• facebook
  • whatsapp
  • telegram

nursing: నర్సింగ్‌ విద్యార్థులకు జపాన్‌లో మెరుగైన ఉపాధి

 బీఎస్సీ నర్సింగ్‌, జీఎన్‌ఎం కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు అవకాశాలు
 

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘ప్రపంచ వ్యాప్తంగా నర్సింగ్‌ విద్యార్థులకున్న ఉపాధి అవకాశాల కంటే జపాన్‌లో మరింత మెరుగైన అవకాశాలున్నాయి.. మధ్యప్రాచ్య దేశాలు, ఇతర దేశాల్లో బీఎస్సీ నర్సింగ్‌ చేసిన విద్యార్థులకు ఉద్యోగాలు లభిస్తుంటే.. ఇంటర్మీడియట్‌ తర్వాత జీఎన్‌ఎం కోర్సు పూర్తిచేసిన నర్సింగ్‌ విద్యార్థులకు సంరక్షకులుగా ఉద్యోగాలు ఇచ్చేందుకు జపాన్‌లో పలు సంస్థలు ముందుకు వస్తున్నాయ’ని టోక్యో కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కేర్‌ గివర్‌ సంస్థ సుకుయ్‌ సంచాలకులు మైహేరా పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలనుంచి అర్హులైన నర్సింగ్‌ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్వంలో కొనసాగుతున్న టామ్‌కామ్‌(తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ)తో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆమె హైదరాబాద్‌ వచ్చారు. తొలుత వంద మందికి ఉద్యోగాలు ఇస్తామని, దశల వారీగా పదివేల మందికి ఉద్యోగాలిచ్చేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు.



   ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట  

జపాన్‌లో వయోధికుల సంఖ్య ఏటా పెరుగుతోంది. వీరిని సంరక్షించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేటు ఆసుపత్రులున్నా వైద్యసేవలు మాత్రమే అందుతున్నాయి. ఇళ్ల వద్ద వారిని జాగ్రత్తగా చూసుకునేందుకు, చికిత్సలు అందించేందుకు అవసరమైనంత మంది నర్సింగ్‌ అధికారులు, సిబ్బంది లేరు. అందుకే విదేశాల నుంచి నర్సింగ్‌ పూర్తిచేసిన వారికి ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చి సంరక్షకులుగా నియమించాలని పలు కార్పొరేటు, ప్రైవేటు సంస్థలు యోచించాయి. ఈ క్రమంలోనే భారత్‌లోని వివిధ రాష్ట్రాల్లో నర్సింగ్‌ కోర్సు పూర్తిచేసిన వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు నిర్వహిస్తున్నాయి. మా సంస్థ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో హైదరాబాద్‌కు వచ్చాం. ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చించనున్నాం.
 


   అక్కడ ఉద్యోగం వస్తే.. రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు పొదుపు   

జపాన్‌లో ఉద్యోగం వచ్చిన ప్రతి ఒక్కరూ సులభంగా, ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా విధులు నిర్వహించుకునే వాతావరణం ఉంటుంది. నెల జీతంలో ఖర్చులు పోగా భారత కరెన్సీలో నెలకు రూ.50వేల నుంచి రూ.లక్ష వరకూ పొదుపు చేయవచ్చు. జీఎన్‌ఎం పూర్తిచేసినవారు అక్కడ నర్సింగ్‌ కోర్సును చదివి నర్సులుగా ఉద్యోగాలు కూడా పొందేందుకు అవకాశాలున్నాయి. జపాన్‌లోని నర్సింగ్‌ ఉద్యోగులకు సమానంగా వేతనాలు ఇస్తారు. నర్సింగ్‌ కోర్సు పూర్తిచేసినవారు జపాన్‌లో ఉద్యోగం చేయాలనుకుంటే.. ఎనిమిది నెలల్లో జపాన్‌ భాషను నేర్చుకునే జేఎల్‌పీటీఎన్‌-4 కోర్సును పూర్తిచేయాలి. జపాన్‌ భాష పరీక్షలో ఉత్తీర్ణులయ్యాక ఉద్యోగంలోకి తీసుకుంటారు. 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ పరీక్ష లేకుండానే ఫార్మా కొలువులు

‣ వాయుసేనలో అగ్నివీరులవుతారా?

‣ బెల్‌లో ఉద్యోగాలు!

‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 25-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.