* రాజకీయాలతో ఆయనకు సంబంధమేంటి?
* ఉపకులపతి తీరును తప్పుపట్టిన హైకోర్టు
* బీఈడీ కౌన్సెలింగ్‌ను పొడిగించాలని ఆదేశం
ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో1కి మద్దతుగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి(వీసీ) రాజశేఖర్ మీడియా సమావేశం నిర్వహించడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తంచేసింది. రాజకీయ విషయాలతో వీసీకి సంబంధం ఏమిటని ప్రశ్నించింది. భావప్రకటన స్వేచ్ఛ హక్కును దుర్వినియోగం చేస్తున్నారని, సమాజాన్ని ఎటు తీసుకెళుతున్నారని వ్యాఖ్యానించింది. ఉన్నతస్థానాల్లో ఉన్నవాళ్లు తమ పాత్రేమిటో గుర్తెరిగి ప్రవర్తించాలంది. ఇలాంటి తీరును గతంలో ఎప్పుడైనా చూశామా? అని ఘాటుగా వ్యాఖ్యానించింది. విద్యా సంబంధ విషయాలపై దృష్టి పెట్టాలని హితవు పలికింది. మరోవైపు బీఈడీ మొదటి విడత కౌన్సెలింగ్‌ను జనవరి 31 వరకు పొడిగించాలని, కోర్టును ఆశ్రయించిన బీఈడీ కళాశాలలను కౌన్సెలింగ్ జాబితాలో చేర్చాలని ఉన్నత విద్యామండలిని జనవరి 27న ఆదేశించింది. కౌన్సెలింగ్ జాబితాలో తమను చేర్చకపోవడాన్ని సవాలు చేస్తూ పలు బీఈడీ కళాశాలలు జనవరి 27న హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యాలు దాఖలు చేశాయి. అదేసమయంలో జనవరి 25 నుంచి కొనసాగుతున్న బీఈడీ కౌన్సెలింగ్ గడువును పొడిగించాలని కోరుతూ విద్యార్థులు సైతం వ్యాజ్యాలు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్, న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్ తదితరులు వాదనలు వినిపించారు. జీరో అడ్మిషన్ పేరుతో తమ కళాశాలలను కౌన్సెలింగ్ జాబితా నుంచి తొలగిస్తున్నట్లు జనవరి 24న తెలియజేసి, మరుసటి రోజు (25వ తేదీ) నుంచే కౌన్సెలింగ్‌ను ప్రారంభించారన్నారు. ప్రభుత్వమిచ్చిన ధ్రువపత్రాలకు భిన్నంగా వ్యవహరించారన్నారు. ఉన్నత విద్యాశాఖ సహాయ ప్రభుత్వ న్యాయవాది(ఏజీపీ) వాదనలు వినిపిస్తూ... ఆయా కళాశాలల్లో లోపాలు ఉండటంతోనే కౌన్సెలింగ్‌కు అనుమతి ఇవ్వలేదన్నారు. వాటికి అనుమతిస్తే విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. దీంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన న్యాయమూర్తి... ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరు ఏమిటని ప్రశ్నించారు. నాగార్జున యూనివర్సిటీ వీసీ జీవో1పై విలేకరుల సమావేశం నిర్వహించడాన్ని పరోక్షంగా గుర్తుచేశారు. విద్యా విషయాలను పక్కనపెట్టి ఇలా చేయడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో ఎప్పుడైనా చూశామా? అని వ్యాఖ్యానించారు. సీనియర్ న్యాయవాది సత్యప్రసాద్ స్పందిస్తూ... వీసీ వ్యవహార శైలి దురదృష్టకరమన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.