• facebook
  • whatsapp
  • telegram

Krishna University: ఒక్కొక్క కోర్సు.. మూసివేస్తూ..

* ఎంఏ జర్నలిజం, తెలుగు ఇప్పటికే తొలగింపు

* ఇదే దారిలో ఆంగ్లం, కామర్స్‌, ఫిజిక్స్‌ విభాగాలు

* కృష్ణా విశ్వవిద్యాలయం మనుగడ ప్రశ్నార్థకం

ఈనాడు, అమరావతి: ‘కృష్ణా విశ్వవిద్యాలయంలో ఒక్కో కోర్సు మూత పడుతోంది. రెండేళ్ల క్రితమే ఎంఏ జర్నలిజం మూసేశారు. తాజాగా ఎంఏ తెలుగు మూతపడింది. ప్రస్తుతం అదే దారిలో ఎంఏ ఇంగ్లీష్‌ విభాగం ఉంది. గత నాలుగేళ్లుగా ఏటా ఒకరిద్దరే ఇంగ్లీష్‌లో చేరుతున్నారు. ఎంఏ కామర్స్‌ పరిస్థితి అదే. ఈ ఏడాది కేవలం ఎనిమిది మందే కామర్స్‌లో చేరారు. ఫిజిక్స్‌లోనూ ఎవరూ చేరడం లేదు. నలుగురు ఫ్యాకల్టీ ఫిజిక్స్‌ విభాగంలో ఉంటే కేవలం ఒక్కరు చేరారు. త్వరలో ఇవీ మూతపడనున్నాయి.
దశాబ్దాలుగా విశ్వవిద్యాలయం కావాలంటే ఎట్టకేలకు మచిలీపట్నంలో 2008లో ఏర్పాటు చేశారు. 12 ఏళ్లు అద్దె భవనాల్లో కొనసాగి ఎట్టకేలకు సొంత ప్రాంగణం ఏర్పాటు చేసుకుని మూడేళ్ల క్రితం అక్కడి నుంచి చదువులు ఆరంభించినా సౌకర్యాల కొరత కారణంగా విద్యార్థులు చేరడం లేదు. గత మూడున్నరేళ్లలో జీతాలకు తప్ప విశ్వవిద్యాలయం అభివృద్ధికి ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు కేటాయించలేదు. వసతిగృహాలు సహా అనేక అభివృద్ధి పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. దీంతో విద్యార్థులు చేరకపోవడంతో ఒక్కో విభాగాన్ని మూసేస్తూ వస్తున్నారు. చివరికి విశ్వవిద్యాలయం మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయేలా చేస్తున్నారు.

మచిలీపట్నంలో 2008లో కృష్ణా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. చాలాకాలం అద్దె భవనాల్లోనే కొనసాగింది. ఎట్టకేలకు గత ప్రభుత్వంలో భారీగా నిధులు కేటాయించి రుద్రవరంలో కృష్ణా విశ్వవిద్యాలయానికి సొంత ప్రాంగణాన్ని నిర్మించారు. 2020 జనవరి 26న కొత్త ప్రాంగణంలోకి వెళ్లారు. కానీ ఈ ప్రాంగణంలో వసతి గృహం నిర్మాణం చేపట్టలేదు. రెండేళ్ల క్రితం యువతీ యువకులకు వేర్వేరుగా రూ.16 కోట్లతో వసతి గృహాల నిర్మాణం ఆరంభించారు. ఏడాదిలోనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఒక్కో వసతిగృహంలో 500 నుంచి 600 మంది ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. కానీ వీటిని పూర్తి చేయడంలో తీవ్ర జాప్యం చేస్తూ వచ్చారు. గతేడాది ఏడాది డిసెంబరు నాటికి వసతిగృహాల నిర్మాణాలు పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు. కానీ ఈ డిసెంబరు నాటికైనా పూర్తవుతాయో లేదో అనుమానమే. దీంతో ఏటేటా విద్యార్థుల ప్రవేశాలు తగ్గిపోతూ ఒక్కో విభాగం మూత పడుతోంది.

గురువుల కంటే విద్యార్థులు తక్కువ..

విశ్వవిద్యాలయంలో గతంలో పూర్తిగా నిండిపోయిన విభాగాల సీట్లు కూడా ఒక్కొక్కటిగా తగ్గిపోతూ వస్తున్నాయి. ఎంఏ ఇంగ్లీష్‌ లాంటి విభాగాలు త్వరలో మూతపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇంగ్లీష్‌ విభాగంలో ఇద్దరు ప్రొఫెసర్లు, ఇద్దరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ఇద్దరు అకడమిక్‌ కన్సల్టెంట్లున్నారు. ఒక్కో ప్రొఫెసర్‌కు నెలకు రూ.2లక్షలకు పైగా జీతం, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ.లక్షకు పైగా జీతాలున్నాయి. కానీ ఈ విభాగంలో గత నాలుగేళ్లుగా ఒకరిద్దరే చేరుతున్నారు. గురువుల కంటే విద్యార్థులు ఈ విభాగంలో తక్కువ ఉంటున్నారు. వచ్చే ఏడాది ఈ విభాగం కూడా మూతపడనుంది. ప్రభుత్వం నుంచి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. అదే వసతిగృహాల సౌకర్యం ఉంటే కచ్చితంగా దూర ప్రాంతాల విద్యార్థులు వచ్చి చేరతారు. నాగార్జున విశ్వవిద్యాలయం లాంటి వాటికి కడప, అనంతపురం సహా పలు ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్నారు. అన్ని వసతులు ఉంటే.. విద్యార్థులు ఎంత దూరమైనా వచ్చి చేరేందుకు అవకాశం ఉంటుంది. కానీ కృష్ణా విశ్వవిద్యాలయంలో అధునాతన ప్రాంగణం ఉన్నా.. వసతి లేక విద్యార్థులు చేరడం లేదు. ప్రధానంగా హాస్టల్‌ వసతి, క్యాంటీన్‌ లాంటి ప్రాథమిక వసతులు కూడా లేకపోవడంతో విద్యార్థులు ఎవరూ చేరేందుకు ఆసక్తి చూపించడం లేదు.

అద్దె భవనాల్లోనే కళకళలాడింది..

కృష్ణా విశ్వవిద్యాలయం 2008 నుంచి 2020 వరకూ 12 ఏళ్లు ఏజే కళాశాల ప్రాంగణంలో నడిచింది. అప్పట్లో అద్దె భవనాల్లోనే ఉన్నా విద్యార్థులు ఎక్కువ చేరేవారు. మచిలీపట్నంలోనే ఉండడంతో ఎక్కువ ప్రవేశాలు జరిగేవి. చుట్టుపక్కల రాజుపేట సహా పలు ప్రాంతాల్లో విద్యార్థులు ఉండేవారు. అక్కడి నుంచి పక్కనే ఉన్న విశ్వవిద్యాలయానికి వచ్చేవారు. కానీ ప్రస్తుతం రుద్రవరానికి మార్చడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మచిలీపట్నంలో ఉంటూ నిత్యం రుద్రవరానికి వచ్చే ఒకటీ రెండు ఆర్టీసీ బస్సుల్లోనే విద్యార్థులు రాకపోకలు సాగిస్తున్నారు. కనీసం ఇప్పటికైనా విశ్వవిద్యాలయ వసతిగృహాల నిర్మాణంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి త్వరితగతిన అందుబాటులోకి తీసుకొస్తే మరికొన్ని విభాగాలు మూతపడకుండా కాపాడుకోవచ్చు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ పైలట్లకు పెరుగుతోంది డిమాండ్‌!

‣ మేటి సంస్థ‌ల్లో ఎంసీఏ!

‣ జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ ఎగ్జామినేషన్‌ డిసెంబర్‌-2022/ జూన్‌-2023

‣ తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 24-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.