• facebook
  • whatsapp
  • telegram

SSC Exams: ప్రణాళికతో చదివితే పదిలో విజయం

* మిగిలింది ఏడు రోజులే

* విద్యార్థులకు విషయ నిపుణుల సూచనలు

న్యూస్‌టుడే, కరీంనగర్‌ విద్యావిభాగం:  పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు సమీపిస్తున్నాయి. విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఉత్తమ ఫలితాల సాధనకు నిరంతరం శ్రమిస్తున్నారు. ఇప్పటికే ప్రీఫైనల్‌ రాసి ఉన్నారు. పబ్లిక్‌ పరీక్షలు సమీపిస్తుండటంతో ఒకింత భయం, ఆత్మవిశ్వాసం వారిలో తొణికిసలాడుతోంది. ఏప్రిల్‌ 3న ప్రారంభమయ్యే వాటికి ఏడు రోజుల సమయమే మిగిలి ఉంది. మంచి మార్కుల సాధనకు ఏం చదవాలనే సందేహాలు వారిని కలవరపరుసున్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ సమయంలో పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలనే అంశంపై జిల్లాలోని విషయ నిపుణుల సూచనలతో ‘న్యూస్‌టుడే’ కథనమిది.

సాధనతో భౌతికశాస్త్రంలో సత్ఫలితాలు

- బి.ఓదెలు కుమార్‌, ఫిజిక్స్‌, జడ్పీహెచ్‌ఎస్‌ పచ్చునూర్‌

* పుస్తకంలోని చిత్రాలను ఎక్కువగా సాధన చేయాలి.

సమస్యలు(లెక్కలు) 1, 2, 4, 5, 9, 10 పాఠాల నుంచి వచ్చే అవకాశముంది. 1, 4, 9 పాఠాల లెక్కలు సాధన చేయాలి.

* తేడాలు(బేధాలు)పై అవగాహన పెంచుకుని పట్టు సాధించాలి.

* నిజ జీవిత ఉపయోగాల్లో పాఠాలను చదివితే పరీక్షలో మంచి మార్కులు సాధించవచ్చు. ప్రయోగాలు, కృత్యాలు చదివేటప్పుడు విధానం, కావాల్సిన పరికరాలు, పరిశీలనలు, జాగ్రత్తలను తప్పక చదివి వాటిని గుర్తుపెట్టుకోవాలి.

ప్రతి పాఠ్యాంశంలోని ముఖ్యమైన ప్రశ్నలను పునశ్చరణ చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. దీని ద్వారా పార్ట్‌-బిలో కూడా ఎక్కువ మార్కులు సాధించవచ్చు.

గణితంలో కీలక భావనలు చదవాలి

- సముద్రాల హరికృష్ణ, మ్యాథ్స్‌, జడ్పీహెచ్‌ఎస్‌ కురిక్యాల

గణిత సూత్రాలు, ముఖ్యమైన భావనలను చదివి అవగాహన పెంచుకోవాలి.

* ప్రాథమిక భావనలైన ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, గుణిజాలు, కారణాంకాలు మొదైలన వాటిని నెమరు వేసుకోవడం ద్వారా సమితులు, సంభావ్యత అధ్యాయాల్లో చక్కగా ఉపయోగపడుతాయి.

కఠినమైన సమస్యలను ఒకటి రెండు సార్లు అభ్యసనం చేయాలి.

పార్ట్‌-బికి 20 మార్కులు. బహుళైచ్ఛిక రూపంలో ఇచ్చే ప్రశ్నలకు సమాధానాలు రాయాలంటే అన్ని పాఠాలపై అవగాహన అవసరం.

* గ్రాఫ్‌కి సంబంధించిన సమస్యలకు రేఖాచిత్రాన్ని పెన్సిల్‌తో గీయాలి. సూచికలు పెట్టాలి. నిర్మాణాలకు చిత్తుపటం వేయాలి.

