• facebook
  • whatsapp
  • telegram

TG Constable Vacancy: తెలంగాణలో 24,247 కానిస్టేబుల్‌ ఖాళీలు  

* 615 మందికో కానిస్టేబుల్‌!

* దేశంలోనే అత్యధిక శిక్షణ సంస్థలు ఇక్కడే

* మన రాష్ట్రంలోనే అత్యధిక సీసీ కెమెరాలు

* బీపీఆర్‌డీ తాజా నివేదికతో బహిర్గతం
 


తెలంగాణలో 615 మంది పౌరులకో పోలీస్‌ ఉన్నట్లు పోలీస్‌ పరిశోధన, అభివృద్ధి సంస్థ(బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌-బీపీఆర్‌డీ) తాజా గణాంకాలు వెల్లడించాయి. వాస్తవానికి 442 మందికి ఒకరు.. అంటే లక్ష మంది పౌరులకు 226 మంది ఉండాలి. కానీ 163 మంది ఉన్నట్లు తేలింది. 2023 జనవరి 1 నాటికి దేశవ్యాప్తంగా పోలీస్‌శాఖ స్థితిగతులపై బీపీఆర్‌డీ తాజా నివేదిక వెలువరించింది. రాష్ట్ర పోలీస్‌శాఖలో అన్ని విభాగాల్లో కలిపి 24,247 ఖాళీలున్నట్లు పేర్కొంది. తెలంగాణకు 139 ఐపీఎస్‌ పోస్టులు మంజూరు కాగా.. 122 మంది ఉన్నట్లు వెల్లడైంది. 


రవాణా సదుపాయంలో ముందంజ 


దేశవ్యాప్తంగా 77 పోలీస్‌ కమిషనరేట్లున్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 12 ఉండగా.., తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు తొమ్మిదేసి కమిషనరేట్లతో రెండో స్థానంలో ఉన్నాయి. 33 పోలీస్‌ శిక్షణ సంస్థలతో రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచింది. 1,12,122.4 చ.కి.మీ.లతో విస్తరించిన మనరాష్ట్రంలో ప్రతి 1.3 కి.మీ.ల పరిధికి ఒకరు అవసరం కాగా.. 1.81 కి.మీ.లకు ఒక పోలీస్‌ ఉన్నారు. ప్రస్తుతం ఠాణాల సంఖ్య 844. మొత్తం పోలీసు శాఖకు 19,982 వాహనాలు ఉండగా.. వీటిలో స్టేషన్లలో 5966 మాత్రమే ఉన్నాయి. ప్రతి 100 మంది పోలీసులకు రవాణా సదుపాయం కల్పిస్తున్న విషయంలో తెలంగాణ ముందంజలో ఉంది. 


ఉన్నత స్థాయిలో అదనం.. క్షేత్రస్థాయిలో అథమం
 

రాష్ట్రంలో డీజీపీ పోస్టులు రెండుకు గాను ఒకటి అదనంగా ఉండటం విశేషం. 6 అదనపు డీజీపీలకు 17 మంది ఉన్నారు. 16 ఐజీలకు 8 మంది.. 17 మంది డీఐజీలకు 12 మంది ఉన్నారు. 104 మంది ఏఐజీ/సీనియర్‌ ఎస్పీ/ఎస్పీ/కమాండెంట్‌ పోస్టులకు నలుగురు అదనంగా ఉన్నారు. 112 మంది అదనపు ఎస్పీ/డిప్యూటీ కమాండెంట్‌ పోస్టులకు 86 మంది.. 387 ఏఎస్పీలకు 352.. 1375 మంది ఇన్‌స్పెక్టర్లకు 1217 మంది.. 3832 మంది ఎస్సైలకు 2997 మంది.. 2654 మంది ఏఎస్సైలకు 2481 మంది.. 7616 హెడ్‌కానిస్టేబుళ్లకు 6199 మంది.. 32,747 మంది కానిస్టేబుళ్లకు 22161 మంది ఉన్నారు.
 


