• facebook
  • whatsapp
  • telegram

UPSC Civils Topper: సొంత ప్రణాళికతో.. వ్యూహాత్మకంగా అడుగులు

* సివిల్స్‌ ఫస్ట్‌ ర్యాంకర్‌ శ్రీవాస్తవ

* ఐపీఎస్‌ ట్ర్రైనీగానే విజయం

దిల్లీ: సివిల్‌ సర్వీస్‌ సాధించడం అంటే అంత తేలికైన విషయం కాదు. లక్షల మంది పోటీపడితే ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ దాటుకొని కొలువు సాధించేది మాత్రం కేవలం వందల్లోనే ఉంటారు. ఏళ్లపాటు కష్టపడితే కొందరికే దేశానికి సేవ చేసే భాగ్యం దక్కేది. అందులోనూ టాప్‌ ర్యాంకర్‌గా నిలవడమంటే సామాన్య విషయం కాదు. అలాంటిది, లఖ్‌నవూకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవ యూపీఎస్సీ ఫలితాల్లో మొదటి ర్యాంకుతో సత్తా చాటారు. కార్పొరేట్‌ కొలువు వదిలి.. తొలి ప్రయత్నంలో విఫలమై.. మూడో ప్రయత్నంలో ఏకంగా ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకర్‌గా నిలిచారు.

కార్పొరేట్‌ ఉద్యోగం వదిలి..

లఖ్‌నవూకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవ ఐఐటీ కాన్పూర్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ప్రపంచంలోనే పేరొందిన ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్ గోల్డ్‌మన్‌ శాక్స్‌లో కొలువు సాధించారు. 2019లో బెంగళూరులో ఉద్యోగ జీవితం మొదలుపెట్టారు. కార్పొరేట్‌ ఉద్యోగం, రూ.లక్షల్లో జీతం ఉన్నప్పటికీ 15 నెలలకే ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. లఖ్‌నవూ చేరి యూపీఎస్సీకి సన్నద్ధమయ్యారు. ఐఐటీ-జేఈఈ వంటి కఠినమైన పరీక్షను దాటిన కొన్నేళ్ల తర్వాత.. మరో కఠిన సవాల్‌ను స్వీకరించి అలుపెరగని కృషి చేశారు. సంప్రదాయ కోచింగ్‌ పద్ధతులు కాకుండా.. తనదైన సొంత ప్రణాళికతో ముందుకెళ్లారు శ్రీవాస్తవ. ముఖ్యంగా పాత క్వశ్చన్‌ పేపర్లపై ఎక్కువగా ఆధారపడేవారు. మాక్‌ టెస్టులు, కోచింగ్‌ సంస్థల ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు. 2021లో తొలి ప్రయత్నంలో ఆదిత్య శ్రీవాస్తవకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆ ఏడాది కనీసం ప్రిలిమ్స్‌ దశను కూడా దాటలేకపోయారు. తప్పులు సరిదిద్దుకుని మళ్లీ తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. తన కష్టానికి 2022లో తొలిసారి ఫలితం లభించింది. ఆ ఏడాది యూపీఎస్సీ ఫలితాల్లో 236వ ర్యాంక్‌ సాధించిన ఆయన ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఐఏఎస్‌ కావాలన్న పట్టుదలతో మూడోసారి 2023లో సివిల్స్‌ రాసి జాతీయస్థాయిలో మొదటి ర్యాంకుతో భళా అనిపించారు. పాత ప్రశ్నపత్రాలను విశ్లేషించి.. పరీక్ష సిలబస్‌ను అంచనా వేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని శ్రీవాస్తవ పేర్కొన్నారు. హార్డ్‌వర్క్‌, స్మార్ట్‌వర్క్‌ మధ్య తేడా గుర్తించి వ్యూహాత్మకంగా ముందుకెళ్లడం వల్లే తనకు ఈ విజయం దక్కిందని చెప్పుకొచ్చారు.
 

యూపీఎస్సీ సివిల్స్‌ తుది ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 16-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.