనాత్మక నాణ్యత విషయంలో రెండో ర్యాంకులో ఉందని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. అంకుర సంస్థలకు ఈ ఆర్థిక సంవత్సరంలోనూ ఆదాయపన్ను ప్రయోజనాలు కల్పిస్తామన్నారు. అంకుర సంస్థలు పెట్టిన ఏడేళ్ల వరకు నష్టాలను తదుపరి ఆర్థిక సంవత్సరంలోకి తీసుకెళ్లే అవకాశం ఉండగా, దాన్ని పదేళ్లకు పెంచుతున్నట్లు తెలిపారు.

మహిళా, శిశు సంక్షేమ శాఖకు స్వల్పంగా పెరిగిన నిధులు
మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపు స్వల్పంగా పెరిగింది. ఈ శాఖకు గత ఆర్థిక సంవత్సరం కంటే రూ.267 కోట్లు  అదనంగా కేటాయించారు. గత బడ్జెట్‌లో ఈ శాఖకు రూ.25,172.28 కోట్లు ఇవ్వగా 2023 - 24కిగానూ రూ.25,448.75 కోట్లు ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.
మహిళలు, బాలికలకు సమ్మాన్‌ ధ్రువపత్రం
మహిళలు, బాలికల కోసం కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో ఓ కీలక ప్రకటన చేశారు. మహిళ లేదా బాలిక పేరుతో బ్యాంకుల్లో రూ.2 లక్షలకు మించకుండా డిపాజిట్‌ చేసే వారికి మహిళా సమ్మాన్‌ ధ్రువపత్రం జారీ చేస్తారు. రెండేళ్ల పాటు నగదును డిపాజిట్‌గా ఉంచుకోవచ్చు. వీరికి 7.5శాతం చొప్పున వడ్డీ చెల్లిస్తారు. పాక్షికంగా నగదును వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంటుంది.
‣ సాక్షం అంగన్‌వాడీ పోషణ్‌ 2.0 కింద రూ.20,554.31 కోట్లు, శిశు సంక్షేమానికి సంబంధించిన మిషన్‌ వాత్సల్యకు రూ.1,472 కోట్లు, మహిళా సాధికారికత కోసం ఉద్దేశించిన ‘శక్తి’ మిషన్‌కు రూ.3,143 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ మిషన్‌కు 2022 - 23లో రూ.3,184 కోట్లు కేటాయించడం గమనార్హం.

కృత్రిమ వజ్రాల ఉత్పత్తి రంగానికి ప్రభుత్వం దన్ను
కృత్రిమ వజ్రాల ఉత్పత్తి (ల్యాబ్‌ గ్రోన్‌ డైమండ్స్‌) రంగాన్ని ప్రోత్సహించడానికి వాటి తయారీలో ఉపయోగించే ముడిపదార్థాలపై కస్టమ్స్‌ సుంకాలను తగ్గిస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఈ రంగంలో మరిన్ని పరిశోధనలకు గానూ ఐఐటీలకు నిధులను కేటాయిస్తున్నట్లు తన ప్రసంగంలో తెలిపారు. సహజ వజ్రాల లభ్యత క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో ప్రయోగశాలల్లో తయారయ్యే ఈ కృత్రిమ వజ్రాలే ఆభరణాల వ్యాపారంలోనూ విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా వజ్రాలను దిగుమతి చేసుకుంటున్న దేశం భారత్‌. ఈ దిగుమతి బిల్లు తగ్గించుకునే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
వాటిని ఎలా రూపొందిస్తారంటే..
కృత్రిమ వజ్రాలు దాదాపుగా భూమిలో తయారయ్యే సహజ సిద్ధమైన వజ్రాల్లాగే ఉంటాయి. మోయిసనైట్, క్యూబిక్‌ జిర్కోనియా (సీజెడ్‌), వైట్‌ సఫైర్, వైఏజీ తదితర పదార్థాలను అధిక పీడనం, అధిక ఉష్ణోగ్రతలకు గురిచేస్తారు. ఈ విధానంలో సహజంగా భూమిలో వజ్రం తయారయ్యే స్థితిని ప్రయోగశాలలో కృత్రిమంగా సృష్టిస్తారు. ఫలితంగా చవకయిన కర్బన పదార్థం.. అత్యంత విలువైన వజ్రంగా రూపొందుతుంది. మామూలు వజ్రంలాగే వీటిని సానపడతారు. అయితే సహజమైన వజ్రాలకుండే మెరుపు, మన్నిక వీటికి ఉండవు. ప్రయోగశాలలో తయారు చేస్తారు కాబట్టి అదనపు హంగులను మరింత అద్దుకోవటానికి అవకాశం ఉంది. వీటిని ప్రస్తుతం పరిశ్రమల్లో కట్టర్లుగా, హైపవర్‌ లేజర్‌ డయోడ్లు, హైపవర్‌ ట్రాన్సిస్టర్లల తయారీలోనూ వినియోగిస్తున్నారు.
క్రీడల బడ్జెట్‌ 3397 కోట్లు
దేశంలో క్రీడలకు ఊతం. అథ్లెట్లు ఆసియా క్రీడలు, 2024 ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో కేంద్రం. బడ్జెట్లో క్రీడా రంగానికి కేటాయింపులు పెంచింది. 2023 - 2024 ఆర్థిక సంవత్సరంలో ఆటల కోసం రూ.3,397.32 కోట్లు ఇచ్చింది. గత ఏడాది కంటే ఇది రూ.723.97 కోట్లు ఎక్కువ. ఖేలో ఇండియాకు రూ.1,045 కోట్ల నిధులు అందించనున్నారు. గత ఏడాది కంటే రూ.439 కోట్లు ఎక్కువగా కేటాయించిందంటే ఈ పథకానికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యం ఇస్తోందో అర్థం చేసుకోవచ్చు. జాతీయ క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్‌)కు 2023 - 24 సంవత్సరానికి రూ.785.43 కోట్లు కేటాయించారు. సాయ్‌ అథ్లెట్లకు జాతీయ శిబిరాలు నిర్వహించడంతో పాటు వారికి మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. అథ్లెట్లకు పరికరాలు ఇవ్వడం, కోచ్‌ల నియమించడం, క్రీడా మౌలిక సదుపాయాల నిర్వహణ లాంటి ఇతర విధులనూ సాయ్‌ నిర్వర్తిస్తుంటుంది.

సాగునీటిలో కర్ణాటక, యూపీ, ఎంపీలకే నిధులు
కేంద్ర బడ్జెట్‌లో సాగునీటి రంగానికి చేసిన కేటాయింపుల్లో కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకే పెద్దపీట దక్కింది. రెండు ప్రాజెక్టులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించగా, ఇందులో ఒకటి కర్ణాటకలోని అప్పర్‌భద్ర ప్రాజెక్టు కాగా, ఇంకొకటి ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లకు సాగునీరందించే కెన్‌-బెట్వా ప్రాజెక్టు. ఈ బడ్జెట్‌లో తెలంగాణ సాగునీటి పథకాలకు ఎలాంటి ప్రయోజనం చేకూరే అవకాశం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా నిధులేమీ రాలేదు.  
అప్పర్‌ భద్రకు రూ.5,300 కోట్లు 
త్వరలో కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అప్పర్‌భద్ర ప్రాజెక్టుకు రూ.5300 కోట్లు ప్రత్యేకంగా కేటాయించడం గమనార్హం. జాతీయ హోదా ఇచ్చిన పోలవరం ప్రాజెక్టుకు కూడా నాబార్డు ద్వారా చెల్లించడం తప్ప ఇలా నేరుగా కేటాయించలేదు. తుంగ నది నుంచి 17.4 టీఎంసీలను భద్ర నదికి మళ్లించడం, భద్ర నుంచి 29.9 టీఎంసీలను మళ్లించి చిక్‌మగళూరు, చిత్రదుర్గ, తుముకూరు జిల్లాల్లో 2.25 లక్షల హెక్టార్లకు నీరందించడం, చెరువులు నింపడం చేయాలని నిర్ణయించింది. సూక్ష్మసేద్యం కూడా అమలు చేయనుంది. ఈ పథకానికి కేంద్ర జలసంఘం ఆమోదం తెలపడం, అంతే వేగంగా జాతీయ హోదా ఇవ్వడం జరిగిపోయాయి. ఈ ప్రాజెక్టు వల్ల తుంగభద్రకు వచ్చే ప్రవాహం, దీని వల్ల శ్రీశైలం మీద ప్రభావం పడుతుందని తెలుగు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. 
కెన్‌-బెట్వాకు రూ. 3,500 కోట్లు
నదుల అనుసంధానంలో భాగంగా చేపట్టిన కెన్‌-బెట్వా ప్రాజెక్టుకు రూ.3,500 కోట్లు కేటాయించారు. దీనివల్ల మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్‌లలో ఆయకట్టుకు నీరందుతుంది. ఈ పథకానికి మొత్తం నిధులు కేంద్రమే ఇస్తుంది. అయిదారేళ్లలో రూ.15 వేల కోట్లకు పైగా ఖర్చు చేయనుంది. ప్రధానమంత్రి ప్యాకేజీ కింద మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో ప్రాజెక్టులకు రూ.400 కోట్లు కేటాయించారు. ఏఐబీపీ కింద 50 ప్రాజెక్టులకు రూ.3,122 కోట్లు కేటాయించారు. ఇందులో తెలంగాణకు నామమాత్రంగా కూడా వచ్చే అవకాశం లేదు. నాబార్డు ద్వారా ప్రాజెక్టులకు కేంద్రం ఇప్పించిన రుణాలకు వడ్డీ, అసలు కింద రూ.3,275 కోట్లు కేటాయించారు. గంగా నది ప్రాజెక్టు కోసం రూ. 4,000 కోట్లు కేటాయించారు. ఇప్పటికే ప్రపంచబ్యాంకు రుణం ద్వారా అమలు చేస్తున్న హైడ్రాలజీ, డ్యాం రిహాబిలిటేషన్‌ తదితర పథకాల కింద నామమాత్రంగా అందేవి తప్ప బడ్జెట్‌ ద్వారా అదనంగా నిధులేమీ లేవు.

ఉపాధి హామీపై నిధుల కేటాయింపును తగ్గించిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల కేటాయింపులను రూ.89,400 కోట్ల నుంచి రూ.60 వేల కోట్లకు తగ్గించడంతో అది తెలంగాణపై ప్రభావం చూపనుంది. ఇప్పటికే రాష్ట్రంలో నమోదైన కూలీలకు సరిపడా పనులు దొరకట్లేదు. కేంద్ర తాజా నిర్ణయంతో మరింత మంది ఉపాధిని కోల్పోనున్నారు. ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలోని 12,771 గ్రామాల్లో ఇది అమలవుతోంది. 2018-19 కాలంలో ఏకంగా 106 శాతం పనులు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో రెండు నెలల గడువు ఉండగా... జనవరి నెలాఖరు నాటికి 10.5 కోట్ల పనిదినాలను కల్పించింది. కూలీలు ఇంకా పనులను కోరుతున్నారు. అయితే నిధులు తక్కువగా కేటాయించడం వల్ల రాష్ట్రంలో నమోదైన వారిలో 35 శాతం మందికే ఉపాధి లభిస్తోంది.

 వరంగల్, కరీంనగర్‌లకు యూఐడీఎఫ్‌ను ప్రకటించిన కేంద్రం
గ్రామీణ మౌలిక సదుపాయాల నిధి (రూరల్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ - ఆర్‌ఐడీఎఫ్‌) తరహాలో పట్టణ మౌలిక సదుపాయాల నిధి (అర్బన్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ - యూఐడీఎఫ్‌) ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం బడ్జెట్లో ప్రకటించింది. ప్రాధాన్య రంగాలకు మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల కొరతను తీర్చేందుకు ఇది ఉపకరించనుంది. రూ.10 వేల కోట్లు దీని ద్వారా అందుబాటులోకి వస్తాయి.  టైర్‌-2, టైర్‌-3 నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వీలవుతుంది. రాష్ట్రంలో హైదరాబాద్‌ మినహా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, రామగుండం వంటి నగరాలకు మేలు జరుగుతుంది. పట్టణాభివృద్ధిలో ప్రణాళికా సంస్కరణలు కీలకమని కేంద్రం ప్రకటించింది. భూవనరులను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించింది. అందరికీ అందుబాటులో పట్టణ భూములు, అవకాశాలు అనే లక్ష్యం పట్టణాభివృద్ధిలో కీలకమని పేర్కొంది. 

రాష్ట్రంలోని వీధి వ్యాపారులకు ప్రయోజనం 
ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్‌ నిధికి రూ.468 కోట్లను కేటాయించారు. దీంతో రాష్ట్రంలోని వీధి వ్యాపారులకు ప్రయోజనం కలగనుంది. దేశంలోనే తెలంగాణ వీధి వ్యాపారులకు రుణాలు అందించడంలో రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడి వీధి వ్యాపారులు దేశంలోనే అత్యధిక ఆర్థిక ప్రోత్సాహకాలు అందుకున్నారు. నగరాలు, పట్టణాల్లో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై)కు రూ.22,967 కోట్లను కేటాయించారు. రెండో దశ అమృత్‌లో భాగంగా అమృత్‌ పథకానికి రూ.16,000 కోట్లు, దేశంలో వంద స్మార్ట్‌ సిటీల అభివృద్ధికి రూ.7,634 కోట్లను కేంద్ర బడ్జెట్‌లో కేటాయించారు. రాష్ట్రంలో స్మార్ట్‌ సిటీలుగా ఎంపికైన కరీంనగర్, వరంగల్‌కు దీని ద్వారా ప్రయోజనం కలగనుంది.
ఏకలవ్య పాఠశాలల్లో వెయ్యికి పైగా కొలువులు
ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో (ఈఎంఆర్‌ఎస్‌) బోధన, బోధనేతర పోస్టులను మూడేళ్లలో భర్తీచేయాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో తెలంగాణకు వెయ్యికిపైగా పోస్టులు రానున్నాయి. గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని పిల్లలకు 6 నుంచి 10 వరకు నిర్బంధ విద్యను అందించేందుకు గురుకుల తరహాలో కేంద్రం వీటిని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 23 ఏకలవ్య గురుకుల విద్యాలయాలు కొనసాగుతున్నాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏడు, మహబూబాబాద్‌లో అయిదు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఒక్కో ఈఎంఆర్‌ఎస్‌లో 6 నుంచి 10 వరకు చదివే విద్యార్థులు 480 మంది ఉంటారు. బోధన సిబ్బంది 29 మంది, బోధనేతర సిబ్బంది 23, నాలుగో తరగతి ఉద్యోగులు పది మంది అవసరం. ఈ లెక్కన రాష్ట్రంలోని ఈఎంఆర్‌ఎస్‌లో 1,426 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా వెయ్యికి పైగా పోస్టులు ఖాళీ ఉన్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆయా సొసైటీల్లో పూర్తి స్థాయిలో సిబ్బంది అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.  
తృణధాన్యాల కేంద్రం హైదరాబాద్‌!
దేశంలో తృణధాన్యాల పంటల (మిల్లెట్స్‌) సాగు, వాటి ఆహారోత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా మారనుంది. రాజేంద్రనగర్‌లోని ‘భారత తృణధాన్యాల పంటల పరిశోధన సంస్థ’ (ఐఐఎంఆర్‌)ను ఈ పంటల సాగు, ఆహారోత్పత్తుల వినియోగం పెంచే కార్యక్రమాలకు నోడల్‌ ఏజెన్సీగా కేంద్రం ఎంపిక చేసింది. ఈ ఏడాది (2023)ని ‘అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరం’గా ఐక్యరాజ్యసమితి ప్రకటించినందున మనదేశంలో ఈ పంటల సాగుకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు కేంద్ర బడ్జెట్‌లో తాజాగా ప్రకటించారు. ఇందులో భాగంగా ఈ పంటలపై ఏర్పాటవుతున్న ‘అంకుర సంస్థ’ (స్టార్టప్‌)లను, ‘రైతు ఉత్పత్తిదారుల సంఘాల’ (ఎఫ్‌పీఓ)లను అనుసంధానం చేసే బాధ్యతను ఐఐఎంఆర్‌కు కేంద్రం అప్పగించింది. ఇప్పటికే 400కు పైగా అంకుర సంస్థలు ఐఐఎంఆర్‌ అధునాతన పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ప్రజల్లోకి ఈ ఆహారోత్పత్తులను తీసుకెళ్లేందుకు పనిచేస్తున్న అంకురాలను, ఈ పంటలు పండించే ఎఫ్‌పీఓలతో అనుసంధానం చేయడం వల్ల రైతులకు మంచి ధరలు వచ్చి వారి ఆదాయం పెరుగుతుందని కేంద్రం తాజాగా సూచించింది. ‘ఒక జిల్లాలో ఒక తృణధాన్యాల ప్రధాన పంట’ అనే కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 19 జిల్లాలను 19 రకాల పంటల సాగు కోసం ఎంపిక చేయనున్నట్లు బడ్జెట్‌లో కేంద్రం తెలిపింది. ఈ పంటలు, వీటి ఆహారోత్పత్తులను పెద్దఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అనేకరకాల కార్యక్రమాలను చేపడతామని ఐఐఎంఆర్‌ సంచాలకురాలు డాక్టర్‌ సీవీ రత్నావతి ‘ఈనాడు’కు చెప్పారు. 
ఆదిమ గిరిజనుల అభివృద్ధికి ఊతం
కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆదిమ గిరిజనుల అభివృద్ధి మిషన్‌లో భాగంగా వారి అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను పెద్దఎత్తున కల్పించనుంది. ఆదిమ గిరిజనుల కోసం ఇప్పటికే నిధులు ఖర్చు చేస్తున్నా, ఆ మొత్తం సరిపోవడం లేదు. తాజాగా మూడేళ్ల మిషన్‌ కోసం రూ.15 వేల కోట్లు ఖర్చుచేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని 570 ఆవాసాల్లో ఆదిమ గిరిజనులు ఉన్నారు. వీరి అభ్యున్నతి కోసం కేంద్రం ఏటా రూ.8-9 కోట్ల వరకు నిధులు ఇస్తోంది. తాజాగా బడ్జెట్‌లో భారీగా నిధులను పేర్కొనడంతో ఎక్కువ సౌకర్యాలు కల్పించేందుకు వీలవుతుంది.

