• facebook
  • whatsapp
  • telegram

Civils: పంచరత్నాలు.. వావ్‌ అనిపించారు..!

* సివిల్స్‌లో సత్తా చాటిన ఓరుగల్లు బిడ్డలు..

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి: లక్ష్య  సాధన నల్లేరు మీద నడక కాదు.. కష్టాలు, కన్నీళ్లు, ఎన్నో ప్రయత్నాల వెనుకే గెలుపు దాగి ఉంటుందని ఎన్నో విజయ గాథలు మనకు చెబుతున్నాయి. అలాంటి ఒడుదొడుకులను దాటుకుని గెలిచే సత్తా ఓరుగల్లు యువతకు ఉందని మరోసారి నిరూపితమైంది.. మంగళవారం యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్‌ ఫలితాల్లో ఓరుగల్లు గడ్డ నుంచి ఐదుగురు యువకిశోరాలు సత్తా చాటి జయకేతనం ఎగురవేశారు.  ప్రజాసేవ చేయాలనే సంకల్పమే వారి విజయానికి ఇంధనం. లక్ష్య ఛేదనలో ఎదురైన వైఫల్యాలను గెలుపునకు సోపానాలుగా మార్చుకుని ప్రతిష్ఠాత్మక సివిల్స్‌లో మెరిశారు. ఈ క్రమంలో ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటూ వారు చేసిన ప్రయాణం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఆదర్శం.

పట్టు వదలకుండా.. 

* పేరు: సయింపు కిరణ్‌

* ర్యాంకు: 568

* ఎన్నో ప్రయత్నం: బీటెక్‌ పూర్తయిన తర్వాత 2018లో సివిల్స్‌ మొదటి ప్రయత్నం చేశారు. ప్రిలిమ్స్‌ కూడా క్వాలిఫై కాలేదు. లోపాలను సవరించుకుంటూ మరింత పట్టుదలతో ప్రయత్నం కొనసాగించారు. 2019, 2020లో మెయిన్స్‌ వరకు 2021, 2022లో ఇంటర్వ్యూ వరకు హాజరై పోస్టల్‌ సర్వీస్‌లో ఉద్యోగం సాధించారు. ఉద్యోగం చేస్తూనే 2023లో చివరి ప్రయత్నం చేశారు. ఈ సారి విజయం కిరణ్‌ సొంతమైంది అత్యుత్తమ ర్యాంకు సాధించారు.

* తల్లిదండ్రులు: ప్రభాకర్‌రావు, జయలక్ష్మి

* చిరునామా: పెదనందిపాడు మండలం గొరిజవోలుగుంటపాలెం గ్రామం. దశాబ్దాల కిందటే తల్లిదండ్రులు వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం అనంతారం గ్రామానికి వలస వచ్చారు. 

* విద్యాభ్యాసం: వరంగల్‌లోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఇంటర్మీడియట్ ప్రైవేటు కళాశాలలో పూర్తి చేసి జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 1598 ర్యాంకు సాధించి దిల్లీ ఐఐటీలో బీటెక్‌ పూర్తి చేశారు.

* నిరంతరం శ్రమిస్తే విజయం: కిరణ్‌

వ్యవసాయ కుటుంబంలో పుట్టాను. మట్టి వాసన తెలిసిన వ్యక్తిగా సామాన్య ప్రజల కష్టాలను తీర్చడంలో  మెరుగ్గా పని చేస్తాను.. అపజయాలతో కుంగిపోకుండా నిరంతరంగా శ్రమిస్తే విజయం సాధించవచ్చు.


కష్టేఫలి..

* పేరు: కొయ్యడ ప్రణయ్‌ కుమార్‌

* ర్యాంకు: 554 

* ఎన్నో ప్రయత్నం: మొదటి ప్రయత్నంలో 2022లో 855 ర్యాంకు సాధించారు. ఇండియన్‌ రైల్వే మేనేజ్‌మెంట్‌ సర్వీసు సాధించి ప్రస్తుతం లక్నోలో శిక్షణ పొందుతున్నారు.

* తల్లిదండ్రులు: ప్రభాకర్‌, లక్ష్మి

* చిరునామా: జనగామ జిల్లా రఘునాథపల్లి 

* విద్యాభ్యాసం: నాగారం ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి, హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో బీటెక్‌ పూర్తిచేశారు

* నేపథ్యం: నిరుపేద కుటుంబం. ఉపాధి లేక హైదరాబాద్‌కు వలస వెళ్లారు.

* తల్లిదండ్రుల కష్టాలను తీర్చాలని పట్టుదలతో చదివా:  ప్రణయ్‌కుమార్‌

మా తల్లిదండ్రులది కులాంతర ప్రేమ వివాహం. వారెన్నో అవమానాలు, బాధలను భరిస్తూ నన్ను చదివించారు. తలిదండ్రుల కష్టాలను తీర్చాలనే పట్టుదలతో, ఐఏఎస్‌ కావాలనే లక్ష్యంతోనే సివిల్స్‌లో విజయం సాధించాను.  పేదరిక నిర్మూలన, సమాజంలో అసమానతల తొలగింపు, విద్యా, వైద్యానికి మొదటి ప్రాధాన్యం ఇస్తూ సేవలందిస్తాను.


విజయమే లక్ష్యంగా..

* పేరు: కోటే అనిల్‌కుమార్‌

* ర్యాంకు: 764   

* ఎన్నో ప్రయత్నం: ఇండియన్‌ పోస్టల్‌ సర్వీసులో డిప్యూటీ డైరెక్టర్‌ (అకౌంట్స్‌)గా పనిచేస్తూనే తాజా ఫలితాల్లో 764 ర్యాంకు సాధించారు.  

* తల్లిదండ్రులు: కొటే కొమురయ్య (సోషల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంటు విశ్రాంత ఉద్యోగి), సరోజన (గృహిణి) 

* చిరునామా: వరంగల్‌ శివనగర్‌ నాలుగు జెండాల ప్రాంతం 

* విద్యాభ్యాసం: శివనగర్‌లోని రెనాల్డ్స్‌ స్కూల్‌లో, ఆ తర్వాత ప్లాటినం జూబ్లి స్కూల్‌, ఇంటర్‌ విజయవాడ నారాయణలో పూర్తిచేసి, బీటెక్‌ వరంగల్‌ నిట్లో చదివారు. మొదట హైదరాబాద్‌

ఎల్‌బీనగర్‌లో ఎలక్ట్రిసిటీ శాఖలో ఏఈగా ఉద్యోగం రాగా, కొంతకాలం పనిచేసి మానేశారు. రైల్వేలో ఉద్యోగం వచ్చినా చేరకుండా సివిల్స్‌ సాధనే లక్ష్యంగా ముందుకు సాగారు. 

* దంపతులకు ముగ్గురు కుమారులు, పెద్దకుమారుడు శ్రీకాంత్‌ బ్యాంకు మేనేజర్‌గా, రెండో కుమారుడు శ్రీధర్‌ జైలువార్డెన్‌గా పనిచేస్తుండగా, మూడో కుమారుడు అనిల్‌కుమార్‌ సివిల్స్‌లో సత్తా చాటారు.

 ప్రస్తుతం అనిల్‌ కోల్‌కతాలో ఉన్నారు. తండ్రి కొమురయ్య మాట్లాడుతూ ఐఏఎస్‌కు బదులుగా ఐఆర్‌ఎస్‌ సర్వీసు వస్తుందన్న ఆశలో తమ కుమారుడున్నాడని తెలిపారు. తన బిడ్డకు పుస్తకాలంటే ఇష్టమని, చరవాణి కేవలం మాట్లాడేందుకే ఉపయోగిస్తారని చెప్పారు.

* ఐఏఎస్‌ సాధించడమే ఆశయం

* పేరు: కొలనుపాక సహన

* ర్యాంకు : 739

ఈనాడు, కరీంనగర్‌ న్యూస్‌టుడే- కరీంనగర్‌ పట్టణం

అమ్మానాన్నల కష్టాన్ని కళ్లారా చూసిన కరీంనగర్‌కు చెందిన మరో యువతి సహన నాలుగో ప్రయత్నంలో 739 ర్యాంకు సాధించింది. నాకు చిన్నప్పటి నుంచే కలెక్టరుగా ప్రజలకు సేవలందించాలనే లక్ష్యం ఉండేది. అప్పట్లో కరీంనగర్‌ కలెక్టరుగా పనిచేసిన స్మితా సభర్వాల్‌ని చూసి నేను అలాగే అవాలనుకున్నా. అమ్మ గీత, నాన్న అనిల్‌ జయశంకర్‌ మద్దతివ్వడంతో ఈ రోజు ఈ ర్యాంకు సాధించగలిగా.


Civils: సివిల్స్‌లో సత్తాచాటిన గిరి పుత్రుడు

* విజయమే లక్ష్యంగా 

హుకుంపేట, న్యూస్‌టుడే: పట్టుదల, ఆత్మ విశ్వాసంతో చదివితే దేన్నైనా సాధించవచ్చని నిరూపించాడు గిరి యువకుడు. హుకుంపేట మండలం అండిభ గ్రామానికి చెందిన చిట్టపులి నరేంద్ర పడాల్‌ సివిల్స్‌లో 545వ ర్యాంక్‌ సాధించారు. ఈయన హైదరాబాద్‌లోని బ్రహ్మప్రకాష్‌ దయానంద్‌ ఆంగ్లో వేద పాఠశాలలో ఇంటర్‌, నారాయణ ఐఏఎస్‌ అకాడమీలో డిగ్రీ పూర్తిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో రాజకీయ శాస్త్రంపై పీజీ రెండో సంవత్సరం చదువుతున్నారు. రెండో ప్రయత్నంలో సివిల్స్‌ విజయం సాధించారు. పాఠశాల నుంచి సివిల్స్‌ విజయమే లక్ష్యంగా చదివి అనుకున్నది సాధించారు. ఈయన తల్లిదండ్రులు డాల్‌ పడాల్‌, విజయభారతి. తండ్రి ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. నరేంద్ర విద్యాభ్యాసం మొత్తం అక్కడే సాగింది. ఈ సందర్భంగా నరేంద్రపడాల్‌ ‘న్యూస్‌టుడే’తో ఫోన్‌లో మాట్లాడారు. ‘ విజయం సాధించాలంటే పట్టుదల చాలా ముఖ్యం. పట్టుదలతో చదివి సివిల్స్‌లో విజయం సాధించాను. నేటి యువత కష్టాలను సాకుగా చూపిస్తూ ఇంటికే పరిమితం అవుతూ,  అనుకొన్న లక్ష్యాన్ని సాధించలేకపోతున్నారు. లక్ష్యసాధనలో అనేక ఇబ్బందులు వస్తాయి. వాటిని అధిగమించి ముందుకు సాగాలని’పేర్కొన్నారు. నరేంద్ర పడాల్‌ను సర్పంచి సత్యనారాయణ, స్థానికులు అభినందించారు.

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 17-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.