• facebook
  • whatsapp
  • telegram

Lokesh: బడికెళ్లే పిల్లలందరికీ ‘తల్లికి వందనం’

* పథకం అమలుకు విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి లోకేశ్‌
 


ఈనాడు, అమరావతి: కుటుంబంలో చదువుకునే పిల్లలందరికీ ‘తల్లికి వందనం’ పథకాన్ని వర్తింపజేస్తామని మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పథకం లబ్ధి అందిస్తామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘పథకం అమలుకు విధివిధానాలను ఖరారు చేయడానికి కొంత సమయం పడుతుంది. గత ప్రభుత్వం అర్హుల సంఖ్యను తగ్గించేందుకు..   కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. అది కూడా రూ.15 వేలు కాకుండా.. రూ.13 వేలే  ఇచ్చింది. ఇలాంటి లోపాలు లేకుండా పథకాన్ని అమలు చేయడానికి మంత్రులు, నిపుణులతో చర్చిస్తాం’ అని పేర్కొన్నారు. కుటుంబ విద్యుత్‌ వినియోగం 300 యూనిట్లు దాటిందని, ఆధార్‌ కార్డు చిరునామాలో మార్పు ఉందని ఇలా రకరకాల కొర్రీలతో గత ప్రభుత్వం లబ్ధిదారుల సంఖ్యను తగ్గించిందని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ లక్ష్మణరావు చెప్పారు. ఈ పథకంతో ప్రభుత్వ పాఠశాలల ఉనికి ప్రమాదంలో పడకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్సీ  వెంకటేశ్వరరావు సూచించారు. ‘రాష్ట్రంలోని 11 వేల పాఠశాలల్లో 10 మంది కంటే తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు.


* 2019తో పోలిస్తే 2024 నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల  సంఖ్య సుమారు 72 వేలు తగ్గింది. వీటికి కారణాలేంటి? విద్యార్థుల సంఖ్యను ఎలా పెంచాలి? నాణ్యమైన విద్య ఎలా అందించాలని యోచిస్తున్నాం. పొరుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న అత్యున్నత విధానాలను పరిశీలిస్తున్నాం. ఉత్తర్‌ప్రదేశ్, దిల్లీల్లో అధ్యయనానికి అధికారుల బృందాన్ని పంపాం. త్వరలో నేను కూడా వెళ్లి పరిశీలించిన తర్వాత.. మన రాష్ట్రానికి సరిపడా నమూనా ఎలా ఉండాలనేది రూపొందిస్తాం. దీనిపై అందరి అభిప్రాయాలను  తీసుకున్న తర్వాత.. వచ్చే విద్యా సంవత్సరం   నుంచి కొత్త విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తాం’ అని లోకేశ్‌ చెప్పారు.


* మాతృ భాషను కాపాడుకోవాల్సిందే
 

  గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన టోఫెల్‌పై సమీక్షించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని మంత్రి లోకేశ్‌ చెప్పారు. ‘టోఫెల్‌లో ఉచ్చారణ అంతా అమెరికన్‌ యాక్సెంట్‌లో ఉంటుంది. అది 3 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు అర్థం కావట్లేదు. ఉపాధ్యాయులకు శిక్షణ లేకపోవడం వల్ల పిల్లలకు నేర్పించలేకపోతున్నారు. ప్రపంచంతో పోటీ పడాలంటే ఆంగ్ల మాధ్యమంలో విద్య అవసరం. కానీ మాతృభాషను కాపాడుకోవాలి. మాతృ భాష మాట్లాడటంలో విద్యార్థులు ఇబ్బంది పడకూడదు. నేను కూడా మాతృభాషలో మాట్లాడేందుకు తడబడుతుంటా. నేనూ ఇంజినీరింగ్‌కు వెళ్లే ముందు టోఫెల్‌ శిక్షణ తీసుకున్నా. ఉత్తర్‌ప్రదేశ్‌లో విద్యార్థులకు కమ్యూనికేషన్‌ ఇంగ్లిష్‌ బోధించే విధానం పకడ్బందీగా అమలు చేస్తున్నారు. దాన్ని పరిశీలిస్తున్నాం’ అని మంత్రి వివరించారు.


* సాగునీటి రంగాన్ని గాలికొదిలేశారు..
 

  రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు మండలిలో పేర్కొన్నారు. పోలవరం, సాగునీటి ప్రాజెక్టులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా.. ‘గత ప్రభుత్వం ఐదేళ్లలో ఈ రంగానికి రూ.49,395 కోట్లు కేటాయించింది. అందులో రూ.19,220 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. దీనివల్లే రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా దెబ్బతిన్నాయి’ అని పేర్కొన్నారు.


* మండలి రెండుసార్లు వాయిదా
 

  శాసనమండలిలో 360 నిబంధన కింద ఎక్సైజ్‌పై శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని ఎజెండాలో పొందుపరచడంపట్ల ఛైర్మన్‌ మోషేనురాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిబంధన కింద సభలో స్టేట్‌మెంట్‌ (ప్రకటన) ఇవ్వచ్చు కాని, శ్వేతపత్రం ప్రవేశపెట్టడం సాధ్యం కాదనడంతో సభ వాయిదా పడింది. శాసనసభ వ్యవహారాల మంత్రి కేశవ్, తెదేపా ఎమ్మెల్సీలు ఛైర్మన్‌ను కలిసి మాట్లాడారు. ఆ నిబంధన మేరకు శ్వేతపత్రానికి బదులు స్టేట్‌మెంట్‌ అని మార్చి, అప్పటికప్పుడు కొత్త ఎజెండాను ప్రకటించారు. సభ సమావేశమైన తర్వాత మంత్రి కొల్లు రవీంద్ర ఎక్సైజ్‌పై ప్రకటన చేశారు. భోజన విరామం తర్వాత కోరం (10 మంది సభ్యులు) లేక సభ మరోసారి వాయిదా పడింది. తర్వాత సరిపడా సభ్యులు రావడంతో సభ కొనసాగింది.


* మహిళల రక్షణకు ప్రాధాన్యం
 

  2024 నాటికి రాష్ట్రంలో బాలికలు, మహిళల అదృశ్యం కేసులు 46,538 నమోదయ్యాయని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. వాటి నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘గత ప్రభుత్వ హయాంలో మిస్సింగ్‌ కేసుల సంఖ్య రెట్టింపయింది. రాష్ట్రంలోని అనంతపురం, గుంటూరు, ఏలూరుల్లో యాంటీ ట్రాఫికింగ్‌ యూనిట్లు పనిచేస్తున్నాయి. ఈ కేసుల విచారణ ప్రస్తుతం సీఐడీ పరిధిలో ఉంది. ఇప్పటికీ ఆచూకీ దొరకని కేసులను ఎలా పరిష్కరించాలనే దానిపై కమిటీ వేస్తాం’ అని సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 25-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.