• facebook
  • whatsapp
  • telegram

Supreme Court: ప్రాథమిక పాఠశాలల టీచర్‌ పోస్టులకు బీఎడ్‌లు అన‌ర్హులు

* వారి నియామకం విద్యాహక్కు చట్టానికి విరుద్ధం

* రాజస్థాన్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పు

ఈనాడు, దిల్లీ: ప్రాథమిక పాఠశాలల టీచర్‌ పోస్టులకు బీఎడ్‌ (B.Ed) అభ్యర్థులు అర్హులు కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. వారి నుంచి ప్రాథమిక స్థాయి విద్యార్థులకు మెరుగైన బోధనను ఆశించలేమని పేర్కొంది. ప్రాథమిక పాఠశాలల టీచర్‌ పోస్టులకు బీఎడ్‌ అభ్యర్థులూ అర్హులేనని ప్రకటిస్తూ నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (NCTE) 2018లో నోటిఫికేషన్‌ ఇచ్చింది. దాన్ని కొట్టివేస్తూ.. రాజస్థాన్‌లో దేవేశ్‌ శర్మ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో అక్కడి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకెక్కగా.. హైకోర్టు ఉత్తర్వులను సమర్థిస్తూ జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ సుధాంశు ధూలియాల ధర్మాసనం తాజాగా తీర్పు వెలువరించింది. ‘‘ప్రాథమిక పాఠశాలల టీచర్‌ పోస్టులకు బీఎడ్‌ను అర్హతగా చేరుస్తూ ఎన్‌సీటీఈ తీసుకున్న నిర్ణయం ఏకపక్షంగా, అహేతుకంగా కనిపిస్తోంది. పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యతోపాటు నాణ్యమైన విద్యను అందించాలని విద్యాహక్కు చట్టం చెబుతోంది. నాణ్యతలో రాజీపడితే ఉచిత, నిర్బంధ విద్యకు అర్థమే ఉండదు. నాణ్యమైన విద్య అందించాలంటే అర్హులైన ఉత్తమ ఉపాధ్యాయులను నియమించాలి. డీఎడ్‌ అభ్యర్థులకు ప్రాథమిక స్థాయి విద్యార్థులకు చదువు చెప్పేలా శిక్షణనిస్తారు. బీఎడ్‌ విద్యార్థులకు మాధ్యమిక, ఉన్నత మాధ్యమిక విద్యార్థులకు బోధించేలా శిక్షణ అందుతుంది. కాబట్టి బీఎడ్‌ అభ్యర్థుల నుంచి ప్రాథమిక స్థాయి విద్యార్థులకు మెరుగైన బోధనను ఆశించలేం. వారిని ఆ పోస్టులకు అర్హులుగా నిర్ణయించడం విద్యాహక్కు చట్టానికి విరుద్ధం. ‘ఆర్టికల్‌-21ఎ’లో పేర్కొన్న ప్రాథమిక హక్కులకు వ్యతిరేకం. కేంద్రప్రభుత్వం వారిని అర్హులుగా ప్రకటించి రాజ్యాంగం, చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించింది. ఎన్‌సీటీఈ లక్ష్యం విద్యా ప్రమాణాలను మెరుగుపరచడమే తప్ప.. బీఎడ్‌ శిక్షణ పొందినవారికి ఉద్యోగావకాశాలు కల్పించడం కాదు’’ అని ధర్మాసనం పేర్కొంది.


వారి అవకాశాలు కుంచించుకుపోతాయి


డిప్లొమా ఉన్నవారికే పరిమితమైన ప్రాథమిక పాఠశాల టీచర్‌ పోస్టుల్లో బీఎడ్‌వారినీ అనుమతిస్తే డీఎడ్‌ అభ్యర్థుల అవకాశాలు కుంచించుకుపోతాయని ధర్మాసనం తెలిపింది. ‘‘ప్రాథమిక పాఠశాల టీచర్లకు డీఎడ్‌ తప్పనిసరి అని నిర్ణయించడం వెనుక ఓ కారణం ఉంది. అప్పుడప్పుడే బడిలోకి ప్రవేశించిన పిల్లలకు చదువు చెప్పడంలో వారికి తగిన శిక్షణనిస్తారు. తొలిసారి పిల్లలు టీచర్‌కు ఎదురుపడి మాట్లాడేది ఈ దశలోనే. ఆ అంకుర దశలో విద్యార్థులకు చక్కని పునాది వేయడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ప్రాథమిక పాఠశాలల్లో మంచి అర్హులైన, శిక్షణ పొందిన టీచర్లు అత్యవసరం. డీఎడ్‌తో అలాంటివారు తయారవుతారు. బీఎడ్‌ అనేది భిన్నమైన అర్హత, శిక్షణ. అది ఉన్నతమైన అర్హతే అయినప్పటికీ ప్రాథమిక తరగతుల బోధనకు సరిపోదు. ఈ విషయాన్ని గుర్తించే.. 2018 నాటి నోటిఫికేషన్‌లోనూ బీఎడ్‌ అభ్యర్థులు టీచర్‌గా నియమితులైన తర్వాత తప్పనిసరిగా ప్రాథమిక విద్యలో ఆరు నెలల బ్రిడ్జి కోర్సు చేయాలన్న నిబంధన విధించారు. బీఎడ్‌ అభ్యర్థులు ప్రాథమిక పాఠశాల టీచర్‌ పోస్టులకు అర్హులు కాదని చెప్పడానికి ఇదొక్కటి చాలు. 2018 నాటి నోటిఫికేషన్‌ విషయంలో ఎన్‌సీటీఈ సొంతంగా నిర్ణయం తీసుకోకుండా కేంద్రప్రభుత్వం చెప్పినట్లు చేసింది. సాధారణంగా ప్రభుత్వాలు తీసుకొనే విధాన నిర్ణయాల్లో రాజ్యాంగపరమైన న్యాయస్థానాలు జోక్యం చేసుకోవు. నిర్ణయాలు ఏకపక్షంగా, అహేతుకంగా ఉంటే మాత్రం తప్పనిసరిగా న్యాయ సమీక్షాధికారాలను ప్రయోగిస్తాయి. ఇక్కడ విధాన నిర్ణయం పూర్తి ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా, ఏమాత్రం బుద్ధి ఉపయోగించకుండా తీసుకున్నట్లుగా ఉంది. వాస్తవానికి ఇలాంటి విషయాల్లో నిర్ణయాధికారాన్ని నిపుణులున్న ఎన్‌సీటీఈ వంటి సంస్థకే వదిలిపెట్టాలి. కానీ ఇక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇది మంచిది కాదు. అందువల్ల నోటిఫికేషన్‌ను కొట్టేస్తూ రాజస్థాన్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తున్నాం’’ అని ధర్మాసనం పేర్కొంది.

మరింత సమాచారం... మీ కోసం!
ఎన్‌టీఏ- పీహెచ్‌డీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ 2023 

'నాసా' మెచ్చిన కుర్రాడు!

తండ్రి కష్టం.. తనయ విజయం

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 15-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.