విశాఖ స్టీల్, సింగరేణికి తగ్గిన కేటాయింపులు
తెలుగు రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్‌లో పెద్దగా ప్రయోజనమేమీ దక్కలేదు. ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమైన పోలవరం, దక్షిణ కోస్తా రైల్వేలకు కేటాయింపుల ప్రస్తావన లేదు. విశాఖ స్టీల్, సింగరేణి బొగ్గు గనులకు గతేడాదికంటే కేటాయింపులు తగ్గాయి. ప్రస్తుతం ప్రైవేటు జాబితాలో చేరిన విశాఖ స్టీల్‌కు 2022 - 23లో రూ.910 కోట్లు కేటాయించి అంచనాల సవరణ నాటికి రూ.603 కోట్లకు తగ్గించారు. ఇప్పుడు 2023 - 24లో కేటాయింపులను రూ.683 కోట్లకు పరిమితం చేశారు. సింగరేణికి రూ.2 వేల కోట్లు కేటాయించి అంచనాల సవరణనాటికి రూ.1,600 కోట్లు మాత్రమే వెచ్చించిన బొగ్గు శాఖ తాజా బడ్జెట్‌లో కేటాయింపులను రూ.1,650 కోట్లకే పరిమితం చేసింది. విశాఖపట్నం పోర్టుకు ఇదివరకు రూ.207.99 కోట్లు కేటాయించిన నౌకాయాన శాఖ అంచనాల సవరణ నాటికి దాన్ని రూ.155.39 కోట్లకు తగ్గించింది. తాజా బడ్జెట్‌లో రూ.337.69 కోట్లు కేటాయించింది. పోలవరం ప్రాజెక్టు ప్రస్తావన ఎక్కడా కనిపించలేదు. 2016 తర్వాత ఈ ప్రాజెక్టుకు నిధులను నాబార్డు నుంచి తీసుకున్న రుణం ద్వారా అందిస్తామని కేంద్రం చెబుతూ వస్తోంది. ఇందుకోసం ఈ ఏడాది రూ.3,875 కోట్లను కేటాయించింది. ఇందులో పోలవరానికి ఎంతిస్తారన్నది ఎక్కడా చెప్పలేదు. 2022 - 23లో ఈ పద్దు కింద రూ.4,585 కోట్లు కేటాయించిన జల్‌శక్తి శాఖ అంచనాల సవరణ నాటికి దాన్ని రూ.3,875 కోట్లకు కుదించింది. రైల్వే మంత్రిత్వ శాఖ పద్దుల్లో విశాఖ కేంద్రంగా ఏర్పాటుచేసే దక్షిణ కోస్తా రైల్వే ప్రస్తావన లేదు. ఏపీ సెంట్రల్‌ యూనివర్సిటీ, ఏపీ, తెలంగాణల్లోని గిరిజన విశ్వవిద్యాలయాలు, వైజాగ్‌ పెట్రోలియం వర్సిటీ, హైదరాబాద్‌ ఐఐటీలకు మాత్రమే ప్రత్యేక కేటాయింపులు జరిపింది. మిగిలిన ఐఐఎం, ఐఐటీ, ఐఐఎస్‌ఈ, ఎన్‌ఐటీ, ఎయిమ్స్, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌లాంటి సంస్థలకు దేశంలోని అన్ని విద్యాలయాలతోపాటు కేటాయింపులు జరిపింది. దీనివల్ల తెలుగు రాష్ట్రాల్లోని ఆయా సంస్థలకు ప్రత్యేకంగా ఎంత మొత్తం లభించాయన్న వివరాలు కనిపించ లేదు. 
కేంద్ర పన్నుల వాటాల్లో స్వల్ప పెరుగుదల
2023 - 24 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల్లో వాటా కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.41,338.02 కోట్లు, తెలంగాణకు రూ.21,470.84 కోట్లు దక్కనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం మొత్తం అన్ని రాష్ట్రాలకూ కలిపి రూ.10,21,448.16 కోట్లు పంపిణీ చేస్తుండగా ఏపీకి 4.047%, తెలంగాణకు 2.102% వాటా రానుంది. ఈసారి రాష్ట్రాలకు వచ్చే పన్ను వాటా 7.70% పెరగనుండడంతో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఏపీకి రూ.3,161.28 కోట్లు, తెలంగాణకు రూ.1,802.69 కోట్ల చొప్పున అధికంగా నిధులు వస్తాయి. 15వ ఆర్థిక సంఘ సూత్రాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏటా నిధులను పంపిణీ చేస్తుంది. దీని ప్రకారం కేంద్ర పన్నుల్లో అత్యధిక మొత్తం ఉత్తర్‌ప్రదేశ్‌ (రూ.1,83,237 కోట్లు), బిహార్‌ (రూ.1,02,737.26 కోట్లు), మధ్యప్రదేశ్‌ (రూ.80,183.67 కోట్లు), పశ్చిమబెంగాల్‌ (రూ.76,843.55 కోట్లు), మహారాష్ట్ర (రూ.64,524.88 కోట్లు), రాజస్థాన్‌ (రూ.61,552.47 కోట్లు) రాష్ట్రాలకు వెళుతోంది. 28 రాష్ట్రాలకు కలిపి కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న మొత్తంలో 55.71 శాతం వాటా ఈ ఆరు రాష్ట్రాలకు దక్కుతోంది. దక్షిణాదిలోని అయిదు రాష్ట్రాలకు కలిపి రూ.1,61,388.81 కోట్లు వస్తుండగా, ఒక్క ఉత్తర్‌ప్రదేశ్‌కే వీటన్నిటికీ కలిపి ఇచ్చిన మొత్తంకంటే 13.53% అధికంగా దక్కుతోంది.


