విశ్వవిద్యాలయాల్లో గాడి తప్పుతున్న ప్రక్రియ
ఈనాడు, అమరావతి: విశ్వవిద్యాలయాల్లో జవాబుపత్రాల మూల్యాంకనం గాడి తప్పుతోంది. పరీక్షల నిర్వహణ, కేంద్రాల కేటాయింపు, మూల్యాంకనంపై వర్సిటీలకు ఏకీకృత విధానం లేదు. ఇటీవల కాగ్ నివేదిక సైతం మూల్యాంకనంలో లోపాలను ఎత్తి చూపింది. పునర్ మూల్యాంకనం కూడా పక్కాగా ఉండటం లేదు. మొదట పరీక్షల్లో తప్పి.. పునర్ మూల్యాంకనంతో ఉత్తీర్ణులవుతున్న వారి సంఖ్య ఏకంగా 40% నుంచి 50% వరకు ఉంటోంది. పైగా 20 ఏళ్ల నాటి పట్టాలు, మార్కులు దిద్దిన మెమోలూ కొన్ని చోట్ల వెలుగుచూస్తుండటం గమనార్హం. ఇలాంటి ఘటనలతో విశ్వవిద్యాలయాల ప్రతిష్ఠ మసకబారుతోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో బీఈడీలో 52 మంది పునర్ మూల్యాంకనానికి దరఖాస్తు చేస్తే 30 మంది మార్కుల్లో మార్పు చోటుచేసుకుంది. పీజీలో ఒక కోర్సుకు 80 మంది దరఖాస్తు చేసుకుంటే 52 మందికి మార్కులు పెరిగాయి. మార్కుల్లో మార్పు 50 శాతానికి మించి ఉండడం ఆందోళనకరం. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గతంలో ఫెయిలైన విద్యార్థికి కంప్యూటర్‌లో మార్కులు దిద్ది ఉత్తీర్ణులైనట్లు పరీక్షల విభాగం మెమో జారీ చేసింది. సదరు విద్యార్థి పట్టా తీసుకునే క్రమంలో వర్సిటీ అధికారులు ఈ తప్పిదాన్ని గుర్తించారు. దీనిపై న్యాయ వివాదం నడుస్తోంది. ఇలాంటి ఘటనే శ్రీ వేంకటేశ్వర వర్సిటీలోనూ వెలుగు చూసింది. ఇటీవల జేఎన్‌టీయూ, అనంతపురంలో కొన్ని ఖాళీ పట్టాలు కనిపించకుండా పోయాయి. ఆ తర్వాత అవి దొరికినట్లు ప్రచారం చేశారు. దీనిపై ఎలాంటి విచారణ చేపట్టకపోవడంపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి.
‣ ఆంధ్ర, ఆది కవి నన్నయ విశ్వవిద్యాలయాల్లో జవాబుపత్రాల మూల్యాంకనం బాగోలేదని కాగ్ హెచ్చరించింది. 2014-19 కాలంలో ఎస్వీయూలో యూజీ కోర్సుల్లో పునర్ మూల్యాంకనానికి 8 వేల మంది దరఖాస్తు చేయగా.. వీరిలో 6 వేల మంది ఉత్తీర్ణులయ్యారు. అప్పట్లో యూజీ సెమిస్టర్-1 పరీక్షల్లో 7 పేపర్లు, సెమిస్టర్-6లో 9 పేపర్లలో ముగ్గురు విద్యార్థులకు ‘సున్నా’ మార్కులు రాగా.. ఆ తర్వాత ఉత్తీర్ణులైనట్లు ప్రకటించారు. మూల్యాంకనం, పునర్ మూల్యాంకనంపై కాగ్ విశ్వాసం లేదని పేర్కొందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ నీట్‌లో మేటిస్కోరుకు మెలకువలు!
‣ పాదాలు పదిలం... కొలువులు పుష్కలం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.