• facebook
  • whatsapp
  • telegram

Fake consultancies: నకిలీ కన్సల్టెన్సీల నయామోసాలు

* శిక్షణ, ఉద్యోగ కల్పన పేరిట యువతకు బురిడీ

ఇంజినీరింగ్‌ పూర్తయి మూడేళ్లు దాటింది. మిత్రుడి సలహాతో కూకట్‌పల్లిలో కన్సల్టెన్సీను సంప్రదించాడు. ప్రముఖ కంపెనీలో పోస్టింగ్‌ ఇప్పిస్తాం.. హెచ్‌ఆర్‌ను దారిలోకి తెచ్చేందుకంటూ రూ.60వేలు తీసుకున్నారు. ఐదు నెలలైనా స్పందన రాకపోవటంతో నిలదీశాడు. అప్పట్నుంచి దిక్కున్నచోట చెప్పుకోమంటూ బెదిరింపు. ఏం చేయాలో పాలుపోక మధ్యవర్తి ద్వారా రూ.25వేలు రాబట్టుకొని వెళ్లిపోయాడు. 

అమీర్‌పేట్‌లోని ఓ శిక్షణ సంస్థ రెండేళ్లు అనుభవం ఉన్నట్టు ఒక యువకుడికి నకిలీ పత్రం సమకూర్చింది. దాని ద్వారా కొలువు సంపాదించిన అతడి పనితీరుపై అనుమానం వచ్చిన సంస్థ విచారణ చేయిస్తే వాస్తవం వెలుగు చూసింది. ఆరు నెలలుగా ఆ యువకుడు తీసుకున్న వేతనం తిరిగి చెల్లించాలని.. లేకుంటే కేసు నమోదు చేస్తామని చెప్పటంతో నగదు కట్టి బయటపడ్డాడు. బాధితుడికి నకిలీ సర్టిఫికెట్‌ ఇచ్చినందుకు ఆ కన్సల్టెన్సీ అతడి 4 నెలల వేతనం తీసుకోవడం కొసమెరుపు.

ఈనాడు, హైదరాబాద్‌: నెలలు.. ఏళ్లు తరబడి ఎదురుచూసిన యువత ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌లో కనిపించే ఉద్యోగ ప్రకటనలకు ఆకర్షితులవుతున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా మోసపోయి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. గ్రేటర్‌ పరిధిలోని మూడు పోలీసు కమిషనరేట్లలో ఏటా 500-600కు పైగా ఉద్యోగం/ఉపాధి అవకాశాల మోసాల కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది 5నెలల వ్యవధిలోనే 200లకు పైగా ఫిర్యాదులు వచ్చినట్టు గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా ఎస్సార్‌నగర్‌ పరిధిలో ఒక ప్రయివేటు సంస్థ శిక్షణ ఉద్యోగాలు కల్పిస్తామంటూ యువతను ఆకట్టుకుంది. పలువురు యువకులు రూ.50-60వేలు చెల్లించి 6 నెలల శిక్షణ పూర్తిచేశారు. ఏడాదికి రూ.2-3లక్షల ప్యాకేజీతో కొలువు పక్కా అని లెక్కలు వేసుకున్నారు. వీళ్లు శిక్షణలో ఉండగానే సంస్థ ప్రతినిధులు వీరి పేర్లతో క్రెడిట్‌కార్డులు/వ్యక్తిగత రుణాలు తీసుకున్నారు. ఈ సొమ్మును తాము వాడుకొని ఉద్యోగాల్లోకి చేరగానే వారి ఖాతాల్లో జమచేస్తామని నమ్మించారు. తరువాత ముఖం చాటేయటంతో బ్యాంకుల నుంచి యువతకు నెలవాయిదాలు చెల్లించాలంటూ నోటీసులు అందటం మొదలైంది. మోసపోయినట్టు గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నకిలీ సంస్థ వెబ్‌సైట్‌ను అంతర్జాలం నుంచి తీసివేయించారు. 

కాస్త ఆగమంటూ వాయిదాలు

గతేడాది అమెరికా, ఇంగ్లండ్‌లో నకిలీ కన్సల్టెన్సీ 150మంది యువకుల నుంచి రూ.2.5కోట్లు కాజేసి ముఖం చాటేసింది. తాజాగా సికింద్రాబాద్‌ పరిధిలో ఒక కన్సల్టెన్సీ విదేశాల్లో ఉద్యోగాలకు అవసరమైన సర్టిఫికెట్లు, పాస్ట్‌పోర్టు, వీసా సమకూర్చుతామంటూ ఒక విద్యాసంస్థకు రూ.3కోట్లకు టోకరా వేసింది. రెండేళ్లుగా ప్రాంగణ ఎంపికలు జరగట్లేదు. కార్పొరేట్‌ సంస్థలు కూడా నియామకాలు చేపట్టడం లేదు. వందశాతం ఉద్యోగాలంటూ శిక్షణ సంస్థలు రేపుమాపంటూ వాయిదాలేస్తున్నాయి. యువత నకిలీ సర్టిఫికెట్లతో ఏదో కంపెనీలో చేరుతున్నారు. పనితీరు సరిగా లేకపోవటంతో దొరికిపోతున్నారు. 


 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నవోదయలో ఉపాధ్యాయ ఉద్యోగాలు

‣ బీటెక్‌లకు సైంటిస్టు కొలువులు

‣ ఉపాధికి డిప్లొమా మార్గాలు

‣ గురిపెట్టండి క్లర్కు కొలువుకు!

Published Date : 11-06-2024 11:48:42

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం