• facebook
  • whatsapp
  • telegram

TGPSC Group 1: 74 శాతానికి పెరిగిన గ్రూప్‌-1 పరీక్ష హాజరు

* ఏఈఈ ఫలితాల వెల్లడికి కసరత్తు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో (జూన్‌ 9) జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు రికార్డుస్థాయిలో హాజరు నమోదైంది. గతంలో జరిగిన పరీక్షతో పోల్చితే ఈసారి ఏకంగా 12.63 శాతం పెరిగి 74 శాతం హాజరు నమోదైంది. గతంలో రద్దయిన రెండు ప్రిలిమినరీ పరీక్షలను పరిగణనలోకి తీసుకుంటే సంఖ్యాపరంగా మూడు లక్షలకు మందికి పైగా అభ్యర్థులు గ్రూప్‌-1 పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రంలో తొలుత 503 పోస్టులతో గ్రూప్‌-1 ఉద్యోగ ప్రకటన వెలువడింది. ఈ ప్రకటనకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3.8 లక్షల మంది దరఖాస్తు చేశారు. 2022 అక్టోబరు 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా 75 శాతం హాజరుతో 2.86 లక్షల మంది పరీక్ష రాశారు. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా ఈ పరీక్ష రద్దయింది. అనంతరం తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గతేడాది జూన్‌ 11న రెండోసారి ప్రిలిమినరీ నిర్వహించింది. కానీ ఈ పరీక్షకు హాజరు గణనీయంగా 61.37శాతానికి పడిపోయింది. కేవలం 2.33 లక్షల మంది మాత్రమే రాశారు. అయితే ఈ పరీక్ష నిర్వహణలో లోపాలున్నాయని, రద్దుచేసి మరోసారి నిర్వహించాలని హైకోర్టు సూచించింది. డిసెంబరులో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం కమిషన్‌ను పూర్తిగా ప్రక్షాళన చేసి, కొత్త ఛైర్మన్, సభ్యుల నియామకంతో పాటు టీఎస్‌పీఎస్సీ పేరును టీజీపీఎస్సీగా మార్చింది. పాతగ్రూప్‌-1 ప్రకటన రద్దుచేసిన కమిషన్‌ 60 అదనపు పోస్టులు కలిపి 563 పోస్టులతో కొత్తప్రకటన ఇచ్చింది. రికార్డుస్థాయిలో ఏకంగా 4.03 లక్షల మంది దరఖాస్తు చేశారు.

ఎన్నికల కోడ్‌ ముగిసినందున నియామకాలు పూర్తిచేసేందుకు టీజీపీఎస్సీ కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే గ్రూప్‌-4 మెరిట్‌ జాబితా వెల్లడించిన కమిషన్‌ త్వరలో ప్రభుత్వ విభాగాల్లో 1,540 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పోస్టుల తుది ఫలితాలు ఇవ్వనుంది. ఈ పోస్టులకు అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తి కాగా త్వరలో ఎంపిక జాబితా వెల్లడించాలని భావిస్తోంది. ప్రభుత్వ విభాగాల్లో 833 అసిస్టెంట్‌ ఇంజినీరు పోస్టుల నియామక ప్రక్రియ ప్రారంభించనుంది. గ్రూప్‌-4 ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తయిన వెంటనే ఏఈ పోస్టుల పరిశీలన ప్రారంభించాలన్న ఆలోచనలో ఉంది. ఈ పోస్టులకు జనరల్‌ ర్యాంకు జాబితా (జీఆర్‌ఎల్‌)ను కమిషన్‌ విడుదల చేసింది. 1 : 2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితా ప్రకటన చేసేందుకు సమాయత్తమవుతోంది.


 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నవోదయలో ఉపాధ్యాయ ఉద్యోగాలు

‣ బీటెక్‌లకు సైంటిస్టు కొలువులు

‣ ఉపాధికి డిప్లొమా మార్గాలు

‣ గురిపెట్టండి క్లర్కు కొలువుకు!

Published Date : 11-06-2024 12:30:09

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం