• facebook
  • whatsapp
  • telegram

Yadadri Power Plant: కొలువుల వెలుగులు ఎన్నడో?!  

* ‘యాదాద్రి’ విద్యుత్కేంద్రం నిర్మాణంలో జాప్యంతో నిర్వాసితులకు నష్టం

* ఆర్డీవో దగ్గరే మూలుగుతున్న రూ.90 కోట్ల పరిహారం సొమ్ము 

* ప్లాంటు నిర్మాణం పూర్తయ్యాక 584 మందికి ఉద్యోగాలు ఇస్తామంటున్న జెన్‌కో
 



ఈనాడు, హైదరాబాద్‌: యాదాద్రి విద్యుత్కేంద్రం నిర్మాణంలో స్థలాలు, ఇళ్లు, పొలాలు సహా సర్వం కోల్పోయిన నిర్వాసితులకు ఆసరా కరవైంది. 2017లో ప్రారంభమైన ప్లాంటు నిర్మాణం 2021కల్లా పూర్తి కావాల్సి ఉంది. కానీ, నిర్మాణంలో తీవ్ర జాప్యం నిర్వాసితులకు శాపంగా మారింది. ఉద్యోగాలు కోరుకున్నవారికి అవి ఇంకా దక్కకపోగా.. పరిహారం కూడా అందరికీ అందలేదు. విద్యుత్కేంద్రం నిర్మాణానికి పర్యావరణ అనుమతి(ఈసీ) కోసం కేంద్ర పర్యావరణ శాఖకు సమర్పించిన నివేదికలో నిర్వాసితులకు పరిహారం చెల్లింపు వివరాలను జెన్‌కో పేర్కొంది. దీని ప్రకారం.. పరిహారం పంపిణీ బాధ్యతను జిల్లా కలెక్టర్‌కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. నల్గొండ కలెక్టర్‌ కార్యాలయం పేరుతో జెన్‌కో రూ.288 కోట్లను 2016 జనవరి 4నే జమ చేసింది. పరిహారం పంపిణీ బాధ్యతను మిర్యాలగూడ రెవెన్యూ డివిజనల్‌ అధికారి(ఆర్డీవో) కార్యాలయానికి కలెక్టర్‌ అప్పజెప్పారు. పరిహారం తీసుకోవడానికి కొందరు నిర్వాసితులు ముందుకురావడం లేదని, మరికొందరి చిరునామా తెలియడం లేదని అధికారులు అంటున్నారు. నిర్వాసితులకు ఇవ్వాల్సిన సొమ్ములో ఇంకా రూ.90 కోట్లు ఆర్డీవో కార్యాలయం అధీనంలోనే మూలుగుతున్నాయి.


4,569 ఎకరాల సేకరణ 

ప్లాంటు నిర్మాణం నిమిత్తం నల్గొండ జిల్లా దామెరచర్ల మండలంలోని వీర్లపాలెం, కొత్తపల్లి, మోదుగుల తండా, కపూర్‌ తండాల్లో మొత్తం 4,569 ఎకరాలను జెన్‌కో సేకరించింది. ఇందులో ప్రైవేటు వ్యక్తులకు చెందిన 1,012 ఎకరాలున్నాయి. రెండు తండాల్లోని 173 కుటుంబాలను పూర్తిగా ఖాళీ చేయించింది. మరోచోట ఇళ్లు కట్టించి ఇచ్చింది. ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలు(ప్రాజెక్టు డిస్‌ప్లేస్డ్‌ ఫ్యామిలీస్‌-పీడీఎఫ్‌) నిబంధనల కింద బాధిత కుటుంబాలకు ఎకరానికి రూ.5 లక్షల పరిహారం లేదా ప్లాంటులో ఉద్యోగాలు ఇస్తామని జెన్‌కో తెలిపింది. తండాల్లోని 173 నిర్వాసిత కుటుంబాల్లో 133 మంది మాత్రమే ఉద్యోగాలివ్వాలని కోరారు. మిగిలిన 40 మందిలో 37 మంది పరిహారం తీసుకున్నారని, ముగ్గురి చిరునామా దొరకడం లేదని జెన్‌కో అధికారులు చెబుతున్నారు. ఇక వీర్లపాలెం, కొత్తపల్లిల్లో 487 మందికి చెందిన వ్యవసాయ భూములను సేకరించారు. వీరిలో 451 మంది ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. ప్లాంటు కోసం 702 ఎకరాల అటవీ భూములను సేకరించారు. వాటిని సాగు చేసుకుంటున్న 563 మందికి పరిహారం ఇచ్చినట్లు కేంద్ర పర్యావరణ శాఖకు సమర్పించిన నివేదికలో జెన్‌కో పేర్కొంది. కాగా, వీరిలో కొందరికి రాజకీయ కారణాలతో పరిహారం అందించినట్లు ఆరోపణలున్నాయి. 


భూవివాదాలతో జాప్యం జరుగుతోందంటున్న జెన్‌కో

నిర్వాసితులందరికీ పరిహారం అందని విషయమై జెన్‌కో అధికారులను ‘ఈనాడు’ వివరణ కోరగా.. పూర్తి పరిహారం సొమ్మును కలెక్టర్‌ కార్యాలయం పేరిట 2016లోనే జమ చేశామని, సొమ్ము అందని బాధితులు మిర్యాలగూడ ఆర్డీవో కార్యాలయంలో సంప్రదిస్తే వెంటనే ఇస్తారని తెలిపారు. 36 మందికి సంబంధించిన భూములపై వివాదాలున్నాయని, వారికి ఇవ్వాల్సిన రూ.1.52 కోట్ల పరిహారం పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. ఈ వివాదంపై విచారణ జరుగుతోందని, అది పూర్తయ్యాక పరిహారం సొమ్ము పంపిణీ చేస్తామని తెలిపారు. వీరు కాకుండా అటవీ భూములకు సంబంధించి మరో 15 మందికి రూ.1.93 కోట్లు పంపిణీ చేయాల్సి ఉందని, ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే ఇస్తామని వివరించారు. కొన్ని భూములపై ఇద్దరు లేదా ముగ్గురు తమకే హక్కులున్నాయని వాదిస్తుండటంతో పరిహారం పంపిణీ ఆగిపోయిందని చెప్పారు. వీటిపై రెవెన్యూశాఖ విచారణ జరిపి స్పష్టత ఇవ్వాల్సి ఉందన్నారు. వచ్చే మార్చి నాటికి ప్లాంటు నిర్మాణం పూర్తి చేస్తామని కాంట్రాక్టు సంస్థ భెల్‌ తాజాగా జెన్‌కోకు తెలిపింది. అప్పటికల్లా 584 మంది నిర్వాసితులకు ఉద్యోగాలివ్వాలని జెన్‌కో యోచిస్తోంది. ప్రస్తుతం నిర్వాసితులు కూలి పనులు చేసుకుంటున్నారు. 


ఆరోపణలపై విచారణ

ప్లాంటుకు సంబంధించిన భూసేకరణ, పరిహారం పంపిణీలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విజిలెన్స్‌ విచారణ చేయించింది. తాజాగా జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ విచారణ చేస్తోంది. ఆరోపణల నేపథ్యంలో ప్లాంటులో పరిహారం పంపిణీ విభాగంలో పనిచేస్తున్న సహాయ ఇంజినీరు(ఏఈ)ని హైదరాబాద్‌లోని జెన్‌కో ప్రధాన కార్యాలయానికి ఇటీవల బదిలీ చేశారు. 
 

Published Date : 26-05-2024 13:17:47

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం