ఆదేశాలు జారీ చేసిన ఎండీ
ఈనాడు, అమరావతి: ఏపీఎస్‌ఆర్టీసీలో 2016 నుంచి 2019 మధ్య సర్వీసులో చనిపోయిన ఉద్యోగుల జీవితభాగస్వామి, వారసులను 1,168 పోస్టుల్లో కారుణ్య నియామకాల కింద నియమించేలా యాజమాన్యం ఆదేశాలు జారీచేసింది. తొలుత కారుణ్య నియామకాలకు చెందిన దరఖాస్తులను ఆయా జిల్లాల్లోని కలెక్టర్లకు పంపి, గ్రామ, వార్డు సచివాలయాల్లోని పోస్టుల్లో నియామకాలు చేపట్టారు. ఇంకా మిగిలిన దరఖాస్తులను కలెక్టర్ల నుంచి జిల్లా ప్రజా రవాణాశాఖ అధికారులు వెనక్కి తీసుకొని.. వారిని ఆర్టీసీలో ఖాళీ పోస్టుల్లో నియమించేలా ఆదేశాలిచ్చారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా వివిధ రీజియన్లలో 34 జూనియర్ అసిస్టెంట్లు, 146 ఆర్టీసీ కానిస్టేబుళ్లు, 175 కండక్టర్లు, 368 డ్రైవర్లు, 445 శామ్రిక్/ అసిస్టెంట్ మెకానిక్‌లు.. కలిపి మొత్తం 1,168 పోస్టుల భర్తీకి ఆర్టీసీ ఎండీ మార్చి 31న ఉత్తర్వులు జారీచేశారు.
‣ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీ,. ఆర్టీసీ కానిస్టేబుల్, కండక్టర్ పోస్టులకు పదో తరగతి, డ్రైవర్‌కు ఎనిమిదో తరగతి ఉత్తీర్ణతతోపాటు భారీ వాహన డ్రైవింగ్ లైసెన్స్, శ్రామిక్ పోస్టుకి ఐటీఐ అర్హతగా పేర్కొన్నారు.
‣ కండక్టర్, ఆర్టీసీ కానిస్టేబుల్, డ్రైవర్ పోస్టులకు శారీరక ధారుడ్య అర్హతలు కూడా పరిశీలించనున్నారు.
‣ ఓపెన్ స్కూల్ ద్వారా పదోతరగతి ఉత్తీర్ణులైన వారు ఉంటే, వాళ్లు చదవడం, రాయడాన్ని సెలక్షన్ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. సందేహాలు ఉంటే నివృత్తి కోసం ఆ వివరాలు ఆర్టీసీ ప్రధాన కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది.
‣ ఆయా పోస్టులకు వయోపరిమితి 34 ఏళ్లు కాగా, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ల సడలింపు ఇచ్చారు. ఒకవేళ అభ్యర్థి మరణించిన ఉద్యోగి భాగస్వామి అయితే 45 ఏళ్ల వరకు వయోపరిమితి కల్పించారు.
‣ వికలాంగులు జూనియర్ పోస్టులకు మాత్రమే అర్హులని, మహిళా అభ్యర్థులు శ్రామిక్ పోస్టులకు అర్హులు కాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
‣ ఆర్టీసీలో కారుణ్యనియామకాల భర్తీకి ఆదేశాలివ్వడంపై నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్, ఎంప్లాయీస్ యూనియన్ హర్షం వ్యక్తం చేశాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.