• facebook
  • whatsapp
  • telegram

Engineering counselling: ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌.. కంప్యూటర్స్‌ సీటు.. సపరేటు

* ఏజెంట్లు, కన్సల్టెంట్ల ప్రతినిధుల కొత్త ట్రిక్కులు



 


ఈనాడు, హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ ఇంకా ప్రారంభమవకుండానే యాజమాన్య కోటా సీట్ల రేట్లు పెంచేందుకు కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. కంప్యూటర్‌ సైన్స్, డేటాసైన్స్, కృత్రిమ మేధ సీట్ల ద్వారా రూ.లక్షలు దండుకునేందుకు కొత్త ట్రిక్కులు అమలు చేస్తున్నాయి. యాజమాన్య కోటా సీట్లు, డొనేషన్ల వివరాల కోసం కళాశాలలకు విద్యార్థుల తల్లిదండ్రులు వెళ్తే.. సీట్లు భర్తీ అయ్యాయంటూ చెబుతున్నారు. వారు కళాశాలల నుంచి బయటకు రాగానే.. వారి చరవాణులకు సీట్లు ఇప్పిస్తామంటూ సంక్షిప్త సందేశాలు వచ్చేలా చేస్తున్నారు. వాటికి ఫోన్‌ చేస్తే.. తాము ఫలానా కన్సల్టెన్సీల ప్రతినిధులు, ఏజెంట్లమని పరిచయం చేసుకుంటున్నారు. రూ.50వేలు బయానా ఇస్తేనే సీట్‌ బుక్‌ చేస్తామంటూ చెబుతున్నారు.

గిరాకీని సొమ్ము చేసుకుందామని.. కంప్యూటర్‌ సైన్స్, డేటాసైన్స్, కృత్రిమ మేధ, మిషన్‌ లర్నింగ్‌ కోర్సులకున్న డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు  కొన్ని ప్రైవేటు కళాశాలల ప్రతినిధులు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు నేరుగా వచ్చినా.. ఫోన్‌ ద్వారా సంప్రదించినా.. సీట్లు లేవంటూ చెప్పాలని తీర్మానించారు. మీరు కోరినంత ఇచ్చేందుకు సిద్ధమన్న వారికి మినహాయింపు ఇస్తున్నారు.

ఏజెంట్ల ద్వారానే బయానాలు..: ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కొన్ని ఏజెంట్లకే ప్రాధాన్యమిస్తున్నాయి. తల్లిదండ్రులు కళాశాలలకు వచ్చి నేరుగా సంప్రదిస్తే రూ.లక్ష ఎక్కువగా చెబుతున్నారు. ఏజెంట్లు తక్కువకే ఇప్పిస్తామంటూ చెబుతుండడంతో వారిని ఆశ్రయిస్తున్నారు. 

* జంట జలాశయాల సమీపంలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో సీటు ఇప్పిస్తామంటూ ఖైరతాబాద్‌లో ఓ ఏజెంట్‌ ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రూ.50వేల చొప్పున బయానా తీసుకున్నాడు. సీఎస్‌సీ డేటా సైన్స్‌ సీటు రూ.10లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఆ విద్యార్థుల తల్లిదండ్రులు అంతకుముందు ఆ కళాశాల యాజమాన్యాన్ని సంప్రదిస్తే సీటు రూ.11లక్షలని చెప్పారు. 
 

Published Date : 26-05-2024 10:48:57

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం