• facebook
  • whatsapp
  • telegram

UPSC Result: యూపీఎస్సీ సివిల్స్‌ తుది ఫలితాలు   

*  సత్తా చాటిన పాలమూరు బిడ్డ

దిల్లీ: అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్‌-2023 పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి.  ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. మహబూబ్‌నగర్‌కు చెందిన అనన్య రెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకుతో మెరిశారు. 2023 ఏడాదికి గాను మొత్తం 1016 మందిని యూపీఎస్సీ ఎంపిక చేయగా.. ఇందులో జనరల్‌ కేటగిరీలో 347 మంది, ఈడబ్ల్యూఎస్‌ నుంచి 115, ఓబీసీ నుంచి 303, ఎస్సీ కేటగిరీలో 165, ఎస్టీ కేటగిరీలో 86 మంది చొప్పున ఎంపికయ్యారు. పోస్టుల వారీగా చూస్తే ఐఏఎస్‌ సర్వీసులకు 180 మంది ఎంపిక కాగా.. ఐఎఫ్‌ఎస్‌కు 37, ఐపీఎస్‌కు 200 మంది ఎంపికయ్యారు. ఇక సెంట్రల్‌ సర్వీసు గ్రూప్‌-ఎ కేటగిరీలో 613 మంది, గ్రూప్‌-బి సర్వీసులో 113 మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ వెల్లడించింది. 

టాప్‌ 10 ర్యాంకర్లు వీళ్లే.. 

ఆదిత్య శ్రీవాస్తవ; అనిమేష్‌ ప్రధాన్‌, దోనూరు అనన్యరెడ్డి, పీకే సిద్ధార్థ్‌ రామ్‌కుమార్‌, రుహాని, సృష్టి దబాస్‌, అన్‌మోల్‌ రాఠోర్‌, ఆశీష్‌ కుమార్‌, నౌషీన్‌ తొలి పది ర్యాంకులతో మెరిశారు. గతేడాది విడుదలైన సివిల్స్‌-2022 ఫలితాల్లో ఉమాహారతి మూడో ర్యాంకుతో సత్తా చాటగా.. ఈసారి కూడా తెలుగు విద్యార్థిని మూడో ర్యాంకు సాధించడం విశేషం.


సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు వీరే.. 

దోనూరు అనన్యరెడ్డి (3) మూడో ర్యాంకుతో సత్తా చాటగా.. నందల సాయికిరణ్‌ 27, మేరుగు కౌశిక్‌ 82, పెంకీసు ధీరజ్‌రెడ్డి 173, జి.అక్షయ్‌ దీపక్‌ 196, గణేశ్న భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ 198, నిమ్మనపల్లి ప్రదీప్‌ రెడ్డి 382, బన్న వెంకటేశ్‌ 467, కడుమూరి హరిప్రసాద్‌ రాజు 475, పూల ధనుష్‌ 480, కె.శ్రీనివాసులు 526, నెల్లూరు సాయితేజ 558, కిరణ్‌ సాయింపు 568, మర్రిపాటి నాగభరత్‌ 580, పోతుపురెడ్డి భార్గవ్‌ 590, కె.అర్పిత 639, ఐశ్వర్య నెల్లిశ్యామల 649, సాక్షి కుమారి 679, చౌహాన్‌ రాజ్‌కుమార్‌ 703, గాదె శ్వేత 711, వి.ధనుంజయ్‌ కుమార్‌ 810, లక్ష్మీ బానోతు 828, ఆదా సందీప్‌ కుమార్‌ 830,  జె.రాహుల్‌ 873, హనిత వేములపాటి 887, కె.శశికాంత్‌ 891, కెసారపు మీన 899, రావూరి సాయి అలేఖ్య 938, గోవద నవ్యశ్రీ 995 ర్యాంకుల్లో మెరిశారు.

