• facebook
  • whatsapp
  • telegram

Coaching:దివ్యాంగులకు సివిల్స్‌ కోచింగ్‌ ఉచితం!

ఓ గొంగళి పురుగు సీతాకోకచిలుకగా మారడం వెనక పెద్ద పోరాటమే ఉంటుందంటారు. ఆ చిన్న జీవికి అది మరో జన్మేనంటారు. మరి ప్రమాదవశాత్తో, పుట్టుకతోనో ఏర్పడ్డ వైౖకల్యాన్ని పట్టుదలతో జయించి ... ఉన్నతాధికారిగా మారడమూ అలాంటి పోరాటమే కదా! అందుకే ఆ ప్రాజెక్టుకి ‘చిత్రశలభం’ అని పేరుపెట్టాడతను మలయాళంలో, సీతాకోకచిలుక అనే అర్థంవచ్చేలా! ఆ ప్రాజెక్టు ద్వారా దివ్యాంగులకి ఉచితంగా సివిల్స్‌ కోచింగ్‌ అందిస్తూ ఎంతోమందిని ఉన్నతాధికారులుగా చేశాడు.ఎవరతనూ ఎందుకా ఉచిత కోచింగ్‌...? చూద్దామా...

సామాన్యుల్ని అసామాన్యులుగా మార్చే ప్రతి గెలుపూ గొప్పదే కానీ... అది ఆ విజేతనే కాకుండా మరెంతోమందిని విజయసాధకులుగా మార్చేదైతే మరింత విశిష్టమైనదవుతుంది! కేరళకి చెందిన జోబిన్‌ది అలాంటి గెలుపే. ఆయన తండ్రి సెబాస్టియన్‌ కొట్టారం కేరళలో పేరున్న సామాజిక కార్యకర్త... చక్కటి వక్త. ఇంటర్‌ చదివేటప్పుడే తండ్రిలా తానూ అనర్గళంగా మాట్లాడటం ప్రాక్టీస్‌ చేశాడు జోబిన్‌. డిగ్రీ ముగించేనాటికే మోటివేషనల్‌ స్పీకర్‌గా మారాడు. సైకాలజీ, మలయాళ సాహిత్యం, జర్నలిజంలో మూడు పీజీలు చేశాడు. ఎంఫిల్‌, ఎంబీఏ కూడా ముగించాడు. 2005లో జోబిన్‌ రాసిన ఓ వ్యక్తిత్వ వికాస పుస్తకానికి చక్కటి ఆదరణ లభించింది. అదే ఏడాది ఓ కార్పొరేట్‌ బ్యాంకులో హెచ్‌ఆర్‌ మేనేజర్‌గా చేరాడు. ఐదేళ్ళ ఉద్యోగ జీవితం తర్వాత జోబిన్‌ మనసు సివిల్స్‌వైపు మళ్ళింది. ఇన్నిన్ని డిగ్రీలూ, వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా అనుభవమూ ఉన్న తాను పరీక్షల్ని దున్నేస్తానని కలలుకన్నాడు. చిన్నప్పటి నుంచి విద్యలో ఓటమి చూడని జోబిన్‌... తొలిసారి సివిల్స్‌ ఇంటర్వ్యూలో బోల్తాపడ్డాడు!  


ఇది కూడా దేశ సేవే...