ద్రవ్యలోటు లక్ష్యం 5.9%ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022 - 23) ద్రవ్యలోటు లక్ష్యంలో ఎటువంటి మార్పు చేయకుండా జీడీపీలో 6.4 శాతం (రూ.16,61,196 కోట్లు)గా కొనసాగించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023 - 24) 5.9 శాతానికి తగ్గిస్తామని, 2025 - 26  కల్లా ద్రవ్యలోటును 4.5 శాతం దిగువకు తేవాలన్నది ప్రణాళికగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. వ్యయాలు, ఆదాయాల వ్యత్యాసమైన ద్రవ్యలోటును  2022 - 23 ఆర్థిక సంవత్సరానికి రూ.16,61,196 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. 2021 - 22కు ద్రవ్యలోటు 6.9 శాతమని తాజాగా ప్రకటించారు. ఇంతకుముందు 6.8 శాతంగా అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పన్నుల ఆదాయం రూ.23.3 లక్షల కోట్లుగా ఉండొచ్చని మంత్రి పేర్కొన్నారు. 
ఆన్‌లైన్‌ గేమ్‌లపై 30% టీడీఎస్‌
ఆన్‌లైన్‌ గేమ్‌లలో గెలుపొందిన నికర మొత్తంపై 30 శాతం పన్నును ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుత రూ.10,000 గరిష్ఠ పరిమితిని ఎత్తివేసింది. ఒక వేళ వినియోగదారు ఖాతా నుంచి నగదు ఉపసంహరణ జరగకపోతే ఆర్థిక సంవత్సరం చివర్లో మూలం వద్ద పన్నును మినహాయించుకుంటారు. నికరంగా గెలుపొందిన సగటు విలువపైనే పన్ను ఉంటుందని రెవెన్యూ కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రా స్పష్టం చేశారు. గరిష్ఠ పరిమితి కంటే తక్కువగా ఉన్న గెలుపొందిన మొత్తాన్ని కొన్ని కంపెనీలు అట్టేపెట్టి ఉంచుకుని, టీడీఎస్‌ నిబంధనల కిందకు రాకుండా చూసుకుంటున్నట్లు పన్ను విభాగం దృష్టికి రావడంతో గరిష్ఠ పరిమితిని ఎత్తివేసినట్లు మల్హోత్రా పేర్కొన్నారు.
పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ.51,000 కోట్లు 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని ప్రభుత్వం రూ.65,000 కోట్ల నుంచి రూ.50,000 కోట్లకు కుదించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.51,000 కోట్లను లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనా (మిస్‌లేనియస్‌ క్యాపిటల్‌ రిసీట్స్‌)ను రూ.65,000 కోట్ల నుంచి రూ.60,000 కోట్లుగా మార్చారు. అందులో రూ.50,000 కోట్లు పెట్టుబడుల ఉపంసహరణ ద్వారా రూ.10,000 కోట్లను ఆస్తుల నగదీకరణ ద్వారా సాధిస్తారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికీ మిస్‌లేనియస్‌ క్యాపిటల్‌ రిసీట్స్‌ను రూ.61,000 కోట్లుగా నిర్దేశించుకోగా ఇందులో రూ.51,000 కోట్లు పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా, రూ.10,000 కోట్లను ఆస్తుల నగదీకరణ ద్వారా సాధించాలన్న తలంపులో ఉంది. వచ్చే ఏడాది షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఎన్‌ఎమ్‌డీసీ స్టీల్, బీఈఎమ్‌ఎల్, హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్, కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, వైజాగ్‌ స్టీల్‌లు ప్రైవేటీకరణ జాబితాలో ఉన్నాయి. 
50 విమానాశ్రయాల పునరుద్ధరణ
దేశంలో ప్రాంతీయ విమాన అనుసంధానతను మెరుగుపరిచేందుకు 50 అదనపు విమానాశ్రయాలు, హెలిపోర్ట్‌లు, వాటర్‌ ఏరోడ్రోమ్‌లు, అధునాతన ల్యాండింగ్‌ గ్రౌండ్‌లకు పునరుజ్జీవం కల్పించనున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. 2014 వరకు దేశంలో 74 విమానాశ్రయాలు ఉంటే, ప్రస్తుతం ఆ సంఖ్య 147కు చేరింది. 
‘సీఎస్‌ఆర్‌’ వస్తు, సేవలపై ఐటీఆర్‌ క్లెయిమ్‌ చేసుకోవద్దు
కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కార్యకలాపాల కోసం ఉపయోగించే లేదంటే ఉపయోగించాలని అనుకునే వస్తువులు, సేవలపై ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ)ను క్లెయిమ్‌ చేసుకోకూడదని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు జీఎస్‌టీ చట్టంలో సవరణలను బడ్జెట్‌లో ప్రతిపాదించారు. జీఎస్‌టీ చట్టం కింద కొన్ని నేరాలను క్రిమినల్‌ నేరం కింద మినహాయింపు ఇచ్చేందుకు, విచారణ అర్హత పరిమితిని రూ.2 కోట్లకు (మోసం విలువ) పెంచేందుకు కూడా సవరణలను ప్రతిపాదించారు. నకిలీ రశీదులకు విచారణ పరిమితిని రూ.1 కోటిగానే కొనసాగించారు.
రుణ హమీ పథకం ద్వారా ఎంఎస్‌ఎమ్‌ఈలకు రూ.9000 కోట్లు
ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చే మార్పుచేసిన రుణ హామీ పథకం కింద ఎంఎస్‌ఎమ్‌ఈలకు రూ.9000 కోట్లు కేటాయించారు. రుణాల మంజూరు సమర్థంగా సాగేందుకు, ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేసేందుకు నేషనల్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌ఫర్మేషన్‌ రిజిస్ట్రీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ప్రస్తుత నిబంధనలపై విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించాలని ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలకు నిర్మలా సీతారామన్‌ సూచించారు. క్లెయిమ్‌ చేసుకోని షేర్లను, డివిడెండ్లను తిరిగి క్లెయిమ్‌ చేసుకునేందుకు అనుసంధానిత ఐటీ పోర్టల్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. 
డిజిలాకర్‌ ద్వారా సులభంగా కేవైసీ
ఖాతాదారుల నిధులకు భద్రత కల్పించడంతో పాటు బ్యాంకుల పాలన మరింత మెరుగు పరచేందుకు బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టానికి సవరణలు చేస్తామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అందరికీ ఆర్థిక సేవలు కల్పించడంలో సాంకేతికతను ఆర్థిక సంస్థలు వినియోగించుకుంటున్నాయని గుర్తుచేశారు. ప్రస్తుతం ఫిన్‌టెక్‌ సేవలు కూడా ఆధార్, పీఎం జన్‌ధన్‌ యోజన, వీడియో కేవైసీ, ఇండియా స్టాక్, యూపీఐ ద్వారా అందుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. డిజిలాకర్‌ ద్వారా మరిన్ని ధ్రువీకరణ పత్రాలు సత్వరం అందుబాటులో ఉండేలా, ఆ సదుపాయాన్ని విస్తరిస్తామని తెలిపారు. డిజిలాకర్‌ సేవల ద్వారా గుర్తింపు, చిరునామాలను అప్‌డేట్‌ చేసేందుకు ‘వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌’ను తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.  
కంపెనీల చట్టం కింద సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ కేంద్రం
కంపెనీల చట్టం కింద క్షేత్ర కార్యాలయాల్లో అందే దరఖాస్తులను నిర్వహించేందుకు ప్రభుత్వం సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రం వల్ల కార్పొరేట్ల అభ్యర్థనలపై  త్వరితగతిన స్పందించేందుకు వీలుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి వరకు క్లెయిమ్‌ చేసుకోని షేర్లు, డివిడెండ్‌లను సులభంగా పొందేందుకు సమీకృత పెట్టుబడిదారు విద్య, భద్రతా నిధి (ఐఈపీఎఫ్‌) ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో పేర్కొన్నారు. కంపెనీల చట్టం 2013ను అమలు చేసే కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ కిందకే ఐఈపీఎఫ్‌ అథారిటీ రానుంది. త్వరలోనే సమీకృత ఐటీ పోర్టల్‌ను తీసుకురానున్నారు. సులభతర వ్యాపారానికి వీలుగా 39,000కు పైగా నిబంధనలను సడలించామని, 3,400కు పైగా న్యాయ చట్టాలను నేరరహితం చేశామని సీతారామన్‌ తెలిపారు.
అంకుర సంస్థలకు మరో ఏడాది పన్ను ప్రోత్సాహకాలు
2024 మార్చి వరకు ఏర్పాటయ్యే అంకుర సంస్థలకూ ఆదాయపు పన్ను ప్రోత్సహకాలు వర్తిస్తాయని బడ్జెట్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు గడువును 2023 మార్చి 31 నుంచి 2024 మార్చి 31కి పొడిగిస్తున్నామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. నష్టాలను క్యారీ ఫార్వర్డ్‌ చేసుకునే ప్రయోజనాన్ని కూడా అంకుర సంస్థలకు 10 ఏళ్లకు పెంచింది. ఇంతకుముందు ఇది ఏడేళ్లుగా ఉండేది. వ్యవస్థాపిత రోజు నుంచి పదేళ్ల కాలంలో వరుసగా మూడేళ్ల పాటు పన్ను ప్రోత్సాహకాలు ఇవ్వాలని గతంలో ప్రతిపాదించారు. 2016 ఏప్రిల్‌ 1న లేదా ఆ తర్వాత వ్యవస్థాపితమైన అంకురాలు ఇందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
విదేశీ పర్యటనలకు టీసీఎస్‌ 20 శాతానికి పెంపు 
విదేశీ పర్యటనల ప్యాకేజీలపై మూలం వద్ద పన్ను వసూలును (టీసీఎస్‌) 20 శాతానికి పెంచుతున్నట్లు బడ్జెట్లో ప్రతిపాదించారు. ప్రస్తుతం ఇది 5 శాతంగా ఉంది. విదేశాలకు రూ.7 లక్షలకు మించి నిధులు పంపితే కూడా 20 శాతం టీసీఎస్‌ వర్తిస్తుంది. 2023 - 24 బడ్జెట్‌ ద్వారా ఆదాయపు పన్ను చట్టం 206సీ సెక్షన్‌లో ద్రవ్యబిల్లు సవరణలు చేసింది. ఈ సవరణలు 2023 జులై 1 నుంచి అమల్లోకి వస్తాయి. విదేశీ మారకపు నిల్వల పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ టీసీఎస్‌ను 20 శాతానికి పెంచడం ఆశ్చర్యకరమని పన్ను విశ్లేషకులు చెబుతున్నారు. 
మౌలిక వసతులకు రూ.10 లక్షల కోట్లు
దేశంలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం బడ్జెట్‌లో పెద్ద పీట వేసింది. ఈ సారి బడ్జెట్‌లో కేటాయింపులను ఏకంగా 33% పెంచి రూ.10 లక్షల కోట్లకు చేర్చింది. జీడీపీలో ఈ కేటాయింపులు 3.3 శాతానికి సమానం. 2019 - 20తో పోలిస్తే 3 రెట్లు అధికమని ఆర్థిక మంత్రి సీతారామన్‌ తెలిపారు. మరిన్ని ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడంలో ‘మౌలిక వసతుల ఆర్థిక సెక్రటేరియట్‌’ సహాయపడనుందని పేర్కొన్నారు. ‘కరోనా సమయంలో స్తబ్దుగా మారిన ప్రైవేటు పెట్టుబడులు పుంజుకుంటున్నాయి. ఆ పెట్టుబడులు, ఉద్యోగ సృష్టి చక్రానికి మరింత వేగం అందించడమే బడ్జెట్‌ లక్ష్యమ’ని వివరించారు.
‣ నౌకాశ్రయాలు, బొగ్గు, ఉక్కు, ఎరువులు, ఆహారధాన్యాల రంగాల్లో తొలి నుంచి చివరి దశ వరకు అనుసంధానం చేసే 100 కీలక రవాణా మౌలిక వసతుల ప్రాజెక్టులను గుర్తించినట్లు సీతారామన్‌ పేర్కొన్నారు. వీటికి ప్రైవేటు వనరుల నుంచి రూ.15,000 కోట్లు సహా మొత్తం రూ.75,000 కోట్ల పెట్టుబడులు కేటాయించామని అన్నారు.
‣ అమృత్‌ కాల్‌కు సరిపోయేలా వర్గీకరణ, ఆర్థిక వ్యవస్థను సిఫారసు చేసేందుకు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ ‘హార్మనైజ్డ్‌ మాస్టర్‌ లిస్ట్‌ ఆఫ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌’ను సమీక్షిస్తుంది. 
‣ జాతీయ రహదారుల రంగానికి రూ.2.7 లక్షల కోట్లను 2023-24 బడ్జెట్‌లో కేటాయించారు. 2022 - 23లో వీటికి రూ.1.99 లక్షల కోట్లను కేటాయించి.. తర్వాత రూ.2.17 లక్షల కోట్లకు సవరించారు. 
వెండి దిగుమతులపై భారం
బంగారం, వెండి, ప్లాటినం దిగుమతులకు సంబంధించి సుంకాల్లో స్వల్ప మార్పులను ఆర్థిక మంత్రి చేశారు. అన్ని లోహాలకు బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీ (బీసీడీ) ఒకేరకంగా 10 శాతం చేశారు. అయితే ఏఐడీసీ (వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సుంకం), ఎస్‌డబ్ల్యూఎస్‌ (సామాజిక సంక్షేమ సర్‌ఛార్జ్‌)లలో మార్పులు చేశారు. అయినా కూడా సుంకాల పరంగా పసిడి, ప్లాటినంకు మార్పులు లేకున్నా, వెండికి మాత్రం పెంచారు. అమెరికా, జర్మనీల తరవాత వెండిని లోహం రూపంలో అత్యధికంగా కొనుగోలు చేసేది మన దేశమే. 2022లో మనదేశం 8,000 టన్నుల వెండిని దిగుమతి చేసుకుందని అంచనా. విదేశాల్లో విలువైన లోహాలతో తయారు చేస్తున్న ఆభరణాలు, వస్తువుల దిగుమతిపై ఇప్పటివరకు 22% సుంకం విధిస్తుండగా, దీనిని 25 శాతానికి పెంచారు. దేశీయ తయారీని ప్రోత్సహించడమే లక్ష్యమని తెలిపారు.


