* ఒక్క దరఖాస్తుతోనే మూడు విభాగాల పోస్టులకు అర్హత
* జిల్లాల్లో మొదలైన వైద్య ఆరోగ్యశాఖ నియామక ప్రక్రియ
ఈనాడు, అమరావతి: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో ఉమ్మడి నోటిఫికేషన్ల ద్వారా పారా మెడికల్ నియామకాలు జరుగుతున్నాయి. ఈ శాఖలో ఉన్న డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీహెచ్), ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని ఆస్పత్రుల్లో ఉండే పోస్టులకు హెచ్ఓడీ కార్యాలయాలు గతంలో విడివిడిగా నోటిఫికేషన్లు జారీచేసేవి. ఇప్పుడు కొత్త నిర్ణయం ప్రకారం ఒకే నోటిఫికేషన్‌తో మూడు విభాగాల్లో పోస్టులకు అర్హులవుతారు. అంతేకాదు.. ఈ నోటిఫికేషన్లకు వచ్చే దరఖాస్తులను ఏడాదిపాటు పరిగణనలోకి తీసుకుంటారు. అంటే, ఈ ఏడాదిలో ఏదైనా పోస్టు ఖాళీ అయితే దానికి ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఇప్పటికే ఉన్న దరఖాస్తుల నుంచి ఎంపికచేస్తారు. సుమారు 2,500 రకరకాల పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ల జారీ మొదలైంది. వీటిలో జనరల్ డ్యూటీ అటెండెంట్స్, ఎలక్ట్రీషియన్, ఈసీజీ, ఈఈజీ, డైటీషియన్, డెంటల్ హైజినిస్ట్, క్యాథ్‌ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2, బయోమెడికల్ ఇంజినీర్, ఆడియో, విజువల్, ఆడియోమెట్రీ, బయోమెడికల్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ లాంటి 42 రకాల పోస్టులు ఉన్నాయి. వీటిల్లో ఎక్కువ పోస్టులను ఒప్పంద విధానంలోనే భర్తీచేస్తున్నారు.
ఒకే అర్హతతో పోస్టుల భర్తీ
ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, జిల్లా, సామాజిక, ప్రాంతీయ ఆస్పత్రులు, బోధనాసుపత్రుల్లో 42 రకాల పారా మెడికల్ పోస్టుల్లో అవసరమైన వాటిని ఒకే అర్హతతో నియమిస్తున్నారు. నెల్లూరు బోధనాసుపత్రిలో, వైద్య కళాశాలలో పలు ఉద్యోగాల భర్తీకి విడివిడిగా నోటిఫికేషన్లను జారీచేశారు. గతంలో ఒక నోటిఫికేషన్లో అటెండరు పోస్టుకు దరఖాస్తు చేసేవారికి సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలనేవారు మరో నోటిఫికేషన్లో ఈ షరతు ఉండేది కాదు. ఇలాంటి సమస్యలు కొత్త విధానంతో తగ్గుతాయని అధికారులు తెలిపారు.
కౌన్సెలింగ్ సమయంలో పోస్టుల వారీగా వివరాల ప్రదర్శన
కృష్ణా, చిత్తూరు, పశ్చిమగోదావరి, ఇతర జిల్లాల్లో నోటిఫికేషన్ల జారీ మొదలైంది. జిల్లా కలెక్టర్ నియామక కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. పోస్టుల వారీగా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మెరిట్ ప్రాతిపదికన కౌన్సెలింగ్ సమయంలో అభ్యర్థులకు ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయో చూపిస్తారు. అభ్యర్థి తమకు నచ్చిన పోస్టును ఎంపికచేసుకోవచ్చు.
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ మొబైల్ యాప్ డెవలపర్లకు డిమాండ్!
‣ మెరుగైన భవితకు మేలైన నిర్ణయం!
‣ వ్యవసాయ కోర్సులకు జాతీయ పరీక్ష
‣ బ్యాంకు ఉద్యోగం... సాధించే వ్యూహం!
‣ దేశ రాజధానిలో టీచింగ్ ఉద్యోగాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.