ఓ అధికారి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లతో ప్రశ్నపత్రాల చోరీ
వాటిని నిందితులు ఎలా పొందారు?
ఈ అంశంపైనే సిట్ ప్రధాన దృష్టి
ఈనాడు, హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ల చుట్టూ సిట్ దర్యాప్తు తిరుగుతోంది. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను రాజశేఖర్‌రెడ్డి చోరీ చేశాడా, రోజువారీ కార్యకలాపాల కోసం అతనికి ఎవరైనా కావాలనే ఇచ్చారా అన్న అంశంపై అధికారులు దృష్టి పెట్టారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం కమిషన్‌కు చెందిన ఓ అధికారి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఉపయోగించి.. రాజశేఖర్‌రెడ్డి ప్రశ్నపత్రాలను చోరీ చేసినట్లు తెలుస్తోంది. కాన్ఫిడెన్షియల్ విభాగంపై అజమాయిషీ ఉండే అధికారికి చెందిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ తెలిస్తేనే ప్రశ్నపత్రాలను కొల్లగొట్టొచ్చని రాజశేఖర్‌రెడ్డి, ప్రవీణ్‌లు భావించారు. ఆ విభాగానికి చెందినవారి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ సేకరించారు. కాన్ఫిడెన్షియల్ విభాగం ఇన్‌ఛార్జి శంకరలక్ష్మి తన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను డైరీలో రాసుకున్నారని, ఆమెకు తెలియకుండా వాటిని సేకరించి.. ప్రశ్నపత్రాలను పొందినట్లు నిందితులు తొలుత చెప్పారు. వారు చెప్పింది అవాస్తవమని సిట్ దర్యాప్తులో తేలింది. రాజశేఖర్‌కు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లు ఎలా వచ్చాయన్నది మిస్టరీగా మారింది. దీని గురించి సిట్ అధికారులు ఎంతగా ప్రశ్నించినా సరైన సమాధానం చెప్పడం లేదని తెలుస్తోంది. వీరు వాడిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ కమిషన్‌కు చెందిన ఓ అధికారిదని అనుమానిస్తున్నారు. ఆ అధికారి నుంచి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను తస్కరించారా లేదా ఆ అధికారే ఇచ్చారా? అన్నది తేలాల్సి ఉంది. చాలామంది ఉన్నతాధికారులు కంప్యూటర్ ద్వారా చేయాల్సిన వ్యవహారాలను తమ వద్ద సహాయకులుగా పనిచేస్తున్న వారికి అప్పగిస్తుంటారు. కంప్యూటర్లపై ఎక్కువ పరిజ్ఞానం లేకపోవడం అందుకు కారణం. తమ వద్ద పనిచేస్తున్నారన్న నమ్మకంతో ఇలా ఇస్తుంటారు. రాజశేఖర్, ప్రవీణ్‌లకూ ఇలాగే ఎవరైనా ఇచ్చి ఉంటారా? అన్న అంశాన్ని తెలుసుకునేందుకు సిట్ ప్రయత్నిస్తోంది. ఒకవేళ ఎవరైనా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఇచ్చిఉంటే వారినీ విచారించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
కొన్ని నెలలుగా పలువురితో సంప్రదింపులు