ఔషధ పరిశోధనలకు తోడ్పాటు‘పరిశోధనలకు సహకరించాలన్న’ ఔషధ పరిశ్రమ దీర్ఘకాల డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ‘కొవిడ్‌’ సమయంలో మనదేశం అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి ఎన్నో దేశాలకు టీకాలు, మందులు సరఫరా చేసింది. ఫార్మా పరిశ్రమ భారీగా ఉండటం, కాస్తోకూస్తో పరిశోధనా కార్యకలాపాలు చేపట్టడం వల్లే ఇది సాధ్యమైంది. ఔషధ రంగంలో పరిశోధనలను ఇంకా విస్తరించేందుకు తాజా బడ్జెట్లో కొన్ని సానుకూలతలను కల్పించారు.  దేశవ్యాప్తంగా ఉన్న ‘సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ ల ద్వారా పరిశోధనా కార్యకలాపాలను పెంపొందిస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. ఎంపిక చేసిన ఐసీఎంఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌) కేంద్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు పరిశోధనా కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతిస్తామన్నారు. భారతదేశం ఫార్మా పరిశోధనలకు ఒక ప్రత్యేక విధానాన్ని ఆవిష్కరించాల్సిన అవసరం ఉందని ఇటీవల యూఎస్‌ఏ- ఇండియా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌  సూచించింది కూడా. ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రేడియంట్స్‌) పరిశోధన, తయారీపై దృష్టి సారించేందుకు వీలుగా కంపెనీలకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందించాలని కోరింది. 

వ్యవసాయానికి గత బడ్జెట్‌తో పోలిస్తే స్వల్పంగానే నిధుల పెంపు 
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు గత ఏడాదితో పోలిస్తే నిధుల కేటాయింపులను పెద్దగా పెంచలేదు. దాదాపు యథాతథంగా ఉంచింది. 2022 - 23లో వ్యవసాయ,  అనుబంధ రంగాలకు రూ.1.24 లక్షల కోట్లు కేటాయించగా ఈసారి రూ.1.25 లక్షల కోట్లు ఇచ్చింది. వ్యవసాయాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించడానికి అధిక ప్రాధాన్యమిస్తూ అంకుర సంస్థలు, పరిశోధనలు, డిజిటల్‌ వేదికలు, కంప్యూటరీకరణకు బాటలు వేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన ప్రసంగంలో ఇదే విషయాన్ని స్పష్టంచేస్తూ పలు కీలక ప్రకటనలు చేశారు. ముఖ్యాంశాలివీ..\
వ్యవసాయ రుణాలు రూ.20 లక్షల కోట్లు 
రైతులకు ఇచ్చే వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని గత ఏడాదితో పోలిస్తే 11% పెంచారు. పశుసంవర్థక, మత్స్య, పాడి, పరిశ్రమలకు ప్రాధాన్యమిస్తూ వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షల కోట్ల రుణాలను ఇస్తామన్నారు. ఇది నిరుడు రూ.18 లక్షల కోట్లు. చిన్న, మధ్య తరహా రైతులకు పూచీకత్తు/తనఖా లేకుండా రూ.1.6 లక్షల వంతున రుణం ఇస్తామన్నారు. 
సేంద్రియ సేద్యంలోకి కోటి మంది 
సేంద్రియ సేద్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కోటి మంది రైతులను ప్రోత్సహిస్తామన్నారు. వీరికి సూక్ష్మ ఎరువులు, పురుగు మందులను సరఫరా చేయడానికి 10 వేల బయో ఇన్‌పుట్‌ రిసోర్సు సెంటర్లను స్థాపిస్తామన్నారు. ప్రత్యామ్నాయ, రసాయన ఎరువుల సమతుల వినియోగాన్ని పెంచడానికి పీఎం-ప్రణామ్‌ (ప్రధానమంత్రి - వ్యవసాయ నిర్వహణకు ప్రత్యామ్నాయ పోషకాల ప్రోత్సాహం) పథకం కింద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. 
ఉద్యానంలో క్లీన్‌ ప్లాంట్‌
ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడానికి రూ.2,200 కోట్లతో ఆత్మనిర్భర్‌ హార్టికల్చర్‌ క్లీన్‌ ప్లాంట్‌ పథకాన్ని మంత్రి ప్రవేశపెట్టారు. దీని ద్వారా వ్యాధి నిరోధకత, నాణ్యత కలిగిన మొక్కలను, పరికరాలను రైతులకు అందిస్తామన్నారు.  
యువ ఆవిష్కర్తలకు ప్రోత్సాహం 
గ్రామీణ ప్రాంతాల్లోని యువ ఆవిష్కర్తలు ఏర్పాటు చేసే వ్యవసాయ అంకుర సంస్థలకు ‘అగ్రికల్చర్‌ యాక్సిలరేటర్‌ ఫండ్‌’ (ఏఏఎఫ్‌) ద్వారా ప్రోత్సాహాన్ని అందజేస్తారు. ఈ సంస్థల ద్వారా రైతులు ఎదుర్కొనే సవాళ్లకు నవీన, అందుబాటులో ఉండే పరిష్కారాలను చూపుతామన్నారు.

పొడుగు పింజల పత్తికి ప్రాధాన్యం 
నాణ్యమైన పత్తి దిగుబడిని పెంచడానికి పొడుగు పింజల రకాలకు ప్రాధాన్యం ఇస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో పని చేస్తామన్నారు. 
రూ.6 వేల కోట్లతో మీనం మిలమిల 
మత్స్య శాఖ అభివృద్ధికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద రూ.6 వేల కోట్లను కేటాయించారు. దేశీయంగా ఉత్పత్తి అయ్యే రొయ్యల దాణాపై కస్టమ్స్‌ సుంకం తగ్గించారు. 
‘సహకారం’లో కంప్యూటరీకరణ 
చిన్న, సన్నకారు రైతుల సంక్షేమం కోసం సహకార వ్యవస్థ ఆధారిత ఆర్థిక నమూనాను అవలంబిస్తున్నట్లు సీతారామన్‌ ప్రకటించారు. దీనికోసం రూ.2,516 కోట్లతో 63 వేల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్‌) కంప్యూటరీకరణ చేపడుతున్నట్లు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో గ్రామాల్లో పీఏసీఎస్, ప్రాథమిక మత్స్య సొసైటీలు, డెయిరీ సహకార సొసైటీలను ఏర్పాటు చేస్తామన్నారు. 
చిరుధాన్యాల్లో పెద్దన్న.. ‘శ్రీఅన్న’ 
చిరుధాన్యాల ప్రాముఖ్యతను ప్రపంచానికి పరిచయం చేయడంలో భారత్‌ ముందుందని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. చిరుధాన్యాలను మంత్రి తన ప్రసంగంలో ‘శ్రీఅన్న’ పేరుతో ఉచ్చరించారు. చిరుధాన్యాల ఉత్పత్తిలో ప్రపంచంలో ప్రథమ స్థానంలో, వాటి ఎగుమతిలో ద్వితీయ స్థానంలో భారత్‌ నిలిచిందని గుర్తుచేశారు. భారత్‌ను ప్రపంచ శ్రీఅన్న కేంద్రంగా మార్చడంలో భాగంగా హైదరాబాద్‌లో ఉన్న ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్‌ రీసెర్చ్‌’ను సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా మార్చనున్నట్లు ప్రకటించారు. 

రక్షణ శాఖకు ‘పన్ను’ ఊరట
వాస్తవాధీన రేఖ వెంబడి చైనా నుంచి ముప్పు పొంచి ఉన్న వేళ 2023 - 24 బడ్జెట్‌లో రక్షణ రంగానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం కల్పించింది. సైనిక పరికరాల సాంకేతికతలో స్వావలంబనే లక్ష్యంగా పెట్టుకున్న మోదీ సర్కారు హిమాలయాల్లో మిలిటరీ ఆధునికీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేటాయింపులు పెంచింది. గత ఐదేళ్లలో రక్షణ బడ్జెట్‌ను దాదాపు రెట్టింపు చేసిన కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో ఈ రంగానికి నిధులను 13 శాతం పెంచింది. ముఖ్యంగా, ఆయుధాల కొనుగోళ్లకు నిధులు పెరిగాయి. దీంతో జలాంతర్గాములు, డ్రోన్లు, యుద్ధ విమానాల సంఖ్యను మరింతగా పెంచుకునేందుకు బడ్జెట్‌ ఊతమిచ్చినట్లయింది. అటు సాయుధ దళాల్లో చేరే అగ్నివీరులకు పన్నుల నుంచి కాస్త ఉపశమనం కల్పించింది.  కేంద్ర ప్రభుత్వ మొత్తం బడ్జెట్‌లో రక్షణ శాఖ వాటా 13.18%గా ఉంది.

రక్షణ రంగానికి కేటాయింపులిలా..
2023 - 24 కేంద్ర బడ్జెట్‌లో రక్షణ రంగానికి రూ.5,93,537.64 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయించిన మొత్తం (రూ.5.25లక్షల కోట్ల)తో పోలిస్తే ఇది 13 శాతం అధికం.
రూ.1.62 లక్షల కోట్లను మూలధన వ్యయం కింద కొత్త ఆయుధాలు, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, ఇతర సైనిక ఆయుధ సామగ్రి కొనుగోళ్లకు కేటాయించారు. 2022 - 23 బడ్జెట్‌ కేటాయింపుల్లో ఈ పద్దు కింద రూ.1.52 లక్షల కోట్లు ప్రతిపాదించగా సవరించిన అంచనాల ప్రకారం అది రూ.1.50 లక్షల కోట్లుగా ఉంది. 
‣ రెవెన్యూ వ్యయాల కోసం రూ.2,70,120 కోట్లను కేటాయించారు. 2022 - 23లో ఈ పద్దు కింద రూ.2,33,000 కోట్లను కేటాయించారు.
అత్యవసర సమయాల్లో సరిహద్దులకు జవాన్లు, ఆయుధాలను వేగంగా తరలించేందుకు వీలుగా హిమాలయాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నారు. దీని కోసం సరిహద్దు రహదారి సంస్థ (బీఆర్‌ఓ)కు ఈ బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లను కేటాయించారు.  
మూలధన కేటాయింపుల కింద అత్యధికంగా వాయుసేనకు రూ.57,137.09 కోట్లు దక్కాయి. అందులో విమానాలు, ఏరో ఇంజిన్ల కొనుగోలుకు రూ.15,721 కోట్లను కేటాయించారు. మూలధన కేటాయింపుల కింద నౌకాదళానికి రూ.52,804 కోట్లు, సైన్యానికి రూ.37,241 కోట్లను ప్రత్యేకించారు. 
‣ పెన్షన్ల కోసం రూ.1,38,205 కోట్లను కేటాయించారు. ఈ పద్దును కలుపుకొని మొత్తం రెవెన్యూ వ్యయం రూ.4,22,162 కోట్లుగా ఉంది. 
‘అగ్నివీర్‌ కార్పస్‌ ఫండ్‌’ నుంచి అగ్నివీరులు పొందే చెల్లింపులకు పన్నుల నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.
‣ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు రూ.23,264 కోట్లు కేటాయించారు. 
‣ ‘ఒకే ర్యాంకు ఒకే పెన్షన్‌’ పథకం కింద రూ. 28,138 కోట్లు కేటాయింపు.
పీఎంఏవైకి రూ.79 వేల కోట్లు
పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై)కి తాజా బడ్జెట్‌లో నిధుల కేటాయింపును భారీగా పెంచారు. గత బడ్జెట్‌లో రూ.48 వేల కోట్లు కేటాయించగా, ఈ సారి రూ.79 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. వడ్డీ రేట్లు పెరుగుతున్న ఈ సమయంలో గృహ కొనుగోలుదారులకు ఇది ఊరట కల్పించే అంశం. అలాగే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి వేర్వేరుగా నిధులు సమకూర్చనున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల కోసం ఉద్దేశించిన పీఎంఏవై(గ్రామీణ)కి రూ.54,487 కోట్లు కేటాయించగా పట్టణ ప్రాంతాల కోసం పీఎంఏవై (అర్బన్‌)కి రూ.25,103 కోట్లు ప్రతిపాదించారు. 
జాతీయ రహదారులకు నిధుల జాతర
మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో జాతీయ రహదారుల కోసం 2023 - 24 బడ్జెట్‌లో రూ.2.70 లక్షల కోట్ల కేటాయింపులు ప్రకటించారు. 

రైల్వేకు రూ.2.42 లక్షల కోట్లు
కేంద్ర బడ్జెట్లో రైల్వేకు మూలధన కేటాయింపులు ఈసారి రికార్డు స్థాయిలో పెరిగాయి. మునుపెన్నడూ లేనిరీతిలో 2023 - 24 ఆర్థిక సంవత్సరంలో ఈ పద్దు కింద రూ.2.42 లక్షల కోట్లు ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. 2013 - 14తో పోలిస్తే ఇది 9 రెట్లు అధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ.లక్ష కోట్లు ఎక్కువ. 2022 - 23లో రూ.1.40 లక్షల కోట్లు కేటాయించారు. దీనిలో రూ.1.37 లక్షల కోట్లు మూలధన వ్యయం. మిగిలినది రెవెన్యూ వ్యయం. నూతన ఆర్థిక సంవత్సరంలో రవాణా రంగంలో 100 కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టనున్నారు. బొగ్గు, ఎరువులు, ఆహార ధాన్యాలు వంటివి ఎక్కడివరకు కావాలంటే అక్కడి వరకు చేరవేయడానికి ఇవి దోహదపడతాయి. రూ.15,000 కోట్ల ప్రైవేటు పెట్టుబడులు సహా రూ.75,000 కోట్లు దీనికి ఖర్చవుతుందని అంచనా. మెట్రో స్టేషన్లను రైల్వేస్టేషన్‌ ప్రాజెక్టులతో సమీకృతపరచడం సహా వినియోగదారుల సదుపాయాలపై రూ.500 కోట్లు వెచ్చించనున్నారు. రాజధాని, శతాబ్ది, దురంతో, హమ్‌సఫర్, తేజస్‌ వంటి ప్రీమియం రైళ్లలో వాడేందుకు వెయ్యి రైలు పెట్టెలను సమూలంగా మార్చి, అధునాతనంగా తీర్చిదిద్దనున్నారు. హైడ్రోజన్‌ ఇంధనంతో నడిచే 35 రైళ్లను, ఆటోమొబైల్‌ పరిశ్రమకు ఉపయోగపడేలా 4,500 నూతన పెట్టెల్ని, 5,000 ఎల్‌హెచ్‌బీ పెట్టెల్ని, 58 వేల వ్యాగన్లను తయారు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. పారదర్శక అద్దాలు ఉండే ఆకర్షణీయ విస్టాడోమ్‌ కోచ్‌లు మరో 100 తయారు చేయించనున్నారు. వందేభారత్‌ రైళ్ల సంఖ్యను, వాటి వేగాన్ని పెంచడానికి వీలుగా పట్టాల పునరుద్ధరణకు నిధుల కేటాయింపును గత బడ్జెట్‌ కంటే దాదాపు రూ.1900 కోట్లు పెంచారు.

మెట్రో ప్రాజెక్టులకు రూ.19,518 కోట్లు 
నగరాల్లో మంచి ఆదరణ పొందుతున్న దృష్ట్యా దేశవ్యాప్తంగా మెట్రో రైళ్ల ప్రాజెక్టులకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.19,518 కోట్లు కేటాయించారు. 22 - 23 ఆర్థిక సంవత్సరంలో రూ.19,130 కోట్లు దీనికి కేటాయించినా, సవరించిన అంచనాల్లో రూ.15,628 కోట్లకు తగ్గించారు. వచ్చే ఏడాదికి కేటాయింపుల్లో ఈక్విటీ పెట్టుబడుల రూపంలో రూ.4,471 కోట్లు, రుణాల ద్వారా రూ.1,324 కోట్లు సమీకరిస్తారు. దేశంలో తొలిసారిగా ‘ప్రాంతీయ శీఘ్ర రవాణా వ్యవస్థ’ (ఆర్‌ఆర్‌టీఎస్‌) చేపట్టడానికి ‘జాతీయ రాజధాని ప్రాంత రవాణా సంస్థ’ (ఎన్‌సీఆర్‌టీసీ)కు రూ.3,596 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. గత బడ్జెట్‌ కంటే ఇది 23% తక్కువ. దిల్లీ - గాజియాబాద్‌ - మేరఠ్‌ నడవాలో ఈ పనులు చేపడతారు.

విద్యా శాఖకు రూ.1,12,899 కోట్లు
కేంద్ర బడ్జెట్‌లో మునుపెన్నడూ లేనంతగా ఈసారి విద్యారంగానికి కేటాయింపులు చేశారు. రూ.1,12,899 కోట్లు కేటాయించారు. మొత్తం బడ్జెట్‌లో ఇది 2.5 శాతం. పాఠశాల విద్యా విభాగానికి రూ.68,805 కోట్లు, ఉన్నత విద్యా విభాగానికి రూ.44,094 కోట్లు దక్కాయి. తాజా బడ్జెట్‌లో కేంద్రం విద్య, నైపుణ్యాల అభివృద్ధికి పెద్దపీట వేసింది.
‣ దేశవ్యాప్తంగా ఏకలవ్య ఆదర్శ పాఠశాలల (మోడల్‌ స్కూళ్లు) కోసం 38,800 మంది టీచర్లు, సహాయక సిబ్బందిని నియమించనున్నారు. 3.5 లక్షల మంది గిరిజన విద్యార్థులకు బోధన అందించే 740 ఏకలవ్య పాఠశాలల్లో వచ్చే మూడేళ్లలో వీరిని నియమిస్తారు.
‣ పిల్లలు, కౌమారప్రాయుల కోసం జాతీయ డిజిటల్‌ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. భౌగోళికాంశాలు, కళలు, భాషలు-సాహిత్య ప్రక్రియలు తదితర అంశాలకు సంబంధించిన నాణ్యమైన పుస్తకాలను అందుబాటులోకి తెస్తారు.
‣ పంచాయతీ, వార్డు స్థాయుల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు రాష్ట్రాలకు ప్రోత్సాహం అందిస్తారు. ఇవి జాతీయ డిజిటల్‌ గ్రంథాలయ వనరులను వినియోగించుకునేందుకు వసతులను కూడా కల్పిస్తారు. పఠనాసక్తి, ఆర్థిక రంగంపై విజ్ఞానాన్ని పెంపొందించేందుకు నేషనల్, చిల్డ్రన్స్‌ బుక్‌ ట్రస్ట్‌లు, పలు సంస్థలు ప్రోత్సాహాన్ని అందిస్తాయి. 
‣ జాతీయ విద్యా మిషన్‌కు రూ.38,953 కోట్లు కేటాయించారు. నూతన విద్యావిధానం (ఎన్‌ఈపీ), 2020 అమలుకు ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఉత్తమ సంస్థలు, విశ్వవిద్యాలయాలకు రూ.4,235.74 కోట్లు కేటాయించారు.

 ‣ 2022 - 23 బడ్జెట్‌తో పోలిస్తే యూజీసీకి 9.37%, కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు 17.66%, డీమ్డ్‌ యూనివర్సిటీలకు 27%, ఐఐటీలకు 14%, ఎన్‌ఐటీలకు 10.5% కేటాయింపులు పెంచారు.
‣ వివిధ రకాల పరిశోధనలు చేపట్టేందుకు అత్యాధునిక అప్లికేషన్ల అభివృద్ధికి.. సుస్థిర నగరాలు, వ్యవసాయ, ఆరోగ్య రంగాలకు సంబంధించి సమస్యల పరిష్కారానికి దేశంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో 3 కృత్రిమ మేధ (ఏఐ) కేంద్రాలను (సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌) ఏర్పాటు చేస్తారు. ప్రముఖ పరిశ్రమలకు చెందిన వారు కూడా భాగస్వాములవుతారు.
‣ 5జీ సేవల అప్లికేషన్లను అభివృద్ధి చేసేందుకు గాను బ్యాంకులు, వివిధ సంస్థల సహకారంతో ఇంజినీరింగ్‌ విద్యాసంస్థల్లో 100 ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తారు. నూతన శ్రేణి అవకాశాలు, వాణిజ్య విధానాలు, కీలక ఉపాధి రంగాల గురించి తెలుసుకునేందుకు ఇవి తోడ్పాటు అందిస్తాయి. 
‣ వినూత్న బోధన, పాఠ్యాంశాలు; నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి, ఐసీటీ అమలు వంటి అంశాల ఆధారంగా ఆధునిక పద్ధతుల్లో టీచర్ల శిక్షణ కార్యక్రమాలను రూపొందిస్తారు. జిల్లా విద్యా శిక్షణ సంస్థల ద్వారా శిక్షణలో సమూల మార్పులు చేస్తారు. వీటిని సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌గా అభివృద్ధి చేస్తారు.
47 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ
తాజా బడ్జెట్‌లో ‘యూత్‌ పవర్‌’ పేరుతో వారికి ప్రాధాన్యం కల్పించారు. యువత సాధికారత, ఉద్యోగాల సృష్టికి లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు గాను ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన-4.0ను అమలు చేయనున్నారు. పరిశ్రమల అవసరాలకు తగినట్లు ఇచ్చే శిక్షణలో పరిశ్రమలను కూడా భాగస్వామ్యం చేయనున్నారు. కోడింగ్, కృత్రిమ మేధ, రోబోటిక్స్, మెకాట్రానిక్స్, ఐవోటీ, త్రీడీ ప్రింటింగ్, డ్రోన్, సాఫ్ట్‌స్కిల్స్‌ వంటి కొత్త తరం కోర్సులు నిర్వహిస్తారు. యువత అంతర్జాతీయ అవకాశాలను అందుకునేలా వివిధ రాష్ట్రాల్లో 30 స్కిల్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ ప్రమోషన్‌ పథకం కింద మూడేళ్లలో దేశవ్యాప్తంగా 47 లక్షల మంది యువతకు శిక్షణ ఇస్తారు. 
దుర్బల గిరిజన తెగల అభివృద్ధికి నూతన పథకం
దుర్బల గిరిజన తెగల ఆర్థిక, సామాజిక స్థితిగతులను మెరుగుపర్చేందుకు ఓ పథకాన్ని ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ‘ప్రధాన మంత్రి దుర్బల ఆదిమ గిరిజన తెగల అభివృద్ధి పథకం (పీఎం-పీవీటీజీ)’ కింద వచ్చే మూడేళ్లలో రూ.15 వేల కోట్ల నిధులు కేటాయించనున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. ఈ బడ్జెట్‌లో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు రూ.12,461.88 కోట్లు కేటాయించారు. 2022 - 23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 47.44 శాతం ఎక్కువ.

