జాతీయ సగటు 105.. రాష్ట్రంలో 94
తగ్గుతున్న పోస్టుగ్రాడ్యుయేషన్ ప్రవేశాలు
ఏఐఎస్‌హెచ్‌ఈ సర్వేలో వెల్లడి
ఈనాడు, అమరావతి: జాతీయ సగటుతో పోల్చితే రాష్ట్రంలో ఉన్నత విద్య చదువుతున్న అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉంది. ప్రతి వంద మంది అబ్బాయిలకు 94మంది అమ్మాయిలే ఉన్నత విద్యలో ఉన్నారు. అదే జాతీయ సరాసరి చూస్తే 105మంది అమ్మాయిలు ఉన్నారు. రాష్ట్రంలో లింగ సమానత్వ సూచిక(జీపీఐ) క్రమంగా పెరుగుతున్నా ఇంకా రాష్ట్రం వెనుకబడే ఉంది. పక్క రాష్ట్రాలతో చూసినా ఈ అంకెల్లో రాష్ట్రానిది వెనకబాటే. పక్కనున్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మన కంటే ముందు వరసలో ఉన్నాయి. ఎంతో వెనుకబడిన రాష్ట్రం అనుకునే ఒడిశా సైతం ఏపీతో సమానంగానే ఉంది. అత్యధికంగా కేరళలో 100మంది అబ్బాయిలకు 152మంది అమ్మాయిలు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ విభాగాల్లోనూ రాష్ట్రంలో తక్కువగానే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అఖిల భారత ఉన్నత విద్య సర్వే 2020-21లో ఇది బహిర్గతమైంది. రాష్ట్రంలో 18-23 ఏళ్లు వయసున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. 2016లో 55.76లక్షల మంది ఉండగా.. 2020కి వచ్చేసరికి 53,43,200 మాత్రమే ఉన్నారు. ఈ ఐదేళ్లలోనే 2.32లక్షల మంది తగ్గారు. ఈ వయసులో ఉన్న వారంతా ఉన్నత విద్య చదివేవారే. ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నత విద్యకు పక్క రాష్ట్రాలకు వెళ్లడంతోనే ఈ సమస్య ఉత్పన్నమవుతోందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ప్రతి లక్ష మంది విద్యార్థులకు 49 కళాశాలలు అందుబాటులో ఉన్నాయి. 2019-20లో 51 చొప్పున ఉండగా.. 2020-21 వచ్చే సరికి రెండు చొప్పున తగ్గాయి.
తగ్గుతున్న పీజీ ప్రవేశాలు..
రాష్ట్రంలో పోస్టుగ్రాడ్యుయేషన్(పీజీ) చదివే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. రెగ్యులర్, దూర విద్య కలిపి 2016-17లో 2,54,650మంది ప్రవేశాలు పొందగా 2020-21 నాటికి 19,5,814మందికి పడిపోయింది. అన్ని యూజీ కోర్సుల్లో కలిపి 13లక్షల నుంచి 16 లక్షలకు పెరిగినా పీజీ చదివేవారు మాత్రం తగ్గుతున్నారు. యూజీ తర్వాత విద్యార్థులు పీజీపై ఆసక్తి చూపడం లేదు. బీటెక్ లాంటి సాంకేతిక కోర్సుల్లో యూజీతోనే ఎక్కువ మంది ఆపేస్తున్నారు. ఎంఫిల్ ప్రవేశాలు సైతం భారీగా తగ్గాయి. 2020-21లో కేవలం 118మంది మాత్రమే చేరారు. పీహెచ్‌డీ ప్రవేశాలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. 2016-17లో 4,672మంది ప్రవేశాలు పొందగా.. 2020-21లో ఇది 6,991కి పెరిగింది.
జీఈఆర్ మెరుగు..
ఉన్నత విద్యలో స్థూల ప్రవేశాల నిష్పత్తి(జీఈఆర్) పెరిగింది. 2019-20లో 35.1శాతంగా ఉన్న జీఈఆర్ 2020-21లో 37.2శాతానికి పెరిగింది. జాతీయ సగటు కంటే దాదాపు 10శాతం అధికంగా ఉంది. ఎస్సీల్లో 33.6శాతం, ఎస్టీల్లో 31.8శాతంగా ఉంది. రాష్ట్రంలో మొత్తం 2,601 కళాశాలలు ఉండగా.. వీటిల్లో సరాసరిన 541మంది విద్యార్థులున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో 604, ప్రైవేటులో 519మంది చొప్పున ఉన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ నీట్‌లో మేటిస్కోరుకు మెలకువలు!
‣ పాదాలు పదిలం... కొలువులు పుష్కలం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.