* బీఈడీ సీట్ల భర్తీలో నిబంధనల ఉల్లంఘన
ఈనాడు, అమరావతి: బీఈడీలో నిబంధనలకు విరుద్ధంగా ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లను సైతం ఇతర రాష్ట్రాల వారితో నింపేస్తున్నారు. ప్రభుత్వం నాలుగేళ్లుగా డీఎస్సీ నిర్వహించకపోవడంతో ఈ కోర్సులో చేరే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. దీంతో కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లు భారీగా మిగిలిపోతున్నాయి. వీటిని స్పాట్ కోటాకు బదిలీ చేయడంతో ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులను యాజమాన్యాలు చేర్చుకుంటున్నాయి. కళాశాలల్లో మొత్తం సీట్లలో 10 శాతం ప్రత్యేకంగా ఈడబ్ల్యూఎస్ కోటాగా పెడుతున్నారు. వీటిని కన్వీనర్ ద్వారా ఉన్నత విద్యామండలి భర్తీ చేస్తోంది. అభ్యర్థుల నుంచి స్పందన లేకపోవడంతో ఈ సీట్లు మిగిలాయి. వాటిని స్పాట్ కింద భర్తీ చేసుకునేందుకు అవకాశం కల్పించడంతో చాలా కళాశాలలు ఒడిశా, పశ్చిమ్‌బంగా, అసోమ్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అభ్యర్థులను చేర్చుకుంటున్నాయి. నిబంధనల ప్రకారం ఏపీకి చెందిన వారినే చేర్చుకోవాలి. లేదంటే వాటిని ఖాళీగా ఉంచాలి. ఆచార్య నాగార్జున, కృష్ణా విశ్వవిద్యాలయాల పరిధిలో ఈ తంతు ఎక్కువగా సాగుతోంది. కొన్ని యాజమాన్యాలు పక్క రాష్ట్రాల నుంచి ఈడబ్ల్యూఎస్ కోటా ధ్రువపత్రాలు తెప్పించి చేర్చుకుంటుండగా.. మరికొన్ని నకిలీ ధ్రువపత్రాలతో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. కొందరు స్థానికంగానే ఒడిశా అధికారుల పేరుతో నకిలీ ధ్రువపత్రాలు తయారు చేస్తున్నారు. వీటిని పరిశీలించేందుకు ప్రత్యేక వ్యవస్థ లేకపోవడంతో నకిలీ పత్రాలు చలామణి అయిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 411 బీఈడీ కళాశాలలు ఉండగా.. వీటిల్లో 34 వేల సీట్లు ఉన్నాయి. ఇందులో 10 శాతంగా 3,400 సీట్లు ఈడబ్ల్యూఎస్ సీట్లు ఉంటాయి. ఈ ఏడాది కన్వీనర్ కోటాలో 3,872 సీట్లు మాత్రమే నిండాయి. ఈ లెక్కన ఈడబ్ల్యూఎస్‌తో కలిపి 33 వేలకు పైగా సీట్లు మిగిలాయి. స్పాట్, యాజమాన్య కోటా సీట్ల భర్తీ వివరాలను ఉన్నత విద్యామండలికి సమర్పించే సమయంలో అన్నింటినీ కలిపి చూపిస్తుండడంతో అధికారులు పట్టించుకోవడం లేదు. కొన్ని కళాశాలలు ఏ రాష్ట్రం అనేదాన్ని పేర్కొనకుండా వివరాలు ఇస్తున్నాయి. కన్వీనర్ కోటాకు మాత్రమే బోధన రుసుముల చెల్లింపు ఉండడంతో ఇతర కోటా సీట్ల భర్తీపై అధికారులు పెద్దగా దృష్టి సారించడం లేదు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ శాంతిభద్రతల సంరక్షణసేనలోకి స్వాగతం!
‣ ప్రఖ్యాత సంస్థలో పరిశోధన డిగ్రీ
‣ ఉన్నత విద్యకు రమ్మంటోంది.. యూకే!
‣ ఇంటర్‌తో వాయుసేనలో అగ్నివీర్ ఉద్యోగాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.