• facebook
  • whatsapp
  • telegram

AP Schools: బడిలో గంజాయి పొగ!

మత్తుకు బానిసవుతున్న బాల్యం
విద్యార్థులే లక్ష్యంగా పాఠశాల సమీపంలో విక్రయాలు

|ఈనాడు డిజిటల్‌, అనకాపల్లి - న్యూస్‌టుడే, అచ్యుతాపురం: ‘నాడు- నేడు’ ద్వారా పాఠశాలల రూపురేఖలను మార్చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా చెబుతోంది. తరగతి గదిలోని పిల్లల్లో వస్తున్న మార్పులను మాత్రం గమనించడం లేదు. అనకాపల్లి జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా కొన్ని పాఠశాలల్లో గంజాయి మత్తు గుప్పుమంటోంది. సామాజిక మాధ్యమాల ప్రభావం, విచ్చలవిడిగా లభిస్తున్న గంజాయి కారణంగా కొందరు భావి పౌరులు మత్తుకు అలవాటు పడుతున్నారు. ప్రధానంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కళాశాలల చుట్టుపక్కల విద్యార్థులే లక్ష్యంగా గుట్టుగా గంజాయి విక్రయాలు సాగుతున్నాయి.
నిషా.. సీసా
గంజాయిని హుక్కాలా పీల్చేందుకు తయారు చేసిన ఓ సీసా అచ్యుతాపురం మండలంలోని ఓ పాఠశాల పక్కనే దొరకడం తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. ఖాళీ సీసాకు మధ్యలో ఓ వైపు రంధ్రం చేసి అందులోకి స్ట్రాలాగా బొప్పాయి గొట్టం జొప్పించారు. సీసాలో గంజాయి పొగను నింపి, గొట్టంతో పీల్చేలా ఈ ఏర్పాటు ఉంది. పాఠశాల విడిచిపెట్టాక కొందరు విద్యార్థులు చాటుగా దీన్ని ఉపయోగిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
 విశాఖ నగరంలోనూ కొందరు వలస కార్మికుల పిల్లలు, తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన కొందరు పిల్లలు ఈ వ్యసనం బారినపడినట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా కొవిడ్‌ సమయంలో చదువును పక్కనపెట్టిన కొంతమంది పిల్లలు దారి తప్పారని విద్యాశాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. విద్యా సంస్థల చుట్టుపక్కలే గుట్టుగా మత్తు పదార్థాల విక్రయాలు సాగుతుండటమూ ఓ కారణమని చెబుతున్నారు
నిఘా పెట్టాం..: శ్రీనివాసరావు, డీఎస్పీ, పరవాడ
గంజాయి విక్రయాలపై నిఘా పెట్టాం. రవాణాను కట్టడి చేశాం. పూర్తిగా నియంత్రించేలా చర్యలు తీసుకుంటున్నాం. మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే కష్టనష్టాలపై అవగాహన కల్పిస్తున్నాం. గంజాయి విక్రయాలు, వినియోగంపై ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసులకు తెలియజేసి సహకరించాలని కోరుతున్నాం.
కళ్లముందే  తాగేస్తున్నారు..
 ‘బడికెళ్లే పిల్లలూ గంజాయి తాగున్నారని పోలీసులే చెబుతున్నారు’ అని ఎలమంచిలి ఎమ్మెల్యే ఉప్పలపాటి రమణమూర్తి రాజు ఇటీవల అచ్యుతాపురం ఉన్నత పాఠశాలలో ట్యాబ్‌ల పంపిణీలో పేర్కొనడం సమస్య
తీవ్రతకు అద్దం పడుతోంది.
 ఇటీవల అచ్యుతాపురం మండలం హరిపాలెం-కొండకర్ల రహదారిలో పాఠశాల ముగిశాక కొందరు పిల్లలు గంజాయి తాగుతుండటాన్ని ఓ పెద్దాయన చూశారు. మంచిది కాదని వారించగా.. వారు ఆయనతో హేళనగా మాట్లాడి దాడి చేయబోయారు.
‣ విశాఖ నగర పరిధిలోని ఓ బడి సమీపంలో విద్యార్థులు రోడ్డుపై కొట్లాటకు దిగారు. మరో పాఠశాలలో ఫ్యాన్లు విరగొట్టేశారు. గంజాయి మత్తువల్లే విద్యార్థులు ఇలా ప్రవర్తించారని తెలుసుకున్న అధికారులు విషయం బయటికి పొక్కకుండా వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి వదిలేశారు.
 అచ్యుతాపురం మండలంలోని ఓ బడి సమీపంలో విద్యార్థులే లక్ష్యంగా కొందరు గంజాయి విక్రయిస్తున్నారు.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ బాగా రాసేవాళ్ల‌కు బోలెడు ఉద్యోగాలు!

‣ ఎల్ఐసీలో ఏఏఓ కొలువులు

‣ నవతరానికి నయా కొలువులు!

‣ సొంతంగా నేర్చుకుంటున్నారా?

‣ అందరి అవసరాలకు అందుబాటులో కోర్సులు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 30-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.