‘సివిల్స్‌లో ఓడిపోవడం మొదట నాకు తీవ్ర పరాభవంగా అనిపించింది. కానీ తరచి చూస్తే- నాలోపాలు స్పష్టంగా కనిపించాయి. వాటిని అధిగమించడానికి సాధన ప్రారంభించాను. ఆ క్రమంలో నేను నేర్చుకున్న మెలకువల్ని నా స్నేహితులతో పంచుకోవడం మొదలుపెడితే వాళ్లలో గణనీయమైన మార్పు కనిపించింది. నేను మళ్ళీ సివిల్స్‌ రాయడంకన్నా, అలా రాసేవాళ్ళకి కావాల్సిన మెలకువల్ని నేర్పించడం కూడా ఓ సేవేనని అనిపించింది’ అని గుర్తుచేసుకుంటాడు జోబిన్‌. అలా ‘అబ్సల్యూట్‌ ఐఏఎస్‌ అకాడమీ’ని స్థాపించాడు. ప్రారంభించిన కొద్దినెలలకే ఓ విషయం తెలిసొచ్చింది...  కేరళలోని గ్రామీణ, గిరిజన ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల్లో అద్భుతమైన తెలివితేటలున్నా వాళ్లకి ఇంగ్లిష్‌ భాష కొరుకుడుపడటం లేదని. దాంతో వాళ్లని మలయాళంలోనే రాయమని ప్రోత్సహించాడు. కానీ ఆ భాషలో సివిల్స్‌ స్థాయి స్టడీ మెటీరియల్‌ లేకపోవడంతో తానే ఆ పుస్తకాలు రాయడం మొదలుపెట్టాడు. చరిత్ర, భూగోళం, భారతదేశ రాజకీయం, ఆర్థికశాస్త్రం పాఠాలని సమగ్రంగా మలయాళంలో రాయడం అంత సులభం కాదు. అయినాసరే, పదేళ్లు శ్రమించి మలయాళంలో తొలిసారి 16 సివిల్స్‌ పుస్తకాల్ని తీసుకొచ్చాడు. అక్కడి రాష్ట్రప్రభుత్వం అరవైఏళ్లు ప్రణాళికలు వేసుకున్నా... కాని పని అది! దాంతో- ఆ రాష్ట్రంలో జోబిన్‌ ప్రభ వెలిగిపోయింది. పదేళ్ళలో వందమంది సివిల్స్‌ విజేతల్ని సృష్టించాడు! ఐఏఎస్‌ అధికారులూ అతని అకాడమీకి వచ్చి బోధించసాగారు. ప్రతి అభ్యర్థి నుంచి రూ.1.10 లక్షల ఫీజు తీసుకోసాగారు. తమ కోచింగ్‌ మెటీరియల్‌ అందరికీ అందాలని- యూట్యూబ్‌ ఛానల్‌ పెట్టి ఉచిత పాఠాలు అందించసాగాడు జోబిన్‌. వాటిని చూసిన ఓ దివ్యాంగుడు ఫోన్‌ చేసి ‘సార్‌...నేనూ సివిల్స్‌ రాయొచ్చా?’ అని అడిగాడట. ఆ ఆసక్తికి మెచ్చి జోబిన్‌ ఉచితంగానే కోచింగ్‌ ఇస్తే... ఆ దివ్యాంగుడు సివిల్స్‌ నెగ్గాడు. ఆ గెలుపు ఇచ్చిన ఉత్సాహంతోనే ‘చిత్రశలభం’ ప్రాజెక్టును ప్రారంభించాడు జోబిన్‌. దివ్యాంగులకి ఉచితంగా సివిల్స్‌ కోచింగ్‌ అందించాలన్న లక్ష్యంతో ఏర్పడ్డ ఈ ప్రాజెక్టులో... తొలి బ్యాచ్‌లో పాతికమంది చేరారు. వారిలో సహానా షెరీన్‌ ఒకరు!


వందమందికి..!

షెరీన్‌ది నిరుపేద కుటుంబమైనా చిన్నప్పటి నుంచీ చాలా బాగా చదివేది. పీజీ చేస్తుండగా- పెళ్ళిచేశారు. మెట్టినింట్లో తొలి రోజు నుంచే హింస మొదలైంది. షెరీన్‌ ఎలాగోలా ఆ నరకం నుంచి బయటపడ గలిగిందికానీ- ఓరోజు బట్టలు ఆరేస్తూ డాబా మీది నుంచి కిందపడిపోయింది. వెన్నెముక విరిగి... నడుముకింది భాగం పనిచేయకపోవడంతో చక్రాలకుర్చీలోనే తిరగసాగింది. అప్పుడే- జోబిన్‌ వీడియోలు చూసి తానూ సివిల్స్‌ రాయాలనుకుంది. ఆమెకి కోచ్‌గానే కాదు... మోటివేటర్‌గానూ మారాడు జోబిన్‌. తొలి ప్రయత్నంలో షెరీన్‌ విఫలమైనా- ధైర్యం నూరిపోసి రెండో ప్రయత్నంలో విజయం సాధించేలా చూశాడు. రైల్వేలో ఉన్నతాధికారిగా మారిన ఆమె కథతోపాటూ జోబిన్‌ ఉచిత కోచింగ్‌ కూడా జాతీయస్థాయి మీడియా దృష్టిలోకి వచ్చింది. దాంతో ఎంతోమంది ఆశ్రయించారు.  ప్రస్తుతం వందమందికి కోచింగ్‌ ఇస్తున్నాడు జోబిన్‌. ఇప్పటికే- వాళ్లలో ముగ్గురు సివిల్స్‌ ఇంటర్వ్యూదాకా వెళ్ళి... ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు! ఇద్దరు ప్రిలిమ్స్‌ క్లియర్‌ చేస్తే...మరో ఇద్దరు బ్యాంకింగ్‌ ఐబీపీఎస్‌ పరీక్షలు నెగ్గి అధికారులయ్యారు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 10-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.