• facebook
  • whatsapp
  • telegram

BED :బీఈడీ ప్రవేశాల్లో గందరగోళం

* వర్సిటీలకు ఉన్నత విద్యామండలికి మధ్య సమన్వయ లోపం

* వందశాతం సబ్జెక్టు మార్పు కోరుతున్న యాజమాన్యాలు

* ఎన్నికల సమయంలో తెరవెనుక భారీగా వసూళ్లు

B.Ed: బీఈడీ ప్రవేశాల్లో విశ్వవిద్యాలయాలకు ఉన్నత విద్యామండలికి మధ్య సమన్వయం లేకపోవడంతో వ్యవస్థ గందరగోళంగా తయారైంది. స్పాట్‌, యాజమాన్యకోటా సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి గడువు పొడిగిస్తుండగా.. వర్సిటీలు దీన్ని పట్టించుకోకుండా సెమిస్టర్‌ పరీక్షలకు షెడ్యూల్‌ ఇచ్చేస్తున్నాయి. బీఈడీ ప్రవేశాలు వ్యాపారంగా మారడంతో ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఉన్నత విద్యామండలి స్పాట్‌, యాజమాన్య కోటా సీట్ల భర్తీ గడువును ఈ నెల 22 వరకు పొడిగించింది. ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం మాత్రం మొదటి సెమిస్టర్‌కు సంబంధించిన ఇంటర్నల్‌ పరీక్షలను ఏప్రిల్‌ 16లోపు పూర్తి చేయాలంటూ షెడ్యూల్‌ ఇచ్చింది. మొదటి సెమిస్టర్‌ పరీక్షలను జులై 8 నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించింది. వాస్తవంగా ఉన్నత విద్యామండలి మొదట ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 12లోపు స్పాట్‌, యాజమాన్య కోటా సీట్ల భర్తీ పూర్తికావాలి. తర్వాత ఈ గడువును ఉన్నతవిద్యామండలి పొడిగించినా వర్సిటీ మాత్రం పట్టించుకోకుండా పాత షెడ్యూల్‌నే కొనసాగిస్తోంది. సెమిస్టర్‌కు 90 రోజులు తరగతులు నిర్వహించాల్సి ఉండగా.. ఏప్రిల్‌ 22న ప్రవేశాలు పూర్తయితే జులై 8కి 76 రోజుల సమయం మాత్రమే ఉంది. వీటిల్లో సెలవులు పోతే 60 రోజులు కూడా పనిదినాలు రావు. ఈ లెక్కన విద్యార్థులకు తరగతులు లేకుండానే పరీక్షలు నిర్వహించే పరిస్థితి కనిపిస్తోంది.

సబ్జెక్టు మార్పు కోసమేనా?

బీఈడీలో సబ్జెక్టుల మార్పు వందశాతం చేసుకునేందుకు అవకాశం కల్పించాలని యాజమాన్యాలు కోరుతున్నాయి. ఈ మేరకు ఇటీవల ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ను కలిసి విన్నవించాయి. యాజమాన్యాలు విన్నవించిన దానికి అనుగుణంగా మెథడాలజీ మార్పునకు అవకాశం కల్పించేందుకే ఉన్నత విద్యామండలి స్పాట్‌, యాజమాన్య కోటా సీట్ల భర్తీ గడువును పొడిగించినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం బీఈడీలో వంద సీట్లు ఉంటే గణితం 25%, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం సబ్జెక్టులకు సంబంధించి 30%, సాంఘిక శాస్త్రం, ఆంగ్ల భాష కలిపి 45 శాతం చొప్పున సీట్ల భర్తీ ఉండాలి. దీనికి విరుద్ధంగా యాజమాన్యాలు వంద సీట్లను తమ ఇష్టం వచ్చినట్లు భర్తీ చేసుకుంటామని కోరుతున్నాయి. మెథడాలజీ నిబంధన లేకుండా ఏ సబ్జెక్టు వారు లభిస్తే వారితో భర్తీ చేస్తామని పేర్కొంటున్నాయి. యాజమాన్యాలకు లబ్ధి చేకూర్చే ఉద్దేశంతోనే ఉన్నత విద్యామండలి గడువు పొడిగించిందని, ఈ సమయంలో మెథడాలజీ వందశాతం మార్పునకు అవకాశం కల్పించేలా ప్రయత్నాలు సాగుతున్నాయనే విమర్శలున్నాయి.

డబ్బుల వసూళ్లు..

మెథడాలజీ మార్పు కోసం కొంతమందికి డబ్బులు ఇవ్వాలని పేర్కొంటూ తమను తాము పెద్దలుగా చెప్పుకొనే కొందరు యాజమాన్య ప్రతినిధులు ఒక్కో కళాశాల రూ.35 వేల నుంచి రూ.50 వేలు సమీకరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వారు ఇప్పటికే అధికారపార్టీకి చెందిన నేతలను కలిసి, తాము కోరినట్లు సీట్ల భర్తీకి అవకాశం కల్పించాలని కోరినట్లు సమాచారం. ఎన్నికల సమయం కావడంతో అధికార పార్టీ నేతలు సైతం మినహాయింపు ఇవ్వాలని ఉన్నత విద్యామండలిపై ఒత్తిడి చేస్తున్నారు. వైకాపాకు చెందిన ఎంపీ అభ్యర్థి ఒకరు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌కు ఫోన్‌ చేసి యాజమాన్యాలు కోరినట్లు మెథడాలజీ మార్పు చేయాలని సూచించినట్లు సమాచారం.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.