ఏపీలో విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టే ప్రాజెక్టులకు రూ.2,618 కోట్ల రుణాలు
ఆంధ్రప్రదేశ్‌లో వివిధ విదేశీ ఆర్థిక సంస్థలతో చేపట్టే ప్రాజెక్టులకు 2023 - 24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,618 కోట్ల రుణాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బడ్జెట్‌లో కేటాయింపులు జరిపింది. మొత్తం 8 ప్రాజెక్టులకు 2022 - 23 బడ్జెట్‌లో సవరించిన అంచనాల ప్రకారం రూ.2,950.49 కోట్లు కేటాయించగా 2023 - 24 బడ్జెట్‌లో ఆ మొత్తాన్ని రూ.2618.25 కోట్లకు తగ్గించింది.

వందేభారత్‌ మరో 3 చోట్ల తయారీ 
వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ఉత్పత్తిని దేశంలో నాలుగు కర్మాగారాలకు విస్తరించబోతున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. 
హైడ్రోజన్‌ రైలు తయారయ్యేది మన దేశంలోనే 
తొలి హైడ్రోజన్‌ రైలు ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి వస్తుందని, ఇది దేశీయంగానే తయారవుతుందని వైష్ణవ్‌ వెల్లడించారు. ‘హైడ్రోజన్‌ రైలు పూర్తిగా భారత్‌లో రూపుదిద్దుకుంటుంది. దీన్ని హెరిటేజ్‌ సర్క్యూట్‌లో నడుపుతాం. తర్వాత అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తాం. రైల్వేలో హరిత ఇంధన వినియోగాన్ని పెంచడానికి అల్ట్రా మెగా సోలార్‌ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తాం. 85% రైలు మార్గాల విద్యుదీకరణ పూర్తయింది’ అని చెప్పారు. 

జమ్మూ కశ్మీర్‌కు రూ.35,581 కోట్లు
కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్‌కు కేంద్ర బడ్జెట్‌ 2023 - 24లో రూ.35,581.44 కోట్లను కేటాయించారు. ఈ నిధుల్లో రూ.33,923 కోట్లు కేంద్ర సాయం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనా రూ.44,538.13 కోట్ల కంటే ఈ కేటాయింపు తక్కువ. ప్రస్తుత బడ్జెట్‌ నిధుల్ని 2014లో జమ్ము కశ్మీర్‌లో వరదల కారణంగా దెబ్బతిన్న మౌలిక సదుపాయాల శాశ్వత పునరుద్ధరణకు, శ్రీనగర్‌లోని దాల్‌-నాగీన్‌ సరస్సు పరిరక్షణకు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో పునరావాసానికి వెచ్చిస్తారు. దీంతోపాటు 800 మెగావాట్ల రాల్టే హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టు, 624 మెగావాట్ల కిరు హైడ్రోఎలక్ట్రిక్‌ ప్రాజెక్టు, 540 మెగావాట్ల క్వార్‌ హైడ్రోఎలక్ట్రిక్‌ ప్రాజెక్టు, జీలం-తవీ వరద నివారణ ప్రాజెక్టులకూ ఖర్చుచేస్తారు.
కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్‌ నికోబార్‌ దీవులకు రూ.5,987.14 కోట్లు, చండీగఢ్‌కు రూ.5,436.10 కోట్లు, లద్దాఖ్‌కు రూ.5,958 కోట్లు, పుదుచ్చేరికి రూ.3,117.77 కోట్లు, దాద్రా నగర్‌ హవేలీ, దమణ్‌ దీవ్‌కు రూ.2,475 కోట్లు, లక్షద్వీప్‌నకు రూ.1,394.75 కోట్లు, దిల్లీకి రూ.1,168.01 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు. 

స్వచ్ఛభారత్‌కు నిధుల హారం
కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమమైన స్వచ్ఛభారత్‌ మిషన్‌ (అర్బన్‌)కు కేంద్ర బడ్జెట్‌లో గతంతో పోలిస్తే దాదాపు 150 శాతం అధికంగా నిధులు కేటాయించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్‌లో ఈ కార్యక్రమానికి రూ.5 వేల కోట్లు ప్రతిపాదించారు. సవరించిన అంచనాల మేరకు 2022 - 23లో రూ.2 వేల కోట్లు ఇచ్చారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌ (అర్బన్‌)తో పాటు సెంట్రల్‌ విస్టా రీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టును అమలు చేస్తున్న హౌసింగ్, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు రూ.76,431.6 కోట్లు కేటాయించారు. మెట్రో ప్రాజెక్టుల కోసం రూ.19,518 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు.
‣ స్మార్ట్‌ పట్టణాల మిషన్‌ కోసం రూ.8,800 కోట్లు ప్రతిపాదించారు. గత ఏడాది కంటే ఇది రూ.800 కోట్లు అదనం.

ప్రభుత్వ విద్యుత్‌ సంస్థల పెట్టుబడులు రూ.60,805 కోట్లు 
2023 - 24 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యుత్‌ సంస్థల మొత్తం పెట్టుబడిని 15 శాతం పెంచి రూ.60,805 కోట్లు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనా రూ.52,878.08 కోట్లతో పోలిస్తే ఇది 15 శాతం అధికం. 2022 - 23 బడ్జెట్‌లో ఈ మొత్తాన్ని రూ.51,470 కోట్లుగా పేర్కొన్నారు.

‣ విద్యుత్‌ మంత్రిత్వ శాఖ మొత్తం వ్యయాలు రూ.20,761.32 కోట్లకు పెంచారు. 2022 - 23 బడ్జెట్‌లో రూ.16,074.74 కోట్లుగా ప్రతిపాదించగా, రూ.13,106.58 కోట్లకు కుదించారు.

చేనేతకు కేటాయింపులు రూ.200 కోట్లే
వ్యవసాయం తర్వాత దేశంలో అత్యధికమందికి ఉపాధి కల్పించే రంగంగా ఉన్న చేనేతకు కేంద్రబడ్జెట్‌ నిరాశను కలిగించింది. నిరుటి మాదిరే ఈసారీ కేవలం రూ.200 కోట్లను కేటాయించింది. చేనేతలో దాదాపు పదికి పైగా పథకాలు, కార్యక్రమాలున్నా కేవలం జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమాని (ఎన్‌హెచ్‌డీపీ)కి మాత్రమే ఈ నిధులను నిర్దేశించింది. చేనేత కార్మికుల సమగ్ర సంక్షేమ పథకం, నూలు సబ్సిడీ, చేనేత సమూహ అభివృద్ధి పథకం, చేనేత భారీ సమూహ పథకం, చేనేత సేవా కేంద్రం ఇతర పథకాలకు నిధుల ఊసే లేదు. దీంతో వాటిని ఎత్తివేసినట్లేనని చేనేత కార్మికవర్గాలు భావిస్తున్నాయి. 2022 - 23 ఆర్థిక సంవత్సరం కింద రూ.200 కోట్లనే కేంద్రం కేటాయించింది. తర్వాత సవరణ బడ్జెట్‌లో దానిని రూ.156 కోట్లకు తగ్గించింది. వీటిలో రూ.86 కోట్లను ఇప్పటివరకు గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ తదితర రాష్ట్రాలకు అందించింది. ఏపీ, తెలంగాణ తదితర రాష్ట్రాలకు కేటాయింపులు జరపలేదు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ, 5జీకి రూ.53,000 కోట్లు 
ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ, 5జీ నెట్‌వర్క్‌లను అప్‌గ్రేడ్‌ చేసేందుకు, దేశవ్యాప్తంగా ల్యాండ్‌లైన్‌ నెట్‌వర్క్‌ను పునరుద్ధరించడం కోసం రూ.53,000 కోట్లను వినియోగించనున్నామని కేంద్ర ఐటీ, టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌వెల్లడించారు. 2023-24 బడ్జెట్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌కు మూలధన సాయం కింద రూ.52,937 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ పునరుద్ధరణ ప్రణాళిక కోసం గత ఏడాది ప్రకటించిన రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజీలో భాగంగానే బడ్జెట్‌లో తాజా కేటాయింపులు జరిగాయని మంత్రి పేర్కొన్నారు.

కేంద్ర  బడ్జెట్‌ 2023 ముఖ్యాంశాలు

       బడ్జెట్‌ స్పీచ్‌ - 2023 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.