• facebook
  • whatsapp
  • telegram

AICTE: కోర్‌ బ్రాంచీల్లో చేరితే స్కాలర్‌షిప్‌

ఈ విద్యాసంవత్సరం నుంచి అమలు


ఈనాడు, హైదరాబాద్‌: మీరు మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్‌ బ్రాంచీల్లో ఇంజినీరింగ్, డిప్లొమాలో చేరాలనుకుంటున్నారా?.. అయితే మీకు స్కాలర్‌షిప్‌ ఇచ్చేందుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) సిద్ధంగా ఉంది. ఇంజినీరింగ్‌ అంటే కంప్యూటర్‌ సైన్స్‌ అన్నట్లుగా పరిస్థితి మారిపోవడంతో కోర్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచీల్లో చేరేలా విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఆ సంస్థ ఈ విద్యాసంవత్సరం (2024-25) నుంచి ఉపకార వేతనాలు మంజూరు చేయనుంది. అందుకు ఇంటర్, తత్సమాన పరీక్షల్లో వచ్చిన మార్కులను కొలమానంగా తీసుకోనుంది. దేశవ్యాప్తంగా 5 వేల ఇంజినీరింగ్, మరో 5 వేల మంది పాలిటెక్నిక్‌ డిప్లొమా విద్యార్థులను ఎంపిక చేయనుంది. 


యంగ్‌ ఎచీవర్స్‌ స్కాలర్‌షిప్‌ అండ్‌ హోలిస్టిక్‌ అకడమిక్‌ స్కిల్స్‌ వెంచర్‌ ఇనిషియేటివ్‌ (యశస్వి) పేరిట పథకాన్ని ఏఐసీటీఈ ప్రవేశపెట్టింది. దేశంలోని మొత్తం బీటెక్‌ సీట్లలో 60 శాతం కంప్యూటర్‌ సైన్స్, ఐటీ సంబంధిత బ్రాంచీల్లోనే చేరుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అది 75 శాతం వరకూ ఉంది. కోర్‌ బ్రాంచీల్లో ఒక్క ఈసీఈలోనే 80 శాతానికిపైగా సీట్లు భర్తీ అవుతున్నాయి. తెలంగాణలో గత ఏడాది మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్‌ బ్రాంచీల్లో సగటున 40 శాతం సీట్లే నిండాయి. కేంద్ర ప్రభుత్వం మేక్‌ ఇన్‌ ఇండియా పేరిట మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా దేశాన్ని మార్చాలని భావిస్తుండగా.. విద్యార్థులు మాత్రం సాఫ్ట్‌వేర్‌ వైపు చూస్తున్నారు. ప్రముఖ కళాశాలలు సైతం కోర్‌ బ్రాంచీల్లో యాజమాన్య కోటా సీట్లను కన్వీనర్‌ కోటా ఫీజుకే ఇస్తామని బతిమలాడుకోవాల్సిన దుస్థితి. ఈ పరిస్థితిలో మార్పు తేవాలని, కోర్‌ ఇంజినీరింగ్‌లో కూడా ప్రతిభావంతుల్ని చేర్పించాలన్న ఉద్దేశంతో ఏఐసీటీఈ ఈ పథకానికి రూపకల్పన చేసింది. ఎంపికైన ఇంజినీరింగ్‌ విద్యార్థులకు సంవత్సరానికి రూ.18 వేలు, డిప్లొమా విద్యార్థులకు రూ.12 వేల చొప్పున ఇస్తారు. బీటెక్, డిప్లొమా తొలి ఏడాదిలో చేరిన వారు నేషనల్‌ ఇ-స్కాలర్‌షిప్‌ పోర్టల్‌(ఎన్‌ఎస్‌పీ)లో దరఖాస్తు చేసుకోవాలి. కేవలం సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్‌(సీసీఈఈఎం) బ్రాంచీల్లో చేరినవారు మాత్రమే అర్హులు. తెలంగాణ ప్రభుత్వం సైతం మిగిలిన బ్రాంచీల్లో విద్యార్థుల కంటే ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ ఎక్కువగా ఇవ్వాలని యోచిస్తోంది. దీనిపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు.
 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ హెచ్‌సీఎల్‌లో జూనియర్‌ మేనేజర్‌లు!

‣ క్లర్క్‌ కొలువు సాధనతో సులువు!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 06-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.