కేవలం తన స్నేహితురాలు రేణుక కోరిక మేరకు ఆమె తమ్ముడి కోసమే ప్రశ్నపత్రం లీక్ చేశానని ప్రవీణ్ తొలుత చెప్పినప్పటికీ అది అబద్ధమని తేలింది. గత అక్టోబరు నుంచి కంప్యూటర్లు రాజశేఖర్‌రెడ్డి, ప్రవీణ్‌ల చేతుల్లోకి వెళ్లినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. కమిషన్ అక్టోబరు తర్వాతే అన్ని పరీక్షలను నిర్వహించింది. వీటన్నింటి ప్రశ్నపత్రాలను కొట్టేసే అవకాశం ఉన్నట్లే. సిట్ దర్యాప్తులోనూ దీనికి బలం చేకూర్చే ఆధారాలు లభిస్తున్నాయని సమాచారం. గత కొద్ది నెలలుగా ప్రవీణ్ పలువుర్ని సంప్రదించినట్లు తెలుస్తోంది. పెళ్లిళ్ల వంటి శుభకార్యాల్లో పరిచయమైనవారిని వారి బంధువులు ఎవరైనా పోటీ పరీక్షలు రాస్తున్నారేమోనని ఆరా తీసేవాడని సమాచారం. ఆ తర్వాత నేరుగా అభ్యర్థులతో, లేకపోతే వారితో సన్నిహితంగా ఉండేవారితో సంప్రదింపులు చేసేవాడని... డబ్బులిస్తే ప్రశ్నపత్రాలు అందిస్తానని బేరం పెట్టేవాడని తెలుస్తోంది. అయితే ప్రవీణ్ మాటలను చాలామంది నమ్మలేదని, ప్రశ్నపత్రం లీకయ్యే అవకాశం లేదని వాదించారని తెలుస్తోంది. ఒకసారి నిరాకరించిన వారితో ప్రవీణ్ మళ్లీ మాట్లాడేవాడు కాదని ఓ అధికారి తెలిపారు. ప్రవీణ్ ఫోన్లో సంప్రదింపులు జరిపిన వారందరి వివరాలను సిట్ అధికారులు సేకరిస్తున్నారు. వీటిలో పోటీ పరీక్షలు రాసినవారు గాని, వారి బంధువులు గాని ఉంటే విచారణకు పిలవాలని భావిస్తున్నారు. రాజశేఖర్ కూడా ఇదే తరహాలో కొద్ది మంది ఎంపిక చేసుకున్నవారికి ప్రశ్నపత్రం అమ్ముకున్నట్లు తెలుస్తోంది.
నాలుగుసార్లు విఫలం.. అయిదోసారి ప్రశ్నపత్రాల చోరీ
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల కేసులో సిట్ బృందం కస్టడీలోని నిందితుల నుంచి కీలక సమాచారం రాబట్టింది. కమిషన్ కార్యాలయంలో నెట్‌వర్క్ అడ్మిన్‌గా పనిచేస్తున్న రాజశేఖర్‌రెడ్డి గ్రూప్-1 ప్రిలిమినరీ ప్రశ్నపత్రాలు కొట్టేసేందుకు పరీక్షకు మూడు నెలల ముందు నాలుగుసార్లు విఫలయత్నం చేశాడు. అనంతరం గతేడాది అక్టోబరు మొదటి వారంలో పెన్ డ్రైవ్‌ల్లోకి కాపీ చేసుకున్నట్లు సిట్ పోలీసులు ఆధారాలు సేకరించినట్లు విశ్వసనీయ సమాచారం. రెండోరోజు నిందితులను వేర్వేరుగా ప్రశ్నించిన సిట్ బృందం.. మూడో రోజు తొమ్మిది మందినీ ఒకేచోట కూర్చోబెట్టి వాంగ్మూలాలు నమోదు చేసుకున్నట్టు సమాచారం. కాగా, కేసులో కీలక నిందితులు ప్రవీణ్‌కుమార్(బడంగ్‌పేట), రాజశేఖర్‌రెడ్డి(మణికొండ)ల నివాసాల్లో సిట్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.
ఆ సొమ్ము ఏమైంది?
రాజశేఖర్, ప్రవీణ్‌ల బ్యాంకు లావాదేవీలు పరిశీలించిన అధికారులకు పెద్దగా ఆధారాలు లభించలేదు. ప్రవీణ్‌కు రూ.10 లక్షలు ఇచ్చినట్లు మరో నిందితురాలు రేణుక చెప్పింది. అంతకుమించిన ఆర్థిక వివరాలేవీ లేవు. అయితే రాజశేఖర్, ప్రవీణ్‌లు చాలామందికి ప్రశ్నపత్రాలు అమ్ముకున్నట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలనూ సేకరించారు. వాటి తాలూకూ సొమ్ము ఏమైందన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రవీణ్ సంప్రదించినట్లు చెబుతున్న కొందర్ని విచారించినప్పుడు తనకు నగదు రూపంలోనే కావాలని చెప్పినట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగి కావడం వల్ల బ్యాంకులో ఎక్కువ డబ్బు పడితే జవాబు చెప్పుకోవాల్సి వస్తుందన్న ఉద్దేశంతోనే నగదు డిమాండు చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.