తొలి ప్రయత్నంలోనే అసాధారణ ప్రతిభ

యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్‌ తుది ఫలితాల్లో మహబూబ్‌నగర్‌కు చెందిన అనన్యరెడ్డి సత్తా చాటారు. తొలి ప్రయత్నంలోనే తన అసాధారణ ప్రతిభతో మూడో ర్యాంకు సాధించారు. పదో తరగతి వరకు మహబూబ్‌నగర్‌ గీతం హైస్కూల్‌లో చదివిన అనన్య.. ఇంటర్‌ విద్యను హైదరాబాద్‌లో అభ్యసించారు. దిల్లీలోని మెరిండా హౌస్‌ కాలేజీలో డిగ్రీ చదివిన ఆమె ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోకుండానే ఈ ఘనతను సాధించారు. ‘సివిల్స్‌’ పరీక్ష ఎంతో కఠినంతో కూడింది. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూలలో ఎదురయ్యే కఠిన సవాళ్లను ఎదుర్కొని నిలవడం ఆషామాషీ వ్యవహారం కాదు. అలాంటిది తొలి ప్రయత్నంలోనే కోచింగ్‌ కూడా తీసుకోకుండా దాదాపు సొంత ప్రిపరేషన్‌తోనే సివిల్స్‌లో జాతీయస్థాయిలో మూడో ర్యాంకుతో భళా అనిపించారు అనన్య రెడ్డి. ఇంటర్వ్యూ తర్వాత సివిల్స్‌కు ఎంపిక అవుతానని భావించినప్పటికీ.. మూడో ర్యాంకు వస్తుందని మాత్రం అస్సలు అనుకోలేదని ఆమె చెప్పారు. సొంత ప్రణాళికతోనే రోజుకు 12 నుంచి 14 గంటల పాటు చదివినట్లు తెలిపారు. చిన్నప్పటినుంచే సమాజానికి సేవ చేయాలన్న కోరికతోనే సివిల్స్‌ను ఎంచుకున్నట్లు తెలిపారు.
 

క్యాప్‌ జెమినీలో ఉద్యోగం వదులుకొని...

సివిల్స్‌కు ఎంపిక కావడమే లక్ష్యంగా క్యాప్‌ జెమినీలో ఉద్యోగం వదులుకొని మెయిన్స్‌కు ప్రిపేర్‌ అయిన కౌశిక్‌.. తొలి ప్రయత్నంలోనే 82వ ర్యాంకుతో సత్తా చాటారు. ఓయూలో సివిల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ పూర్తి చేసిన ఆయన.. దిల్లీలో ఎంబీఏ చేశారు. అందరూ చదివినట్లే చదివానని.. రోజుకు ఎనిమిది, తొమ్మిది గంటల పాటు ప్రిపేర్‌ అయినట్లు ఆయన ‘ఈటీవీ’తో చెప్పారు.  ‘‘ఎంబీఏ ఫైనల్‌ ఇయర్‌లో ఉన్నప్పుడు సివిల్స్‌కు ప్రిపరేషన్‌ మొదలు పెట్టా. ఆ తర్వాత ఏడాది పాటు జాబ్‌ చేశాను. ప్రిలిమ్స్‌ తర్వాత సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలేసి మెయిన్స్‌ రాశాను. ఐఏఎస్‌ అవ్వాలనేది నా లక్ష్యం. నాకు 100లోపు ర్యాంకు వస్తుందని మాత్రం అసలు ఊహించలేదు. సెలెక్ట్‌ అయితే చాలనుకున్నా.. కానీ.. అదృష్టం, దేవుడి దయవల్లే ఈ ర్యాంకు సాధించా. నాన్న కన్‌స్ట్రక్షన్‌ ఫీల్డ్‌లో పనిచేస్తారు. అమ్మ గృహిణి. నాన్నకు తెలిసిన కొందరు ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లను కలవడం, ఇతరుల గైడెన్స్‌తో పాటు కొన్ని స్టాండర్డ్‌ సోర్సులు నాకు బాగా ఉపయోగపడ్డాయి. నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి. ముఖ్యంగా దివ్యాంగుల కోసం, ఆరోగ్య రంగంపై పనిచేయాలని ఉంది’’ అని అన్నారు.

 


యూపీఎస్సీ సివిల్స్‌ తుది ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 16-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.