* త్రికోణమితి-అనువర్తనాలు అనే అధ్యయాలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు రాసేప్పుడు సరైన పటాన్ని తప్పక గీయాలి.

అవగాహన పెంచుకుంటే జీవశాస్త్రం సులభం

- కె.ఎస్‌.అనంతాచార్య, బయోసైన్స్‌, జడ్పీహెచ్‌ఎస్‌ వెల్ది

* జీవశాస్త్రం చదవడం సులభం, అన్ని అంశాలు నిజ జీవితంతో ముడిపడి ఉంటాయి. అన్ని పాఠాల పేర్ల భావనలను విద్యార్థులు పూర్తి తెలుసుకోవాలి.

* 9, 10 పాఠాల నుంచి పర్యావరణానికి సంబంధించి ప్రశ్నలు వస్తున్నందున వాటిపై పట్టు సాధించాలి.

* ప్రయోగం ఉద్దేశం, పరికరాలు, విధానం, ఫలితాలను రాసేలా అధ్యయనం చేయాలి.

* పటాలపై దృష్టి నిలపడంతోపాటు భాగాలను గుర్తించడం, దాని విధిని తెలుసుకోవాలి.

* ప్రతి పాఠాన్ని చదివి అవగాహన పెంచుకోవాలి.

* జవాబులు రాసేటప్పుడు విద్యార్థులు విజ్ఞానశాస్త్ర సంబంధిత సాంకేతిక పదజాలాన్ని ఉపయోగించాలి.

* సైన్స్‌ పరీక్ష ఉ.9.30 నుంచి మ.12.50 వరకు ఉంటుంది. ఇందులో జీవశాస్త్రం పరీక్ష ఉ.11.20 నుంచి మ.12.50 వరకు జరుగుతుంది. పార్ట్‌-బికి 15 ని.ల సమయం కేటాయించారు.

సాంఘికశాస్త్రం క్లుప్తంగా చదవాల్సిందే..  

- ఆరెల్లి కుమారస్వామి, సోషల్‌, జడ్పీహెచ్‌ఎస్‌, ముదిమాణిక్యం

* విద్యార్థులు అన్ని పాఠాలపై అవగాహన కల్గి ఉండాలి.

* పేరాగ్రాఫ్‌ పరిచయ వాక్యం, విశ్లేషణ, ముగింపు అనే మూడు సూచికాలతో సమాధానం రాయాలి.

* పుస్తకంలోని చదివిన వాటికి ప్రస్తుత సమకాలీన అంశాలను జోడించి ప్రశ్నలు అడుగుతున్నందున వాటికి సంబంధించిన పాఠాలపై అవగాహన పెంచుకోవాలి.

* పాఠ్య పుస్తకం దాటి పటాలను అడగరు.

* భారతదేశం, తెలంగాణ రాష్ట్ర అవుట్‌లైన్‌ పటాలను గీయడం, సరిహద్దు రాష్ట్రాలను గర్తించడం వంటి వాటిపై సాధన చేయాలి. పుస్తకంలోని ప్రతి ప్రదేశాన్ని గుర్తించి భారతదేశ, ప్రపంచ పటాలను సాధన చేయాలి.

* సమాచార నైపుణ్యం, పట నైపుణ్యం, ప్రశంస-సున్నితత్వం, మల్టీఫుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలపై ఎక్కువ దృష్టి పెడితే మంచి మార్కులు పొందవచ్చు.

* పార్ట్‌-బిలో 20 మార్కులకు మల్టీఫుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఇంటర్‌తో వాయుసేనలో అగ్నివీర్‌ ఉద్యోగాలు

‣ ఐఐటీలో న్యాయవిద్య

‣ భవిష్యత్తు శాస్త్రవేత్తలకు, ప్రొఫెసర్లకు నెట్‌!

‣ కాలుష్య నియంత్రణ బోర్డులో కొలువులు

‣ అమెరికాలో అడ్వాన్స్‌డ్‌ కోర్సులు ఇవే!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.