మహిళా పోలీసులు 5351 మంది 

మహిళా పోలీస్‌ అధికారుల్లో సివిల్‌ విభాగంలో డీజీపీ స్థాయిలో ఒక్కరూ లేరు. ఆరుగురు అదనపు డీజీపీలు.. ఒక్కో ఐజీ, డీఐజీ.. 29 మంది ఎస్పీలు.. 13 మంది అదనపు ఎస్పీలు.. నలుగురు డీఎస్పీలు.. 27 మంది ఇన్‌స్పెక్టర్లు.. 372 మంది ఎస్సైలు.. 198 మంది ఏఎస్సైలు.. 320 మంది హెడ్‌కానిస్టేబుళ్లు.. 2907 మంది కానిస్టేబుళ్లున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 61,811 మంది పోలీసులు ఉండగా.. అన్ని విభాగాల్లో కలిపి 5351 మంది మహిళా పోలీసులున్నారు. రాష్ట్రంలో ప్రతి 3530 మంది ఆడవారికి ఓ మహిళా పోలీస్‌ ఉన్నారు. 16 మహిళా ఠాణాలు ఉన్నాయి.


పోలీస్‌ శాఖ ఆధునికీకరణకు..


దేశవ్యాప్తంగా పోలీస్‌శాఖ ఆధునికీకరణకు రూ.2169.99 కోట్లను వివిధ రాష్ట్రాలు కేటాయించాయి. కానీ తెలంగాణలో మాత్రం ఇది సున్నా. రాష్ట్రప్రభుత్వం రూ.2.56 లక్షల కోట్ల బడ్జెట్‌లో పోలీస్‌ బడ్జెట్‌ కింద రూ.7932.56 కోట్లు కేటాయించింది. 


సీసీ కెమెరాలు 2.82 లక్షలు 
 


* దేశవ్యాప్తంగా కమ్యూనిటీపరంగా ఉన్న సీసీటీవీ కెమెరాల్లో సగానికి పైగా ఒక్క తెలంగాణలోనే ఉన్నాయి. మొత్తం 5,48,057 కెమెరాలకు రాష్ట్రంలో 2,82,558 ఉండటం విశేషం. రాష్ట్రంలో 844 స్టేషన్లకుగాను 750 ఠాణాల్లో సీసీ కెమెరాలున్నాయి.

రాష్ట్రంలో డీఎస్పీ నుంచి ఆ పైస్థాయి అధికారుల వరకు మంజూరైన పోస్టులు 818 మందికి 767 మంది ఉన్నారు. ఏఎస్సై నుంచి ఇన్‌స్పెక్టర్‌ వరకు 11,027 మందికి 9,638 మంది, కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది 74,213 మందికి 51,406 మంది ఉన్నారు. 

తెలంగాణలో కానిస్టేబుల్‌ నుంచి డీఎస్పీ వరకు 61,811 మంది ఉండగా.. వీరిలో 11,064 మంది ఎస్సీ అధికారులున్నారు. ఎస్సీలకు 15శాతం రిజర్వేషన్‌ ఉండగా.. ఇది 18 శాతంతో సమానం. ఎస్టీ అధికారులు 7199 మంది ఉన్నారు. వీరికి 10 శాతం రిజర్వేషన్‌ కేటాయించగా 11.7 శాతం మంది ఉన్నారు. బీసీలకు 27 శాతం రిజర్వేషన్‌కు.. 33,551 మందితో 54.5 శాతం మంది ఉన్నారు. 

తెలంగాణలో పోలీస్‌శాఖకు చెందిన ట్రాకర్‌ డాగ్స్‌ 125.. స్నిఫర్‌ డాగ్స్‌ 332 ఉన్నాయి. ఈ విషయంలో మనదే ప్రథమ స్థానం.

    Published Date : 26-05-2024 13:19:27

    గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

    విద్యా ఉద్యోగ సమాచారం